Best Dress Combinations For Men

1. White – Cobalt Blue
Everyone will team up white and black. And no doubt they do look exceptionally good together. But we think you should do things a little differently and pair white with cobalt blue.

2. Cherry Red – Gray
As unusual as it may sound, but it is sure to look fantastic. We suggest that you team up gray straight fit trousers with a cherry red shirt. This combination will especially look good on men with a fair complexion.

3. Beige – Emerald
This combination is perfect for a casual relaxed evening. You can team an emerald polo t-shirt with beige cargo pants. The emerald will ensure you stand out, as the color is not usually picked by men, and the cargo pants are perfect for a chilled-out look.

4. Pale Yellow – Brown
How about brown pants, white t-shirt and a pale yellow scarf? Sounds good? Well, it will look good too. Pale yellow and brown will look really good together. The darkness of brown is well complemented by the coolness and ashen look of the yellow.

5. Turquoise – Creamy White
A turquoise shirt paired with creamy white trousers / jeans is an apt colour combination for a lazy morning brunch. The turquoise colour gives a very beachy, relaxed vibe and when paired with creamy white, it will add the necessary softness and calmness to your look.

Baby Pink – Mint Green

Mint green is definitely the colour of the season. Pair a baby pink shirt with a mint green tie for an in-vogue and stylish look. Team this up with dark shade trousers and you are set to rock this look. These are 6 colour combinations that will never fail you. Different as they are from the usual, they all are stylish and look smart. Try, if not all, then at least one of these. We promise you, you won’t regret it.

మూలాల ముంగిలికి లాక్కెళ్లే పండుగ.. సంక్రాంతి..!

  పండుగ అంటే అదొక  ఆనందం.  చదువులు, వృత్తి, ఉద్యోగం, సౌకర్యాలు.. ఇలా కారణాలు ఏవైనా సరే..  పట్టణంలో ఉన్నవారు పండుగ వచ్చిందంటే చాలు పల్లె బాట పడతారు. తెలుగు వారు ఎంతో సంబరంగా చేసుకునే పండుగలలో సంక్రాంతికి ఓ రేంజ్ ఉంది.  భోగి, సంక్రాంతి, కనుమ.. పేరిట ముచ్చటగా మూడురోజులు జరిగే ఈ పండుగ వైభోగం గ్రామాలలో మాత్రమే కనిపిస్తుంది. భోగి మంటలు, భోగి పళ్లు..  పొంగళ్లు, పిండి వంటలు.. పశువుల అలంకరణ,  కోడి పందేలు.. కొత్త అల్లుళ్లకు చేసే మర్యాదలు.. ప్రేమ, అభిమానం, ఆప్యాయత.. ఒక్కటనేమిటి? సంక్రాంతి పండుగలో లేనిదంటూ ఏదీ లేదు.. భోగి మంటలు, భోగి పళ్లు.. జనవరి 13వ తేదీన భోగి పండుగ.  ఈరోజు ఉదయాన్నే చలికి సవాల్ విసురుతూ ఉదయాన్నే లేచి భోగి మంటలు వేయడం చాలా చోట్ల కనిపిస్తుంది. ఇంట్లో ఉన్న పాత సామాను నుండి పిడకల హారం వరకు భోగి మంటలలో వేస్తారు.   ఇక ఇదే రోజు సాయంత్రం చిన్న పిల్లలకు భోగి పళ్లు పోస్తారు. ఈ భోగి పళ్లలో చెరకు ముక్కలు,  రేగు పళ్లు,  చిల్లర పైసలు, పువ్వులు ఉంటాయి.  ఇలా భోగి పళ్లు పోయడం వెనుక పురాణ కథనం ఉంది.  భోగి పండుగ రోజే బదరీ వనంలో  శ్రీహరిని పసిబిడ్డగా మార్చి దేవతలందరూ రేగుపళ్లు పోశారట.  బదరీ పళ్లనే రేగు పళ్లు అంటారు.  అందుకే కాల క్రమేణా భోగి రోజు చిన్న పిల్లలకు భోగి పళ్లు పోయడం ఆచారం అయ్యింది.  పిల్లలకు భోగి పళ్లు పోస్తే ఆ శ్రీహరి ఆశీస్సులు ఉంటాయని, పిల్లలు ఆరోగ్యంగా ఉంటారని చెబుతారు. పొంగల్.. సంక్రాంతి.. మూడు రోజులు జరిగే సంక్రాంతి పండుగలో రెండవ రోజు ప్రధాన పండుగ అయిన సంక్రాంతి జరుపుకుంటారు. సంక్రాంతి పండుగను పొంగళ్ల పండుగ అంటారు. ఈ రోజు సూర్యుడి గమనం మారుతుంది.  సూర్యుడు ఉత్తరాయణంలోకి ప్రవేశిస్తాడు. అది కూడా మకర రాశిలోకి ప్రవేశిచడం వల్ల దీనికి మకర సంక్రాంతి అని పేరు వచ్చింది. సంక్రాంతి రోజు పొంగళ్లు వండి నైవేద్యం పెడతారు. చాలా చోట్ల రథం ముగ్గులు వేసి సూర్యుడికి స్వాగతం చెబుతారు.  ఈ రోజు చేసే దాన ధర్మాలకు చాలా ప్రాముఖ్యత ఉంది.  కొత్తగా పెళ్లైన వారు ఈ పండుగను అత్తారింట్లో చేసుకోవడం, సావిత్రి గౌరీ వ్రతం చేసుకోవడం జరుగుతుంది. కనువిందు చేసే కనుమ.. సంక్రాంతి పండుగ ముఖ్యంగా రైతన్నల పండుగ. ఈ రోజు  రైతులు తమకు పంటలు పండించడంలో సహాయపడే పశువులకు కృతజ్ఞతలు చెప్పుకుంటారు. పశువులను చాలా మంది తమ కుటుంబంలో భాగంగా చూస్తారు.  పశువులకు స్నానం చేయించి అందంగా అలంకరిస్తారు. పశువులకు విశ్రాంతిని ఇస్తారు.  కొత్త పంట చేతికి వచ్చిన ఆనందంలో  సంబరాలు చేసుకుంటారు.  కోనసీమ ప్రాంతాలలో కోడి పందెల సందడి సాగుతుంది.  కోట్ల రూపాయల డబ్బులు చేతులు మారతాయి. కోడి పుంజుల పౌరుషాలు, వాటిలో పోరాట పటిమ ముక్కున వేలేసుకునేలా చేస్తాయి.  సంక్రాంతి పండుగంటే పల్లెలదే.. పండుగ ఆస్వాదించాలంటే పల్లెకు పోవాల్సిందే..!                           *రూపశ్రీ.

కొత్త ఏడాదిలో అతిగొప్ప సంకల్పం.. మీరు బాగుండాలంటే ఇది చేయండి..!

ప్రతి ఒక్కరికి తమ జీవితం బాగుండాలని కోరిక ఉంటుంది. ఇందుకోసం ఏదేదో చేయాలని కూడా ఆనుకుంటారు. కానీ తమ జీవితం బాగుండక పోవడానికి ఎన్నో పరిస్థితులు,  తమ చుట్టూ ఉన్న వ్యక్తులు కారణం అని అనుకుంటూ ఉంటారు.  జీవితంలో ఎవరికి వారు బాగుండాలంటే దానికి కావాల్సింది తమ చుట్టూ ఉన్న వ్యక్తులు మారడం లేదా వారు  అర్థం చేసుకోవడం కాదు.  ప్రతి వ్యక్తి తాము మారితేనే తమ జీవితం బాగుంటుందని అంటున్నారు లైప్ స్టైల్ నిపుణులు. కొత్త సంవత్సరంలో చాలామంది కొన్ని లక్ష్యాలు పెట్టుకుంటూ ఉంటారు. కొన్ని నిర్ణయాలు కూడా తీసుకుంటూ ఉంటారు.  అయితే దానికోసం మొదటగా ప్రతి ఒక్కరు తనకు తాను మారాలి అనే సంకల్పం చేసుకుంటే అదే గొప్ప మలుపు అవుతుంది.  ఇది ఎందుకు మేలు చేస్తుంది? దీని కోసం ఏం చేయాలి? అనే విషయం తెలుసుకుంటే.. అహంకారం.. దూరం..  కుటుంబం అయినా, స్నేహం అయినా లేదా ఆఫీసు  అయినా మనిషిలో ఉండే  అహం సంబంధాలలో చీలికకు అతిపెద్ద కారణం అవుతుంది. చాలా సార్లు అవతలి వ్యక్తి సరైన విషయం చెబుతున్నా  అది  వినే వారి  అహాన్ని దెబ్బతీస్తుంది.  అందుకే అది నిజమైనా,  అది మంచి విషయం అయినా దాన్ని అస్సలు అంగీకరించరు.  ఈ చిన్న ఇగో కాస్తా క్రమంగా విభేదాలకు,  దూరానికి కారణమవుతుంది. కొంతమంది ఎప్పుడూ తాము ఇతరులకన్నా గొప్పవారిగా భావిస్తారు.   వారి మాటలే ఫైనల్ అంటుంటారు. అలాంటి మనస్తత్వం రిలేషన్స్ లో  చేదు అనుభవాలను తెస్తుంది. బంధాలు కొనసాగాలి అంటే అహాన్ని పక్కన పెట్టడం,  అవతలి వ్యక్తి స్థానాన్ని అర్థం చేసుకోవడం, చిన్న విషయాలను విస్మరించడం చాలా ముఖ్యం.  ఈ చిన్న మార్పు పెద్ద వివాదాలను నిరోధించగలుగుతుంది. ఇతరులను మార్చకండి.. రిలేషన్స్ లో అయినా ఇతర విషయాలలో అయినా చాలా మంది తమ సమయాన్ని, శక్తిని ఎదుటి వ్యక్తిని తమకు అనుగుణంగా మార్చుకోవడానికి ప్రయత్నిస్తూ గడుపుతారు. కానీ నిజం ఏమిటంటే ఇతరుల  స్వభావాన్ని మార్చడం దాదాపు అసాధ్యం. మనం ఇతరులను మార్చడానికి ఎంత ఎక్కువగా ప్రయత్నిస్తామో, అంతగా నిరాశ చెందుతాము. ప్రతి పరిస్థితిలోనూ ప్రశాంతంగా  ఉండేవారు సమస్యలకు సులభంగా పరిష్కారాలను కనుగొంటారు. చాలా పాజిటివ్ గా,  సంతోషంగా ఉన్న వ్యక్తులు ఒత్తిడి, నిరాశ, అధిక రక్తపోటు,  ఆందోళన వంటి సమస్యలను రాకుండా చూసుకోగలుగుతారు.  అందుకే ఇతరులను మార్చడం కంటే మనలో మార్పు కోసం కృషి చేయడం తెలివైన పని. పాజిటివ్ గా ఉండాలి.. ఏ సంబంధం కూడా పూర్తిగా మన నియంత్రణలో ఉండదు. మనం ఇతరుల కోణం నుండి  విషయాలను అర్థం చేసుకోకపోతే చాలా వరకు ప్రతికూల పరిస్థితులే ఎదురవుతూ ఉంటాయి.  అంచనాలు ఉన్నప్పుడు ఇతరులలో  తప్పులను వెతకుతుంటాము. ఇది  అసంతృప్తికి గురిచేయడమే కాకుండా మన చుట్టూ ఉన్నవారిని కూడా ఇబ్బంది పెడుతుంది. పరిస్థితులకు అనుగుణంగా సర్దుబాటు చేసుకోవడం మంచిది. ఎప్పుడైతే మన ఆలోచన మారుతుందో.. అప్పుడు పరిస్థితులు కూడా పాజిటివ్ గా కనిపిస్తాయి.  మనస్సు కూడా సంతోషంగా ఉంటుంది. సానుకూల ఆలోచన ఉన్న వ్యక్తులు శారీరకంగా,  మానసికంగా ఆరోగ్యంగా ఉంటారని అనేక అధ్యయనాలు రుజువు చేస్తున్నాయి. ఆత్మ పరిశీలన.. ఎవ్వరూ పర్ఫెక్ట్ కాదు.. అలాగే ఎవరూ అన్ని విషయాలలో కరెక్ట్ గా ఉండరు. మన బలహీనతలు, తప్పులు,  తెలియకుండానే ఇతరులను ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఉంటాయి. అయితే అలాంటి వాటిని గుర్తించడం చాలా ముఖ్యం.  మొదట మనల్ని మనం నిజాయితీగా అర్థం చేసుకోవడం,  మన లోపాలను అంగీకరించడం చాలా అవసరం. మన మనస్సును,  తెలివితేటలు సమతుల్యంగా ఉన్నప్పుడు మాత్రమే మనం సరైన నిర్ణయాలు తీసుకోగలం. మనం మన ఆలోచనలను సానుకూలంగా ఉంచుకుంటే మన తప్పులను అంగీకరించడం సులభం అవుతుంది. ఎవరికి వారు మారితే  ఒత్తిడిని తగ్గిస్తుంది, ప్రతికూలతను దూరంగా ఉంచుతుంది.  జీవితాన్ని మరింత సమతుల్యంగా చేస్తుంది. మంచి ఆరోగ్యం, సంతోషకరమైన మనస్సు,   సంబంధాల మధ్య సామరస్యం, మనలో సానుకూల మార్పులు చేసుకోవడం..  ఇవన్నీ  సంతోషకరమైన జీవితానికి మొదటి అడుగు అవుతాయి.   కాబట్టి జీవితం బాగుండాలంటే.. ఎవరి జీవితం వారికి బాగుండాలంటే పైన చెప్పుకున్న మార్పులు వచ్చే విధంగా కొత్త ఏడాదిలో ఒక లక్ష్యం పెట్టుకుని వాటికి అనుగుణంగా మారాలి. అప్పుడే సంతోషంగా ఉండగలుగుతారు.                             *రూపశ్రీ.

మనిషికి, డబ్బుకు మధ్య సంబంధం!

“మనం డబ్బును సంపాదిస్తాం కానీ, డబ్బు మనల్ని సంపాదించడం లేదు కదా?” అని డాంబికంగా పలికేవారున్నారు. అనడానికైతే ఇలా అన్నప్పటికీ వారి జీవితమంతా డబ్బుకు దాస్యం చేస్తూనే వుంటారు. ఆ డబ్బుకై ఎవరినైనా ఆశ్రయిస్తారు. ఎంతైనా వేడుకుంటారు. లేనితనం వల్ల వీరిలా తయారైనారా అంటే అది నిజం కాదు, కేవలం ధనం మీద ఆపేక్షే వీరినిస్థితికి తెచ్చింది. అసలీ జీవితాన్ని ధనార్జనకు కాక మరొకందుకు వినియోగించే వీలుందనే ఆలోచన కలగదు. మతాన్ని ఆశ్రయించామని, దైవారాధనకు అంకితమయామని ప్రకటించే వారిలో కూడా చాలా మందికి ధనమే దైవం వారు తలపెట్టే “మహత్కార్యా” లన్నిటికీ ధనం పోగుచేస్తుంటారు. ఎక్కడో వందలాది ఎకరాల స్థలం కొంటామంటారు. అక్కడ అనేకమందిని చేర్చి ఏదో విశ్వమానవ కల్యాణం సాధిస్తామంటారు. మిగతా రంగాల్లో పనిచేసేవారు కూడా ఇలాంటి "లోక కళ్యాణ” పథకాలే రూపొందిస్తుంటారు. సినిమాలు తీసేవారు, సినిమాహాళ్ళు కట్టించేవారు. హోటళ్ళు నెలకొల్పేవారూ, మార్కెట్లోకి కొత్తపత్రికలు వెలువరించేవారూ, మార్కెట్లోకి కొత్త సబ్బు, విశిష్టమైన సూటింగ్ క్లాత్, చల్లటి కూల్డ్రింకు ప్రవేశ పెట్టేవారూ, అందరూ కూడా ప్రజాక్షేమం కాంక్షించే ఈ పనులు చేస్తున్నామంటారు. కానీ అందరికీ కావలసింది డబ్బే. కానీ డబ్బు అక్కరలేనివారు అరుదుగా ఎక్కడైనా కనిపించవచ్చు. అలాంటివారు కోర్కెల్నీ, సంకల్పాలనూ దాటి వుంటారు. నీమ్ కరోలి బాబా అలాంటి యోగి. ఆయన ఇటు ఇహంలోను, అటు పరంలోనూ ఏక కాలమందు నివసించినట్లు ఉండేవాడని అంటారు స్వామీ రామా. బాబా ఎవరి పరిచయమూ కోరేవాడు కాదు. ఎవరైనా తన దర్శనార్థమై వస్తే, “నేను మిమ్మల్ని చూడడమైనది. మీరు నన్ను చూడడమైనది. ఇక వెళ్ళిరండి" అనేయడం ఆయనకు అలవాటు. నైనిటాల్లో ఒకసారి బాబాతో కూచోనుండగా, భారతదేశంలోని అత్యంత ధనికుల్లో ఒకరైన ఒక వ్యక్తి కరెన్సీ కట్టలతో బాబా వద్దకు వచ్చారని అంటాడు స్వామీ రామా. " ఈ ధనమంతా మీకు సమర్పించడానికి తెచ్చానండీ" అన్నాడు ఆ ధనికుడు.  బాబా ఆ నోట్లకట్టలను కిందపరిచి చక్కగా వాటి మీద ఆసీనుడయ్యాడు. "కూర్చుకునేందుకు అంత మెత్తగా లేవు. వీటికన్నా దిండు నయం. నాకు చలిమంట వేసుకునే అలవాటు లేదు, పోనీ అందుకైనా ఉపయోగిద్దామంటే వీటినేమి చేయను?" అని అడిగాడు బాబా. "అయ్యా ఇది ధనమండీ" అన్నాడు అతడు.  బాబా ఆ మొత్తం తిరిగి ఇచ్చేస్తూ "దీనితో కాసిని పళ్ళు కొనుక్కురండి. అందరం తినచ్చు" అన్నాడు. "ఈ ప్రాంతంలో మార్కెట్ లేదు గదండీ?” అన్నాడు అతడు. "ఐతే మరి ఇది డబ్బెలా అవుతుందయ్యా. పండ్లు కూడా కొనలేని దీనిని నేనేమి చేసుకోను" అని, కాసేపు ఆగి "ఏమి కావాలని నావద్దకొచ్చావు" అన్నారు.  "నాకు విపరీతమైన తలనొప్పి, భరించలేని బాధ" అని చెప్పాడు అతడు "అది నువ్వు సృష్టించుకున్నదే, నేనేమి చేయగలను." అన్నారు బాబా.  "అలా అంటే ఎలా మహాత్మా? మీరు నాకు సాయపడాలి.” అని వేడుకున్నాడు అతను. అప్పుడు బాబా, “పోనీ పాపం” అనుకున్నట్లున్నారు.. “సరే ఇకనుండి నీకు తలనొప్పి ఉండదు పో, కానీ ఇవాళ నుండి నీవు ఇతరులకు పెద్ద తలనొప్పిగా రూపొందుతావు. నీ దగ్గర వెర్రి డబ్బు పోగవుతుంది. తద్వారా నీవు సమాజానికి గొప్ప శిరోవేదన కలిగిస్తావు, ఇక వెళ్ళు" అని పంపించేశాడు నీమ్ కరోలి బాబా. ఆయన చెప్పినట్లే, ఆ ధనికుడు ఆరోగ్యవంతుడై, తన జీవన విధానంతో సంఘానికి గొప్ప “శిరోభారం" గా పరిణమించాడు.                                             ◆నిశ్శబ్ద.

దుఃఖాలు.. సమస్యలకు దూరంగా ఉండాలంటే ఇలా చేయండి..!

  ప్రతి వ్యక్తి తన జీవితాన్ని ఆనందంగా, ప్రశాంతంగా, సంతృప్తిగా గడపాలని కోరుకుంటాడు.  మానసిక సమస్యలకు దూరంగా ఉండాలని కోరుకుంటాడు.  నేటి కాలంలో కొందరు  అనారోగ్యంతో బాధపడుతుంటే  మరికొందరు  కుటుంబ సమస్యల గురించి ఆందోళన చెందుతుంటారు. కొంతమంది ఉద్యోగం రాలేదని,   మరికొందరు తమకు జీతం తక్కువ అని, ఇంకొందరు జీతం సరిగా రావడం లేదని.. ఇలా  సగం ప్రపంచం ఏదో ఒక సమస్యతో ఇబ్బంది పడుతోంది. కానీ ఈ ప్రపంచంలో కొంతమంది ఎటువంటి ఆందోళన లేకుండా  సంతోషంగా ఉంటుంటారు. వాళ్లు అసలు అంత సంతోషంగా ఎలా ఉన్నారు? అనే విషయం కూడా కొందరికి అర్థమే కాదు.. అసలు  జీవితాన్ని సంతోషంగా,  ప్రశాంతంగా ఉంచగల మార్గాలు ఏమిటి? దుఃఖాలకు, సమస్యలకు దూరంగా ