Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...మరుగున పడ్డ అభివనవ భగీరథుడు మక్త్యాల రాజా చరిత్ర
posted on: May 18, 2026 4:33PM

ఆంధ్రప్రదేశ్ జలవనరుల ముఖచిత్రాన్ని మార్చేసి, కోట్లాది ఎకరాలకు నీటిని అందించి వాటిని సశ్యశ్యామలం చేసిన ఘనత నాగార్జునసాగర్, పులిచింతల వంటి మహా ప్రాజెక్టులకే దక్కుతుంది. సాధారణంగా ఈ ప్రాజెక్టుల గురించి మాట్లాడుకునేటప్పుడు అప్పటి ప్రభుత్వాలు, ప్రణాళికా సంఘాలు, ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ పేర్లు మాత్రమే వినిపిస్తూ ఉంటాయి. కానీ.. ఈ భారీ జలాశయాల నిర్మాణానికి అంకురార్పణ చేసింది మాత్రం కృష్ణా తీరానికి చెందిన ముక్త్యాల రాజా గా పిలువబడే ముక్త్యాల జమీందారు వాసిరెడ్డి శ్రీరామ గోపాలకృష్ణ మహేశ్వర ప్రసాద్. ఈ చారిత్రక సత్యాన్ని ప్రస్తుత చరిత్రకారులు తక్కువగా ప్రస్తావిస్తున్నారు. ప్రభుత్వ ఫైళ్లలోకి ఈ ఆలోచనలు రాకముందే.. ముక్త్యాల కోట కేంద్రంగా ఈ జలయజ్ఞానికి సంబంధించిన రూపకల్పన జరిగింది.
కృష్ణా నదీ పరివాహక ప్రాంతంలో వ్యవసాయాన్ని, జల సంరక్షణను వ్యవస్థీకరించడంలో వాసిరెడ్డి వంశానికి సుదీర్ఘ చరిత్ర ఉంది. శాతవాహనుల కాలం నాటి ధాన్యకటక, అమరావతి వైభవం నుంచి కృష్ణా డెల్టా పరిధిలో నీటి వినియోగం నిరంతరాయంగా సాగుతూ వచ్చింది. ఈ క్రమంలోనే వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు (1783–1816) గుంటూరు, కృష్ణా ప్రాంతాలలోని వందలాది గ్రామాలను పాలిస్తూ జలవనరుల అభివృద్ధికి పెద్దపీట వేశారు. చెరువుల పూడికతీత, కాలువల విస్తరణ ద్వారా ఆయన నీటిని ఒక మహాశక్తిగా మార్చి చూపించారు.
ఆ వంశ పరంపరలోనే వచ్చిన ముక్త్యాల రాజా 20వ శతాబ్దంలో ఆంధ్ర నీటిపారుదల రంగానికి దిక్సూచిగా నిలిచారు. కృష్ణా నదిపై ఒక భారీ నిల్వ జలాశయాన్ని నిర్మించాల్సిన అవశ్యకతను ముక్త్యాల రాజా అందరికంటే ముందే గుర్తించారు. బ్రిటిష్ ఇంజనీర్లతో సంప్రదింపులు జరిపి, నందికొండ ప్రాంతం ప్రాజెక్టుకు అత్యంత అనుకూలమైనదని ప్రతిపాదించారు. అదే సమయంలో మద్రాసు ప్రభుత్వం కృష్ణా జలాలను పెన్నా నది గుండా మద్రాసు వైపు తరలించేందుకు వ్యూహాలు పన్నుతుండటాన్ని గమనించిన ముక్త్యాల రాజా.. దానికి ప్రత్యామ్నాయంగా నాగార్జునసాగర్ డ్యామ్ ప్రతిపాదనను ఒక ప్రజా ఉద్యమంగా మార్చారు. తొమ్మిది జిల్లాల పరిధిలోని గ్రామ గ్రామాన తిరిగి ప్రజల నుంచి లక్షలాది సంతకాలను సేకరించడమే కాకుండా.. దట్టమైన అడవులను దాటుకుని నందికొండ ప్రాంతంలో స్వయంగా పర్యటించారు.
ప్రభుత్వాలు స్పందించక ముందే, సొంత ధనంతో రిటైర్డ్ ఇంజనీర్లను నియమించి ప్రాజెక్ట్ ప్రాథమిక మ్యాప్‌లను, డిజైన్‌లను సిద్ధం చేయించడం భారత జలవనరుల చరిత్రలోనే అపూర్వ ఘట్టం. మద్రాసు పాలకుల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురైనప్పటికీ, ముక్త్యాల రాజా వెనక్కి తగ్గలేదు. కృష్ణా ఫార్మర్స్ వెల్ఫేర్ సొసైటీ’ అనే రైతు సంఘాన్ని స్థాపించి.. ఢిల్లీలోని కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చారు. దీని ఫలితంగానే కేంద్రం ఈ అంశాన్ని పరిశీలించడానికి ఖోస్లా కమిటీని రంగంలోకి దించింది. అయితే.. ఆ రోజుల్లో నందికొండ ప్రాంతానికి సరైన రహదారి సౌకర్యం లేకపోవడంతో అక్కడికి వెళ్లేందుకు కమిటీ సభ్యులు నిరాకరించారు. ఆ సమయంలో ముక్త్యాల రాజా దాదాపు 25 గ్రామాల ప్రజలను, స్వచ్ఛంద సేవకులను ఏకం చేసి, కేవలం వారం రోజుల్లోనే రాత్రింబగళ్లు శ్రమించి నందికొండకు తాత్కాలిక రోడ్డు నిర్మించారు. ఆ రహదారి గుండా ప్రయాణించిన ఖోస్లా కమిటీ, ఆ ప్రదేశం భారీ డ్యామ్ నిర్మాణానికి అత్యంత యోగ్యమైనదని ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది.
