విప్లవ త్రిమూర్తులలో మరుగునపడిన మహానేత సుఖ్ దేవ్ థాపర్ ఉజ్వల చరిత్ర

posted on: May 16, 2026 5:42PM

భారత స్వాతంత్ర్య సంగ్రామ చరిత్రలో మాతృభూమి విముక్తి కోసం తమ ప్రాణాలను తృణప్రాయంగా అర్పించిన యువ విప్లవకారుల త్యాగాలు అనన్యసామాన్యమైనవి. బ్రిటిషు సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా సాగిన పోరాటంలో భగత్ సింగ్, రాజగురులతో కలిసి ఉరితాడును ముద్దాడిన అమరవీరుడు సుఖ్‌దేవ్ థాపర్ జయంతి సందర్భం మే 15.  దేశ ప్రజల హృదయాలలో భగత్ సింగ్ రూపం  గాఢంగా ముద్రపడటంతో..  ఆయనతో పాటు   పోరాడిన సుఖ్‌దేవ్, రాజగురుల పాత్రలు కాలక్రమేణా కొంతవరకు జనం స్మృతిలో వెనుకబడిపోయాయనేది వాస్తవం. ఈ నేపథ్యంలో..  సుఖ్‌దేవ్ థాపర్ జయంతిని  పురస్కరించుకుని..  ఆయన సాగించిన అద్వితీయ విప్లవ ప్రస్థానాన్ని, దేశం కోసం ఆయన చేసిన ఆత్మబలిదానాన్ని స్మరించుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది.  

సుఖ్‌దేవ్ థాపర్ 1907 మే 15న పంజాబ్ లోని   లుధియానా నగరంలో   నౌఘరాలో జన్మించారు. బాల్యంలోనే పితృవియోగం కలగడంతో ఆయన తన మేనమామ అయిన లాలా అచింత్ రామ్ పర్యవేక్షణలో పెరిగారు. ఆ రోజుల్లో భారతదేశాన్ని పాలిస్తున్న బ్రిటిష్ ప్రభుత్వం స్వదేశీయులపై సాగిస్తున్న అరాచకాలు, అణచివేత చర్యలు చిన్న వయసులోనే సుఖ్‌దేవ్ మనసును తీవ్రంగా కలచివేశాయి. ఆ తదనంతర కాలంలో లాహోర్ నేషనల్ కాలేజీలో ఉన్నత విద్యాభ్యాసం చేస్తున్న సమయంలో   ప్రపంచవ్యాప్తంగా వచ్చిన విప్లవాలు, భారత చరిత్రపై లోతైన అధ్యయనం చేయడానికి ప్రత్యేక స్టడీ సర్కిళ్లను నిర్వహించేవారు. అదే విద్యాసంస్థలో ఆయనకు భగత్ సింగ్, యశ్‌పాల్ వంటి భావసారూప్యత కలిగిన యువకులతో పరిచయం ఏర్పడి, వారి విప్లవ ఆలోచనలకు మరింత స్పష్టత, పదును చేకూరాయి. కేవలం బ్రిటిషు పాలనను నిరసించడమే కాకుండా, ఆ సామ్రాజ్యాన్ని పూర్తిగా కూకటివేళ్లతో పెకలించివేయడమే లక్ష్యంగా ఆయన విద్యార్థి దశలోనే ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు.

స్వాతంత్ర్య సాధన కోసం ఉధృతంగా పనిచేస్తున్న క్రమంలో సుఖ్‌దేవ్  హిందుస్తాన్ సోషలిస్టు రిపబ్లికన్ అసోసియేషన్ (హెచ్ఎష్ఆర్ఏ) లో చేరి, అతి తక్కువ కాలంలోనే పంజాబ్ విభాగానికి ప్రధాన నిర్వాహకుడిగా బాధ్యతలు చేపట్టారు. దేశ యువతను విప్లవ పథం వైపు నడిపించడమే ధ్యేయంగా సాగిన  నౌజవాన్ భారత్ సభ కార్యక్రమాల్లో ఆయన చురుకైన పాత్ర పోషించారు. పంజాబ్‌తో పాటు ఉత్తర భారతదేశంలోని వివిధ ప్రాంతాలలో రహస్య విప్లవ ముఠాలను ఏర్పాటు చేయడం..  పోరాటానికి అవసరమైన ఆయుధాలను సేకరించడం, విప్లవ భావజాలాన్ని వ్యాప్తి చేసే కరపత్రాలను ముద్రించి పంపిణీ చేయడం వంటి వ్యూహాత్మక పనులన్నింటినీ ఆయనే స్వయంగా పర్యవేక్షించేవారు. లాహోర్ కేంద్రంగా సాగిన హెచ్ఎస్ఆర్ఏ కార్యకలాపాలకు మేధోపరమైన వ్యూహాలను, పోరాట పటిమను అందించిన అద్భుతమైన నాయకత్వ లక్షణాలు సుఖ్‌దేవ్ సొంతం.  

