చిన్నమ్మ ఓడింది... సెల్వం గెలిచాడు!
posted on Feb 8, 2017 3:05PM

నిన్నటి దాకా అందరి నోటా శశికళ పేరే వినిపించింది! కాని, రాత్రికి రాత్రి పన్నీర్ సెల్వం పెద్ద కలకలమే రేపాడు. నిజంగా ఆయన సీఎంగా కొనసాగే అవకాశాలు చాలా తక్కువగా వున్నాయి. ఏడీఎంకే ఎమ్మెల్యేలంతా చిన్నమ్మ చేతి గోరు ముద్దలు తినటానికే ఇష్టపడుతున్నారు. కాని, పన్నీర్ సెల్వం లెక్కలు కూడా వేరే వున్నాయంటున్నారు. ఆయన వెనుక బీజేపి, మోదీ వున్నా లేకున్నా ఇప్పుడు చేసిన తిరుగుబాటు వల్ల పోయేదేం లేదు. ఎలాగూ సీఎం పదవి శశికళ లాగేసుకుంటుంది. కాబట్టి ఆమెకి ఎదురుతిరిగి జనం ముందు వీరుడిగా గుర్తింపు పొందే అవకాశం వుంది. అలాగే, ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బీజేపి, డీఎంకే లాంటి పార్టీల లోపాయికారి మద్దతు కూడా ఆయనకు వుంటుంది. కాబట్టి పదే పదే సీఎం పదవి వదులుకుంటూ వచ్చిన పన్నీర్ క్యాలికులెటెడ్ గానే ఇదంతా చేశాడని వాదించే వారూ వున్నారు!
శశికళకి ఎదురు తిరిగి నిలవటం అంటే ఎంతైనా రిస్కే. కాని, దానికి తగ్గ ప్రతిఫలం ముందు ముందు పన్నీర్ సెల్వం పొందుతాడా? ఈ అనుమానానికి ఒక హోప్ ఫుల్ యాన్సర్ సోషల్ మీడియాలో వచ్చింది. ఈ మధ్య సామాన్య జనం మూడ్ ఫేస్బుక్ , ట్విట్టర్ లలో రిఫ్లెక్ట్ అయినంతగా మరెక్కడా కావటం లేదు. మొన్నటికి మొన్న జల్లికట్టు విషయంలో కూడా సోషల్ మీడియానే ప్రధాన పాత్ర పోషించింది. అది వేదికగానే తమిళులు మెరీనా బీచ్ కి లక్షల్లో కదిలారు! అంటే అభివృద్ధిలో, విద్యలో ఎంతో ముందున్న తమిళనాడులో సోషల్ మీడియా ప్రభావానికి బాగానే లోనైందని అర్థం! మరి సోషల్ మీడియా శశికళ, పన్నీర్ సెల్వమ్ ల రాజకీయ పోరు గురించి ఏమనుకుంటోంది?
సోషల్ మీడియా అంటేనే జనాభిప్రాయం. అందుకే, కొందరు శశికళ సీఎం పదవి చేపట్టడం పై నెట్టిజన్ల ఒపీనియన్ కనుక్కునే ప్రయత్నం చేశారు. శశికళ సీఎం పదవి చేపట్టాలా? పన్నీర్ సెల్వమే కొనసాగాలా? అన్న రెండు ప్రశ్నలు జనానికి వేస్తే... అత్యధిక శాతం మంది సెల్వానికే సెల్యూట్ కొట్టారట! శశికళ వద్దే వద్దన్నవారు బోలెడు మంది వున్నారట! అంతే కాదు, అవసరమైతే గవర్నర్ పాలన విధించమని కూడా అభిప్రాయపడ్డారట! దాదాపు ఒకటిన్నర లక్షల మంది ఈ ఫలితాల్ని తమ అకౌంట్లలో షేర్ చేశారు! దీనిబట్టి చిన్నమ్మ పెద్ద పోస్ట్ చేపట్టడంపై తమిళులు ఎంత గుర్రుగా వున్నారో అర్థం చేసుకోవచ్చు!
సుప్రీమ్ కోర్టులో శశికళ దోషిగా తేలితే ప్రజల్లో విముఖత మరింత పెరుగుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఆ భరోసాతోనే పన్నీర్ తిరుగుబాటు చేసినట్టు కనిపిస్తోంది పరిస్థితి చూస్తోంటే!