భారత్–చైనా ఎలక్ట్రానిక్స్ వాణిజ్యంలో సరికొత్త అధ్యాయం

posted on: Jun 12, 2026 4:07PM

గ్లోబల్ ఎలక్ట్రానిక్స్ రంగంలో భారతదేశం సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. ఒకప్పుడు చైనా నుండి భారీగా సాంకేతిక ఉత్పత్తులను,  ఎలక్ట్రానిక్ వస్తువులను దిగుమతి చేసుకున్న భారత్..  ఇప్పుడు ఏకంగా అదే చైనాకి భారీ ఎత్తున ఎలక్ట్రానిక్ విడిభాగాలను ఎగుమతి చేసే స్థాయికి ఎదిగింది. చైనాకు ఏకంగా 35 వేల కోట్ల రూపాయల విలువైన ఎలక్ట్రానిక్ విడిభాగాలను భారతదేశం విజయవంతంగా ఎగుమతి చేసిందని కేంద్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ అధికారికంగా వెల్లడించారు. ఈ అసాధారణ పరిణామం కేవలం వాణిజ్య పరమైన అంకెలకు మాత్రమే పరిమితమైనది కాదు.  అంతర్జాతీయ సాంకేతిక విలువ గొలుసులో (గ్లోబల్ వాల్యూ చైన్స్) భారతదేశం ఒక నమ్మకమైన,  అత్యంత కీలకమైన భాగస్వామిగా రూపాంతరం చెందిందనే విషయానికి ఇది స్పష్టమైన నిదర్శనం.  

గడచిన దశాబ్ద కాలంలో దేశీయ సాంకేతిక, ఉత్పాదక రంగాల్లో చోటుచేసుకున్న నిర్మాణాత్మక మార్పుల వల్లే ఈ అద్భుతమైన విజయం సాధ్యమైందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  గతంలో కేవలం ఇతర దేశాల నుంచి విడిభాగాలను తెచ్చి ఇక్కడ అసెంబుల్  చేసే దేశంగా ఉన్నఇండియా..  నేడు స్వయంగా హైటెక్ భాగాల రూపకల్పన, డిజైనింగ్, అలాగే  పూర్తి స్థాయి తయారీ సామర్థ్యాన్ని సంతరించుకుంది. కేవలం స్క్రూడ్రైవర్ సాంకేతికతతో కాలం గడిపే రోజులు పోయాయనీ..  ప్రస్తుతం అత్యాధునిక మాడ్యూల్స్, మైక్రో కాంపోనెంట్స్, ఇంకా  క్లిష్టమైన డిజైన్ల తయారీ స్థాయికి భారతీయ పరిశ్రమలు చేరుకున్నాయని కేంద్ర మంత్రి ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే విదేశీ మార్కెట్లపై ఆధారపడటం తగ్గడమే కాకుండా, ప్రపంచంలోనే అతిపెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ హబ్‌గా ఉన్న చైనాకే ఇండియా  ఎగుమతులు చేయడం దేశీయ పారిశ్రామిక శక్తికి అద్దం పడుతోంది.  

ఈ భారీ వృద్ధి వెనుక గత కొన్ని సంవత్సరాలుగా భారత ప్రభుత్వం అనుసరిస్తున్న వ్యూహాత్మక విధానాలు, అమలు చేస్తున్న సంస్కరణలు ఎంతో కీలక పాత్ర పోషించాయి. ముఖ్యంగా దేశీయంగా ఎలక్ట్రానిక్స్ పరిశ్రమను ప్రోత్సహించడానికి ప్రవేశపెట్టిన ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ (పీఎల్ఐ) పథకం ఈ రంగానికి కొండంత అండగా నిలిచింది. ఈ పథకం ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న దిగ్గజ టెక్నాలజీ కంపెనీలు భారతదేశంలో భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చాయి. దీనికి తోడు ఇండియా సెమీకండక్టర్ మిషన్ (ఐఎస్ఎమ్) వంటి ప్రతిష్టాత్మక కార్యక్రమాలు దేశంలో చిప్ డిజైనింగ్,  ఫ్యాబ్రికేషన్ రంగంలో సరికొత్త విప్లవానికి తెర లేపింది. చిప్ డిజైన్ స్టార్టప్‌లకు ఆర్థిక తోడ్పాటు అందించడంతో పాటు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన మౌలిక సదుపాయాల కల్పనపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది.  ఈ పారిశ్రామిక పురోగతి కేవలం ఎగుమతులకే పరిమితం కాకుండా దేశీయంగా భారీ ఎత్తున సామాజిక, ఆర్థిక మార్పులకు కారణమవుతోంది. ఎలక్ట్రానిక్స్ పరిశ్రమ విస్తరణ వల్ల దేశవ్యాప్తంగా దాదాపు పాతిక లక్షల మేర నాణ్యమైన,  నైపుణ్యంతో కూడిన ఉద్యోగ అవకాశాలు ఏర్పడ్డాయి. చిప్ డిజైన్, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, అడ్వాన్స్‌డ్ మ్యానుఫ్యాక్చరింగ్ వంటి విభాగాల్లో భారత  యువతకు అంతర్జాతీయ స్థాయి నైపుణ్యాలు లభిస్తున్నాయి. 