1928వ సంవత్సరంలో దేశవ్యాప్తంగా సైమన్ కమిషన్‌కు వ్యతిరేకంగా నిరసనలు వెల్లువెత్తిన సమయంలో, ప్రముఖ నాయకుడు లాలా లజపత్ రాయ్‌పై బ్రిటిష్ పోలీసులు జరిపిన అమానుష లాఠీచార్జ్ ఆయన మరణానికి దారితీసింది. ఈ ఘటన దేశంలోని యువ విప్లవకారులలో తీవ్ర ఆగ్రహాన్ని నింపింది. ఈ దౌర్జన్యానికి కారణమైన అప్పటి బ్రిటిష్ పోలీస్ అధికారి జె.పి. సాండర్స్‌ను హతమార్చడం ద్వారా ప్రతీకారం తీర్చుకోవాలని విప్లవకారులు నిర్ణయించారు. ఈ వ్యూహాత్మక నిర్ణయంలోనూ, సాండర్స్ హత్యకు సంబంధించిన పూర్తి ప్రణాళికను రూపొందించడంలోనూ సుఖ్‌దేవ్ కీలక పాత్ర పోషించారు. ఈ దాడిలో భగత్ సింగ్, రాజగురులు నేరుగా పాల్గొని కాల్పులు జరిపినప్పటికీ..  ఆ ఆపరేషన్‌కు సంబంధించిన ఏర్పాట్లు, వ్యూహ రచన వెనుక సుఖ్‌దేవ్ అసాధారణ మేధోశక్తి దాగి ఉంది.  

ఆ తర్వాత 1929లో ఢిల్లీ సెంట్రల్ అసెంబ్లీలో బాంబు పేల్చిన ఉదంతం అనంతరం..  బ్రిటిష్ పాలకులు హెచ్ఎస్ఆర్ఏ సంస్థపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ క్రమంలోనే లాహోర్ కుట్ర కేసు నమోదైంది. బ్రిటీష్ ప్రభుత్వం దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ లో నిందితుల జాబితాలో మొదటి పేరు సుఖ్‌దేవ్ థాపర్‌దే కావడం గమనార్హం. ఈ కేసు అధికారిక శీర్షికను కూడా  క్రౌన్ వర్సెస్ సుఖ్‌దేవ్ అండ్ అదర్స్ గా పేర్కొనడం ద్వారా బ్రిటిష్ ప్రభుత్వ దృష్టిలో ఆయన ఎంతటి ప్రమాదకరమైన నాయకుడో స్పష్టమవుతుంది. సుదీర్ఘ కాలం పాటు సాగిన ఈ కేసు విచారణ ముగింపులో భాగంగా భగత్ సింగ్, రాజగురు, సుఖ్‌దేవ్‌లకు న్యాయస్థానం మరణదండన విధించింది. 1931 మార్చి 23న లాహోర్ సెంట్రల్ జైలులో ఈ ముగ్గురు వీరులను అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం ఉరితీసింది. అనంతరం ఎటువంటి ప్రజా తిరుగుబాటు రాకుండా ఉండేందుకు వారి భౌతిక కాయాలను రహస్యంగా సుత్లెజ్ నదీ తీరానికి తరలించి అంత్యక్రియలు నిర్వహించారు. 

