కార్పొరేట్ ముసుగులో వ్యవస్థీకృత నేర సామ్రాజ్యం

posted on: Apr 17, 2026 8:30PM

ప్రముఖ ఐటీ దిగ్గజం టీసీఎస్కి చెందిన నాసిక్ బిపిఓ యూనిట్‌లో వెలుగుచూసిన షాకింగ్ ఉదంతం ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. కార్పొరేట్ కార్యాలయాల్లో మహిళా భద్రతపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్న వేళ, నాసిక్ మహిళా పోలీసులు నిర్వహించిన ఒక రహస్య ఆపరేషన్ ద్వారా అక్కడ జరుగుతున్న అక్రమాలు బయటపడ్డాయి.   లైంగిక వేధింపులే కాకుండా, బలవంతపు మత మార్పిడిలు, గూమింగ్,   అంతర్జాతీయ హ్యూమన్ ట్రాఫికింగ్ నెట్‌వర్క్, టెర్రర్ ఫండింగ్ లాంటి తీవ్రమైన అంశాలు ఈ కేసులో ముడిపడి ఉన్నట్లు ప్రాథమిక ఆధారాలు లభించాయి.

ఈ కేసు దర్యాప్తులో నాషిక్ మహిళా పోలీసులు  అత్యంత సాహసోపేతంగా అండర్ గ్రౌండ్ ఆపరేషన్ నిర్వహించి ఆధారాలతో సహా బయటపెట్టారు.  సుమారు ఏడెనిమిది మంది మహిళా కానిస్టేబుళ్లు సాధారణ ఉద్యోగులుగా, హౌస్ కీపింగ్ సిబ్బందిగా వేషాలు మార్చుకుని టీసీఎస్ యూనిట్‌లోకి ప్రవేశించారు. దాదాపు రెండు నుంచి మూడు వారాల పాటు అక్కడే ఉండి, కార్యాలయంలోని పరిస్థితులను, మహిళా ఉద్యోగులపై జరుగుతున్న మానసిక,  శారీరక వేధింపులను వారు ప్రత్యక్షంగా గమనించి, ఆధారాలు సేకరించారు.

ఈ అండర్ కవర్ ఆపరేషన్ ద్వారా సేకరించిన పక్కా ఆధారాలతోనే పోలీసులు  నిందితులకు ఉచ్చు బిగించారు.  ఈ కేసులో ఒక పద్దతి ప్రకారం నేరాలు జరుగుతున్నాయని పోలీసులు గుర్నించారు. ముఖ్యంగా చిన్న పట్టణాల నుండి మొదటిసారి కార్పొరేట్ ఉద్యోగాల్లోకి వచ్చే హిందూ యువతులను లక్ష్యంగా చేసుకుని ఈ గూమింగ్ గ్యాంగ్ పనిచేస్తున్నట్లు తేచ్చారు. హెచ్ఆర్, టీమ్ లీడ్ స్థాయిల్లో ఉన్న కొందరు వ్యక్తులు తొలుత మార్గదర్శకత్వం పేరిట యువతులకు దగ్గరై, ఆపై వారిని మానసిక ఒత్తిడికి గురిచేసి లైంగికంగా వాడుకుంటున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.

ఈ క్రమంలోనే  ఇమ్రాన్  అనే వ్యక్తి వీడియో కాల్స్ ద్వారా యువతులకు బ్రెయిన్ వాష్ చేస్తూ మత మార్పిడికి ప్రేరేపిస్తున్నట్లు పోలీసులు ఎఫ్ఐఆర్ లో నమోదు చేశారు. ప్రస్తుతం ఈ కేసులో దర్యాప్తు వేగవంతమైంది. ఇప్పటివరకు లైంగిక దాడికి సంబంధించి 9 కేసులు, బలవంతపు మత మార్పిడికి సంబంధించి 2 కేసులు నమోదయ్యాయి. బాధితులకు కౌన్సెలింగ్ ఇస్తున్న కొద్దీ మరిన్ని కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయనీ..  త్వరలోనే మరికొన్ని కేసులు నమోదయ్యే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు. ఈ కేసులో కేవలం స్థానిక నేరస్తులే కాకుండా, విదేశీ శక్తుల ప్రమేయం కూడా ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బాధితులను మలేషియా వంటి దేశాలకు తరలించే ప్రణాళిక ఉందా అన్న  కోణంలో దర్యాప్తు సాగుతోంది.

మరోవైపు ఈ ఘటనపై కార్పొరేట్ బాధ్యతపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. టీసీఎస్ వంటి ప్రతిష్టాత్మక సంస్థలో ఇలాంటి సంఘటనలు చోటుచేసుకోవడం యాజమాన్య వైఫల్యమేనన్న విమర్శలూ వెల్లువెత్తుతున్నాయి.  సంస్థలోని అంతర్గత మహిళా భద్రతా కమిటీలు  ఏం చేస్తున్నాయని సామాజిక కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థలు కూడా ఈ కేసుపై దృష్టి సారించాయి, ముఖ్యంగా టెర్రర్ ఫండింగ్ వంటి కోణాలు  ఉన్నాయా అన్న కోణంలో వారు దర్యాప్తు చేస్తున్నారు.

మరో వైపు రాజకీయంగా కూడా ఈ అంశం వేడెక్కింది. గత ప్రభుత్వాల హయాంలో ఇటువంటి ఫిర్యాదులను నిర్లక్ష్యం చేశారని.. ప్రస్తుత ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాల  ద్వారా నిజాలను వెలికితీస్తోందని బీజేపీ నేతల వ్యాఖ్యలు రాజకీయ వేడిని రగులుస్తున్నాయి.   కార్పొరేట్ కార్యాలయాల్లో మహిళలకు రక్షణ కల్పించడంతో పాటు, ఇలాంటి గూమింగ్ ముఠాల ఆటకట్టించడానికి కఠినమైన నిబంధనలు తీసుకురావాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...