పాక్‌లో "పరువు" కోసం దారుణాలు..

posted on: Jun 21, 2016 4:59PM

కూతురో..కొడుకొ తమ కన్నా తక్కువ కులం వారిని పెళ్లి చేసుకున్నారనో..లేదా వేరే మతం వారిని పెళ్లాడితే..నలుగురిలో తలెత్తుకోలేమని పరువు పోతుందని కన్నబంధాన్ని మరచిపోయి వారిని కడతేర్చే సంఘటనలు మన దగ్గర కొకొల్లలు. దేశంలో రోజూ ఏదో ఒక మూలన ఈ తరహా హత్యలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఈ సంస్కృతి పాకిస్థాన్‌లో రక్తపుటేరులు పారిస్తోంది. గత రెండు రోజుల నుంచి మూడు నిండు ప్రాణాల్ని పరువు బలి తీసుకుంది.

 

పంజాబ్ ప్రావిన్స్‌లోని ఓ క్రిస్టియన్ కుటుంబానికి చెందిన నస్రీన్ షహజాదీ మూడు నెలల క్రితం తల్లిదండ్రులకు ఇష్టం లేకుండా ఓ ముస్లిం వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. అనంతరం ఆమె ఇస్లాం స్వీకరించడంతో తల్లిదండ్రులు తట్టుకోలేకపోయారు. నలుగురిలో తలెత్తుకోనీయకుండా చేసిన కూతురిని కడతేర్చాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో ఇటీవల ఆమెకు ఫోన్ చేసిన తల్లిదండ్రులు భర్తతో కలిసి ఇంటికి రమ్మని ఆహ్వానించారు. తల్లిదండ్రులు మారిపోయారని..ఎంతో ఆశతో పుట్టింటికి వెళదామని సిద్ధమయ్యింది. కానీ నస్రీన్ తాను మృత్యుదేవత కౌగిలిలోకి వెళ్లబోతున్నట్టు ఊహించలేకపోయింది. ఇంట్లో నస్రీన్ అడుగు పెట్టగానే ఆదరిస్తారనుకుంటే..ఆగ్రహాంతో ఊగిపోయి కత్తితో పొడిచి చంపారు. అనంతరం ఆమె మృతదేహాన్ని ఓ నిర్జన ప్రదేశంలో పడేశారు.

 

మరో ఘటనలో మొహమ్మద్ షకీల్, ఆక్సా అనే జంట నాలుగేళ్ల క్రితం పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకుని వేరుగా ఉంటోంది. దీనిని సహించలేని ఆక్సా సోదరుడు వారిని చంపాలని సరైన సమయం కోసం ఎదురుచూస్తున్నాడు. ఇటీవలే సౌదీ నుంచి వచ్చిన ఆయన నాలుగు రోజుల క్రితం తల్లి, మేనమామతో కలిసి సోదరి ఇంటికి వెళ్లి గొడవపడ్డాడు. దంపతులను చితకబాది..అనంతరం వారిని గుర్తు తెలియని ప్రదేశానికి తీసుకెళ్లారు. మొహమ్మద్ నోట్లో తుపాకి పెట్టి మూడు రౌండ్లు కాల్చారు. ఆ వెంటనే అతడి భార్య ఆక్సా,  నాలుగేళ్ల కొడుకు తలలను గొడ్డలితో నరికేశారు. ఇక్కడ బాధకరమైన విషయం ఏంటంటే ఆక్సా అప్పటికే నిండు గర్భిణీ రెండు, మూడు రోజుల్లో పండంటి బిడ్డకు జన్మనిచ్చేది. మరో ఘటనలో ఇష్టం లేని పెళ్లి చేసుకుందని కన్న తల్లే గర్బిణి అయిన తన కుమార్తెను సజీవ దహనం చేసి పాశవికంగా హత్య చేసింది. పాక్‌లో పరువు హత్యల పట్ల ప్రపంచ సమాజం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇక్కడ ఈ తరహా హత్యలు సర్వ సాధారణం. గత ఏడాది పాక్‌లో 1100 మంది పరువు హత్యలకు బలయ్యారు.
 

google-ad-img
    Related Sigment News
    • Loading...