అలాగే దేశంలో ప్రాంతీయ సమతుల్యతను సాధిస్తూ బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, నోయిడా వంటి నగరాలు సరికొత్త ఎలక్ట్రానిక్స్ క్లస్టర్లుగా అవతరించగా..  గుజరాత్ వంటి రాష్ట్రాలు గ్లోబల్ సెమీకండక్టర్ హబ్‌గా వేగంగా రూపాంతరం చెందుతున్నాయి.  భారతదేశం సాధించిన ఈ ప్రగతి అంతర్జాతీయంగా కూడా మీడియా,  పారిశ్రామిక వర్గాల ఆలోచనా విధానాన్ని పూర్తిగా మార్చేసింది. గతంలో అంతర్జాతీయ మీడియా ఇండియాను  కేవలం ఒక తక్కువ ఖర్చుతో కూడిన అసెంబుల్  కేంద్రంగా,  చైనా సరఫరాలపై ఆధారపడే దేశంగా మాత్రమే చూసేది. కానీ ప్రస్తుత పరిణామాలు భారత దేశాన్ని అమెరికా, యూరప్,   చైనా వంటి పెద్ద మార్కెట్లకు నమ్మకమైన సాంకేతిక భాగస్వామిగా నిలబెట్టాయి. 

స్మార్ట్‌ఫోన్ల ఎగుమతుల్లో ఇప్పటికే సరికొత్త మైలురాళ్లను అందుకున్న ఇండియా.. ఇప్పుడు ప్రపంచానికి కేవలం ఉత్పత్తులను మాత్రమే కాకుండా తమ సొంత ఆవిష్కరణలను సైతం విజయవంతంగా ఎగుమతి చేస్తోందనే ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.  రాబోయే రోజుల్లో ఈ రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు ప్రభుత్వం సుదీర్ఘ కాలిక వ్యూహాలను అమలు చేస్తోంది. ప్రస్తుతం దేశంలో సుమారు 75 ఎలక్ట్రానిక్ విడిభాగాల కర్మాగారాలు నిర్మాణ దశలో ఉండగా, రాబోయే రెండు మూడు సంవత్సరాలలో మరో 250 కొత్త కర్మాగారాలను అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది. పూర్తి స్థాయి సెమీకండక్టర్,  చిప్ తయారీలో విదేశాలపై ఆధారపడటాన్ని పూర్తిగా తగ్గించుకుంటూ, సరఫరా గొలుసు భద్రతను (సప్లై చైన్ సెక్యూరిటీ) మరింత పటిష్టం చేయడంపై భవిష్యత్తు ప్రణాళికలు సాగుతున్నాయి. ఈ అడుగులతో రానున్న కాలంలో గ్లోబల్ టెక్ మార్కెట్లో భారతదేశం మరింత అగ్రగామిగా నిలుస్తుందని పారిశ్రామిక వర్గాలు,  ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. 

 -సీతారాం కంఠంనేని

ఈ విశ్లేషణ మీకు నచ్చినట్లయితే, దయచేసి https://www.teluguone.com పోర్టల్ ను  ఫాలో అవ్వండి. లైక్ చేయండి. షేర్ చేయండి. మీ విలువైన అభిప్రయాలను తెలియజేయండి.    

google-ad-img
    Related Sigment News
    • Loading...