టీవీ స్టూడియోల్లో గెలిచి ఎన్నికల్లో ఓడిన ఆప్!

posted on: Mar 11, 2017 1:36PM

 

మన దేశంలో రాజకీయ పార్టీలు రెండు రకాలుగా వుంటాయి! మొదటి రకం ... జనం మెచ్చినవి! రెండో రకం... మెయిన్ స్ట్రీమ్ మీడియా నచ్చినవి! ఇందుకు మంచి ఉదాహరణ, ఆమ్ ఆద్మీ పార్టీ! అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలో నడిచే ఈ ఢిల్లీ పార్టీ అంటే జాతీయ ఇంగ్లీష్ , హిందీ మీడియాకి ఎక్కడలేని ఆసక్తి! అన్నా హజారేతో విడిపోయి కేజ్రీవాల్ స్వంత దుకాణం తెరిచినప్పటి నుంచీ ఇంగ్లీష్, హిందీ పేపర్లు, ఛానల్స్ దాదాపుగా ఆప్ కు మద్దతు ప్రకటిస్తూనే వచ్చాయి. కొత్త రకం రాజకీయం అంటూ కొంత కాలం భ్రమ ఏర్పడినా రాను రాను ఆప్ ఎదుర్కొంటోన్న విమర్శలు చాలా మందిని పునరాలోచనలో పడేశాయి. అన్నా హజారే, ప్రశాంత్ భూషణ్, యోగేంద్ర యాదవ్ తో సహా చాలా మంది ఆప్ పైన అసంతృప్తి వెళ్లగక్కారు! అయినా మన మీడియా మాత్రం ఆమ్ ఆద్మీ పార్టీ చీపురు కట్టా పాత పార్టీల్ని ఊడ్చేస్తుందంటూ అవసరానికి మించి హైప్ క్రియేట్ చేస్తూనే వచ్చాయి!

 

ఈ సారి జరిగిన అయిదు రాష్ట్రాల ఎన్నికల ముందు నుంచీ కూడా ఆప్ ఎప్పటిలానే మీడియా ప్రొత్సాహాన్ని బోలెడంత పొందింది! పార్లమెంట్లో ఎన్నికల్లో వారణాసి నుంచి పోటీ చేసి దారుణంగా ఓడిపోయిన కేజ్రీవాల్ ఈసారి తెలివిగా యూపీ జోలికి వెళ్లలేదు. గోవా, పంజాబ్ లలో పాగా వేద్దామని తలిచాడు. రాజకీయ నేతగా ఆయనకు ఆ హక్కు వున్నా... జనానికి వాస్తవాలు చెప్పాల్సిన మీడియా ఆయన పార్టీని ఆకాశానికి ఎత్తేసింది!

 

గోవాలో , పంజాబ్ లో బీజపి పాలనని అంతం చేసేస్తుందంటూ ఆప్ పై అపోహలు కల్పించాయి. ప్రీ పోల్స్ లో, ఒపీనియన్ పోల్స్ లో, ఎగ్జిట్ పోల్స్ లో వీలైనన్ని ఎక్కువ సీట్లు ఇస్తూ వచ్చాయి! కాని, చివరకు ఫలితాలు వచ్చాక ఆప్ ప్రభావం మీడియా చెప్పినదాంట్లో వందో వంతు కూడా కాదని తేలిపోయింది! పంజాబ్ లో చెప్పుకోదగ్గ స్థాయిలో సీట్లొచ్చినా.. గెలిచిన కాంగ్రెస్ సాధించిన సీట్లలో సగం కూడా ఆప్ కు రాలేదు. ఇక గోవాలో అయితే ఖాతా తెరిచే సూచనలు కనిపించటం లేదు! ఇలాంటి పరిస్థితి క్షేత్ర స్థాయిలో ఆప్ కు వుందని మీడియాకు, సీనియర్ జర్నలిస్టులకి తెలియదా? తెలియదనుకోవటం మన అమాయకత్వమే అవుతుంది!

google-ad-img
    Related Sigment News
    • Loading...