సంచలనం రేపుతున్న మాఫియా డాన్, లాలూ ఫోన్ క్లిప్
posted on: May 6, 2017 6:02PM
.jpg)
ఒక జాతీయ మీడియా ఆర్జేడీ అధిపతి లాలూ ప్రసాద్ యాదవ్, మాఫియా డాన్ షహాబుద్దీన్ తో ఫోన్ లో మాట్లాడిన ఆడియో క్లిప్ లీక్ చేయడం సంచలనానికి తెర లేపింది. ఆ ఆడియో క్లిప్ లో షహాబుద్దీన్, లాలూ యాదవ్ కి శివన్ ఎస్పీ సౌరభ్ కుమార్ షా ని తొలగించాల్సిందిగా ఆర్డర్ చేసినట్టు వినిపించింది. "ఆ ఎస్పీని, ఇంకొందరు పనికిరాని అధికారుల్ని పంపించేయండి, మావాళ్ళు అల్లర్లు సృష్టిస్తారు," అని షహాబుద్దీన్ లాలూ కి దిశా నిర్దేశం చేసినట్టుగా ఆ క్లిప్ లో ఉంది. భారతీయ జనతా పార్టీ లీడర్ సుశీల్ కుమార్ మోడీ, లాలూ ప్రసాద్ పై విరుచుకుపడ్డాడు. ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తన రాజకీయ భాగస్వామి లాలూ ప్రసాద్ యాదవ్ చేస్తున్న తప్పుడు పనులని చూసీ చూడనట్టు వ్యవహరిస్తున్నారని, లాలూ అయితే నేరస్థులకు కొమ్ము కాస్తున్నారని దుయ్యబట్టారు. "ఆ మీడియా లాలూ, షహాబుద్దీన్ లాంటి ఒక క్రిమినల్ చెప్పిన విదంగా ఎలా వ్యవహరిస్తున్నారో తెలియజేసింది. మరి, ముఖ్యమంత్రి నితీష్ కుమార్ దీనికి ఎలా జవాబిస్తారో చూడాలి," అని అన్నారు. అయితే, నితీష్ కుమార్ పార్టీ వర్గీయులు మాత్రం ఈ విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. బీహార్ ప్రభుత్వం ఈ విషయాన్ని దర్యాప్తు చేస్తుందని, ఆ ఆడియో క్లిప్ లో చెప్పబడిన ఎస్పీ ని విధుల్లోంచి తొలగించలేదని, తాము చట్టం పట్ల ఎంత నిభద్దదతో ఉంటామో ఇది రుజువు చేస్తుందని, చెప్పుకొచ్చారు. శివన్ నుండి నాలుగు సార్లు ఎంపీ గా ఎన్నికయిన షహాబుద్దీన్ కి అంతకు ముందు నేర చరిత్ర ఉంది. అతని మీద చాలా క్రిమినల్ కేసు లు ఉన్నాయి. సుప్రీమ్ కోర్ట్ షహాబుద్దీన్ కి బెయిల్ నిరాకరించడంతో, ప్రస్తుతం ఢిల్లీ లోని తీహార్ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. ఇదిలా ఉంటే, ఆర్జేడీ మాత్రం ఇప్పటికీ షహాబుద్దీన్ కి మద్దతుగా మాట్లాడుతోంది. "ఆడియో క్లిప్ ని ఆధారంగా చేసుకొని ఇప్పుడు ఏం మాట్లాడలేం. షహాబుద్దీన్ మంచి లీడర్. మా మద్దతు అతనికుంటుంది. కానీ, ఒక వేళ ఆయన నిజంగా లాలూ తో జైలు నుండి ఫోన్ లో మాట్లాడుంటే మాత్రం అది పెద్ద తప్పే," అని పార్టీ సీనియర్ లీడర్ ఒకరు చెప్పారు. అయితే, సుశీల్ కుమార్ మోడీ మాత్రం నితీష్ కుమార్, లాలూ తో అలయెన్స్ రద్దు చేసుకోవాలని... లాలూ ప్రజా జీవితాన్ని వదిలేయాలని అభిప్రాయపడ్డారు.




.jpg)


.webp)