అయితే న్యాయ పత్రాలలో  మొదటి నిందితుడిగా  ఉన్న సుఖ్‌దేవ్, కాలగమనంలో ప్రజల జ్ఞాపకాలలో మాత్రం కేవలం  మూడవ పేరుగా మిగిలిపోవడం గమనార్హం.  సుఖ్‌దేవ్‌ను కేవలం ఆయుధాలు పట్టిన విప్లవకారుడిగా మాత్రమే చూడటం ఆయనలోని అసలైన మేధావిని, విప్లవతత్వాన్ని తక్కువ చేసి చూపడమే అవుతుంది. లాహోర్ నేషనల్ కాలేజీ రోజుల్లో ఆయన స్థాపించిన అధ్యయన వేదికల ముఖ్య ఉద్దేశం యువతలో మూఢనమ్మకాలను తొలగించి, శాస్త్రీయ ఆలోచనా విధానాన్ని, సామాజిక న్యాయం పట్ల అవగాహనను, సామ్రాజ్యవాద వ్యతిరేక చైతన్యాన్ని పెంపొందించడమే. సమాజంలో ఉన్న ఆర్థిక అసమానతలు, వర్గ దోపిడీ, సామ్రాజ్యవాద అణచివేత వంటి అంశాల మధ్య ఉన్న అంతర్గత సంబంధాన్ని ఆయన క్షుణ్ణంగా విశ్లేషించారు. వారి విప్లవ సంస్థ పేరులోనే  సోషలిస్టు రిపబ్లికన్  అనే పదాలను చేర్చడం ద్వారా భవిష్యత్తు భారతదేశం ఏ సిద్ధాంతాల ప్రాతిపదికన నిర్మితం కావాలో వారు ముందే స్పష్టం చేశారు.  స్వాతంత్య్రానంతర భారతదేశంలో సమాచార మాధ్యమాలు, చలనచిత్రాలు, పాఠ్యపుస్తకాలు భగత్ సింగ్‌ను ఒకే ఒక్క విప్లవ ప్రతీకగా భారీ స్థాయిలో ప్రస్ఫుటించాయి. ఈ ప్రక్రియలో ఆయనతో సమానంగా పోరాడిన రాజగురు, సుఖ్‌దేవ్‌ల చరిత్రలు కొంతవరకు ఉపేక్షించబడ్డాయి. 

లూధియానాలో ఉన్న సుఖ్‌దేవ్ నివాసాన్ని గానీ, ఆయన స్మారక చిహ్నాలను గానీ పరిరక్షించడంలో పాలకులు ప్రదర్శించిన ఉదాసీనత దీనికి నిదర్శనంగా నిలుస్తుంది. విప్లవ త్రిమూర్తులలో ఒకరిని మాత్రమే అగ్రస్థానంలో నిలిపి..  మిగిలిన ఇద్దరిని కేవలం చరిత్రక పుటలకే పరిమితం చేయడం సరైనది కాదనే విమర్శలు ఉన్నాయి.  నేటి ఆధునిక భారతదేశానికి సుఖ్‌దేవ్ అందించిన సందేశం ఎంతో ప్రాముఖ్యమైనది. ఆయన ఆశించిన స్వాతంత్ర్యం కేవలం తెల్లదొరల పాలన ముగిసిపోవడం మాత్రమే కాదు..  సామాజిక సమానత్వం, శాస్త్రీయ దృక్పథం కలిగిన నవభారత నిర్మాణం. యువతను రాజకీయంగా చైతన్యపరచడం, మతతత్వానికి, అంధవిశ్వాసాలకు వ్యతిరేకంగా నిలబెట్టడం. ఇదీ సుఖ్ దేవ్ ముఖ్య అజెండా. 

ప్రస్తుత సమాజంలో కనిపిస్తున్న సామాజిక విభజనలు, అసమానతల నేపథ్యంలో.. అసలైన స్వాతంత్ర్యం అంటే ఏమిటి?  సామాజిక న్యాయం ఎలా సాధించాలి అనే ప్రశ్నలకు సమాధానంగా సుఖ్‌దేవ్ ఆలోచనలు నేటికీ దిక్సూచిగా నిలుస్తాయి. భగత్ సింగ్, రాజగురు, సుఖ్‌దేవ్‌లు ముగ్గురూ భారత స్వాతంత్ర్య సంగ్రామంలో  సమానమైన కాంతితో ప్రకాశించిన ధ్రువతారలు. కాబట్టి, సుఖ్‌దేవ్ థాపర్ జయంతి సందర్భంగా ఆయనను కేవలం ఒక సహచరుడిగా కాకుండా, స్వతంత్ర రాజకీయ దార్శనికత, అసాధారణ సంస్థాగత నైపుణ్యాలు కలిగిన ఒక మహోన్నత విప్లవ నాయకుడిగా గుర్తించి, చరిత్రలో ఆయనకు దక్కాల్సిన సమాన గౌరవాన్ని అందించడమే దేశ ప్రజలుగా మనం ఇచ్చే అసలైన నివాళి.  

-సీతారాం కంఠంనేని

ఈ విశ్లేషణ మీకు నచ్చినట్లయితే, దయచేసి https://www.teluguone.com పోర్టల్ ను  ఫాలో అవ్వండి. లైక్ చేయండి. షేర్ చేయండి. మీ విలువైన అభిప్రయాలను తెలియజేయండి.  

google-ad-img
    Related Sigment News
    • Loading...