TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఈవీలదే భవిష్యత్.. సీఎం చంద్రబాబు

Published on: Thu Jul 2, 2026 12:47PM

భవిష్యత్ అంతా ఎలక్ట్రిక్ వాహనాలదేనని(ఈవీ) ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఈవీల తయారీలో హీరో మోటార్స్ సంస్థ పెద్ద ఎత్తున దృష్టి సారించాలన్నారు. తిరుపతి జిల్లా సత్యవేడులోని మాదన్నపాలెం వద్ద హీరో మోటార్స్ సంస్థకు చెందిన గ్లోబల్ పార్ట్స్ సెంటర్ 2.0 కు ఆ సంస్థ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ పవన్ ముంజాల్ తో కలిసి బుధవారం శంకుస్థాపన చేసిన  చంద్రబాబు.. హీరో మోటార్స్ వ్యవస్థాపక ఛైర్మన్ బ్రిజ్ మోహన్ లాల్ ముంజాల్ పారిశ్రామిక వేత్తగా జాతి నిర్మాణానికి సహకరించిన గొప్ప వ్యక్తి అన్నారు.  హీరో మోటార్స్ సంస్థ వేరే రాష్ట్రంలో ప్లాంట్ పెట్టాలనుకుంటే వారితో ప్రత్యేకంగా చర్చించి ఏపీలో ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు ఒప్పించామని చెప్పారు.  

2018లో తిరుపతిలో శంకుస్థాపన చేసిన హీరో మోటార్స్ ప్లాంట్ ఇప్పుడు పెద్ద ఎత్తున వాహనాలను ఉత్పత్తి చేస్తోందన్న ఆయన.. ఇప్పుడు విడా పేరుతో ఎలక్ట్రిక్ టూ వీలర్లను ఉత్పత్తి చేయడం సంతోషంగా ఉందన్నారు.  హీరో సంస్థకు ఉన్న అన్ని ఉత్పత్తి కేంద్రాల కంటే  ఇక్కడి యూనిట్ ను ప్రతిష్టాత్మకంగా అభివృద్ధి చేయాలని చెప్పారు.  హీరో సంస్థ ప్రకటించిన మేరకు రూ.3,200 కోట్ల పెట్టుబడులతో ప్లాంట్ విస్తరణ పనులు ప్రారంభించాలనీ,  భవిష్యత్ అంతా ఈవీలదే కనుక ఆ డిమాండ్ కు తగినట్టుగా ఈవీల ఉత్పత్తికి హీరో సంస్థ సిద్దంగా కావాన్నారు.   

అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు హీరో మోటార్స్ కార్పొరేషన్ ఉత్పత్తి ప్లాంట్ ను సందర్శించారు. ఆ సంస్థ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ పవన్ ముంజాల్  స్వయంగా ఈవీ వాహనాన్ని డ్రైవ్ చేస్తూ ముఖ్యమంత్రికి ప్లాంట్ లోని వేర్వేరు విభాగాలను చూపించారు. మోటార్ సైకిళ్ల తయారు చేస్తున్న ఉద్యోగులు, మహిళా సిబ్బందితో ముఖ్యమంత్రి మాట్లాడారు. తాము ఉత్పత్తి చేస్తున్న వాహనాల ప్రత్యేకతలను పవన్ ముంజాల్ వివరించారు. హీరో సంస్థ రూపొందించిన స్కూటీ కమ్ ఆటో వాహనాన్ని సీఎం  పరిశీలించారు.