పవన్ కళ్యాణ్ కి వీహెచ్ మార్గదర్శనం!!!

 

కరవమంటే కప్పకు కోపం, విడవమంటే పాముకి కోపం అన్నట్లుగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రత్యేక హోదా, రాజధాని భూసేకరణ తదితర అంశాలపై మాట్లాడకపోతే ప్రతిపక్షాల విమర్శలు, ప్రశ్నలు ఎదుర్కోవలసి వస్తుంది. వాటిపై గట్టిగా మాట్లాడితే అధికార పార్టీ నేతల విమర్శలు ఎదుర్కోవలసి వస్తుంది. కురుక్షేత్ర సంగ్రామంలో ఇటువంటి సందిగ్ద పరిస్థితుల్లోనే ఉన్న అర్జునుడికి శ్రీకృష్ణుడు కర్తవ్యం భోదపరిచి యుద్దానికి సన్నధం చేసినట్లుగా తెలంగాణాకు చెందిన సీనియర్ కాంగ్రెస్ నేత వి. హనుమంతరావు వెనక నుండి పవన్ కళ్యాణ్ కి మార్గదర్శనం చేస్తుండటం చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది.

 

పవన్ కళ్యాణ్ ఎప్పుడయినా మౌనం వహిస్తే వీహెచ్ ఆతనికి తక్షణ కర్తవ్యం భోదిస్తున్నట్లు ఫలానా అంశం మీద పోరాడు లేకుంటే నీ ఇంటి ముందు ధర్నా చేస్తానని చురకలు వేసి మేల్కొలుపుతూ ఉంటారు. ఉదాహరణకి ఓటుకి నోటు కేసు విషయంలో పవన్ కళ్యాణ్ మౌనం వహిస్తే దాని గురించి మాట్లడవేమని నిలదీసింది ఆయనే. అదేవిధంగా రాజధాని భూసేకరణ అంశం గురించి పవన్ కళ్యాణ్ ట్వీట్లకే పరిమితమయినప్పుడు, తెలంగాణాకు చెందిన వీహెచ్ కి ఆ అంశంతో ఎటువంటి సంబంధం లేనప్పటికీ, ట్వీట్లు పోస్ట్ చేయడం కాదు వెళ్లి రైతుల తరపున నిలబడి పోరాడమని దిశా నిర్దేశం చేసింది ఆయనే. పవన్ కళ్యాణ్ ఆయన సలహాలు, సూచనలను పట్టించుకోవడంలేదనడానికీ లేదు. ఎందుకంటే ఇంతకు ముందు అయన హైదరాబాద్ లో ప్రెస్ మీట్ పెట్టినప్పుడు తన ప్రసంగంలో వీహెచ్ ప్రస్తావన చేసారు. అంటే వీహెచ్ పరోక్షంగా పవన్ కళ్యాణ్ కి కర్తవ్యం భోదిస్తున్నట్లుగానే భావించవచ్చును.

 

పవన్ కళ్యాణ్ నిన్న రాజధాని గ్రామాలలో పర్యటించి తెదేపా ప్రభుత్వాన్ని ఎండగట్టిన తరువాత, వీహెచ్ మళ్ళీ పవన్ కళ్యాణ్ పై ప్రశంసలు కురిపించడం విశేషం. ప్రజల కోసం దైర్యంగా పోరాడే వాడే నిజమయిన లీడర్ అని రైతులకు అండగా నిలబడేందుకు సిద్దపడిన పవన్ కళ్యాణే నిజమయిన లీడర్ అని ఆయన మెచ్చుకొన్నారు. ఒక సీనియర్ కాంగ్రెస్ నేత తమ రాజకీయ ప్రత్యర్ధి అయిన తెదేపా, బీజేపీలకు మద్దతు ఇస్తున్న పవన్ కళ్యాణ్ కి ఈవిధంగా మెచ్చుకోవడం చాలా ఆశ్చర్యం కలిగించవచ్చు. ఆయన తమ ప్రత్యర్ధ రాజకీయ పార్టీల మీదకి పవన్ కళ్యాణ్ ని ఉసిగొల్పుతున్నట్లు కనబడుతోంది. రాజధాని భూసేకరణ విషయంలో ఆయన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని విమర్శించడం చూస్తే ఈ అనుమానం నిజమేననిపిస్తుంది. లేకుంటే ప్రత్యేక హోదా, రాజధాని భూసేకరణ అంశాలపై పవన్ కళ్యాణ్ కంటే ముందు నుండి పోరాటం చేస్తున్న వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డిని ఆయన మెచ్చుకొని ఉండాలి. పైగా జగన్ కూడా ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ సభ్యుడే. కానీ జగన్ని పట్టించుకోకుండా వీ.హెచ్. కేవలం పవన్ కళ్యాణే పట్టించుకొంటున్నారు?

Online Jyotish
Tone Academy
KidsOne Telugu