నాయకులు @ నాలుకలు!

 

 

 

ఎవరికైనా కొత్తకొత్త హింసాత్మక పద్ధతులు తెలుసుకోవాలని వుంటే తెలంగాణ కాంగ్రెస్ నాయకులను సంప్రదించవచ్చు. మొన్నటి వరకూ సీమాంధ్రుల నాలుకలు కోయడం మీద తెలంగాణ వాదులు ఇంట్రస్ట్ చూపించేవారు. ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ నాయకులు సీమాంధ్రుల నాలుకలు కోయడంతోపాటు సరికొత్తగా హింసిస్తామని చెబుతున్నారు. ఆ సరికొత్త హింసాత్మక కార్యక్రమం ఎలా వుంటుందంటే, సీమాంధ్రుల నాలుకలకి ఉప్పు, పసుపు రాస్తారట. దాంతో సదరు నాలుకలు పల్చగా అయిపోతాయట! ఇదీ తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ప్రతిపాదిస్తున్న నూతన హింసావళి!

 

 

ఇంతకీ ఈ కొత్త విధానాన్ని ఎవరి మీద ప్రయోగించాలని అనుకుంటున్నారంటే, తెలుగుదేశం సీమాంధ్ర నాయకుల మీద! తెలుగుదేశం పార్టీలో వున్న సీఎం రమేష్ లాంటి సీమాంధ్ర నాయకులు తెలంగాణ నాయకుడైన ఎర్రబెల్లి దయాకరరావుని నానామాటలూ అంటున్నారంట. అది చూసి తెలంగాణ కాంగ్రెస్ నాయకులు పొన్నం ప్రభాకర్, సురేష్ షెట్కర్, సిరిసిల్ల రాజయ్య ఎంతమాత్రం తట్టుకోలేకపోతున్నారట. ఎర్రబెల్లిని ఎవరైనా ఏమైనా అంటే నాలుకలు కోయడంతోపాటు నాలుకలకి ఉప్పు, పసుపు రాసి పలుచగా చేస్తారట! తెలుగుదేశంలో వున్న ఎర్రబెల్లి దయాకరరావుకి, అదే పార్టీలో వున్న సీఎం రమేష్‌కి మధ్య వాగ్వాదం జరిగితే, కాంగ్రెస్‌లో ఉన్న ముగ్గురు మూర్తులకి కోపమెందుకో!
అయినా  చంద్రబాబు జోక్యంతో తెలుగుదేశంలో వివాదం సర్దుమణిగిన తర్వాత వీళ్ళు హడావిడి చేయడం ఎందుకో! ఎందుకనేది టీ కాంగ్రెస్ నాయకులు చెప్పకుండానే చెబుతున్నారు. తెలుగుదేశం పార్టీలో అవమానాలను గురి అవుతున్న తెలంగాణ నాయకులు ఇంకా ఆ పార్టీలో వుండటం వేస్టట! అర్జెంటుగా బయటకి వచ్చేయాలట! అదండీ విషయం.. తెలుగుదేశం పార్టీలో వున్న తెలంగాణ నాయకుల మీద ‘ఆకర్ష’ పథకాన్ని ప్రయోగించడంలో భాగంగానే తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ఇలాంటి మొసలి కన్నీరు కార్చుతున్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. టీ కాంగ్రెస్ నాయకులు తెలుగుదేశం నాయకుల మీద ఎంత ‘ఆకర్ష’  ప్రయోగించినా అది ‘వికర్ష’ కావడం ఖాయమని విశ్లేషిస్తున్నారు.