TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

సాయికృష్ణ లాకప్ డెత్ ఘటనపై NHRC ఆగ్రహం

Published on: Fri Jun 26, 2026 9:16PM

 

విజయవాడలో జరిగిన సాయికృష్ణ కస్టడీ మరణం కేసులో జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తెలంగాణకు చెందిన మానవ హక్కుల న్యాయవాది రామారావు ఇమ్మనేని ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన కమిషన్, ఈ ఘటనను **"జీవించే హక్కుపై జరిగిన ఘోర ఉల్లంఘన"**గా అభివర్ణించింది.

ప్రాథమిక విచారణలో విజయవాడలో అక్రమ నిర్బంధం, ప్రాణాంతక హింస జరిగినట్లు ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) గుర్తించిన విషయాన్ని కమిషన్ ప్రస్తావించింది. లాకప్ డెత్‌ను దాచిపెట్టేందుకు యువకుడి మృతదేహాన్ని దహనం చేసి, బూడిదను నదిలో కలిపేశారన్న ఆరోపణలు అత్యంత ఆందోళనకరమని వ్యాఖ్యానించింది.

మరణానికి ముందు కృష్ణలంక సీఐ నాగరాజు "నీ కొడుకుకు దండ కొనుక్కో" అంటూ అవమానకరంగా మాట్లాడాడని బాధితుడి తల్లి గాదె విజయలక్ష్మి చేసిన ఆరోపణలను కూడా కమిషన్ తన పరిశీలనలో ప్రస్తావించింది. ఈ కేసులో సీఐ నాగరాజును సస్పెండ్ చేసి, సిట్ విచారణ అనంతరం రిమాండ్‌కు తరలించిన విషయాన్ని గుర్తు చేసింది.

ఆధారాలను ధ్వంసం చేసే ఉద్దేశంతో కృష్ణలంక పోలీస్ స్టేషన్ సీసీటీవీ ఫుటేజీని కావాలనే డిలీట్ చేశారన్న ఆరోపణలపై కూడా NHRC తీవ్రంగా స్పందించింది. డిలీట్ చేసిన ఫుటేజీని రికవర్ చేయాలని, బాధితుడి అస్థికలను వెలికితీయడానికి చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించింది.

ఈ ఘటనలో ఆంధ్రప్రదేశ్ పోలీసుల తీరును తీవ్రంగా ఖండించిన కమిషన్, రాష్ట్ర డీజీపీతో పాటు విజయవాడ పోలీస్ కమిషనర్‌కు వారం రోజుల్లో సమగ్ర "యాక్షన్ టేకన్ రిపోర్ట్" (ATR) సమర్పించాలని నోటీసులు జారీ చేసింది. అలాగే ఎఫ్‌ఐఆర్ దర్యాప్తు పురోగతి, నిందితుల వివరాలు, బాధిత కుటుంబానికి అందించిన పరిహారం, గాదె విజయలక్ష్మికి కల్పించిన భద్రతపై పూర్తి నివేదిక సమర్పించాలని ఆదేశించింది.

ఈ ఘటన అంతర్జాతీయ మానవ హక్కుల ప్రమాణాలను ఉల్లంఘించే అత్యంత తీవ్రమైన కేసుగా కనిపిస్తోందని పేర్కొన్న NHRC, బాధ్యులపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది.