జీవో 596... జవహర్‌రెడ్డి భూకుంభకోణం!

posted on: May 31, 2024 3:58PM

ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి జవహర్‌రెడ్డి భూకుంభకోణం తీగ కదిలి డొంకంతా బయటపడింది. ఉత్తరాంధ్రాలో రెండు వేల కోట్ల రూపాయల విలువ చేసే అసైన్డ్‌ భూములను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి కొట్టేశారంటూ ప్ర‌తిప‌క్షాలు దుమ్మెత్తి పోస్తున్నాయి.  ఎస్సీ, ఎస్టీలకు గత ప్రభుత్వాలు ఇచ్చిన ఆసైన్డ్ భూముల మార్పిడికి జీవో 596 జారీ చేసి, దాని ఆధారంగా భూ దోపిడీకి తెరలేపారనేది ఆరోప‌ణ‌.  ఆ జీవో ఆధారంగానే సీఎస్‌ కుమారుడు విశాఖలో 800 ఎకరాలకు పైగా భూములు చేజిక్కించుకున్నారు. 400 ఎకరాల ఎస్సీ, బీసీ అసైన్డ్‌ భూములను బినామీల పేరిట సొంతం చేసుకున్నారట‌. ఎకరం 2 కోట్ల రూపాయ‌లు పలికే భూములను, కేవ‌లం ఐదారు లక్షలకే జవహర్‌రెడ్డి ముఠా ఒప్పందాలు చేసుకుంది.  
  
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం చుట్టూవున్న వందల ఎకరాల అసైన్డ్‌ భూములపైనే జవహార్‌ కన్నేశారు.  విమానాశ్రయం ఏడాదిలో పూర్తికానున్నందున, చుట్టుపక్కల భూములకు మంచి డిమాండు ఉంటుందన్న భావనతో వాటిని చేజిక్కించుకున్నట్టు తెలుస్తోంది. భోగాపురం విమానాశ్రయానికి దగ్గరలోవున్న విజయనగరం జిల్లా పరిధిలో పూసపాటిరేగ, డెంకాడ, నాతవలసలలో పెద్ద సంఖ్యలో భూములు రిజిస్ట్రేషన్లు ప్రస్తుతం జరుగుతున్నాయి. వీటితోపాటు విశాఖ జిల్లా పరిధిలోని అత్యంత విలువైన ఆనందపురం, పద్మనాభం, భీమిలి మండలాల్లో వందలాది ఎకరాలను జవహార్‌రెడ్డి టీం చేజిక్కించుకొంద‌ని ప్ర‌తిప‌క్షాలు ఆరోపిస్తున్నాయి.  గుడిలోవ, గండిగుండం, తర్లువాడ, గిరజాల, రామవరం, రావాడ, రావివలస, ముక్కాం, సవరవల్లి, తూడెం, బీటీ కల్లాలు, భీమ దొరపాలెం, ఐనాడ కనమాం తదితర గ్రామాల్లో జవహార్‌రెడ్డి వత్తిడితో వందల ఎకరాలు చేతులుమారి రిజిస్ట్రేషన్లు జరిగిపోతున్నాయి.  జవహర్‌ రెడ్డి తన కుమారుడిని బినామీగాపెట్టి 800 ఎకరాలకు పైగా భూముల డీల్‌ చేశారు. ఎన్నికల ముందే అడ్వాన్సులు తీసుకున్న అసైన్డ్‌ భూముల రిజిస్ట్రేషన్లు ఇప్పుడు చకచకా జరిగిపోతున్నాయి. పని త్వరగా పూర్తి చేయాలని అధికారులమీద సీఎస్‌ జవహర్‌రెడ్డి తీవ్ర ఒత్తిడి తెస్తున్నట్టు తెలుస్తోంది. అసైన్డ్‌ భూముల రిజిస్ట్రేషన్లు రద్దు చేసి, సీబీఐతో విచారణ జరిపిస్తే.. సంచలన విషయాలు బయటపడతాయన్న వాదన వినిపిస్తోంది.

జీవో 596  ప్రకారమే  అసైన్డ్‌ భూములను వారసులకు, అనుభవదారులకు ఫ్రీహోల్డ్‌ సర్టిఫికేట్‌ జారీచేసి భూమిపై సర్వ హక్కులూ కల్పించారు. అంటే ఫ్రీహోల్డ్‌ సర్టిఫికేట్‌ జారీ అయితే భూములను 22ఏ నుంచి తప్పిస్తారన్న మాట. ఈమేరకు సెక్షన్‌ 35 ఆఫ్‌ 2023 పేరిట చట్టం చేశారు. దీంతో ఇస్టానుసారంగా అసైన్డ్‌ భూములను అమ్ముకోవచ్చు. జీవో 596 వచ్చిన పది రోజుల్లోనే విశాఖలో పదుల సంఖ్యలో అసైన్డ్‌ భూముల అమ్మకాలు జరిగాయి. వందలాది మందికి చెందిన భూములను నిషేధిత జాబితా నుంచి ఆగమేఘాల మీద తప్పించడం వెనుక బిగ్ బాస్ వున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.  వాటిని 22-ఏ నుంచి తప్పించారు. 

ఏదైనా భూమిని 22-ఏ నుంచి తప్పించాలంటే అదో పెద్ద ప్రహసనం. నెలల సమయం పడుతుంది. కానీ ఈ అసైన్డ్‌ భూముల విషయంలో మాత్రం ఆగమేఘాలపై అనుమతులు వచ్చేశాయి. వీఆర్‌వో మొదలుకొని ఆర్‌ఐ, డిప్యూటీ తహసీల్దార్‌, తహసీల్దార్‌, ఆర్‌డీవో, జాయింట్‌ కలెక్టర్‌... ఆపై కలెక్టర్‌ అంతా వరుస పెట్టి ఆయా ఫైళ్లపై సంతకాలు పెట్టేశారు. కలెక్టర్‌ గంపగుత్తగా ఆయా సర్వే నంబర్లను డీనోటిఫై చేస్తున్నామని అమరావతిలో రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీకి పంపడం, అక్కడి నుంచి జిల్లా రిజిస్ట్రార్‌కు ఆదేశాలు రావడం, తక్షణమే 22-ఏ నుంచి ఆయా భూములు తీసేయడం, ఆ వెంటనే సబ్‌ రిజిస్ట్రార్లు వాటిని రైతుల నుంచి ఇతరులకు రిజిస్ట్రేషన్‌ చేయడం జరిగిపోయింది. 
 
జగనన్న పేద ప్రభుత్వంలో ప్రధాన కార్యదర్శి ఒక్క విశాఖలోనే రెండు వేల కోట్ల భూములు కొట్టేస్తే.. రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడెక్కడ ఇంకెంత కొట్టేశారో అన్న చ‌ర్చ ఏపీలో జ‌రుగుతోంది. 

- ఎం.కె. ఫ‌జ‌ల్‌

google-ad-img
    Related Sigment News
    • Loading...