Curfew in Hyderabad to Continue 2 More Days

The curfew imposed in the old city of Hyderabad is likely to continue for 2 more days. On Tuesday, the consecutive third day of the curfew, the situation still remains tense, but is under control.

People in curfew bound areas under Madannapet and Saeedabad police station limits are reeling under the shortage of essential commodities. Daily wage earners are the worst hit. Though police Monday night announced that there would be relaxation in curfew between 12 noon and 2 p.m. Tuesday, the same was withdrawn. However, Police Commissioner A.K. Khan has announced that prohibitory orders, banning the assembly of four or more people, would continue till April 14 in the city. Pillion riding on motorbike has also been banned during night hours.

The indefinite curfew was imposed Sunday after communal clashes broke out following the desecration of a place of worship at Madannapet. Police remained on high alert following the desecration of three more places of worship at Narayanguda and Kachiguda, both outside curfew-bound areas. A tense situation prevails across the old city due to sporadic incidents of violence. An uneasy calm prevails in the densely populated neighbourhoods around the historic Charminar and Mecca Masjid as a sense of fear grips people. Business in the centuries-old markets in the old city has been badly hit.
 

కూటమి పార్టీల కంటే వైసీపీకే ఎక్కువ ఎలక్షన్ ఫండ్స్

  తెలుగు రాష్ట్రాల్లోనూ పొలిటికల్ పార్టీలకు ఫండ్స్ బాగానే గిట్టుబాటయ్యాయి. అయితే.. ఏపీలో పవర్‌లో ఉన్న టీడీపీ, జనసేన కంటే వైసీపీ కలెక్షన్లే ఎక్కువగా ఉండడం హాట్‌టాపిక్‌గా మారింది. ఇక, తెలంగాణలో ప్రతిపక్ష బీఆర్ఎస్‌ సీన్ రివర్సైంది.  రాజకీయ పార్టీలకు లభించే ఫండ్స్ విషయంలో ఏపీ, తెలంగాణలోని పార్టీలు సైతం ముందు వరుసలో ఉన్నాయి. అయితే.. తెలంగాణతో పోలిస్తే ఏపీకి దక్కిన వాటా చాలా ఎక్కువ. కానీ, ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న పొలిటికల్ పార్టీల మధ్య మాత్రమే చూస్తే ఆసక్తికరమైన సంగతులు బయటపడ్డాయి. ఏపీలోని అధికార కూటమిలో భాగమైన టీడీపీకి 83 కోట్లు డొనేషన్ల రూపంలో లభించగా.. జనసేనకు 25 కోట్లు ఫండ్ల రూపంలో వచ్చాయి. అయితే.. ఇక్కడ కీలకమైన విషయం ఏంటంటే 2023-24 ఆర్థిక సంవత్సరంలో అంటే టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వచ్చిన విరాళాలు వంద కోట్లు కాగా.. 2024-25 ఫైనాన్షియల్ ఇయర్ అంటే టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు లభించినవి కేవలం 83 కోట్లు మాత్రమే కావడం ఆసక్తికరంగా మారింది. ఇక, జనసేనకు ఎలక్టోరల్ ట్రస్ట్‌ల నుంచి ఒక్క రూపాయి కూడా విరాళం కింద లభించలేదు. కానీ, వ్యక్తిగతంగా మాత్రం పలువురు 25 కోట్ల రూపాయల మేర అందించారు.  ఏపీలోని పొలిటికల్ పార్టీలకు దక్కిన విరాళాల్లో అన్నింటికంటే ముఖ్యమైనది వైసీపీకి వచ్చిన డొనేషన్లు. అధికారంలో లేకపోయినా జగన్ నేతృత్వంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఏకంగా 140 కోట్ల రూపాయలు పార్టీ ఫండ్‌ కింద విరాళంగా లభించాయి. ఇదేఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. పవర్‌లో లేకపోయినా విరాళాల సేకరణలో ఏ స్థాయిలో పవర్‌ఫుల్‌గా వైసీపీ మారిందో అన్నదానిపై ఏపీలో పెద్ద ఎత్తున చర్చ సైతం జరుగుతోంది.   పార్టీల వారీగా టీడీపీకి వచ్చిన విరాళాలను ఓసారి పరిశీలిస్తే.. ప్రూడెంట్ ఎలక్టోరల్ ట్రస్ట్ ద్వారా టీడీపీకి 40 కోట్లు లభించాయి. నాట్కో ఫార్మా 7 కోట్ల రూపాయలు విరాళంగా ఇవ్వగా.. వర్సిటీ ఎడ్యుకేషన్ మేనేజ్‌మెంట్ 5 కోట్లను డొనేషన్ల రూపంలో ఇచ్చింది.  తమిళనాడుకు చెందిన క్రిస్ట్రీ ఫ్రైడ్‌గ్రామ్ ఇండస్ట్రీ, బెంగళూరు బేస్‌డ్‌గా నడిచే యునైటెడ్ టెలీ లింక్స్, ప్రకాశం జిల్లా కేంద్రంగా కార్యకాలాపాలు సాగించే ప్రియా ఆక్వా ఫామ్స్ తలో రెండు కోట్లు ఫండ్స్ రూపంలో అందించాయి. జనసేనకు మాత్రం ఎలక్టోరల్ ట్రస్ట్‌ల నుంచి ఒక్క రూపాయి కూడా విరాళం కింద లభించలేదు. కార్పొరేట్ల పరంగా చూస్తే నాట్కో ఫార్మా కోటి రూపాయలు, ఆర్వీఎం కన్‌స్ట్రక్షన్స్ మూడు కోట్లు, డీవీకే కన్‌స్ట్రక్షన్స్ 2 కోట్లు డొనేషన్ రూపంలో అందించాయి.  వ్యక్తుల పరంగా చూస్తే షాద్‌నగర్‌కు చెందిన రవికుమార్ ఆకుల జనసేన పార్టీకి ఐదు కోట్ల విరాళం అందించారు. ఏపీలో అలా ఉంటే తెలంగాణలో బీఆర్ఎస్ పరిస్థితి మాత్రం రివర్సైంది. ఎలక్టోరల్ బాండ్స్ ఉన్నప్పుడు విరాళాల సేకరణలో మంచి దూకుడు చూపించిన గులాబీ పార్టీ.. ఆ తర్వాత వెనుకబడింది. పైగా రాష్ట్రంలో అధికారం కోల్పోవడంతో పరిస్థితి మరింత దిగజారిందన్న వాదన విన్పిస్తోంది. అందుకు తగ్గట్లుగానే బీఆర్ఎస్‌కు కేవలం 15 కోట్ల రూపాయల మేర మాత్రమే డొనేషన్లు రావడం ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది.  

అంబటి.. అహంకారమా? అవివేకమా?

వైసీపీలో నోరున్న నాయకులలో ఒకరిగా మాజీ మంత్రి, ఆ పార్టీ సీనియర్ నాయకుడు అంబటి రాంబాబు గుర్తింపు పొందారు. అందులో సందేహం లేదు. అయితే ఇటీవలి కాలంలో ఆయన మాటల వల్ల పార్టీకి మేలు కంటే  కీడే ఎక్కువ జరుగుతోందన్న భావన వైసీపీ నాయకులు, శ్రేణులలోనే వ్యక్తం అవుతోంది. అసలాయన మాటలు చూస్తుంటే అహంకారం తలకెక్కిందా? లేక అజ్ణానమా అంటూ రాజకీయ పరిశీలకులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఆయన 2029 ఎన్నికలలో వైసీపీదే అధికారం అంటూ చేసిన వ్యాఖ్యలు ఆ అనుమానాలను మరింత బలపరుస్తున్నాయి. వాస్తవానికి 2024 ఎన్నికలలో వైసీపీ ఘోర పరాజయానికి కారణాలేమిటన్న విషయంపై పార్టీలో ఇప్పటి వరకూ ఆత్మ విమర్శ జరగలేదు. 2019 ఎన్నికలలో 151 స్థానాలతో ఘన విజయం సాధించిన వైసీపీ 2024 ఎన్నికలలో కేవలం 11 స్థానాలకు పరిమితం కావడానికి కారణాలేమిటన్నది వైసీపీ అగ్రనేతలకు ఇంకా అర్థమైనట్లు కనిపించదు. ప్రజలివ్వని ప్రతిపక్ష హోదా కోసం మంకుపట్టు పట్టి అసెంబ్లీకి గైర్హాజర్ కావడం చూస్తుంటే ఆ పార్టీ ఓటమి నుంచి పాఠాలు నేర్చుకున్నట్లు కనిపించదు.  వాస్తవానికి ప్రతిపక్ష నేతగా సుదీర్ఘ పాదయాత్ర ద్వారా నిత్యం జనంలో తిరిగినందుకే జగన్ 2019 ఎన్నికలలో అధికారంలోకి రాగలిగారు. సరే పాదయాత్ర సందర్భంగా నవరత్నాలు సహా అడుగుకో హామీ గుప్పించి జనాన్ని మాయ చేశారు అదీ ఓ కారణమేననుకోండి, వాటికి తోడు వైఎస్ వివేకాహత్య, కోడికత్తి దాడి సంఘటనలను తనకు అనుకూలంగా జగన్ సానుభూతిగా మలచుకోవడం మరో ప్రధాన కారణం. అయితే ఒక సారి అధికారంలోకి వచ్చిన తరువాత ఆయన జనానికి ముఖం చాటేశారు. ఎప్పుడైనా బటన్ నొక్కుడు కార్యక్రమాల కోసం తాడేపల్లి ప్యాలెస్ నుంచి బయటకు వచ్చినా రోడ్డుకిరువైపులా పరదాలు కట్టుకుని జనాన్ని చూడటం తనకు ఇష్టం లేదన్నట్లుగా వ్యవహరించారు.  ఇక పోతే ఐదేళ్ల జగన్ హయాంలో అభివృద్ధి పడకేసింది. రాష్ట్రానికి పెట్టుబడులు రాలేదు. మౌలిక సదుపాయాల కల్పన జరగలేదు. ఉద్యోగ ఉపాధి అవకాశాల మాటే వినిపించలేదు. ఆ ఐదేళ్ల కాలంలో జరిగిందంతా.. దోపిడీ, దుర్మార్గం, అణచివేత, కక్షసాధింపు మాత్రమే.   ఆ ఐదేళ్ల జగన్ పాలన మొత్తం ప్రత్యర్థి పార్టీల నేతలపై కక్ష సాధింపులతోనే గడిచిపోయింది. అందుకే ప్రజలలో తీవ్ర వ్యతిరేకత ప్రబలింది. దాని ఫలితమే 2024 ఎన్నికల ఫలితాలు. ఆ విషయాన్ని అంగీకరించడం పక్కన పెడితే కనీసం అర్ధం చేసుకోవడానికి కూడా జగన్, ఆయన పార్టీ నేతలూ సుముఖంగా లేరు.  ఈ నేపథ్యంలో మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలు పార్టీ శ్రేణుల్లోనే తీవ్ర వ్యతిరేకతకు కారణమయ్యాయి. నెటిజనులైతే ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు. ఇంతకీ అంబటి ఏమన్నారంటే.. 2024 ఫలితాలను అర్ధం చేసుకోవడంలో తెలుగుదేశం కూటమి పార్టీలు విఫలమయ్యాయట. చంద్రబాబు మోసపూరిత వాగ్దానాల కారణంగానే కూటమి ఆ ఎన్నికలలో అధికారంలోకి వచ్చిందట.. ఇప్పుడు ఈ ఏడాదిన్న కాలంలో జనానికి తత్వం బోధపడి.. జగన్  పాలన మళ్లీ రావాలని కోరుకుంటున్నారట. అంబటి భాష్యం విన్న వైసీపీయులే ఆశ్చర్యపోతున్నారు. చంద్రబాబు, ఆయన కేబినెట్ సహచరులు నిత్యం జనంలో ఉంటున్నారు. సంక్షేమంతో పాటు, అభివృద్ధీ జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో జగన్ తాడేపల్లి, బెంగళూరుల మధ్య షటిల్ సర్వీస్ చేస్తున్నారు. అటువంటప్పుడు జనం జగన్ పాలనను ఎందుకు కోరుకుంటారు? అని వైసీపీ శ్రేణులే అంటున్నాయి.   అదలా ఉంచితే రాజకీయ విశ్లేషకులు మాత్రం  అంబటి వంటి నాయకులు ప్రజల తీర్పును అవహేళన చేసే విధంగా ఇలాగే తమ వాచాలతను ప్రదర్శిస్తూ పొతే.. వైసీపీ పరిస్థితి మరింత దిగజారడం ఖాయమంటున్నారు. స్వోత్కర్ష, పరనింద మాని వాస్తవాన్ని అంగీకరించి, తమ పాలనలో జరిగిన తప్పు లను అంగీకరించి జనంలోకి రాకుండా ఇదే విధానం కొనసాగిస్తే వైసీపీ సంక్షోభం నుంచి సంక్షోభంలోకి కూరుకుపోవడం తధ్యమని విశ్లేషిస్తున్నారు. 

