అభిషేక్ బెనర్జీపై దాడి...సీఈవోకు మమత వార్నింగ్

posted on: May 31, 2026 1:03PM

 

పశ్చిమ బెంగాల్ రాజకీయం మరోసారి హీటెక్కింది. తృణమూల్ కాంగ్రెస్  కీలక నేత అభిషేక్ బెనర్జీపై జరిగిన దాడి ఉదంతం.. ప్రస్తుతం అధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్ర స్థాయి ఘర్షణకు దారితీసింది. ఈ క్రమంలోనే కోల్‌కతాలోని ఓ ప్రముఖ ప్రైవేట్ ఆసుపత్రి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ తో మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మాట్లాడినట్లు చెబుతున్న ఒక ఆడియో క్లిప్ సామాజిక మాధ్యమాల్లో ప్రత్యక్షమవ్వడం కలకలం రేపుతోంది.

తీవ్ర గాయాలపాలైన అభిషేక్ బెనర్జీ ప్రస్తుతం కోల్‌కతాలోని ప్రఖ్యాత బెల్ వ్యూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే, ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నప్పటికీ, డిశ్చార్జ్ చేయాలంటూ భారతీయ జనతా పార్టీ నాయకులతో పాటు ఒక సీనియర్ పోలీస్ అధికారి ఆసుపత్రి యాజమాన్యంపై విపరీతమైన ఒత్తిడి తీసుకువచ్చారని మమతా బెనర్జీ ఆరోపిస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే బెల్ వ్యూ ఆసుపత్రి సీఈవో ప్రదీప్ టాండన్‌తో మమతా బెనర్జీ మాట్లాడిన ఆడియో వెలుగులోకి వచ్చింది. తన మేనల్లుడి ప్రాణాలకు ఏమాత్రం ముప్పు వాటిల్లినా దానికి పూర్తి బాధ్యత ఆసుపత్రి యాజమాన్యానిదేనంటూ ఆమె ఆ ఫోన్ సంభాషణలో గట్టిగా హెచ్చరించినట్లు స్పష్టమవుతోంది.

వైద్య సేవల విషయంలో రాజకీయ ఒత్తిళ్లకు లొంగిపోవడంపై మమత తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. గతంలో తాము చేసిన సాయాన్ని గుర్తుంచుకోవాలని, ప్రస్తుత ప్రవర్తనను దేవుడు కూడా క్షమించడని సదరు సీఈవోకు ఆమె స్పష్టం చేసినట్లు ఆడియో ద్వారా తెలుస్తోంది.

బీజేపీ నాయకుల మాటలు విని తప్పుదోవ పట్టవద్దని, ఇప్పుడు వారు అధికారంలో ఉన్నంత మాత్రాన శాశ్వతం కాదని మమతా బెనర్జీ వ్యాఖ్యానించారు. భవిష్యత్తులో అధికార మార్పిడి జరిగినప్పుడు తాము తీసుకోవాల్సిన చర్యలు తీసుకుంటామని సంచలన హెచ్చరికలు జారీ చేశారు.

ప్రస్తుతం ఈ ఆడియో క్లిప్ పశ్చిమ బెంగాల్ వ్యాప్తంగా పెను రాజకీయ దుమారాన్ని రేపుతోంది. ఒక ప్రైవేట్ సంస్థ అధిపతిని ఈ విధంగా బెదిరించడం సరికాదని ప్రతిపక్షాలు మండిపడుతుండగా, ఒక రోగి ప్రాణాలతో ఆడుకోవాలని చూస్తే చూస్తూ ఊరుకోబోమని టీఎంసీ శ్రేణులు సమర్థిస్తున్నాయి.

మరోవైపు, అభిషేక్ బెనర్జీపై జరిగిన దాడిని సీరియస్‌గా తీసుకున్న పోలీసులు ఇప్పటికే రంగంలోకి దిగి విచారణ చేపట్టారు. ఈ దాడి ఉదంతానికి సంబంధించి ఇప్పటివరకు ఐదుగురు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు పోలీస్ వర్గాలు వెల్లడించారు.

ప్రస్తుతం అభిషేక్ బెనర్జీకి ఇంటి వద్దే ప్రత్యేక వైద్య బృందం పర్యవేక్షణలో చికిత్స అందిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఆడియో లీక్ వ్యవహారం రానున్న రోజుల్లో బెంగాల్ రాజకీయాల్లో ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో, దీనిపై ఇరు పక్షాలు ఎలా స్పందిస్తాయో వేచి చూడాలి.

google-ad-img
    Related Sigment News
    • Loading...