Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...అమెరికా సైనిక స్థావరాలపై నిఘా.. ఇరాన్ కు చైనా సహకారం
posted on: Apr 16, 2026 9:27AM

పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతల మధ్య ఒక సంచలన వార్త అంతర్జాతీయ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. అమెరికా సైనిక స్థావరాల కదలికలను కనిపెట్టేందుకు ఇరాన్ ఒక రహస్య వ్యూహాన్ని అమలు చేసిందనీ, దీనికి చైనా పూర్తిస్థాయిలో సహకరించిందని వెల్లడైంది. ఈ మేరకు ఫైనాన్షియల్ టైమ్స్ ప్రచురించిన కథనం సంచలనం సృష్టించింది. గతేడాది రహస్యంగా 01బి శాటిలైట్‌ను పొదిన ఇరాన్ దీని ద్వారా సౌదీ అరేబియా, జోర్డాన్, ఇరాక్‌లోని అమెరికా బేస్ లలో కదలికలను ట్రాక్ చేసింది. చైనా అనుమతితోనే ఈ ఒప్పందం జరిగిందని నిపుణుల విశ్లేషణ. అయితే ఈ ఆరోపణలను చైనా ఖండించిందనుకోండి అది వేరే సంగతి.
మధ్యప్రాచ్యంలో నెలకొన్న యుద్ధ వాతావరణం, ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా బలగాల కదలికలను పర్యవేక్షించేందుకు ఇరాన్ ఆధునిక సాంకేతికతను ఆశ్రయించింది. ఇందులో భాగంగా చైనాకు చెందిన ఒక నిఘా ఉపగ్రహాన్ని ఇరాన్ ఉపయోగించిందని ఫైనాన్షియల్ టైమ్స్ కథనం పేర్కొంది. చైనాకు చెందిన ఎర్త్ ఐ కంపెనీ అభివృద్ధి చేసిన టీఈఈ 01బి శాటిలైట్ ద్వారా ఇరాన్ సక్సెస్ ఫుల్ గా అమెరికా సైనిక స్థావరాలపై నిఘా పెట్టింది.
సాధారణంగా ఉపగ్రహాలను భూమిపై ఉండగానే విక్రయిస్తుంటారు. కానీ ఇక్కడ చైనా కంపెనీ ఇన్-ఆర్బిట్ డెలివరీ' అనే వినూత్న పద్ధతిని అనుసరించింది. అంటే శాటిలైట్‌ను అంతరిక్షంలోకి విజయవంతంగా ప్రయోగించిన తర్వాత.. దాని నియంత్రణను ఐఆర్జీసీ ఏరోస్పేస్ విభాగానికి బదిలీ చేసింది. ఈ రహస్య ఒప్పందం ద్వారా ఇరాన్ నేరుగా ఉపగ్రహ డేటాను పొందే వీలు కలిగింది. దీనికి తోడు బీజింగ్‌కు చెందిన ఎంపోశాట్ అనే సంస్థ గ్రౌండ్ స్టేషన్ల నెట్‌వర్క్‌ను కూడా ఇరాన్ వాడుకునేందుకు వీలు కల్పించింది. ఇక ఇరాన్ టార్గెట్ చేసిన అమెరికా సైనిక స్థావరాలు ఏంటంటే..
సౌదీ అరేబియాలో ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్, జోర్డాన్లోని మువాఫక్ సల్తీ ఎయిర్ బేస్, అలాగే.. బహ్రెయిన్ లోనిఅమెరికా 5వ ఫ్లీట్ హెడ్ క్వార్టర్స్. ఇక పోతే, ఇరాక్ ఎర్బిల్ ఎయిర్‌పోర్ట్, క్యాంప్ బ్యూహ్రింగ్, ఇంకా అలీ అల్ సేలం ఎయిర్ బేస్ వద్ద ఉన్న అమెరికా కార్యకలాపాలను కూడా ఇరాన్ ట్రాక్ చేసింది. ఈ నిఘా సక్సెస్ కావడం వల్లనే అమెరికాపై ఇరాన్ స్పష్టమైన ఆధిక్యత సాధించగలిగింది. యుద్ధంలో అమెరికా తీవ్రంగా నష్టపోయేలా చేయగలిగింది. ఇక్కడ ఫైనాన్షియల్ టైమ్స్ తన కథనంలో పేర్కొన్నదేంటంటే.. చైనా ప్రభుత్వ అనుమతి లేకుండా ఆ దేశంలోని ఏ ప్రైవేట్ కంపెనీ కూడా ఇలాంటి సున్నితమైన ఉపగ్రహ సమాచారాన్ని ఇరాన్‌కు విక్రయించే సాహసం చేయదు అని. చైనా వ్యూహాత్మకంగా ఇరాన్‌కు సహకరిస్తూనే, పైకి మాత్రం తమకు సైనిక సంబంధాలు లేవని బుకాయిస్తోందని ఆ కథనం పేర్కొంది.
ఇరాన్ తన బాలిస్టిక్ క్షిపణి సామర్థ్యాన్ని పెంచుకుంటున్న తరుణంలో, చైనా నుంచి అందుకుంటున్న నిఘా సమాచారం పెను ప్రమాదానికి దారితీస్తుందని గల్ఫ్ దేశాలు ఆందోళన చెందుతున్నాయి. చైనా ఇరాన్ క్షిపణుల తయారీకి అవసరమైన విడిభాగాలను సరఫరా చేస్తోందని అమెరికా గతంలోనే ఆరోపించిన సంగతి విదితమే. ఇప్పుడు శాటిలైట్ సాయం కూడా తోడవడం అగ్రరాజ్యాన్ని ఆందోళనలోకి నెట్టేసింది. మొత్తానికి, చైనా,ఇరాన్ మధ్య బలపడుతున్న ఈ రహస్య సైనిక సంబంధాలు ప్రపంచ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు బాటలు వేస్తున్నాయని అంతర్జాతీయ రక్షణ నిపుణులు అంటున్నారు.