లోకేష్ విషెస్ కు జగన్ నో రిప్లై.. కారణమేంటో తెలుసా?

తెలుగు రాష్ట్రాలలో ప్రత్యర్థులకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపే సత్సాంప్రదాయానికి శ్రీకారం చుట్టినది నారా చంద్రబాబునాయుడే అని చెప్పవచ్చు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబునాయుడు.. ఈ సంప్రదాయానికి తెరలేపారు. అప్పటి నుంచీ అది కొనసాగుతూ వస్తోంది. ఆ క్రమంలోనే నారా చంద్రబాబు జగన్ కు ఆయన విపక్ష నేతగా ఉన్నప్పుడూ, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడూ , ఇప్పుడు పార్టీ అధినేతగా, పులివెందుల ఎమ్మెల్యేగా ఉన్నప్పుడూ కూడా ఏటా జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ వస్తున్నారు. దీంతో జగన్ కు కూడా అనివార్యంగా ఈ సంప్రదాయాన్ని పాటించక తప్పని పరిస్థితి ఏర్పడింది.  ఆ క్రమంలోనే ఆదివారం తన 53వ పుట్టిన రోజు జరుపుకున్న జగన్ కు చంద్రబాబు, నారా లోకేష్, వైఎస్ షర్మిల తదితరులు సామాజిక మాధ్యమం ద్వారా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఇందుకు ప్రతిగా జగన్ కూడా ఒక్క మంత్రి లోకేష్ కు తప్ప మిగిలిన వారందరికీ ధన్యవాదాలు చెబుతూ రిప్లై ఇచ్చారు. దీనిపై జగన్ ను నెటిజనులు ట్రోల్ చేయడంతో వైసీపీయులు జగన్ లోకేష్ కు రిప్లై ఇవ్వకపోవడంపై వివరణ ఇచ్చారు. లోకేష్ జగన్ కు  జన్మదిన శుభాకాంక్షలు తెలుసుతూ ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అంటూ గారు అనే మర్యాద వాచకం లేకుండా ట్వీట్ చేశారనీ, అందుకే జగన్ ఆయనకు ధన్యవాదాలు చెప్పలేదని సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు.  దీనిపై తెలుగుదేశం వర్గీయులు లోకేష్ జగన్ ను గారూ అనకపోవడానికి కారణం ఉందంటూ రిటార్డ్ ఇచ్చారు. గత ఏప్రిల్ లో ఏపీ సీఎం చంద్రబాబు జన్మదినం సందర్భంగా జగన్ ఆయనను విష్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అని మాత్రమే పేర్కొన్నారని గుర్తు చేశారు. తన తండ్రి సమకాలీనుడైన వ్యక్తికి గౌరవం ఇవ్వాలని తెలియని జగన్ ఇప్పుడు తనకు గౌరవం ఇవ్వలేదని లోకేష్ ను ఎలా అనగలరని పేర్కొన్నారు.  అందుకే టిట్ ఫర్ టాట్ లా లోకేష్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని మాత్రమే సంబోధిస్తూ జన్మదిన శుభాకంక్షలు చెప్పారంటున్నారు. 

