ఉగ్రవాదం మారుతున్నారు... మనం మారడం లేదు... మోదీ

posted on: Apr 1, 2016 11:13AM

 

అణుభద్రత సదస్సులో పాల్గొనేందుకు అమెరికాకి చేరుకునే మోదీ, తీవ్రవాదాన్ని గట్టిగా ఖండించేందుకే సిద్ధపడినట్లున్నారు. నిన్నటికి నిన్న ఉగ్రవాదాన్ని నిర్వచించడంలో ఐక్యరాజ్య సమితి విఫలమైందని విమర్శించిన మోదీ మరోసారి తన అభిప్రాయాలను స్పష్టంగా వెల్లడించారు. సదస్సుకు ముందుగా అతిథుల గౌరవార్థం అమెరికా అధ్యక్షులు ఏర్పాటు చేసిన విందులో మోదీ పలు వ్యాఖ్యలు చేశారు. తీవ్రవాదులు 21వ శతాబ్దానికి అనుగుణంగా ఆధునికంగా మారుతున్నారనీ, కానీ ప్రభుత్వాలు మాత్రం కాలం చెల్లిన పద్ధతులను అనుసరిస్తున్నాయనీ ఆయన వాపోయారు. పైగా తీవ్రవాదుల చర్యలు మరింత హింసాత్మకంగా మారుతున్నాయనీ, వారు పౌరులలో కలిసిపోతూనే విధ్వంసాన్ని సృష్టిస్తున్నారని చెప్పుకొచ్చారు. పరోక్షంగా పాకిస్తాన్‌ వంటి దేశాలను ప్రస్తావిస్తూ కొన్ని దేశాలు తీవ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ ప్రమాదకరంగా మారుతున్నాయని విమర్శించారు. తీవ్రవాదం అనేది ఎవరో ఒకరికి మాత్రమే సంబంధించిన సమస్యగా చూడటం మానివేయాలని మోదీ హితవు పలికారు. అణుభద్రత గురించి సదస్సుని నిర్వహించడం ద్వారా అమెరికా అధ్యక్షడు ఒబామా ఒక కీలక సమస్య మీద ప్రపంచ దృష్టిని నిలిపారని కొనియాడారు. సదస్సు ముందే ఇంత కఠినమైన విమర్శలు చేస్తున్న మోదీ, ఇక సదస్సు సందర్భంగా మరెన్ని ప్రకటనలు చేస్తారో చూడాలి.

google-ad-img
    Related Sigment News
    • Loading...