జగన్ జిల్లాలో... క్యాంపు రాజకీయాల జాతర!
posted on Feb 9, 2017 4:14PM

క్యాంపు రాజకీయాలు ... ఈ మాట వినగానే ఇప్పుడు అందరి ఆలోచనలు తమిళనాడు మీదకి మళ్లుతున్నాయి. అక్కడ పన్నీర్ సెల్వం, శశికళ శిబిరాల మధ్య భీభత్సమైన వార్ నడుస్తోంది. అందులో ఎమ్మెల్యేలే ఆయుధాలు. అందుకే, వారిని జాగ్రత్తగా కాపాడుకునేందుకు శశికళ శాయశక్తులా ప్రయత్నిస్తోంది. క్యాంపు ఏర్పాటు చేసి ప్రజా ప్రతినిధుల్ని జాగ్రత్తగా దాచేసింది. అయితే, ఈ క్యాంపు రాజకీయాలు ముఖ్యమంత్రి సీటు కోసం జరిగే బలపరీక్షల్లోనే అనుకుంటే పొరపాటే! అన్ని స్థాయుల్లోనూ మన నేతలు క్యాంపులకి తెర తీస్తున్నారు. పరోక్ష ఎన్నికలు ఎప్పుడు, ఎక్కడ జరిగినా ప్రజా ప్రతినిధుల్ని గుట్టుగా దాచేయటం మామూలైపోయింది!
మరి కొన్ని రోజుల్లో ఏపీలోని ఎమ్మెల్సీ స్థానాలకి ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. అయితే, కడపలో మాత్రం ఎమ్మెల్సీ ఫైట్ తీవ్రంగా వుంది. అది జగన్ జిల్లా కావటంతో వైసీపీ గెలుపు కోసం మంచి ఊపు మీద వుంది. ఎలాగైనా మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డిని గెలిపించుకోవాలని ఆ పార్టీ భావిస్తోంది. అందుకు తగ్గ ఎంపీటీసీ, జెడ్పీటీసీ సంఖ్యా బలం కూడా జగన్ వద్ద వుంది. కాని, టీడీపీ కూడా ప్రతిపక్ష నేత స్వంత జిల్లాలో పాగా వేసేందుకు పట్టుదలతో వుండటంతోనే ఆట రక్తి కడుతోంది. రెండు పార్టీలు ఒక్కో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఓటుని కూడా అమూల్యంగా భావిస్తున్నాయి!
ఇప్పటికే చంద్రబాబు తమ నేతలకి చెప్పి కడప జిల్లా ఎంపీటీసీ, జెడ్పీటీసీలతో చర్చలు జరిపించారు. త్వరలో వారితో రాజధానిలో సమావేశం కూడా అవ్వనున్నారు. అటు జగన్ అయితే తన జిల్లాకు వచ్చి వైసీపీ మద్దతుదారులతో ఆల్రెడీ సమావేశం అయిపోయారు. ఆయన తానే భవిష్యత్ సీఎం అని వారికి భరోసా ఇచ్చి ఓటు వైసీపీకే వేయాలని చెప్పాడు. అయితే, ఇంత చేస్తున్నా తమ మద్దతుదారులు ఎక్కడ చేజారిపోతారోనని టీడీపీ, వైసీపీలు రెండిటికీ భయంగానే వుంది. అందుకే, క్యాంపులకి సిద్ధమవుతోన్నట్టు తెలుస్తోంది!
టీడీపీ నేతలు కడపలోని తమ ఎంపీటీసీ, జెడ్పీటీసీలను రాజధానికి తరలిస్తే.. వైసీపీ జిల్లాలోనే వుంచుతూ నేతలు ఎటూ పోకుండా జాగ్రత్తపడుతోంది. మొత్తానికి ఎమ్మెల్సీ ఎన్నికల వేళ మరో సారి ప్రజా ప్రతినిధులు సంతలో సరుకుల్లా మారిపోయారు. అయినా కూడా డబ్బుల సంచుల చుట్టూ తిరుగుతోన్న ప్రస్తుత రాజకీయంలో ఏ పార్టీ మడి కట్టుకుని కూ్ర్చునే అవకాశం లేకుండా పోతోంది! అదీ అసలు సమస్య...