తెలుగుదేశం తప్పటడుగు!
posted on Apr 12, 2014 12:06PM
.jpg)
ఏ నిర్ణయం తీసుకున్నా చంద్రబాబు ఆచి, తూచి చాలా జాగ్రత్తగా తీసుకుంటారు. ఇది గతం. ఇప్పుడు పరిస్థితి మారినట్టుగా కనిపిస్తోంది. చంద్రబాబు నాయుడు తీసుకుంటున్న చాలా నిర్ణయాలు గతంలో మాదిరిగా పకడ్బందీగా వుండటం లేదనే అభిప్రాయాలు పార్టీలో వినిపిస్తున్నాయి. దీనికి ఉదాహరణగా బీజేపీతో సీట్ల సర్దుబాటు విషయంలో వేసిన భారీ తప్పటడుగు గురించి చెబుతున్నారు. రెండు పార్టీల సీట్ల సర్దుబాటులో భాగంగా వైజాగ్, తిరుపతి లోక్‌సభ స్థానాలకు బీజేపీకి అప్పగించారు. ఈ సీట్ల సర్దుబాటు జరిగిన సమయంలో చంద్రబాబును చుట్టూ వున్నవారు భలే నిర్ణయం తీసుకున్నారని అభినందించారు. అయితే అదెంత పెద్ద తప్పటడుగో ఆ తర్వాత తెలిసొచ్చింది. ఆ తెలిసి రావడం కూడా చంద్రబాబుకి సొంతగా తెలిసిరావడం కాదు.
సీనియర్ నాయకుడొకరు చంద్రబాబు వేసిన తప్పటడుగును ఆయన దృష్టికి తీసుకెళ్ళారు. సీమాంధ్రలో వున్న మూడు ప్రధాన నగరాలలో రెండు ప్రధాన నగరాలను బీజేపీకి ఇచ్చేశారు. ఈ రెండు సీట్లలో బీజేపీ గెలిచినా, మరో పార్టీ గెలిచినా ఈ రెండు నగరాలలో తెలుగుదేశానికి ఎలాంటి పట్టూ వుండదు. ఒకవేళ విజయవాడలో టీడీపీ ఎంపీ అభ్యర్థి గెలవకపోతే సీమాంధ్రలోని మూడు ప్రధాన నగరాలలో తెలుగుదేశం పార్టీకి అడ్రసే వుండదు. ఆ సీనియర్ నాయకుడు ఈ పాయింట్‌ని చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకురాగానే తాను వేసి తప్పటడుగును గ్రహించిన చంద్రబాబు దాన్ని సరిదిద్దుకునే ప్రయత్నాలు ప్రారంభించారు.
వైజాగ్ సీటును తెలుగుదేశానికి ఇచ్చేస్తే కాకినాడ సీటు ఇస్తామని బీజేపీతో రాయబారాలు ప్రారంభించారు. అయితే ఇప్పటి వరకు బీజేపీ నుంచి ఎలాంటి ప్రతిస్పందన రాలేదు. ఒకవేళ బీజేపీ గనుక తెలుగుదేశం సవరణ ప్రతిపాదనకు అంగీకరించకపోతే ఆ తప్పటడుగు తెలుగుదేశం అధినేతను సుదీర్ఘకాలం బాధపెట్టే అవకాశం వుంది.