ఉనికి కాపాడుకోవడానికే కేసీఆర్ ఉడత ఊపులు!

రాష్ట్ర ఆవిర్భావం తరువాత పదేళ్ల పాటు అధికారంలో కొనసాగి అహంకారంతో కన్నూమిన్నూగానక వ్యవహరించిన బీఆర్ఎస్ నేతల పరిస్థితి ఇప్పుడు దయనీయంగా మారిందా? గతంలో మాట్లాడితే తోలు తీస్తామంటూ హెచ్చరికలు జారీ చేసిన ఆ పార్టీ నేతలకు ఇప్పుడు కండలు కరిగి తోలు మాత్రమే మిగిలిందా? అంటే.. తాజాగా మంత్రి జూపల్లి కృష్ణారావు చేసిన వ్యాఖ్యలు ఔననే అంటున్నాయి.  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ పాలనలో బీఆర్ఎస్ నాయకుల పరిస్థితి దయనీయంగా మారిందన్న ఆయన గత పదేళ్ల అధికార గర్వంతో విర్రవీగిన నేతల కండలు  ఇప్పుడు కరిగిపోయాయని ఎద్దేవా చేశారు.  క్షేత్రస్థాయిలో బీఆర్ఎస్ పార్టీ పట్టు కోల్పోయిందనీ, దీంతో ఏం చేయాలో పాలుపోక ఆ పార్టీ నేతలు అయోమయంలో పడ్డారనీ,  అందుకే రేవంత్ ప్రభుత్వంపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. గాంధీ భవన్ లో సోమవారం మీడియాతో మాట్లాడిన మంత్రి జూపల్లి కృష్ణారావు.. కేసీఆర్ చేసిన  తోలు తీస్తా  వ్యాఖ్యలపై  తీవ్రంగా స్పందించారు. బీఆర్ఎస్ కేడర్‌లో మిగిలి ఉన్న కొద్దిపాటి తోలు ను రక్షించుకునేందుకే కేసీఆర్ ఇలాంటి పదాలు వాడుతున్నారని ఎద్దేవా చేశారు. జనం బీఆర్ఎస్ పాలనను తిరస్కరించారని, ఇప్పుడు  ఉనికిని కాపాడుకోవడానికి కేసీఆర్ బయటకు రాక తప్పని పరిస్థితి ఏర్పడిందని విశ్లేషించారు. పార్టీ ఉనికిని కాపాడుకోవడానికే ఇప్పుడు ఉడత ఊపుల మాదిరి విమర్శలు గుప్పిస్తున్నారని విమర్శించారు.  రాష్ట్రంలో జరిగిన పంచాయతీ ఎన్నికల ఫలితాలు బీఆర్ఎస్ పతనానికి నిలువెత్తు నిదర్శనంగా జూపల్లి అభివర్ణించారు.  బీఆర్ఎస్, బీజేపీ లు లోపాయికారీ ఒప్పందంతో కలిసి పోటీ చేసినా కూడా  మూడింట్ ఒక వంతు సీట్లు కూడా గెలుచుకోలేకపోయాయన్న జూపల్లి, గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బ్రహ్మరథం పట్టారన్నారు. ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు చేసినా ప్రజలు వాస్తవాలను గ్రహిస్తున్నారనడాని కి ఈ ఫలితాలే నిదర్శనమన్నారు.  పార్టీ ఉనికే ప్రశ్నార్ధకం కావడం వల్లే కేసీఆర్ ఇప్పుడు జిల్లాల పర్యటనకు సిద్ధమయ్యారన్నారు. ఒకప్పుడు ఫామ్ హౌస్‌కే పరిమితమైన నాయకులు, ఇప్పుడు రోడ్ల మీదకు వస్తున్నారంటే అర్ధమ దేనన్నారు.  ఉనికి కాపాడుకోవడానికే కేసీఆర్ రాజకీయ డ్రామాలకు తెరలేపారని జూపల్లి విమర్శించారు.  ఉమ్మడి పాలమూరు జిల్లాలో ప్రాజెక్ట్ లను నిర్లక్ష్యం చేసింది కేసీఆరేనన్నారు. పదేళ్లు అధికారంలో ఉండి కూడా ప్రాజెక్టులను పూర్తి చేయలేని దద్దమ్మ సర్కార్ కేసీఆర్ ది అంటూ విమర్శలు గుప్పించారు.

