కాంగ్రెస్‌కి ముస్లింల టాటా!

 

 

 

కాంగ్రెస్ పార్టీకి కాలం తీరినట్టుంది. ఓటర్లకు చేరువవ్వాలని కాంగ్రెస్ నాయకులు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా అవి బెడిసి కొడుతున్నాయి. తాళ్ళే పాములుగా మారి కాంగ్రెస్ పార్టీని కాటేస్తున్నాయి. రాబోయే లోక్‌సభ ఎన్నికలకు సెమీఫైనల్‌గా భావిస్తున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ దీనస్థితి బయటపడుతోంది.కాంగ్రెస్ పార్టీ ఎటు వెళ్ళాలని అనుకున్నా ఎదుర్రాళ్ళు తగులుతున్నాయి. ఓటర్లను ఎమోషనల్ బ్లాక్‌మెయిలింగ్ చేసి ఓట్లు దండుకోవాలని రాహుల్ ‌గాంధీ చేస్తున్న ప్రయత్నాలు, ప్రసంగాలు బెడిసికొడుతున్నాయి.

 

ఆమధ్య ముజఫర్‌నగర్‌లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో రాహుల్ గాంధీ ముస్లిం ఓటర్లను ఆకట్టుకునే ఉద్దేశంతో ప్రసంగాన్ని ప్రారంభించాడు. చివరికి ఆ ప్రసంగం అటు తిరిగి ఇటు తిరిగి ముస్లిం యువకులకు తీవ్రవాదులతో సంబంధాలున్నట్టు ధ్వనించే మాటలు మాట్లాడే వరకూ వెళ్ళింది. రాహుల్ ప్రసంగం ముస్లింలను ఆకట్టుకునే మాట అటుంచి ఆల్రెడీ కాంగ్రెస్‌కి ఓటుబ్యాంకుగా వున్న ముస్లిం ఓటర్లు కూడా ఖల్లాస్ అయ్యే పరిస్థితి వచ్చింది. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ఉపయోగం వుంటుందా? నోరు జారిన తర్వాత నాలుక్కరుచుకుంటే లాభం వుంటుందా? ప్రస్తుతం ముస్లిం ఓటర్ల విషయంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి, రాహుల్ గాంధీ పరిస్థితి అలాగే తయారైంది. రాబోయే రోజుల సంగతి ఏమోగానీ, ప్రస్తుతం జరుగుతున్న ఐదు రాష్ట్రాల ఎన్నికలలో మాత్రం ముస్లింలు కాంగ్రెస్ పార్టీకి టాటా చెప్పినట్టేనని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.
అయితే ముస్లింల విషయంలో జరిగిన పొరపాటును సరిదిద్దే కార్యక్రమాన్ని కాంగ్రెస్ అధిష్ఠానం మొదలుపెట్టింది. కాకలు తిరిగిన మంత్రి కపిల్ సిబాల్‌ని రంగంలోకి దించింది. కపిల్ సిబల్ నాటకీయంగా రంగంలోకి దిగి, ముస్లింల మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడి రాహుల్ చాలా పెద్ద తప్పు చేశాడని, కాబట్టి రాహుల్ వెంటనే ముస్లింలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశాడు. రేపో ఎల్లుండో రాహుల్ ముస్లింలకు సారీ చెప్పేస్తే ముస్లింలు చల్లబడిపోయి కాంగ్రెస్‌కి ఓటేసేస్తారని కాంగ్రెస్ పెద్దల దింపుడుకళ్ళం ఆశావాదం.