గుజరాత్ అల్లర్లలో కీలక తీర్పు

posted on: Jun 17, 2016 2:37PM

14 సంవత్సరాల నాటి రక్తసిక్తమైన నేరానికి ఇవాళ ఓ ముగింపు దక్కింది. 2002లో జరిగిన గుజరాత్‌ అల్లర్లలో భాగంగా 24 మందికి ఓ ప్రత్యేక న్యాయస్థానం కారాగార శిక్షను విధించింది. అయితే ఈ నేరస్తులకు తగిన శిక్షను అందించలేదనీ, పైగా వీరి వెనుక ఉన్న అసలు నేరస్తులు నిర్భయంగా తిరుగుతున్నారనీ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వివరాల్లోకి వెళ్తే... 2002, ఫిబ్రవరి 27న గుజరాత్‌లోని గోధ్రా స్టేషన్‌లో 58 మంది కరసేవకులను మతవాదులు హతమార్చారు. ఇందుకు ప్రతీకారంగా గుజరాత్‌ అంతగా ఒక్కసారిగా అల్లర్లు చెలరేగాయి. అల్లర్లను అదుపుచేయాల్సిన అధికార యంత్రాంగం కూడా చూసీచూడనట్లు వ్యవహరించిందన్న ఆరోపణలూ ఉన్నాయి. 

 

గోధ్రా ఘటన జరిగిన మర్నాడు అహ్మదాబాదులో ముస్లింలు అధికంగా నివసించే ప్రాంతాల మీద అల్లరి మూకల కళ్లు పడ్డాయి. అందులో భాగంగానే గుల్బర్గా హౌసింగ్‌ సొసైటీ అనే నివాసం సముదాయం మీదకు ఒక్కసారిగా దాడిచేశారు. గుల్బర్గా సొసైటాలో మాజీ పార్లమెంట్‌ సభ్యుడు ఎహ్‌సాన్‌ జాఫ్రీవంటి వారు సైతం ఉన్నా, వారికి రక్షణగా ఎవరూ స్పందించలేకపోయారు. రక్షణను అర్థిస్తూ ఎహ్‌సాన్‌ చేసిన ఫోన్‌ కాల్స్‌ అన్నీ వృధా అయిపోయాయి. జాఫ్రీతో సహా 69 మందిని నిర్దాక్షిణ్యంగా ఊచకోత కోశారు. ఈ అల్లర్ల వెనుక సాక్షాత్తూ అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోదీ ప్రోత్సాహం ఉందన్నది జాఫ్రీ భార్య ఇప్పటికీ ఆరోపిస్తున్నారు. అయితే ప్రభుత్వాలు మాత్రం ఈ విషయాన్ని దాటవేస్తూ వచ్చాయి. జాఫ్రీ చివరిసారిగా చేసిన ఫోన్‌కాల్స్‌ జాబితాను కానీ, దర్యాప్తు సంస్థ రూపొందించిన నివేదికను కానీ బహిర్గతం చేసేందుకు న్యాయస్థానాలు సైతం నిరాకరించాయి.

 

తాజాగా ఓ ప్రత్యేక కోర్టు ఆనాటి అల్లర్లలో ముద్దాయిలుగా పేర్కొన్న 60 మందిలో 24 మందిని దోషులుగా గుర్తించింది. వీరిలో పదకొండు మందికి 14 సంవత్సరాల కారాగార శిక్షను ఖరారు చేసింది. మరో 12 మందికి ఏడు సంవత్సరాల శిక్షనూ, ఒకరికి పదేళ్ల జైలునీ శిక్షగా పేర్కొంది. దోషులుగా గుర్తించినవారిలో వీహెచ్‌పీ నేత అతుల్ వైద్య కూడా ఉండటం గమనార్హం.
 

google-ad-img
    Related Sigment News
    • Loading...