కన్నెపల్లి వద్ద ఉద్రిక్తత.. బీఆర్ఎస్ నేతలను అడ్డుకున్న పోలీసులు..!

posted on: Jul 5, 2026 11:42AM

 

తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా వేడి పెరిగింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రతిష్టాత్మక కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని కన్నెపల్లి పంప్‌హౌజ్ పర్యటనకు పిలుపునివ్వడంతో ఉమ్మడి వరంగల్ జిల్లావ్యాప్తంగా తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కన్నెపల్లి పంప్‌హౌజ్ వైపు వెళ్లే అన్ని ప్రధాన మార్గాల్లో పోలీసులు భారీగా మోహరించారు. శాంతిభద్రతల పరిరక్షణ పేరుతో అడుగడుగునా బారికేడ్లు, ముందస్తు అరెస్టులతో కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ పర్యటనను అడ్డుకునేందుకు శతవిధాలా ప్రయత్నిస్తోందని ప్రతిపక్ష శ్రేణులు మండిపడుతున్నాయి.

హైదరాబాద్ నుంచి వరంగల్ వైపు సాగిన కేటీఆర్ కాన్వాయ్‌ను జనగామ జిల్లా పెంబర్తి వద్ద పోలీసులు అత్యంత నాటకీయ పరిణామాల మధ్య నిలిపివేశారు. హైవేపై భారీగా బారికేడ్లు ఉంచి కేటీఆర్ వాహనాలను అడ్డుకోవడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఈ క్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, పోలీసుల మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగింది. ఒక పక్కా ప్రణాళిక ప్రకారం ప్రజాప్రతినిధుల పర్యటనను ఎలా అడ్డుకుంటారని గులాబీ నేతలు అధికారులను నిలదీశారు. పెంబర్తి పరిసర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున మోహరించిన పోలీసు బలగాలు, బీఆర్ఎస్ కార్యకర్తల నినాదాలతో జాతీయ రహదారి ఒక్కసారిగా రణరంగాన్ని తలపించింది.

ఈ పర్యటనను నిలువరించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉన్న దాదాపు అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో ముందస్తు చర్యలు చేపట్టింది. బీఆర్ఎస్ ముఖ్య నేతలు, నియోజకవర్గ స్థాయి ఇన్ఛార్జ్‌లు, సోషల్ మీడియా యాక్టివిస్టులు, చివరకు కన్నెపల్లి పంప్‌హౌజ్ వైపు వెళ్తున్న రైతుల వాహనాలను సైతం పోలీసులు ఎక్కడికక్కడ నిలిపివేస్తున్నారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పదుల సంఖ్యలో ఉన్న స్థానిక పోలీస్ స్టేషన్లలో వందలాది మంది బీఆర్ఎస్ శ్రేణులను ముందస్తుగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లకు తరలించారు.

కేటీఆర్ కాన్వాయ్‌ను అడ్డుకోవడంపై బీఆర్ఎస్ అధికారికంగా తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. రాష్ట్రంలో ప్రజాస్వామ్యయుతంగా పర్యటనలు చేసే హక్కును కూడా కాలరాస్తున్నారని, కన్నెపల్లి పంప్‌హౌస్ వాస్తవాలను ప్రజలకు తెలియకుండా దాచడానికే ప్రభుత్వం ఈ స్థాయి ఆంక్షలు విధిస్తోందని ఆరోపించింది. హైదరాబాద్-వరంగల్ హైవే పొడవునా పోలీసులు పహారా కాస్తుండటంతో ప్రయాణికులు సైతం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కేటీఆర్ పర్యటన ముగిసేవరకు ఈ ఉత్కంఠ ఇలాగే కొనసాగేలా కనిపిస్తోంది.
 

google-ad-img
    Related Sigment News
    • Loading...