జగన్ బర్త్ డే.. సంబరాల పేరిట పశుబలులు!

ఒక రాజకీయ నాయకుడు ఎలా ఉండకూడదో.. అలా ఉంటారు జగన్. ఒక రాజకీయ నాయకుడు ఎలా మాట్లాడకూడదో అలా మాట్లాడతారు జగన్. ఒక రాజకీయపార్టీకి ఉండాల్సిన లక్షణాలేవీ, ఆయన నేతృత్వంలోని వైసీపీకి లేవు అంటారు పరిశీలకులు. ఔను మరి యధా రాజా తథా ప్రజా అన్నట్లుగా నాయకుడిని బట్టే ఆయన పార్టీ, ఆ పార్టీ నేతలూ, శ్రేణులూ అలా కాకుండా మరెలా ఉంటాయం టున్నారు రాజకీయ పండితులు. జగన్ అధికారంలో ఉన్న ఐదేళ్లూ అభివృద్ధి ఆనవాలు అన్నదే రాష్ట్రంలో కనిపించలేదు. కక్షసాధింపు, వ్యతిరేకించిన వారిపై కేసులు, అరెస్టులే పాలనగా ఆయన అధికారంల ఉన్న ఐదేళ్లూ కొనసాగింది. రాజకీయ ప్రత్యర్థులే కాదు.. ప్రభుత్వ విధానాలు సరిగా లేవన్న సామాన్యులపై కూడా జగన్ పాలనలో దాడులు జరిగాయి. ఇక అవినీతి, అక్రమాలు, దౌర్జన్యాలూ సరే సరి.  సరే జనం విషయం గుర్తించి 2019లో తాము  కట్టబెట్టిన అధికారాన్ని 2024 ఎన్నికలలో లాగేసుకుని అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్ అంటూ చంద్రబాబుకు అప్పగించారు.  అది పక్కన పెడితే అధికారం కోల్పోయిన తరువాత కూడా జగన్ తీరు, ఆయన పార్టీ తీరు ఇసుమంతైనా మారలేదు. తాజాగా ఆదివారం జగన్ 53వ పుట్టిన రోజు సందర్భంగా వైసీపీయులు నానా హంగామా సృష్టించారు. జనం ఈసడించుకునేలా పశుబలులు ఇచ్చి రక్తం చిందించారు.  ఇక జగన్ కు జనాభిమానం తగ్గలేదని చాటేందుకు కొందరు పెయిడ్ ఆర్టిస్టులతో డ్రామాలూ వేయించారు. జగన్ తాడేపల్లి నుంచి బెంగళూరు వెళ్లడానికి ఫ్లయిట్ ఎక్కగానే  ఆయన పేరున్న గౌన్లు వేసుకున్న చిన్నారులు ఆయనకు బర్త్ డే విషెస్ చెప్పారు. కేక్ కట్ చేశారు. అసలు ఆ విమాన ప్రయాణీకులలో జగన్ ఉంటారని వైసీపీయులకు వినా మరొకరికి తెలిసే చాన్సే లేదుగా. అందుకే చిన్నారులతో చేసిన ఆర్భాటమంతా పెయిడ్ ఆర్టిస్టుల పనేనని ఇటే తెలిసిపోతోందంటున్నారు పరిశీలకులు. సరే ఫ్లైట్ సీన్లు అలా ఉంటే..  ఇక రాష్ట్రంలో పలు ప్రాంతాలలో జగన్ పై అభిమానమంటూ వైసీపీ యులు చేసిన విన్యాసాలు జుగుప్సాకరంగా ఉన్నాయి. రప్ప రప్ప గంగమ్మ జాతర అంటూ ఫ్లెక్సీలు, బ్యానర్లు హోర్డింగులే కాకుండా  మూగజీవాలను బలి ఇచ్చి వాటి రక్తంతో జగన్ ఫ్లెక్సీలకు అభిషేకాలు చేశారు. ఆ దృశ్యాలను సామాజిక మాధ్యమంలో పోస్టు చేశారు.   అనంతపురం జిల్లా బ్రహ్మసముద్రం మండలం బొమ్మగానిపల్లిలో , మండల కేంద్రమైన విడపనకల్లు, శ్రీసత్యసాయి జిల్లా కనగానపల్లి మండలం భానుకోట గ్రామంలో జగన్ జన్మదినం సందర్భంగా  వైసీపీ నాయకులు, కార్యకర్తలు మూగజీవాల తలలు నరికి, ఆ రక్తంతో జగన్‌ ఫ్లెక్సీలకి అభిషేకాలు చేశారు. ఇక  ప్రకాశం జిల్లా పందువ నాగులారం పంచాయతీ పరిధిలోని గుమ్మలకర్ర జంక్షన్‌లో వైసీపీ అభిమాని ఒకరు   2029లో రప్పరప్ప.. 88 మ్యాజిక్‌ ఫిగర్‌ దాటినప్పటి నుంచి గంగమ్మ జాతరే అంటూ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. అధికారంలో లేకుండానే ఇంత అరాచకంగా వ్యవహరిస్తున్న వైసీపీయులు.. పొరపాటున వచ్చే ఎన్నికలలో విజయం సాధించి అధికారంలోకి వస్తే రాష్ట్రాన్ని ఏం చేస్తారు? ఆ హింసాకాండను, అరాచకత్వాన్నీ తట్టుకోగలమా అన్న భయాందోళనలు ఇప్పటి నుంచే జనంలో వ్యక్తమౌతున్నాయి. 