ఈ నివేదికను కూడా పక్కనబెట్టేందుకు కొన్ని శక్తులు ప్రయత్నించినప్పటికీ, ఆచార్య ఎన్.జి.రంగా, మోటూరి హనుమంతరావు, కొత్త రఘురామయ్య వంటి నాటి ప్రముఖ నేతల అండదండలతో ప్రణాళికా సంఘం ఆమోదం లభించింది. అప్పటి గవర్నర్ చందూలాల్ త్రివేది, ప్రధాని నెహ్రూల సహకారంతో 1954లో నాగార్జునసాగర్ నిర్మాణానికి అధికారిక ప్రకటన వెలువడింది. 1955 డిసెంబర్ 10న శంకుస్థాపన జరుపుకున్న ఈ ప్రాజెక్టు, 1966 ఆగస్టు 3 నాటికి రైతులకు సాగునీటిని అందించడం ప్రారంభించింది. డ్యామ్ నిర్మాణ ఆమోదం లభించిన తర్వాత ముక్త్యాల రాజా ఏకంగా 52 లక్షల రూపాయల భారీ విరాళాన్ని ప్రకటించి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. నాగార్జునసాగర్‌తో పాటే పులిచింతల ప్రాజెక్టు వెనుక ఉన్న దూరదృష్టి కూడా వాసిరెడ్డి వంశానిదే. కృష్ణా నది ప్రవాహ సరళి, వరదలు, కరవు కాలాల గమనాన్ని ముక్త్యాల కోటలోని అర్ష రసాయనశాలలో శాస్త్రీయంగా అధ్యయనం చేసేవారు. వరద ముప్పు ఉన్న ప్రాంతాలు, నీటి నిల్వ అవసరమైన మండలాలపై ముక్త్యాల రాజా చేసిన పరిశోధనలే తదనంతర కాలంలో పులిచింతల ప్రాజెక్టుకు బలమైన పునాదులుగా మారాయి.
1980ల్లో పునరుద్ధరణ పనులు జరిగి, 2014 నాటికి పూర్తిస్థాయిలో నీటి నిల్వ సామర్థ్యాన్ని సాధించిన పులిచింతల వెనుక వాసిరెడ్డి వంశీయుల శతాబ్ద కాలపు శాస్త్రీయ ఆలోచనలు దాగి ఉన్నాయి. ఇంతటి ఘన చరిత్ర కలిగిన ముక్త్యాల రాజా పాత్ర అధికారిక రికార్డుల్లో ఎందుకు మరుగునపడిందనేది నేటి తరం ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత జమీందారీ వ్యవస్థ రద్దు కావడంతో.. ప్రాంతీయ పాలకుల ప్రస్తావనను చరిత్ర పుస్తకాల్లో తగ్గించి చూపే ధోరణి పెరిగింది. స్థానిక మేధావుల మేధోమథనం కంటే రాష్ట్ర, కేంద్ర స్థాయి రాజకీయ నాయకత్వాలకే క్రెడిట్ ఇచ్చే సంస్కృతి బలపడింది. దీనికి తోడు వాసిరెడ్డి వంశీయులు తమ సొంత ప్రచారానికి దూరంగా ఉండటం వల్ల ప్రభుత్వ నివేదికల్లో, పాఠ్యపుస్తకాల్లో వారి త్యాగాలు మసకబారిపోయాయి. నాగార్జునసాగర్ పునాదిలో కేవలం కాంక్రీటు మాత్రమే లేదు, ముక్త్యాల రాజా చెమట, సొంత ధనం, అంకితభావం కూడా ఉన్నాయి. నేడు ఆంధ్రప్రదేశ్ జలవనరుల అసలైన చరిత్రను పునర్లిఖించాల్సిన సమయం ఆసన్నమైంది. వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు చేసిన డెల్టా ఆధునికీకరణను, ముక్త్యాల రాజా నాగార్జునసాగర్-పులిచింతల కోసం సాగించిన భగీరథ ప్రయత్నాన్ని నేటి తరానికి చాటి చెప్పాలి. స్థానిక రైతాంగ పోరాటాలు, జమీందారుల ఒత్తిడి వల్లే నాటి కేంద్ర ప్రభుత్వాలు కదిలాయనే నిజాన్ని పాఠ్యపుస్తకాల ద్వారా సమాజానికి అందించడమే ఆ మహనీయునికి మనం ఇచ్చే అసలైన నివాళి.
-సీతారాం కంఠంనేని
ఈ విశ్లేషణ మీకు నచ్చినట్లయితే, దయచేసి https://www.teluguone.com పోర్టల్ ను ఫాలో అవ్వండి. లైక్ చేయండి. షేర్ చేయండి. మీ విలువైన అభిప్రయాలను తెలియజేయండి.






