వైసీపీ నేత పూడి శ్రీహరికి బెయిల్ మంజూరు

posted on: Apr 16, 2026 6:58PM

 

చిత్తూరు జిల్లా రాజకీయాల్లో గత రెండు రోజులుగా ఉత్కంఠ రేపిన వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పూడి శ్రీహరి అరెస్టు ఎపిసోడ్‌లో కీలక పరిణామం చోటుచేసుకుంది. శ్రీహరికి కుప్పం కోర్టు గురువారం బెయిల్ మంజూరు చేసింది. దాదాపు 33 గంటల పాటు పోలీసుల అదుపులో ఉన్న ఆయనకు న్యాయస్థానం నుంచి ఊరట లభించింది.

బుధవారం ఉదయం 8 గంటల ప్రాంతంలో పోలీసులు పూడి శ్రీహరిని అదుపులోకి తీసుకున్నారు. అయితే, నిబంధనల ప్రకారం 24 గంటల లోపు మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచాల్సి ఉండగా, పోలీసులు ఆయనను సుదీర్ఘకాలం పాటు అజ్ఞాతంలో ఉంచడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. బుధవారం రోజంతా ఆయన ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు ఆందోళన చెందారు.

అరెస్టు చేసిన 33 గంటల తర్వాతే శ్రీహరికి వైద్య పరీక్షలు నిర్వహించిన పోలీసులు, ఆపై కుప్పం కోర్టులో ప్రవేశపెట్టారు. పోలీసులు కావాలనే ఆయనను ఇబ్బంది పెట్టేందుకు కాలయాపన చేశారని వైఎస్సార్‌సీపీ లీగల్ సెల్ కోర్టు దృష్టికి తీసుకెళ్లింది. వాదనలు విన్న న్యాయమూర్తి, శ్రీహరికి బెయిల్ మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం ఏపీలో రాజకీయ వాతావరణం వేడెక్కిన నేపథ్యంలో, కుప్పం నియోజకవర్గంలో చోటుచేసుకున్న ఈ పరిణామం ప్రాధాన్యత సంతరించుకుంది.

google-ad-img
    Related Sigment News
    • Loading...