పోయిన చోటే వెతుక్కుంటున్న బీజేపీ

posted on: Mar 13, 2017 2:29PM


పోయిన చోటే వెతుక్కోవాలి... పడిన చోటే లేచి నిలబడాలి... సరిగ్గా ఇదే ఫార్ములాను ఫాలో అవుతోంది బీజేపీ. గోవా ఫలితాల డ్యామేజ్ ను పారికర్ ఇమేజ్ తో సరిచేసేందుకు రెడీ అయ్యింది. మనోహరుడే సరైనోడంటూ పారికర్‌ను రంగంలోకి దింపిన బీజేపీ... మరోసారి గోవా ముఖ్యమంత్రిని చేసేందుకు పావులు కదిపింది.

 

40 స్థానాలున్న గోవాలో కాంగ్రెస్ 17 సీట్లు గెలుచుకుని అతిపెద్ద పార్టీగా అవతరించగా, బీజేపీ 13 సీట్లతో రెండోస్థానంలో నిలిచింది. ఇతరులు 10 సీట్లు గెల్చుకున్నారు. ప్రభుత్వాన్ని ఏర్పాటుకు 21 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. దాంతో బీజేపీ చక్రం తిప్పింది. ముగ్గురు గోవా ఫార్వర్డ్ పార్టీ ఎమ్మెల్యేలు, ముగ్గురు MGP ఎమ్మెల్యేలతో పాటు ముగ్గురు ఇండిపెండెంట్లు బీజేపీకి మద్దతు ప్రకటించారు. మద్దతిస్తున్న ఎమ్మెల్యేల లేఖలతో గవర్నర్‌ను కలిసిన పారికర్‌....ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరారు.

 

ఎదురులేని నేతగా ఎదిగిన పారికర్... ప్రధాని మోడీకి అత్యంత ఆప్తుడు. మనోహరుడి పనితీరుకు ఫిదా అయిన మోడీ... ఏకంగా గోవా సీఎం పదవికి రాజీనామా చేయించి మరీ, తన కేబినెట్ లో చేర్చుకున్నారు. కీలకమైన రక్షణ శాఖ బాధ్యతలను అప్పజెప్పారు. కానీ ఎన్నికల ఫలితాలతో కమలం ప్లాన్ మార్చింది. మొత్తానికి పారికర్ రీఎంట్రీ గోవా బీజేపీకి కొత్త ఉత్సాహాన్ని ఇవ్వనుంది. అయితే సింగిల్ లార్జెస్ట్‌ పార్టీగా అవతరించిన కాంగ్రెస్‌ను మొదట ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానిస్తారా? లేక కేంద్రం ఒత్తిడికి తలొగ్గి బీజేపీని పిలుస్తారో చూడాలి.

google-ad-img
    Related Sigment News
    • Loading...