Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...దేశం మరచిపోయిన కేదార్‌నాథ్ విషాదం!
posted on: Jun 8, 2026 3:52PM

ఉత్తరాఖండ్ లోని కేదార్‌నాథ్ ధామ్‌లో వరదలు సంభవించి 13 ఏళ్లు. 2013 జూన్ 16న కేథర్‌నాథ్ ప్రాంతాన్ని భయంకరమైన వరదలు ముంచెత్తాయి. మూడు రోజుల పాటు కొనసాగిన ఈ ప్రకృతి విపత్తులో దాదాపు పాతిక వేల మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ దేశం ఎన్నడూ మరచిపోలేని ఈ విషాదాన్ని, కాలం గడిచేకొద్దీ ప్రజలు మర్చిపోయారు. కానీ ఆ రోజుల్లో జరిగిన రాజకీయ నిర్లక్ష్యం, పరిపాలనా వైఫల్యం, తరువాత జరిగిన సంఘటనలు ఇప్పటికీ ప్రశ్నలుగా నిలిచిపోయాయి.
కేదర్‌నాథ్ యాత్రను అత్యంత పవిత్రంగా భావించే ప్రజలు పెద్ద ఎత్తున కుటుంబాలతో అక్కడకి వెళ్లారు. ఒక్కసారిగా మేఘం విస్పోటనం, భారీ వర్షంతో కొండచరియలు విరిగిపడ్డాయి. ఆ ఉపద్రవానికి వేలమంది గల్లంతయ్యారు. వంతెనలు, రోడ్లు, భవనాలు, పర్వతాలు, చెట్లు కొట్టుకుపోయాయి. అక్కడి కొన్ని గ్రామాలు మ్యాప్‌లో నుంచి మాయమయ్యాయి. సజీవంగా మిగిలిన కొందరు ఇంకా ఆ షాక్ నుంచి కోలుకోలేకపోతున్నారు. అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం, వరదల్లో చిక్కుకున్న వేలాది మంది యాత్రికులను కాపాడేందుకు తక్షణ చర్యలు తీసుకోలేదని ఆరోపణలు ఉన్నాయి. నాలుగో రోజు నాటికి ప్రపంచ మీడియా దాన్ని ఫోకస్ చేయడంతో.. కాంగ్రెస్ ప్రభుత్వం సహాయక చర్యలు చేపడుతున్నామని ప్రకటించింది. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఆ క్రమంలో శవాల వెలికితీత, దహనాలపై పాలకులు పెద్ద ఎత్తున్న అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలు దేశాన్ని కుదిపేశాయి.
కేదార్‌నాథ్ ధామ్ 12 వేల అడుగుల ఎత్తులో ఉంటుంది. గర్వాల్ ప్రాంతంలోకి వచ్చే ఈ ప్రాంతంలో తీవ్రమైన చలి వణికిస్తుంటుంది. జూన్‌లో కూడా మైనస్ 3 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉంటుంది. అక్కడి ప్రజలు చలికి అలవాటు పడిపోయారు. ఎంతలా అంటే కేదార్‌నాథ్ పూజారులు చెప్పులు లేకుండా మంచు మీద నడుస్తారు. చాలా మంది యోగులు మంచు మీద కూర్చుని తపస్సు చేస్తుంటారు. పవిత్రమైన ఆ ప్రాంతానికి భక్తుల తాకిడి ఎక్కువే. అయితే 2013 వరద భీభత్సానికి పాతమార్గం పూర్తిగా ధ్వంసమైంది. కొత్త మార్గం భక్తులకు మరింత సంక్లిష్టంగా తయారైంది.
కేదార్‌నాథ్ ప్రాంతంలో యాత్రికులు బస చేయాలంటే ఒక గది అద్దె 5 వేల నుంచి 8 వేల రూపాయల వరకు ఉంటుంది. అందుకే చాలా మంది యాత్రికులు మందాకిని నది ఒడ్డున ఏర్పాటు చేసిన గుడారాల్లో ప్రమాదకరమని తెలిసినా రాత్రి బస చేస్తారు. 2013లో జరిగిన వినాశనానికి అక్కడ ఎముకలు కొరికే చలి, నీరే ప్రధాన కారణం. ఆ ప్రాంతం మొత్తం గుడారాలతో నిండి ఉంటుంది. బసకు ఏలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా గుడారాలు ఏర్పాటు చేశారు. అవి యాత్రికులకు 500 నుంచి వెయ్యి రూపాయలలోపు అందుబాటులో ఉంటాయి. వరదల సమయంలో అత్యధిక మరణాలకు అవే కారణం.
