జీఎస్టీ బిల్లు కోసమే బాబుపై మెత్తబడ్డారా..?

posted on: Aug 3, 2016 4:06PM

జీఎస్టీ బిల్లు..ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రతి పార్లమెంట్ సమావేశంలో బిల్లు ఆమోదింప చేసుకోవాలని బీజేపీ భావించడం..ప్రతి పక్షాలు దీనికి సవరణలు ప్రతిపాదించి బిల్లును అడ్డుకోవడం ఆనవాయితీగా మారింది. జీఎస్టీ బిల్లు రాజ్యాంగ సవరణ బిల్లు అయినందున..దానిని ఆమోదించాలంటే మూడింట రెండు వంతుల మంది సభ్యుల మద్ధతు అవసరం. మొత్తం 245 మంది సభ్యులున్న రాజ్యసభలో కాంగ్రెస్‌కు గణనీయంగా 68 మంది సభ్యుల బలం ఉండగా..అధికార బీజేపీకి 48 మంది సభ్యులు మాత్రేమే ఉన్నారు. ఎన్డీఏ మిత్రపక్షాలు అన్ని కలుపుకుని 120 మంది సభ్యుల మద్ధతు ప్రభుత్వానికి ఉంది. బిల్లు ఆమోదం పొందాలంటే కనీసం 165 మంది సభ్యుల మద్ధతు అవసరం. అంటే ఇంకా 45 మంది సభ్యుల మద్ధతును కూడగట్టాల్సి ఉంటుంది.

 

గతేడాది పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో బిల్లును ప్రవేశపెట్టేందుకు ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ నిలుచోగానే..అప్పటి వరకూ మౌనంగా ఉన్న కాంగ్రెస్ సభ్యులు ప్రభుత్వ చర్యకు వ్యతిరేకంగా వెల్‌లోకి దూసుకెళ్లారు. అంతే జైట్లీ అగ్గి మీద గుగ్గిలం అయ్యారు..2014 ఎన్నికల్లో ఓటమిని ఇంకా జీర్ణించుకోలేని కాంగ్రెస్ దేశ ప్రగతిని అడ్డుకునేందుకు అవరోధాలు సృష్టిస్తున్నారని అరుణ్‌జైట్లీ ధ్వజమెత్తారు. అలా గొడవ పడుతుండగానే ఆ ఏడాది సమావేశాలు ముగిశాయి. ఇక అప్పటి నుంచి పరువు నెగ్గించుకోవటానికి బీజేపీ నానా తంటాలు పడుతూ వస్తోంది. రాష్ట్రాల ఆర్ధిక మంత్రులతో జైట్లీ వరుస భేటీలు నిర్వహించారు. అటు ప్రధాని నరేంద్రమోడీ కూడా బిల్లుపై ఏకాభిప్రాయాన్ని సాధించేందుకు విపక్ష నాయకులతో మాట్లాడారు. అలా తన మద్ధతును బీజేపీ 131 మందికి పెంచుకుంది,

 

నాడు లోక్‌సభలో జీఎస్టీ బిల్లును వ్యతిరేకించిన అన్నాడీఎంకే ఇప్పుడు తన వైఖరిని మార్చుకుంది..ఎన్సీపీ, డీఎంకేలు మాత్రం బిల్లుకు వ్యతిరేకంగా ఉన్నాయి. సీపీఎం తన వైఖరిని ఇంకా స్పష్టం చేయలేదు. కానీ కాంగ్రెస్ మద్ధతిస్తే ఇక బిల్లుకు అడ్డే ఉండదు. హస్తం ప్రతిపాదించిన డిమాండ్లను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకున్నందున ఆ పార్టీ కూడా కాస్త తగ్గినట్లు కనిపించింది. సరిగ్గా ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకహోదాపై కేవీపీ ప్రైవేట్ బిల్లు పెట్టడం..దానిపై జైట్లీ చేసిన ప్రకటన పరిస్థితిని మార్చేసింది. అంతే ఎన్డీఏ మిత్రపక్షం తెలుగుదేశం పార్టీకి ఆ ప్రకటన ఆగ్రహాన్ని కలిగించింది. ఆ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాస్త ఘాటుగా స్పందించి కేంద్రంపై ఒత్తిడి పెంచాలని నిర్ణయించారు. అదే దారిలో వైసీపీ, కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం నడవడంతో జీఎస్టీ బిల్లు ప్లేసులో ప్రత్యేకహోదా వచ్చి చేరింది. పార్లమెంట్ లోపలా, వెలుపలా హోదాపై ఎంపీలు నిరసన గళం వినిపించడంతో సభా కార్యక్రమాలు స్తంభించిపోయాయి.

 

అసలే చచ్చి చెడి జీఎస్టీ బిల్లు కోసం అందరి మద్దతు కూడగట్టిన బీజేపీకి ఈ పరిణామం మింగుడు పడలేదు. హోదాపై ఏదో ఒకటి తేల్చకపోతే..జీఎస్టీ బిల్లు మళ్లీ అటకెక్కే ప్రమాదం ఉండటంతో జైట్లీ వెంటనే నష్టనివారణ చర్యలు ప్రారంభించి, ప్రధాని మోడీతో చర్చించారు. తేరుకున్న ప్రధాని మొన్న సాయంత్రం ప్రత్యేకహోదాపై కసరత్తు ప్రారంభించాలని జైట్లీకి సూచించినట్లు సమాచారం. ఒకవేళ హోదా సాధ్యంకాని పక్షంలో భారీ ప్యాకేజీ అయినా ఇవ్వాలని ప్రధాని యోచిస్తున్నట్లు సమాచారం. అంటే చంద్రబాబు అలిగారనో..ఎంపీలు నిరసన తెలిపారనో బీజేపీ మెత్తబడలేదన్న మాట. కేవలం తన పంతం నెగ్గించుకోవడానికి, ఏపీ ఎంపీలు జీఎస్టీ బిల్లుకు అడ్డం రాకుండా చేసుకోవడానికే కమలనాథులు ఈ ఎత్తు వేశారన్నమాట.
 

google-ad-img
    Related Sigment News
    • Loading...