డాలర్ యుగం అంతమౌతోందా? డీ- డాలరైజేషన్ వేగం పెరుగుతోందా?

posted on: Apr 14, 2026 1:55PM

సంకలనం, సేకరణ : కంఠమనేని సీతారాం

ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఒక కీలక మార్పు దిశగా చర్చలు మళ్లీ వేగం అందుకున్నాయి. ఇటీవల అమెరికా విదేశాంగ  మంత్రి మార్కో రూబియో చేసిన వ్యాఖ్యలు ఈ అంశాన్ని అంతర్జాతీయ వేదికపైకి తెచ్చాయి.  డాలర్ ఆధిపత్యానికి సవాల్ ఎదురైందా?  రూబియో పేర్కొన్నదేమిటంటే..  బ్రెజిల్, చైనా వంటి దేశాలు పరస్పర వాణిజ్యంలో అమెరికన్ డాలర్ను పక్కన పెట్టి, తమ స్థానిక కరెన్సీలతో లావాదేవీలు నిర్వహిస్తున్నాయి. ఇదే ధోరణి కొనసాగితే, వచ్చే 5 సంవత్సరాల్లో అనేక దేశాలు డాలర్ పై ఆధారపడటాన్ని  తగ్గించుకోవచ్చు. అదే కనుక జరిగితే..  అమెరికా ఇతర దేశాలపై ఆర్థిక ఆంక్షలు  విధించే శక్తి గణనీయంగా తగ్గిపోతుంది.  

 ఇంతకీ డీ-డాలరైజేషన్ అంటే ఏమిటి?  అంటే.. అంతర్జాతీయ వాణిజ్యంలో డాలర్ వినియోగాన్ని తగ్గించడం, స్థానిక కరెన్సీలు లేదా ప్రత్యామ్నాయ వ్యవస్థలను ఉపయోగించడం.  ఇది కేవలం ఆర్థిక మార్పు కాదు భౌగోళిక-రాజకీయ (పొలిటికల్ అండ్ జియోగ్రాఫికల్) మార్పు కూడా.  బ్రిక్స్ దేశాలు ఇందులో  ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. భారత్  రష్యా నుండి చమురు కొనుగోళ్లలో రూపాయి వినియోగం. అలాగే..  చైనా  తన సొంత కరెన్సీ యువాన్ ఆధారిత వాణిజ్యాన్ని ప్రోత్సహిస్తోంది . రష్యా పాశ్చాత్య ఆంక్షల తర్వాత ప్రత్యామ్నాయ వ్యవస్థలపై దృష్టి సారించింది.   భారత రూపాయి ఇప్పటికే 20కి పైగా దేశాల్లో వాణిజ్య లావాదేవీలకు ఉపయోగంలోకి వస్తోంది.

ఈ పరిస్థితుల్లో  డాలర్ భవిష్యత్  ఏమిటి? 

 ప్రస్తుతానికికైతే.. ప్రపంచ విదేశీ మారక నిల్వల్లో డాలర్ దే ఆధిపత్యం.   గ్లోబల్ ట్రేడింగ్లో అత్యధిక భాగం డాలర్ ద్వారానే  జరుగుతోంది.   అయితే భవిష్యత్తులో పరిస్థితి  మారే అవకాశాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. ఆ మార్పు ఎలా ఉండొచ్చంటే..   మల్టీ-కరెన్సీ ప్రపంచం అంటే.. డాలర్ తో పాటు, యువాన్ , యూరో , రూపాయి వంటి అనేక కరెన్సీలు కూడా సమాంతరంగా వినియోగంలోకి వస్తాయి. డాలర్ ఆధిపత్యం తగ్గినా, పూర్తిగా ముగియదు.  అమెరికా ఆర్థిక వ్యవస్థ బలం, మార్కెట్ల లోతు కారణంగా డాలర్  కీలక పాత్రలోనే ఉంటుంది.  అయితే..   ఆంక్షలు విధించే శక్తి తగ్గుతుంది.  ఇతర దేశాలు ప్రత్యామ్నాయ చెల్లింపు వ్యవస్థలు అభివృద్ధి చేస్తే అమెరికా ప్రభావం గణనీయంగా తగ్గుతుంది.  

డీ-డాలరైజేషన్ గురించి చర్చలు పెరుగుతున్నా.. ఇది ఒక్కరోజులో జరిగే మార్పు కాదు.  గ్లోబల్ ఫైనాన్షియల్ సిస్టమ్ చాలా క్లిష్టమైనది. విశ్వసనీయత, స్థిరత్వం, మార్కెట్ లోతు వంటి అంశాలు కీలకం. ఈ ఆంశాల్లో అమెరికా ఇప్పటికీ బలోపేతంగా ఉంది.  డీ-డాలరైజేషన్ ఒక ట్రెండ్, కానీ అది ఇంకా పూర్తి స్థాయికి విస్తరించలేదు. ప్రపంచం నెమ్మదిగా, ఒకే కరెన్సీ ఆధారిత వ్యవస్థ నుంచి బహుళ కరెన్సీ వ్యవస్థ వైపు  మారుతోంది.   డాలర్ ముగిసిపోతుందా? అనే ప్రశ్న కంటే  డాలర్ పాత్ర ఎలా మారుతుంది?  అనేది ముఖ్యమైన ప్రశ్న.

భవిష్యత్తు ప్రపంచం, మరింత సమతుల్యమైనది ,  మరింత విభిన్న కరెన్సీలతో కూడినది.  అంత మాత్రాన డాలర్ ప్రభావం పూర్తిగా తగ్గిపోవడం ఇప్పట్లో జరిగే విషయం కాదు. కానీ డీ-డాలరైజేషన్ ప్రారంభమైంది.. అదే సమయంలో డాలర్ యుగం ముగియలేదు.  

google-ad-img
    Related Sigment News
    • Loading...