తెలుగు రాష్ట్రాలలో ఐటీ సోదాల కలకలం.. వెయ్యి కోట్ల రూపాయల ఆర్థిక అక్రమాల గుట్టు రట్టు.!

posted on: Aug 20, 2026 11:10AM

తెలుగు రాష్ట్రాల్లో విదేశీ చెల్లింపుల పేరుతో సాగిన ఒక భారీ ఆర్థిక  అక్రమాల గుట్టు ఐటీ దాడుల్లో బయటపడింది.  ఉభయ తెలుగు రాష్ట్రాలలో ఆదాయపు పన్ను శాఖ  అధికారులు నిర్వహించిన  సోదాలు సంచలనం సృష్టిస్తున్నాయి. దాదాపు వెయ్యి కోట్ల రూపాయల  విదేశీ చెల్లింపుల  వ్యవహారంలో పన్ను ఎగవేత, యు అక్రమ నిధుల మళ్లింపు ఆరోపణలపై ఐటీ అధికారులు ఉభయ తెలుగు రాష్ట్రాలలో ఏకకాలంలో  13 ప్రాంతాలలో సోదాలు చేపట్టారు.  ఈ సోదాల్లో డిజిటల్ ఆధారాలు, కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.  హైదరాబాద్‌లో 9చోట్ల, ఏపీలోని విశాఖపట్నంలో 3,  గుంటూరులోని ఒక ప్రాంతంలో   ఐటీ అధికారులు   ఈ సోదాలను నిర్వహించారు.   

సింగపూర్, హాంగ్‌కాంగ్, బ్రిటన్ , చైనా,  ఇండోనేషియా వంటి   దేశాల్లో ఉన్న వివిధ సంస్థలకు విదేశీ సేవలు పొందినట్లు చూపుతూ ఈ వందల కోట్ల నిధులను పంపినట్లు ఐటీ అధికారులు ఈ సోదాలలో గుర్తించారు. అయితే ఆయా దేశాల్లో అసలు సేవలు అందాయా లేక   అక్రమ మార్గాల్లో డబ్బును విదేశాలకు దాటవేయడానికే బోగస్ షెల్ కంపెనీలను సృష్టించారా అన్న విషయంపై దర్యాప్తు జరుగుతోంది. ఈ మొత్తం నెట్‌వర్క్‌లో విశాఖపట్నం వేదికగా స్టాక్‌పైల్ సాఫ్ట్‌టెక్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థపై అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించారు.  2021లో విశాఖలోని మారీకవలస జంక్షన్ చిరునామాతో ఏర్పాటైన ఈ   కంపెనీ నుంచే  .900 కోట్ల రూపాయల మేర విదేశీ చెల్లింపులు జరిగినట్లు తేలింది.     ఈ కంపెనీ డైరెక్టర్లు దీపక్ , మాధవ రామ్ పొనపల్లి నివాసాలు,  కార్యాలయాలలో జరిగిన సోదాలలో   భారీగా లావాదేవీలు జరగినట్లు గుర్తించారు.

అలాగే..  గుంటూరులోని అరండల్‌పేటకు చెందిన చిన్న వెంకట సుబ్రహ్మణ్యం దామా అనే వ్యక్తికి సంబంధించిన నివాసాలు, కార్యాలయాల్లో జరిపిన తనిఖీల్లో..  130 కోట్ల రూపాయల   అనుమానాస్పద లావాదేవీలకు సంబంధించిన పత్రాలను ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. విదేశాలకు నిధులు మళ్లించే క్రమంలో ప్రాసెసింగ్ కోసం సిఏలు, ఇతర ప్రొఫెషనల్స్ ఇచ్చే ఫారమ్ 15సీబీ  జారీలోనూ భారీగా అక్రమాలు జరిగాయని, నిబంధనలు ఉల్లంఘించి సర్టిఫికెట్లు ఇచ్చారని స్పష్టమైంది. వ్యాపార టర్నోవర్ నామమాత్రంగానే ఉన్నప్పటికీ, కేవలం పేపర్లపై ఉన్న కంపెనీల పేరిట వందల కోట్లు విదేశాలకు ఎలా వెళ్లాయనే కోణంలో దర్యాప్తు సాగుతోంది.  డొల్ల కంపెనీల ద్వారా నకిలీ బిల్లులు సృష్టించి హవాలా మార్గాల్లో నల్లధనాన్ని విదేశాలకు పంపించడమే లక్ష్యంగా ఈ భారీ నెట్‌వర్క్ పనిచేసినట్లు ప్రాథమికంగా గుర్తించారు.   

IT raids in Telugu states, foreign remittances scam, Visakhapatnam IT raids, Stockpile Softech Solutions, income tax raids Hyderabad, bogus foreign transactions

google-ad-img
    Related Sigment News
    • Loading...