నయీంను పామును పెంచినట్టు పెంచారా..!

posted on: Aug 11, 2016 2:58PM

 

నయీం.. నయీం.. నయీం. గత మూడు నాలుగు రోజుల నుండి ఎక్కడ చూసినా ఇదే మాట వినిపిస్తుంది. గ్యాంగ్ స్టర్ నయీమ్ ఎన్ కౌంటర్ తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తున్నసంగతి తెలిసిందే. గ్యాంగ్ స్టర్ నయీమ్ ఎన్ కౌంటర్ నేపథ్యంలో ఇప్పటికే పులువురు ప్రముఖుల పేర్లు బయటకు వస్తున్నాయి. తవ్వే కొద్ది రోజు రోజుకు కొత్త విషయాలు బయటపడుతున్నాయి. గత మూడు రోజుల నుండి నయీం ఇంటిలో, వారి బంధువుల ఇళ్లలో సోదాలు నిర్వహిస్తుండగా.. భారీగా ధనం.. అక్రమాస్తులకు సంబంధించిన డాక్యుమెంట్లు, ప్రామిసరీ నోట్లు పెద్ద మొత్తంలో దొరుకుతున్నాయి. ఇక న్యాయమూర్తుల అనుమతితో అతని బెడ్ రూంను కూడా నిన్న బద్దలు కొట్టిన పోలీసులకు దిమ్మతిరిగిపోయింది. వారికి ఓ బంగారు నిధే కనిపించినంత పనైంది. వజ్రాలు పొదిగిన బంగారు వాచీలు..! మందమైనా తాళ్లలా ఉన్న బంగారు చైన్లు! బ్రేస్‌లెట్లు..! నెక్లె్‌సలు..! ఒకటా.. రెండా.. ఏకంగా రెండు గోనె సంచుల్లో బంగారు ఆభరణాలు లభించాయి. ఇంకా అత్యాధునిక సైనైడ్ గన్ తో పాటు శాటిలైట్ ఫోన్ దొరికింది. అంతేనా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా వెయ్యి జతల దుస్తులు.. సౌందర్య పోషణకు వినియోగించే మేకప్ కిట్లు.. విగ్గులు లభించాయి. అయితే అన్నీ ఒక ఎత్తైతే ఆయన డైరీలు మరో ఎత్తు. ఈ కేసులో ఇవే కీలకం.. ఎందుకంటే పోలీసులకి దొరికిన మొత్తం పది డైరీలలో చాలా కీలకమైన సమాచారం ఉన్నట్టు తెలుస్తోంది.

 

తనతో ఎవరెవరికి లింకప్స్ ఉన్నాయి.. ఎవరు ఏ పని చేయించుకున్నారు.. ఎవరి చేతి నుండి ఎంత సొమ్ము వచ్చింది.. ఎంత సొమ్ము చేతులు మారింది... తనకు ఎంత ముట్టింది.. అన్న విషయాలు డేట్స్ తో సహా అన్నీ వివరాలు రాసిపెట్టాడట. ఇంకా ఈయన గారితో ఎవరు డీల్ కుదుర్చుకున్నారో వారి వివరాలు కూడా ఉన్నాయట. అయితే ఆశ్యర్యకమైన విషయం ఏంటంటే.. ఈయన డీల్ కుదుర్చుకున్న వారిలో రాజకీయ నాయకులు, ఐ.ఏ.ఎస్, ఐ.పీఎస్ అధికారులు.. ఇంకా మనకు రోజు నీతి వాఖ్యాలు చెప్పే పాత్రికేయులు, పెద్ద పెద్ద బిల్డర్లు, వ్యాపారులు.. ఇలా చెప్పుకుంటూ పోతే చాలామందే ఉన్నారు. ఇంటి పేర్లతో సహా ఉన్నాయట. దీంతో ఇప్పుడు సిట్ బృందం ఆదిశగా దర్యాప్తు చేయడానికి నిర్ణయించుకుంది. నయీమ్ సామ్రాజ్యం విస్తరించిన నాటి నుంచి అతనికి సహకరించిన రాజకీయ నాయకులు, పోలీసు అధికారులపై విచారణను తొలత ఆరంభించాలని.. నయీమ్ మొబైల్‌లో కాల్‌లిస్టు, డైరీలో ఉన్న పేర్లు...వారికి నయీమ్ ఏ విధంగా సహకరించాడు...వాళ్ల ద్వారా నయీమ్ ఏ విధంగా లబ్దిబొందాడనే దానిపై సిట్ దర్యాప్తు చేయనుంది.

 

మొత్తానికి ఎంత పాలు పోసినా పెంచినా పాము ప్రమాదకరమైనదే అన్న సామెత ప్రకారం.. ఎంతో మంది నేతలు నయీంను పామును పెంచినట్టు పెంచారు. చివరికి ఏమైంది ఇప్పుడు అతని వల్లే చిక్కుల్లో పడే పరిస్థితి వచ్చింది. ఒక సామాన్య మనిషి.. గ్యాంగ్ స్టర్ గా మారి ఇన్ని వేల కోట్ల ప్రజా ధనాన్ని అక్రమంగా సాధించగలిగాడు అంటే అది అతని ఒక్కడి వల్ల అయ్యే పనికాదు. అతనికి కొమ్ముకాసిన వారు చాలా మంది ఉన్నారు కాబట్టే గ్యాంగ్ స్టర్ గా చెలామణి అయ్యాడు. ఏకంగా 15 మంది సీనియర్ ఐపీఎస్ అధికారులతో అతనికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయన్నదే దీనికి నిదర్శనం. అయితే పోతే పోయాడులే కానీ.. అతని డైరీల్లో మొత్తం వివరాలు రాసిపెట్టాడు.. ఆ ఒక్క మండి చేశాడు అని చాలామంది అనుకుంటున్నారు. అందుకే ఇంత నిశ్శబ్దం. పేర్లు ఉన్నట్టు తెలుసు.. కానీ ఎవరి పేర్లు ఉన్నాయన్నది మాత్రం ఇంకా తెలీదు.. నరాలు తెగే ఉత్కంఠ, ఒక్కొక్కరికి హైబీపీలు, ఫోన్ రింగ్ అయితే ఏం వార్త వినాల్సి వస్తుందో అన్న టెన్షన్.. చూద్దాం ఏం జరుగుతుందో..

google-ad-img
    Related Sigment News
    • Loading...