Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...అక్రమం మైనింగ్ పై హైడ్రా చర్యలు.. ఒకే రోజు ఆరు ప్రాంతాల్లో ఆపరేషన్
posted on: May 5, 2026 12:39PM

అక్రమ మైనింగ్‌పై హైడ్రా చర్యలు చేపట్టింది. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, మైనింగ్, రెవెన్యూ శాఖల నుంచి వచ్చిన ఫిర్యాదుల మేరకు మంగళవారం (మే 5) ఒకే రోజు ఏకకాలంలో ఆరు ప్రాంతాల్లో దాడులు నిర్వహించింది. అనుమతులు లేకుండా నడుస్తున్న స్టోన్ క్రషింగ్ యూనిట్లు, రెడీమిక్స్ కాంక్రీట్ ప్లాంట్లను తొలగించింది. రంగారెడ్డి జిల్లాలోని గండిపేట మండలం వట్టినాగులపల్లి, శేరిలింగంపల్లి మండలం గౌలిదొడ్డి, శంషాబాద్ మండలం కొత్వాల్‌గూడ ప్రాంతాల్లో ఈ ఆపరేషన్ సాగింది. అక్రమంగా క్వారీలు తవ్వడం, రాళ్లను పేల్చడం, భారీ స్థాయిలో స్టోన్ క్రషింగ్ నిర్వహించడం వల్ల పరిసర ప్రాంతాల్లో తీవ్రమైన దుమ్ము కాలుష్యం వ్యాపించి, సమీప నివాసాల భద్రతకు ముప్పుగా మారిన నేపథ్యంలో అధికారులు ఈ చర్యలు చేపట్టారు.
మంగళవారం ( మే 5) ఉదయం ప్రారంభమైన ఈ ఆపరేషన్‌లో మొత్తం ఆరు స్టోన్ క్రషింగ్ యూనిట్లను నేలమట్టం చేయడంతో పాటు.. 12 ఆర్‌ఎంసీ ప్లాంట్లను పూర్తిగా తొలగించారు. భవిష్యత్తులో అక్కడ మళ్లీ క్రషింగ్ కార్యకలాపాలు జరగకుండా యంత్ర సామగ్రిని స్వాధీనం చేసుకుని తరలించారు. గతంలో మైనింగ్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు శాఖలు పలుమార్లు హెచ్చరికలు జారీ చేసినప్పటికీ యథేచ్ఛగా కార్యకలాపాలు కొనసాగించడంతో ఈసారి శాశ్వతంగా చెక్ పెట్టినట్లు హైడ్రా అధికారులు వెల్లడించారు.
రంగారెడ్డి జిల్లా గండిపేట మండలంలోని వట్టినాగులపల్లి, శేర్లింగంపల్లి మండలంలోని గౌలిదొడ్డి గ్రామం అలాగే శంషాబాద్ మండలంలోని కొత్వాల్ గూడ గ్రామం లో అక్రమ మైనింగ్ పాల్పడుతున్న వారంతా బడా సంస్థలకు చెందినవారే కావడం గమనార్హం. అక్రమ మైనింగ్ జరుగుతున్న యూనిట్లను డిస్మాంటల్ చేయమని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ హైడ్రాకు విజ్ఞప్తి చేశారు. ఎలాంటి అనుమతులు లేకుండా చేస్తున్న యూనిట్లను వెంటనే తొలగించాలని కోరారు. గౌలి దొడ్డిలో గ్రేట్ ఇండియా మైనింగ్ సంస్థ, అలాగే వట్టినాగులపల్లి లోని మూడు చోట్ల పరమేష్ సింగ్ స్టోన్ క్రషర్, శ్రీలక్ష్మి కన్స్ట్రక్షన్స్, పృధ్వి స్టోన్ క్రషర్, కొత్వాల్ గుడాలో రాఘవ స్టోన్ క్రషర్ సంస్థలు అక్రమ మైనింగ్ పాల్పడ్డాయి. ఈ సంస్థలకు తోడు మక్త భగత్ సింగ్ అనే వ్యక్తి స్టోన్ క్రషింగ్ ను పెద్ద ఎత్తున చేపట్టారని వాటన్నిటినీ వెంటనే తొలగించాలి అంటూ జిల్లా కలెక్టర్ లేఖ రాయడంతో హైడ్రా బృందం రంగంలోకి దిగి ఈరోజు మొత్తం ఆరు ప్రాంతాలలో అక్రమ మైనింగ్ లను తొలగించారు.
అనుమతులు లేకుండా సాగుతున్న ఈ యూనిట్ల వల్ల ప్రభుత్వానికి వందల కోట్ల రూపాయల ఆదాయం నష్టపోయినట్లు అంచనా వేస్తున్నారు. అంతేకాక విద్యుత్ బిల్లులు కోట్ల రూపాయల మేర బకాయి ఉండగా, కరెంట్ నిలిపివేసిన తర్వాత డీజిల్‌తో యూనిట్లు నడిపినట్లు కూడా అధికారులు గుర్తించారు.
కాలుష్య కారక యూనిట్ల తొలగింపుతో పరిసర ప్రాంత ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. అక్రమ మైనింగ్‌ను పూర్తిగా అరికట్టేందుకు ఇలాంటి చర్యలు కొనసాగుతాయని అధికారులు స్పష్టం చేశారు.






