ముద్రగడ కొద్దిగా నీళ్లు తాగారు.. అయోమయంలో ప్రభుత్వం..

posted on: Jun 13, 2016 11:23AM

 

ముద్రగడ పద్మనాభం శనివారం ర్రాతి కొద్దిగా మంచినీళ్లు తీసుకున్నారని రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు చెప్పారు. కాపు నేత ముద్రగడ పద్మనాభం తన దీక్షను ఇంకా కొనసాగిస్తూనే ఉన్నారు. కాపులకు రిజర్వేషన్లు కల్పించాలని.. అంతేకాదు తుని ఘటనలో అరెస్ట్ చేసిన వారిని విడుదల చేయాలని.. లేదంటే తనను కూడా అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ ముద్రగడ దీక్షకు దిగగా.. దానిని భగ్నం చేసి పోలీసులు ఆస్పత్రికి తరలించారు. అయినా కూడా ముద్రగడ దీక్ష విరమించేది లేదని పట్టుబట్టి అలానే దీక్ష కొనసాగిస్తున్నారు. అయితే వైద్య పరీక్షలకు మాత్రం ఆయన నిరాకరిస్తున్నారని.. పరీక్షలు చేయించుకుంటేనే ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి చెప్పగలమని..  ఆహారం తీసుకోకపోవడం వల్ల ముద్రగడ ఆరోగ్యం క్షీణిస్తుందని తెలిపారు.

 

మరోవైపు ఏపీ ప్రభుత్వం కూడా ముద్రగడ డిమాండ్లకు సానుకూలంగానే స్పందించింది. దీక్ష విరమించడానికి ముద్రగడ అంగీకరిస్తే తుని విధ్వంసం కేసును సిబిఐకి అప్పగిస్తామని చినరాజప్ప తెలిపారు. ఎంత ఖర్చైనా ముద్రగడకు చికిత్స అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రిగారు అన్నారు. కానీ ముద్రగడ డిమాండ్ ప్రకారం.. నిందితులను విడుదల చేయడం వీలు కాదని.. రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం పై ఉందని తెలిపారు.

 

ఇదిలా ఉండగా ఇదే అదనుగా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ముద్రగడ దీక్షను ఉపయోగించుకొని ప్రభుత్వంపై విమర్శల బాణాలు వదులుతున్నారు. ఇక చిరంజీవి సహా పలువురు కాపునేతలు ముద్రగడకు మద్దతు తెలుపుతున్నారు. దీంతో ఒకపక్క ముద్రగడ దీక్ష విరమింపజేయకపోవడం.. మరోవైపు నేతల విమర్శలతో ప్రభుత్వానికి కూడా ఏం చేయాలో తెలియని అయోమయ పరిస్థితిలో పడింది. మరి ముద్రగడ డిమాండ్ ప్రకారం.. ప్రభుత్వం నిందితులను విడుదల చేస్తుందా.. లేక వ్యూహాత్మక రచనలు ఏమైనా చేస్తుందా..లేక ముద్రగడ దీక్షను విరమిస్తారా.. తెలియాలంటే వెయిట్ చేయాల్సిందే.

google-ad-img
    Related Sigment News
    • Loading...