విపత్తు జరిగిన తర్వాత ఏడాది నుంచే అక్కడ పునర్నిర్మాణ పనులు మొదలయ్యాయి. ప్రతి ఏటా వేలాది మంది యాత్రికులు వెళ్లే ప్రసిద్ధ ఆలయం ఉన్న కేదార్‌నాథ్‌ను పునరుద్ధరించి, పునర్నిర్మించే లక్ష్యంతో ఒక పునరుద్ధరణ ప్రాజెక్ట్ 2014 మార్చిలో ప్రారంభమైంది. కానీ, జాప్యం, నిధుల దుర్వినియోగం ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా.. పర్యావరణపరంగా సున్నితమైన పర్వత ప్రాంతంలో భారీ నిర్మాణాల వల్ల కలిగే ప్రమాదాలు, 2013 విపత్తుకు ముందు కంటే ఇప్పుడు కేదార్‌నాథ్ సురక్షితంగా ఉందా, మరింత ప్రమాదంలో పడిందా అనే సందేహాలు తలెత్తేలా చేస్తున్నది. 2023 ఆగస్టు 4వ తేదీ రాత్రి, భారీ వర్షాల మధ్య కేదార్‌నాథ్ యాత్రా మార్గంలో పెద్ద కొండచరియలు విరిగిపడటంతో ఆ ప్రాంతం ఎంత పెళుసుగా ఉందో మరోసారి రుజువైంది. కేదార్‌నాథ్ యాత్ర ప్రారంభమయ్యే గౌరీకుండ్ సమీపంలోని అనేక దుకాణాలను అప్పట్లో ఈ కొండచరియలు తుడిచిపెట్టేశాయి.
2013 వరదల అనంతరం, కేదార్‌నాథ్ దీర్ఘకాలిక బలహీనతలను విస్మరించి.. తక్షణమే పునర్నిర్మాణంపై దృష్టి పెట్టడానికి బలమైన కారణాలు ఉన్నాయి. ఉత్తరాఖండ్ రాష్ట్రం పర్యాటకంపై, మరీ ముఖ్యంగా కేదార్‌నాథ్ వంటి ప్రసిద్ధ ప్రదేశాలను సందర్శించే వారిపైనే అధికంగా ఆధారపడి ఉంది. అందుకే ప్రధాన పర్యాటక కేంద్రమైన కేదార్‌నాథ్ పట్టణాన్ని వీలైనంత త్వరగా యాత్రికుల సందర్శనకు అనుకూలంగా మార్చడానికి పనులు చేపట్టారు. ప్రారంభంలో, ఈ పనిని నెహ్రూ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మౌంటెనీరింగ్‌కు అప్పగించారు. ఆ తర్వాత 2017లో, ఈ ప్రాంతంలోని అన్ని పునర్నిర్మాణ, మౌలిక సదుపాయాల నిర్మాణ పనులను ఒకే అధికార సంస్థ పర్యవేక్షించేలా చూసేందుకు.. రాష్ట్ర ప్రభుత్వం తన ప్రత్యక్ష పర్యవేక్షణలో ఏర్పాటు చేసిన శ్రీ కేదార్‌నాథ్ ఉత్థాన్ ఛారిటబుల్ ట్రస్ట్ కి ఈ పనులను బదిలీ చేసింది.
2018లో సుప్రీం కోర్టు నియమించిన ఒక ఉన్నత స్థాయి కమిటీ, చార్ ధామ్ సామర్థ్యంపై అధ్యయనం చేయాలని సిఫార్సు చేసింది. ఆ కమిటీ కేదార్‌నాథ్ పుణ్యక్షేత్రానికి రోజుకు 5,000 మంది యాత్రికులను మాత్రమే అనుమతించాలని సిఫార్సు చేసినప్పటికీ, ప్రతిరోజూ 13 వేల మందిని సందర్శించడానికి అనుమతిస్తున్నారు. కేదార్‌నాథ్‌లో పునర్నిర్మాణం సమగ్రంగా, సకాలంలో జరిగేలా చూడటానికే ఒకే అధికార సంస్థను ఏర్పాటు చేసినప్పటికీ, నిర్మాణ పనులు గడువులోగా పూర్తి కావడం లేదని కాగ్ 2018 నివేదికలో తేలింది. మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు ఆమోదం లభించకపోవడం, వివిధ ఏజెన్సీల వల్ల నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులు ఆలస్యం కావడం, నిధుల దుర్వినియోగం వంటి అంశాలను కూడా ఆ నివేదిక పేర్కొంది. ఈ విమర్శలపై రాష్ట్ర ప్రభుత్వం గానీ, కేంద్ర ప్రభుత్వం గానీ స్పందించలేదు.
-సీతారాం కంఠంనేని
ఈ విశ్లేషణ మీకు నచ్చినట్లయితే, దయచేసి https://www.teluguone.com పోర్టల్ ను ఫాలో అవ్వండి. లైక్ చేయండి. షేర్ చేయండి. మీ విలువైన అభిప్రయాలను తెలియజేయండి.






