శారదా పీఠాధిపతికి ఇది తగునా?

posted on: Jul 2, 2014 11:58AM

 

విశాఖ శారదా పీఠాధిపతి శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి అంటే అందరికీ గౌరవం. ఆధ్యాత్మిక బాటలో పయనిస్తున్నప్పటికీ హేతుబద్ధంగా ఆలోచిస్తారు, మాట్లాడతారన్న గౌరవం ఆయన మీద అందరికీ నిన్నటి వరకూ వుండేది. అయితే తాజాగా ఆయన చేసిన కామెంట్లు, మాట్లాడిన విధానం ఆయన మీద తెలుగువారికి వున్న గౌరవం తగ్గించేలా వున్నాయి. కొంతమంది మూఢ నమ్మకాలను విశ్వసించేవారు, దుష్ర్పచారం చేసేవారు నడిచే బాటలోనే ఆయన కూడా నడుస్తూ వుండటం, చాలా సిల్లీగా వుండే విషయాలను అలాంటి ఆధ్యాత్మికవేత్త తన ప్రసంగంలో ప్రస్తావించడం చాలా ఆవేదనను కలిగిస్తూ వుంది. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత వర్షాలు కురవటం లేదట. అలాగే రాష్ట్రంలో చాలామంది చనిపోతున్నారట. నిజంగా ఆయన ఏం మాట్లాడుతున్నారో ఆయనకయినా అర్థమవుతోందా?


2009 ఎన్నికల సమయంలో కొన్ని రాజకీయ వర్గాలు ఒక అసంబద్ధమైన, ఘోరమైన వాదనని తెరమీదకి తెచ్చాయి. అది చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా వున్న సమయంలో వర్షాలు సరిగా కురవలేదు. అదే వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి కాగానే వర్షాలు బాగా కురిశాయి... ఇదీ ఆ వాదన! అసలు ప్రకృతికి, వర్షాలు కురవడానికి, ముఖ్యమంత్రి పదవిలో వున్న వ్యక్తికి ఏమైనా సంబంధం వుంటుందా? మరి అలాంటిదేమైనా వుంటే వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి కాగానే కరుణించిన మేఘాలు, ఆయన హెలికాప్టర్‌లో ప్రయాణిస్తున్నప్పుడు ఎందుకు కరుణించలేదు? వర్షాలు కురిపించే విషయంలో పనిచేసిన రాజశేఖరరెడ్డి అదృష్టం హెలికాప్టర్‌లో మేఘాల మధ్యలోంచి ప్రయాణిస్తున్నప్పుడు ఎందుకు ఉపయోగపడలేదు? చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా వున్న వర్షాలు సరిగా కురవలేదంటారు.. మరి సరిగా కురవకపోవడం ఎందుకు.. చంద్రబాబు మీద పగపట్టిన వర్షాలు అస్సలు కురవకుండానే వుండొచ్చుగా? మరొక పిచ్చి వాదన ఏమిటంటే, చంద్రబాబు ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోగానే వర్షాలు కురవడం మొదలుపెట్టాయట!


వర్షాలు కురవడానికి కారణమేంటి? చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోయాడని అప్పుడు వరుణుడికి శారదా పీఠాధిపతి లాంటి దేవదూతలు ఎవరైనా టెలీగ్రామ్ ఇచ్చారా? ఇన్నేళ్ళ తర్వాత ఇప్పుడు మళ్ళీ వర్షాలు సకాలంలో కురవకపోవడానికి కారణం చంద్రబాబు సీఎం అయ్యారని మళ్ళీ ఎవరైనా దేవుడికి వర్తమానం పంపారా? ఆంధ్రప్రదేశ్‌లో వర్షాలు కురవకపోవడానికి చంద్రబాబు నాయుడు కారణం అనుకుందాం. మరి తెలంగాణలో కూడా వర్షాలు కురవడం లేదు.. దానికి ఎవరు కారణం? ప్రస్తుతం దేశమంతా వర్షాలు కురవటం లేదు. దానికెవరు కారణం? అలాగే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా వున్నందుకు వర్షాలు కురవడం లేదు. అంతవరకూ ఓకే.. మరి దైవాంశ సంభూతులైన శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి ఆంధ్రప్రదేశ్‌లోనే వున్నారు కదా.. అలాంటి పుణ్యాత్ముడు నడయాడే నేలమీద వర్షాలు ఎందుకు కురవడం లేదు? అంత అధ్యాత్మిక శక్తి వున్న ఆయన జనాల బాధ చూడలేక దేవుణ్ణి ప్రార్థించి వర్షాలు కురిపించొచ్చు కదా.. తెలుగువాళ్ళెవరూ ప్రమాదాల్లో మరణించకుండా చేయొచ్చు కదా?! ఈ విషయం మీద స్వామివారిని ఇంకా ఎన్నెన్నో ప్రశ్నలతో నిలదీయొచ్చు.. కానీ ఆయన కూర్చున్న పీఠం మీద గౌరవంతో ఇక్కడితో ముగించడం న్యాయం. ఆయన కూడా లేనిపోని అంధ విశ్వాసాలను ప్రచారం చేయకుండా వుంటే బాగుంటుంది! ఆంధ్రప్రదేశ్ అన్యాయమైపోయింది. మళ్ళీ ఎలా అభివృద్ధిలోకి రావాలో ముందు అది ఆలోచించండయ్యా స్వామీ!

google-ad-img
    Related Sigment News
    • Loading...