Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...జనగణనలో సరికొత్త ప్రశ్నలు...ఆహారపు అలవాట్లపై కేంద్రం ఆరా!
posted on: Apr 18, 2026 4:04PM

రానున్న జనాభా గణనలో ప్రజల జీవనశైలితో పాటు, వారి ఆహారపు అలవాట్లపై కూడా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోంది. దేశ చరిత్రలో తొలిసారిగా, ప్రతి కుటుంబం తమ భోజన విధానాల గురించి స్పష్టమైన సమాచారాన్ని తెలియజేయాలని కేంద్రం ఆదేశించింది. ఇప్పటివరకు ప్రాథమిక వివరాలకే పరిమితమైన గణన, ఈసారి మరింత సమగ్రంగా సాగనుంది.
ఈ ప్రక్రియలో భాగంగా, ప్రజలు ప్రధానంగా తీసుకుంటున్న ఆహార ధాన్యాల వివరాలను సేకరించనున్నారు. సాధారణంగా లభించే బియ్యం, గోధుమలతో పాటు, జొన్నలు, సజ్జలు, మక్కల వంటి తృణ ధాన్యాలను ఆహారంలో భాగంగా తీసుకుంటున్నారా? లేదా అనే అంశాన్ని తప్పనిసరిగా నమోదు చేయాలి. ఒకవేళ వీటిలో ఏవీ కాకుండా ఇతరత్రా ఆహారాన్ని తీసుకుంటే, దానిని 'ఇతరాలు'గా పేర్కొనాలని అధికారులు సూచించారు.
ఈ వివరాలను సేకరించడం వెనుక కేంద్రం ప్రత్యేక లక్ష్యాలను కలిగి ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రేషన్ కార్డుల ద్వారా పంపిణీ చేస్తున్న ఆహార పదార్థాల నాణ్యతను, లబ్ధిదారుల అవసరాలకు అనుగుణంగా మార్పులు చేయాలనే యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉంది. ప్రజల వాస్తవ ఆహారపు అలవాట్లను బట్టి భవిష్యత్తులో రేషన్ పంపిణీ వ్యవస్థలో కీలక మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది.
జనగణనలో భాగంగా మొత్తం 34 ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ నెల 26 నుంచి వచ్చే నెల 10 వరకు సదరు వెబ్ పోర్టల్‌లో ఆన్‌లైన్ ద్వారా కుటుంబ యజమానులు వివరాలను నమోదు చేయవచ్చు. నమోదు ప్రక్రియలో కుటుంబంలోని ఏదో ఒక సెల్‌ఫోన్ నంబర్‌ను తప్పనిసరిగా అనుసంధానించాలి. ఒకవేళ ఎవరైనా ఆన్‌లైన్‌లో నమోదు చేయలేకపోతే, వచ్చే నెల 11 నుంచి జూన్ 9 మధ్య గణకులు స్వయంగా ఇంటికి వచ్చి సమాచారాన్ని సేకరిస్తారు.
కేవలం ఆహారమే కాకుండా, ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాల వివరాలు, వారి మతపరమైన గుర్తింపు, అలాగే సొంత ఇల్లు ఉందా? లేదా అద్దె ఇంట్లో ఉంటున్నారా? వంటి సమగ్ర వివరాలను ప్రభుత్వం అడుగుతోంది. అలాగే, రేడియో వినియోగం, వంట కోసం గ్యాస్ కాకుండా కిరోసిన్, కట్టెలు, బయోగ్యాస్ వంటి ఇతర మార్గాలను వాడుతున్నారా? అన్న అంశాలను కూడా ఈ సర్వేలో చేర్చారు.
ఈ సమగ్ర సమాచార సేకరణ ద్వారా దేశంలోని పేదరికం, నివాస సౌకర్యాలు మరియు ప్రజల జీవన ప్రమాణాలపై పూర్తిస్థాయి అవగాహన వస్తుందని అధికారులు భావిస్తున్నారు. ఈ గణన ఫలితాలు భవిష్యత్తులో ప్రభుత్వ సంక్షేమ పథకాల రూపకల్పనకు మరియు అమలుకు కీలక మార్గదర్శకంగా మారనున్నాయి. ప్రజలందరూ తమ పూర్తి వివరాలను వాస్తవంగా నమోదు చేసి, సర్వేకు సహకరించాలని అధికారులు కోరుతున్నారు.


.webp)