కేసీఆర్ నేల విడిచి సాము.. బాబు బూచి అంటే జనం నమ్ముతారా?

బీఆర్ ఎస్ అధినేత‌, మాజీ సీఎం కేసీఆర్ మరోసారి నేల విడిచి సాము చేశారు.  కేసీఆర్ సుదీర్ఘ కాలం తర్వాత మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన పార్టీ ఓటమికి కారణాలు, ఇటీవలి కాలంలో పార్టీలో సంక్షోభ పరిస్థితులపై మాటమాత్రమేనా ప్రస్తావించకుండా.. ఏక‌కాలంలో అటు కేంద్రాన్ని, ఇటు రాష్ట్రంలోని కాంగ్రెస్ స‌ర్కారుని, పనిలో పనిగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై విమర్శలు గుప్పిస్తూ వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలోని మోడీ సర్కార్ తెలంగాణకు శనిలా దాపురించిందని శాపనార్ధాలు పెట్టారు.   రాష్ట్రానికి అన్యాయం జ‌రుగుతుంటే.. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ సర్కార్ దద్దమలా చూస్తూ కూర్చుందంటూ దుయ్యబట్టారు. అలాగే చంద్రబాబునా యుడు ఉమ్మడి రాష్ట్ర సీఎంగా ఉన్నప్పుడు పేరుకు పాలమూరును దత్తత తీసుకుని, అభివృద్ధి పేరిట శంకుస్థాపన ఫలకాలకే పరిమితమయ్యారనీ, ఆయన హయాంలో శంకుస్థాపన ఫలకాలకు అయిన ఖర్చుతో ఏకంగా ఓ ప్రాజెక్టే కట్టవచ్చంటూ విమర్శలు గుప్పించారు. సాగునీటి ప్రాజెక్టులలో తెలంగాణ అన్యాయంపై ఆయన మాట్లాడినా, ఆయన అసలు లక్ష్యం మాత్రం చంద్రబాబును రెచ్చగొట్టి చంద్రబాబు  లేదా, తెలుగుదేశం పార్టీ నుంచి ప్రతి విమర్శలు రావాలనీ, అలా వస్తే మొత్తం పరిస్థితిని తెలంగాణ వర్సెస్ ఏపీగా మార్చి ఏకకాలంలో తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీనీ, కేంద్రంలో మోడీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి ప్రభుత్వాన్నీ ఇరుకున పెట్టాలన్నట్లుగా కనిపిస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  అంతర్గత సంక్షోభంలో కూరుకుపోయి, రాష్ట్రంలో పార్టీ ఉనికి మాత్రంగా మిగిలిన ప్రస్తుత పరిస్థితులలో తెలంగాణ సెంటిమెంట్ ను ఆసరా చేసుకుని రాష్ట్రంలో బలోపేతం కావాలన్న ఉద్దేశం వినా కేసీఆర్ మాటలలో రాష్ట్రానికి జలాల విషయంలో అన్యాయం జరుగుతోందన్న ఆవేదన కానీ, ఆందోళన కానీ కనిపించలేదని అంటున్నారు. ఒక వేళ అటువంటిదేమైనా ఉంటే.. తన కుమార్తె కవిత కాళేశ్వరం ప్రాజెక్టును దండగమారి ప్రాజెక్టు అనడంపై స్పందించి కనీసం ఆమె వ్యాఖ్యలను ఖండించి ఉండేవారని చెబుతున్నారు.  పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు జాప్యంపై కాంగ్రెస్ ను దుమ్మెత్తి పోసిన ఆయన.. రాష్ట్రంలో అధికారంలో ఉన్న రేవంత్ ప్రభుత్వానికి ఇంత కాలం సమయం ఇచ్చామనీ, ఇక నుంచి మాత్రం ఊరుకునేది లేదనీ హెచ్చరించారు. త్వరలో బహిరంగ సభలు ఏర్పాటు చేసి మరీ రేవంత్ సర్కార్  వైఫల్యాలను ఎండగడతామని హెచ్చరించారు.  కేసీఆర్ మీడియా సమావేశం పెట్టి కాంగ్రెస్, బీజేపీలపై విమర్శలు గుప్పించినా, ఆయన మాటలు విన్న ఎవరికైనా తెలంగాణలో బీఆర్ఎస్ ప్రధాన ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీయా అన్న అనుమానం రాకమానదు. ఎందుకంటే కేసీఆర్ ప్రెస్ మీట్ మొత్తం చంద్రబాబు జపంగా మారిపోయింది. కనీసం ఓ 50 సార్లు ఆయన చంద్రబాబు పేరు ప్రస్తావించారు. తెలంగాణకు జరుగుతున్న అన్యాయానికి కాంగ్రెస్, బీజేపీలు కాదు చంద్రబాబే కారణమని తేల్చేశారు.  రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ కు చంద్రబాబు గురువు అన్నారు. బాబును కాదనీ రేవంత్ ఏం చేయరన్నారు. అలాగే కేంద్రంలో మోడీ సర్కార్ మనుగడకు కీలకంగా ఉన్న చంద్రబాబు అభీష్ఠం మేరకే కేంద్ర ప్రభుత్వం నడుచుకుంటోందంటూ ఆరోపణలు గుప్పించారు.  కేసీఆర్ వైఖరి చూస్తుంటే.. తెలంగాణలో బీఆర్ఎస్ రాజకీయంగా బలపడాలన్నా, కనీసం ఉనికిని చాటుకోవాలన్నా చంద్రబాబు ను లాగకుండా సాధ్యం కాదని ఆయన భావిస్తున్నట్లు కనిపిస్తోంది. వాస్తవానికి బీఆర్ఎస్ (అప్పుడు టీఆర్ఎస్) 2018 ఎన్నికలలో విజయం సాధించి రెండో సారి అధికారంలోకి రావడానికి కేసీఆర్ రగిల్చిన సెంటి ‘మంటే’ కారణమనడంలో సందేహం లేదు. అయితే రెండో సారి అధికారంలోకి వచ్చిన తరువాత కేసీఆర్ జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పాలన్న లక్ష్యంతో స్వయంగా తానే సెంటిమెంట్ ను నీరుగార్చేశారు. పార్టీ పేరులో తెలంగాణను తీసేశారు. అందుకే నీట తగాదాలు, సాగర్ వివాదం అంటూ 2023 ఎన్నికల ముందు ఎంత ప్రయత్నించినా జనం తిరస్కరించారు. కేసీఆర్ రాజకీయ అవసరాల కోసం సెంటిమెంట్ పని చేయదన్న విషయాన్ని సందేహాలకు అతీతంగా తెలంగాణం 2023 ఎన్నికలలో తీర్పు ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సెంటిమెంటు అంటూ పొరుగు రాష్ట్రం ముఖ్యమంత్రిని బూచిగా చూపాలని కేసీఆర్ చేస్తున్న ప్రయత్నం నేల విడిచి సామేనని అంటున్నారు పరిశీలకులు.  

