ప్రధాని నోట ఖురాన్‌ మాట

posted on: Mar 18, 2016 10:59AM

 

ఇస్లాంలోని ఒక ఉపమార్గంగా భావించే సూఫీ తత్వాన్ని, విశ్వవ్యాప్తం చేసేందుకు నిన్న దిల్లీలో ఓ అంతర్జాతీయ సమావేశం జరిగింది. ఇందులో ముఖ్య అతిథిగా పాల్గొన్న భారత ప్రధాని నరేంద్ర మోదీ ఒక పక్క ఉగ్రవాదాన్ని దుయ్యబడుతూనే, ఇస్లాంను శాంతిని కోరే మతంగా అభివర్ణించారు. మోదీ ప్రసంగం ఆరంభంలోనే సభనుంచి భారత్ మాతాకీ జై అన్న నినాదాలు వినిపించడం గమనార్హం. దాదాపు అరగంటపాటు సుదీర్ఘంగా సాగిన ప్రసంగంలో మోదీ సూఫీ తత్వాన్ని కొనియాడారు. సూఫీ తత్వం ఇస్లాంలోని ఉన్నత ఆదర్శాలను తలకెత్తుకుంటూనే... అతివాదాన్నీ, ఉగ్రవాదాన్నీ తిరస్కరిస్తుందని ప్రశంసించారు. అల్లాహ్‌కు ఉన్న 99 పేర్లలో ఒక్కటి కూడా హింసను సూచించదనీ, పైగా మొదటి రెండు పేర్లూ ఆయన కరుణను సూచిస్తాయని అన్నారు.

 

ఉగ్రవాదానికి ఓ మతమంటూ ఉండదనీ, వారు కేవలం తమ అమానుష చర్యలను కప్పిపుచ్చుకునేందుకు మతాన్ని ఓ ముసుగుగా ధరిస్తారనీ విమర్శించారు. ఉగ్రవాదుల చర్యలకు ముందుగా బలయ్యేది వారు ఉంటున్న దేశం, వారి సొంత ప్రజలే అని హెచ్చరించారు. దేశమంతటా ఇప్పడు అతివాదం గురించి, అసహనం గురించి చర్చలు జరుగుతున్న సందర్భంలో ప్రధానమంత్రి పరమత సహనాన్నీ, విశ్వశాంతినీ కాంక్షిస్తూ ప్రసంగం సాగించడం ఒక సానుకూల వాతావరణాన్ని సృష్టిస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...