బెంగాల్లో ల‌క్ష్మీర్ భాండార్ వివాదం..మ‌త‌ల‌బు ఏమిటి?

posted on: Jun 6, 2026 5:33PM

 సంక్షేమం, ఓటు బ్యాంక్, అక్రమ చొరబాటు.. బెంగాల్‌లో ప్రస్తుతం జరుగుతున్న చర్చ ఒక్కటే ప్రశ్న చుట్టూ తిరుగుతోంది.  రాష్ట్రం నడుస్తుందా-  లేక ఓటు బ్యాంక్ మార్కెట్ నడుస్తుందా? అన్న డిబేట్ కి తెర‌లేచింది.  లక్ష్మీర్ భండార్ పథకం, దాని స్థానంలో వస్తున్న.. అన్నపూర్ణ యోజన, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(సర్)  ద్వారా వెలుగులోకి వచ్చిన ఓటరు జాబితా లోపాలు, అక్రమ చొరబాటు ఆరోపణలు.. ఇవన్నీ కలిసిపోయి ఇప్పుడు బెంగాల్ రాజకీయాలను, దేశ భద్రత చర్చను, సంక్షేమ రాజ్య తత్వాన్ని ఒకేసారి ప్రశ్నిస్తున్నాయి. 

సంక్షేమం పేరిట‌ నడిచేది నిజంగా పేదల రక్షణా? లేక‌ ఓటు బ్యాంక్‌ను కాపాడే డబ్బు యంత్రమా?

సర్  ప్రక్రియలో బెంగాల్‌లో కోట్ల సంఖ్యలో..  లాజికల్ ఇన్‌కన్సిస్టెన్సీలు, లక్షల సంఖ్యలో అనుమానాస్పద ఓటర్లు, ఇప్పుడు లక్ష్మీర్ భండార్ లబ్ధిదారుల్లో.. 30 లక్షల మంది అనర్హులని ప్రభుత్వమే ప్రకటించడం.. ఇవన్నీ కలిపి ఒక పెద్ద వ్యవస్థాత్మక సమస్యను సూచిస్తున్నాయి.  బెంగాల్‌లో సంక్షేమ రాజకీయాల పరిణామం ఎలాంటిదో చూస్తే.. వామపక్ష హయాంలో రేషన్, భూమి పంపిణీ, కార్మిక హక్కులు.. ఇవే ప్రధాన నినాదాలు. మమతా బెనర్జీ యుగంలో.. మా, మాటీ, మానుష్  నినాదంతో పాటు, 90కి పైగా సంక్షేమ పథకాలు, ముఖ్యంగా మహిళలు, యువత, మైనారిటీలకు లక్ష్యంగా పెట్టిన డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్- డీబీటీ మోడల్.
 
లక్ష్మీర్ భండార్ పథకం- 2021లో ప్రారంభమై, 25 నుంచి 60 ఏళ్ల మధ్య వయస్సు గల మహిళలకు నెలనెలా నగదు సహాయం అందించే పథకంగా రూపుదిద్దుకుంది. సాధారణ వర్గానికి రూ.1,500,ఎస్సీఎస్టీ  వర్గాలకు రూ.1,700 చొప్పున నేరుగా ఖాతాల్లోకి జమ అయ్యే విధాన‌మిది. అయితే ఇది, సంక్షేమం- సామాజిక న్యాయమా, రాజకీయ పెట్టుబడా? అన్న ప్ర‌శ్న‌కు తెర‌లేచింది. అకడమిక్ అధ్యయనాలు ఏం చెబుతున్నాయంటే, లక్ష్మీర్ భండార్ వంటి పథకాలు మహిళల ఆర్థిక భద్రతకు కొంత ఉపశమనం క‌లిగించినా, అవి ఎన్నికల రాజకీయాల్లో కీలక ఓటు బ్యాంక్ సాధనాలుగా కూడా పనిచేశాయని. 

ఇక ఎలక్షన్ కమిషన్ చేపట్టిన సర్ ప్రక్రియలో బెంగాల్ ఓటరు జాబితాలో భారీ అసమానతలు బయటపడ్డాయి. 2002 ఓటరు జాబితాతో పోల్చితే సుమారు 26 లక్షల పేర్లలో డేటా మిస్‌మ్యాచ్ అవుతోంది.  కుటుంబ సంబంధాల డేటాలో 94 లక్షల కేసులు  ప‌ర‌స్ప‌రం విరుద్ధంగా ఉన్న‌ట్టు గుర్తించారు.
  
తండ్రి–తల్లి వయస్సు తేడా అసాధ‌ర‌ణ‌ స్థాయిలో ఉండటం,ఆరుగురికి పైగా పిల్లలు చూపించడం,  లింగం, వయస్సు, తరం సంబంధాలు గందరగోళంగా ఉండటం. ఎలక్షన్ కమిషన్ స్పష్టంగా ఎత్తి చూపింది. ఇవి నేరుగా డిలీషన్‌కు దారి తీసే అంశాలు కావు, కానీ..  బోగస్ ఓటర్ల ప్రయత్నాలు, ఫేక్ ఫ్యామిలీ లింకులు ఉన్నాయని ప్రాథమికంగా గుర్తించామని ప్ర‌క‌టించింది.
 
సువేందు అధికారి ఆరోపణలు ఏంటంటే.. కోట్లలో ఫేక్ ఓటర్లున్నార‌ని. బెంగాల్‌లో 73 లక్షల నుంచి 1.25 కోట్ల వరకు ఫేక్ ఓటర్లు, అక్రమ చొరబాటుదారులు, రోహింగ్యాలు, బంగ్లాదేశీ ముస్లింలు ఓటరు జాబితాలో ఉన్నారని సువేందు అధికారి పలు దఫాలుగా ఆరోపించారు.  కొన్ని ప్రాంతాల్లో ఒక్కో పేరు చేర్చడానికి లంచం తీసుకుని బంగ్లాదేశీ పౌరులను ఓటర్లుగా నమోదు చేస్తున్నారనిఎఫ్ఐఆర్ లతో సహా ఆరోపణలు వచ్చాయి. ఇవి ఇప్పటికీ పూర్తిగా న్యాయపరంగా నిరూపితమైన తీర్పులు కాకపోయినా..  ఎన్నికల వ్యవస్థపై ప్రజల్లో అనుమానాన్ని పెంచే రాజకీయ, పరిపాలనా సంకేతాలుగా నిలిచాయి.

లక్ష్మీర్ భండార్ లో 30 లక్షల అనర్హులైన‌ లబ్ధిదారులున్న‌ట్టు గుర్తించినట్ల  2026 మేలో  అధికారంలోకి వచ్చిన సువేందు అధికారి నేతృత్వంలోని  ప్రభుత్వం ప్రకటించింది. . లక్ష్మీర్ భండార్ పథకంలో సుమారు 30 లక్షల మంది లబ్ధిదారులు అనర్హులని అంటోంది సువేందు స‌ర్కార్.  వీరిలో ఓటరు జాబితా నుంచి.. శాశ్వతంగా తొలగించబడినవారు, సర్  ట్రైబ్యునల్‌కు అప్పీల్ చేయని వారు, సీఏఏ కింద పౌరసత్వానికి దరఖాస్తు చేయని నాన్ ఇండియన్స్ కూడా ఉన్నారని ప్రభుత్వం అధికారికంగా ప్ర‌క‌టించింది. అదే సమయంలో, అన్నపూర్ణ యోజన పేరుతో అదే మోడల్‌ను కొనసాగిస్తూ, నెలకు రూ.3 వేలు చొప్పున పెంచిన పథకాన్నిబీజేపీ  ప్రభుత్వం ప్రకటించింది. కానీ  కేవలం భార‌త‌ మహిళలకే  అని స్పష్టమైన అర్హతా ప్రమాణం పెట్టింది. 

ఇక‌ న్యాయపరమైన అంశాలు ఎలాంటివో చూస్తే..  పౌరసత్వం, ఓటు హక్కు, సంక్షేమ హక్కు వంటి వివ‌రాల్లోకి వెళ్తే..  పౌరసత్వం వర్సెస్  ఓటు హక్కు విష‌యంపై సుప్రీం కోర్టు ఇటీవల ఒక విష‌యం స్పష్టం చేసింది. సర్  ద్వారా ఎలక్షన్ కమిషన్ చేసే నిర్ణయాలు  ఎలక్టోరల్ పర్పస్ వరకే పరిమితం, అవి పౌరసత్వంపై తుది తీర్పు కావని క్లారిటీ ఇచ్చింది. అంటే..  ఓటరు జాబితా నుంచి పేరు తొలగించడం అంటే, పౌరసత్వం కోల్పోవడం కాదని అర్ధం. కానీ అదే డేటాను ఆధారంగా తీసుకుని.. సంక్షేమ పథకాల అర్హతను నిర్ణయించడం.. ఇది ప్ర‌స్తుతం బెంగాల్‌లో జరుగుతున్న కొత్త రాజకీయ, న్యాయపరమైన ప్రయోగం.

సీఏఏ, సర్, సంక్షేమం.. ప్ర‌స్తుతం ఇదో పొలిటిక‌ల్ ట్ర‌యాంగిల్ కింద  త‌యారైంది. సువేందు అధికారి ప్రభుత్వం స్పష్టంగా చెబుతోంది  ఏంటంటే, సీఏఏ కింద పౌరసత్వానికి దరఖాస్తు చేసినవారు,  లేదా సర్ ట్రైబ్యునల్ ముందు అప్పీల్ చేసినవారు.. వీరికి అన్నపూర్ణ యోజన కొనసాగుతుంది. మిగతా  నాన్ ఇండియన్స్ కి ఈ సంక్షేమం నిలిపివేస్తారు.  ఇది సంక్షేమ హక్కును పౌరసత్వ నిర్ధారణతో నేరుగా కట్టిపడేసే మోడల్, దీనిపై భవిష్యత్తులో రాజ్యాంగ, న్యాయపరమైన చర్చలు మరింత ముదిరే అవకాశం క‌నిపిస్తోంది.

ఇందులో తృణమూల్ కాంగ్రెస్  వాదన ఏంటంటే, సర్ పేరుతో సైలెంట్ ఇన్విజ‌బుల్ రిగ్గింగ్ జరుగుతోందని, నిజమైన భారతీయుల పేర్లు తొలగిస్తున్నారని ఆరోపిస్తోంది.   సంక్షేమ పథకాలపై దాడి అంటే, అది పేదలపై దాడి, మైనారిటీలపై దాడి అని ప్రచారం చేస్తోంది. ఇక BJP వాదన ఎలాంటిదంటే.. అక్రమ చొరబాటు, రోహింగ్యాలు, బంగ్లాదేశీ ముస్లింలను ఓటర్లుగా, లబ్ధిదారులుగా మార్చిన ఓటు బ్యాంకు రాజ‌కీయాల‌ను క్లీన్ చేస్తున్నామని అంటోంది. 
 
లక్ష్మీర్ భండార్ వంటి పథకాలు మహిళల ఆర్థిక స్వాతంత్రానికి కొంత మద్దతు ఇచ్చాయి. కానీ దీర్ఘకాలిక ఉపాధి, నిర్మాణాత్మక మార్పులు లేకపోతే ఇవి డిపెండెన్సీ మోడల్ గా మారే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు పరిశీలకులు.  ఇక ప్రో–నేషనలిస్ట్, కన్సర్వేటివ్ కథనాలు ఎలా ఉన్నాయంటే.. అక్రమ బంగ్లాదేశీయులు లక్ష్మీర్ భండార్ ద్వారా కోట్ల రూపాయల పన్ను డబ్బు దోచుకున్నారు. సర్ భయంతో సరిహద్దు దాటి పారిపోతున్నారని  అంటున్నాయి. 

కొత్త ప్రభుత్వం..  అదే మోడల్ కానీ, కొత్త బ్రాండింగ్ ఇస్తోంది. ఇందులో విశేషం ఏమిటంటే.. బీజేపీ గతంలో డోల్ పాలిటిక్స్,  అంటే ఉచిత ప‌థ‌కాలపై  విమర్శలు చేసినా.. ఇప్పుడు అదే క్యాష్ ట్రాన్స్‌ఫర్ మోడల్‌ను అన్న‌పూర్ణ భండార్ పేరుతో కొనసాగిస్తూ, మరింత పెంచిన మొత్తాన్ని వాగ్దానం చేసింది.  ఇందులో కూడా ఒక స్పష్టమైన రాజకీయ వాస్తవం దాగి ఉంది. ఏది ఏమైన‌ప్ప‌టికీ సంక్షేమ పథకాలు ఇప్పుడు భారత ఎన్నికల రాజకీయాల్లో  అనివార్యంగా మారిపోయాయన్న‌ది తేట‌తెల్ల‌మవుతోంది.

ట్యాక్స్ పేయ‌ర్స్ కోణంలోంచి చూస్తే.. కొత్త ప్రభుత్వం అంచనా ప్రకారం.. ఫేక్, గోస్ట్, అనర్హత‌గ‌ల‌ లబ్ధిదారులను తొలగిస్తే.. సంవత్సరానికి సుమారు రూ.25వేల‌ కోట్లు ఆదా అవుతాయి.  అదే సమయంలో.. పాత ప్రభుత్వ కాలంలో సంక్షేమ పథకాలపై సంవత్సరానికి రూ.75వేల కోట్ల వరకు ఖర్చ‌య్యింద‌న్న‌ అంచనాలున్నాయి. ఇది నిజంగా పేదల కోసం ఖర్చా? లేక రాజకీయంగా లాభదాయకమైన ఓటు బ్యాంక్ పెట్టుబడా? అనే ప్రశ్నను మరింత పదును పెడుతోంది.

పౌర హక్కులు, మైనారిటీల భయం ఏంటంటే, SIR, CAA, సంక్షేమ అర్హత – ఇవన్నీ కలిసిపోవడంతో,  నిజమైన పౌరుల పేర్లు కూడా పొరపాటున తొలగించబడతాయేమో.. మైనారిటీలు లక్ష్యంగా దాడి జరుగుతుందేమో అనే భయం కూడా ఒక క‌ఠిక‌ వాస్తవం. దేశ భద్రత కోణంలోంచి చూస్తే.. రోహింగ్యాలు, బంగ్లాదేశీ చొరబాటుదారులు, ఉగ్రవాద నెట్‌వర్క్‌లతో సంబంధం గ‌ల‌ వ్యక్తులు.. బెంగాల్ ఓటరు జాబితాలో పేరు పొందిన కేసులు బయటకు రావడం.  బీఎస్ఎఫ్, సరిహద్దు భద్రత, అంతర్గత భద్రత..  ఇవన్నీ ఇప్పుడు ఒకే చ‌ట్రంలోకి వచ్చాయి. ఇక్కడ అసలు ప్రమాదం ఏంటంటే, సరిహద్దు దాటి వచ్చిన వ్యక్తుల కంటే, వారిని  ఓటుగా చూసే రాజకీయ దాహమే ప్రజాస్వామ్యానికి అతి పెద్ద ముప్పు.