జగన్ కు షర్మిల బర్త్ డే విషెస్.. ధ్యాంక్యూ షర్మిలమ్మా అంటూ జగన్ రెస్సాన్స్

ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదివారం (డిసెంబర్ 21) తన 53వ పుట్టిన రోజు జరుపుకున్నారు. ఆ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు సహా పలువురు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అయితే విశేషమేంటంటే.. ఇటీవలే ఆయన సోదరి వైఎస్ షర్మిల కూడా తన జన్మదినాన్ని జరుపుకున్నారు. ఆ సందర్భంగా కూడా ఏపీ సీఎం చంద్రబాబాబు, మంత్రి లోకేష్ సహా రాజకీయాలకు అతీతంగా పలువురు నేతలు, ప్రముఖులు ఆమెకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అయితే షర్మిల సొంత అన్న జగన్ మాత్రం చెల్లెలికి శుభాకాంక్షలు తెలియజేయలేదు. ఈ అన్నా చెళ్లెళ్ల మధ్య చాలా కాలంగా విభేదాలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఆస్తుల పంచాయతీ నుంచి, పొలిటికల్ గా దారులు వేరవ్వడం వరకూ ఇరువురి మధ్యా అగాధం పూడ్చలేనంతగా పెరిగిపోయిన సంగతి తెలిసిందే.    షర్మిల ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన తరువాత నుంచీ వీరి మధ్య విభేదాలు మరింత పెచ్చరిల్లాయి.  2024 ఎన్నికలకు ముందు, తరువాత కూడా షర్మిల జగన్ పై విమర్శల వర్షం కురిపించారు. ఈ నేపథ్యంలో ఇరువురి మధ్యా జన్మదిన శుభాకాంక్షలు చెప్పుకోవడం, రాఖీలు కట్టడం వంటివి అన్నీ నిలిచిపోయియి.  అయితే తాజాగా ఆదివారం జగన్ పుట్టిన రోజు సందర్భంగా షర్మిల అన్నకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అయితే ఆ తెలపడంలోనూ చిన్న ట్విస్ట్ ఇచ్చారు. చెల్లెలిగా కాకుండా కాంగ్రెస్ ఏపీ అధ్యక్షురాలిగా షర్మిల వైసీపీ అధ్యక్షుడు జగన్ గారికి అని సంబోధిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. అందుకు జగన్ కూడా స్పందించారు. ధ్యాంక్యూ షర్మిలమ్మా అంటూ రిప్లై ఇచ్చారు. జగన్ కు షర్మిల పుట్టిన రోజు శుభాకాంక్షల ట్వీట్, అలాగే అందుకు జగన్ రెస్పాన్స్ రెండూ కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. 

కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకత స్పష్టంగా కనిపించింది : కేసీఆర్

  తెలంగాణలో గ్రామ పంచాయితీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ మెరుగైన ఫలితాలు సాధించిందని  బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. రేవంత్ ప్రభుత్వంపై వ్యతిరేకత స్పష్టంగా కనిపించిందని గర్వంతో ఎగిరే కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ప్రజలు బుద్ది చెప్పారని తెలిపారు. బీఆర్‌ఎస్ అధికారంలో ఉన్నప్పుడు అహంకారం ప్రదర్మించలేదన్నారు.  తనను తిట్టడం తాను చనిపోవాలని శాపాలు పెట్టడమే ఈ ప్రభుత్వ విధానం అని కేసీఆర్ విమర్శించారు. బీఆర్‌ఎస్‌ శాసనసభాపక్షం, రాష్ట్ర కార్యవర్గ భేటీ తెలంగాణ భవన్‌లో ప్రారంభమైంది. పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్యవర్గసభ్యులతో గులాబీ అధినేత భేటీ అయ్యారు.  కారు పార్టీ గుర్తులతో జరిగే ఎన్నికలైతే బీఆర్‌ఎస్‌ సత్తా తెలిసేది. బీఆర్‌ఎస్ పార్టీ విజయం కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. రేవంత్‌రెడ్డి ఒక్క కొత్త పాలసీ కూడా తేలేదు. తీసుకొచ్చిన పాలసీ.. రియల్‌ ఎస్టేట్‌ కోసమే. రాష్ట్రంలో ప్రజల ఆస్తుల విలువ పూర్తిగా తగ్గింది. ఒకప్పుడు యూరియా ఇంటికి, చేను వద్దకు వచ్చేది. ఇప్పుడు యూరియా కోసం ఫ్యామిలీ మొత్తం లైన్‌లో నిలబడే పరిస్థితి వచ్చింది’’ అని గులాబీ బాస్ విమర్మించారు

వైసీపీ, బీఆర్ఎస్ బంధానికి ఇంత కంటే రుజువుంటుందా?

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి శనివారం తన పుట్టిన రోజు జరుపుకోనున్నారు. ఈ సందర్భంగా ఆయనకు అభిమానులు, ఆయన పార్టీ నేతలు, శ్రేణుల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. సోషల్ మీడియాలో జగన్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ పోస్టులు ఓ రేంజ్ లో కనిపిస్తున్నాయి.  అవన్నీ పక్కన పెడితే  తాడేపల్లిలోని జగన్ నివాసం వద్ద వెలసిన  ఓ భారీ కటౌట్ ఆసక్తి రేకెత్తిస్తోంది. జగన్ జన్మదినాన్ని పురస్కరించుకుని  తాడేపల్లిలోని జగన్ నివాసం అదేనండి తాడేపల్లి ప్యాలెస్ వద్ద పెద్ద ఎత్తున బ్యానర్లు, హోర్డింగ్ లు, కటౌట్ లు వెలిశాయి.  వీటిలో ఒక బ్యానర్ మాత్రం అందరి దృష్టినీ విశేషంగా ఆకర్షిస్తోంది.  ఆ భారీ కటౌల్ లో జగన్, కేసీఆర్, కేటీఆర్ చిత్రాలు ఉండటమే అందుకు కార ణం. ఈ బ్యానర్ రాజకీయ వర్గాలలో పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది. ఈ బ్యానర్ బీఆర్ఎస్, వైసీపీ బంధానికి నిదర్శనంగా పరిశీలకులు అభివర్ణిస్తున్నారు. ఇటీవల బెంగళూరులోని ఓ ప్రైవేటు కార్యక్రమంలో జగన్ కేటీఆర్ తో భేటీ అయిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేస్తున్నారు.  

బీజేపీలో చేరిన ప్రముఖ సినీ నటి

  ప్రముఖ సినీ నటి ఆమని భారతీయ జనతా పార్టీలో చేరారు. నాంపల్లి సెంట్రల్ ఆఫీసులో రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు ఆమెకు కాషాయ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు.  అనంతరం పార్టీ సభ్యత్వాన్ని అందజేశారు. ఈ సందర్బంగా ఆమని మాట్లాడుతు ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం సాధిస్తున్న ప్రగతిని చూసి గర్వపడుతున్నాని తెలిపారు. ప్రధాని చేస్తున్న అభివృద్ధి పనులకు ఆకర్షితురాలినై ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె పేర్కొన్నారు.  ఆయన సనాతన ధర్మం కోసం మోదీ ఎంతో పాటుపడుతున్నారు" అని ఆమె పేర్కొన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజా పోరాటాలపై నెమ్మదిగా స్పందిస్తున్న బీజేపీ, ఇప్పుడు అనూహ్యంగా సినీ తారలను చేర్చుకోవడంపై దృష్టి పెట్టడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు కూడా విజయశాంతి, జయసుధ, జీవితా రాజశేఖర్ వంటి వారిని పార్టీలోకి ఆహ్వానించింది. కొందరు అగ్ర హీరోలతో బీజేపీ జాతీయ నేతలు భేటీ కావడం, దర్శకుడు రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్‌కు రాజ్యసభ సభ్యత్వం ఇవ్వడం వంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి