నేడో రేపో చంద్రబాబు నాయుడుతో పవన్ కళ్యాణ్ సమావేశం
posted on Aug 22, 2015 2:20PM
.jpg)
ఈరోజు రాత్రి లేదా రేపు ఉదయం పవన్ కళ్యాణ్ ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సమావేశం అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రాజధాని ప్రాంతంలో రైతులపై భూసేకరణ చట్టాన్ని ప్రయోగించి వారివద్ద నుండి బలవంతంగా భూములు సేకరణ చేయవద్దని పవన్ కళ్యాణ్ గత కొన్ని రోజులుగా ట్వీట్ మెసేజులు పెడుతున్నారు. వాటికి రాష్ట్ర మంత్రులు చాలా గట్టిగా జవాబు చెపుతుండటంతో తెదేపా-పవన్ కళ్యాణ్ ల మధ్య ఈ వ్యవహారంలో కొంత ఉద్రిక్తత నెలకొని ఉంది. కనుక ఈ భూసేకరణ వ్యవహారం గురించి ముఖ్యమంత్రితోనే నేరుగా చర్చించి దానిపై ఆయన అభిప్రాయాలు తెలుసుకొన్న తరువాత రాజధాని ప్రాంతంలో గ్రామాలలో పర్యటించాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నట్లు తాజా సమాచారం. ముఖ్యమంత్రితో సమావేశం తరువాత రాజధాని గ్రామాలలో పర్యటించడం కోసం పవన్ కళ్యాణ్ రేపటి తన సినిమా షూటింగుని వాయిదా వేసుకొన్నట్లు సమాచారం. ఒకవేళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన సమాధానంతో సంతృప్తి చెందకపోతే అప్పుడు పవన్ కళ్యాణ్ ఏమి చేస్తారో చూడాలి.