లక్ష్మీర్ భండార్ పథకం.. మహిళల ఆర్థిక భద్రతకు కొంత ఉపశమనం ఇచ్చింది..  కానీ అదే సమయంలో, భారీ స్థాయిలో ఫేక్, అనర్హ, నాన్-ఇండియన్ లబ్ధిదారులు ఉన్నారని ఇప్పుడు ప్రభుత్వమే అంగీకరిస్తోంది.  ఓటర్ల‌ జాబితా  విష‌యానికి  వ‌స్తే.. సర్ ద్వారా బయటపడిన  లాజికల్ ఇన్‌కన్సిస్టెన్సీలు, మిస్‌మ్యాచ్‌లు, బోగస్ ఫ్యామిలీ లింకులు.. ఇవి కేవలం టెక్నికల్ లోపాలు కాదు, సంవత్సరాలుగా సాగిన ఓటు బ్యాంక్ ఇంజనీరింగ్‌కు బలమైన సూచనలు. ఇందులోని రాజకీయ కథనాల ప‌రిశీలిస్తే..  సెక్యులరిజం పేరుతో అక్రమ చొరబాటును, ఫేక్ ఓటర్లను, ఫేక్ లబ్ధిదారులను కాపాడే రాజకీయాలు కూడా ఉన్నాయి.  నేషనలిజం పేరుతో నిజమైన పౌరుల హక్కులు దెబ్బతినే ప్రమాదం కూడా ఉందని అంటున్నారు.

అక్రమ చొరబాటు, ఫేక్ ఓటర్లు, ఫేక్ లబ్ధిదారులు..  ఇవన్నీ నిజమైన సమస్యలు. ఒప్పుకోవ‌ల్సిందే. కానీ,  అదే సమయంలో, శుద్ధి పేరిట‌ పేదరికం అంచున ఉన్న వర్గాల హక్కులు దెబ్బతినకుండా న్యాయపరమైన, పారదర్శకమైన, సమానమైన ప్రక్రియ అవసరం. బెంగాల్‌లో జరుగుతున్న ఈ మొత్తం ప్రక్రియ.. సర్, సీఏఏ, లక్ష్మీర్ భండార్ నుంచి అన్నపూర్ణ యోజన వ‌ర‌కూ.. భారతదేశం మొత్తం కోసం ఒక పెద్ద ప్రశ్నను లేవనెత్తుతోంది. సంక్షేమం- పౌరుల కనీస భద్రతా? లేక‌ ,  ఎన్నికల కోసం నడిచే ఓటు బ్యాంక్ యంత్రమా? అన్నదే ఆ ప్రశ్న.  

పౌరసత్వం, ఓటు హక్కు, సంక్షేమ హక్కు..  ఇవి పరస్పరం ఎలా ముడిపడాలి? అంటే..  బెంగాల్ ఉదాహరణ మనకు ఒక స్పష్టమైన హెచ్చరిక ఇస్తోంది. సరిహద్దులు బలహీనపడినప్పుడు, ఓటరు జాబితాలు కలుషితమైనప్పుడు, సంక్షేమ పథకాలు ఓటు బ్యాంక్‌లుగా మారినప్పుడు, ప్రజాస్వామ్యం తన అసలు అర్థాన్ని కోల్పోతుంది. ముందు దేశం, తర్వాత రాజకీయాలు.. అనే వాక్యం ఇప్పుడు కేవలం నినాదం కాదు.. పౌరసత్వం, భద్రత, సంక్షేమం, సమానత్వం – ఇవన్నీ సమతుల్యంగా నిలబెట్టే బాధ్యతగా మారింది.

-సీతారాం కంఠంనేని

ఈ విశ్లేషణ మీకు నచ్చినట్లయితే, దయచేసి https://www.teluguone.com పోర్టల్ ను  ఫాలో అవ్వండి. లైక్ చేయండి. షేర్ చేయండి. మీ విలువైన అభిప్రయాలను తెలియజేయండి.    
 

google-ad-img
    Related Sigment News
    • Loading...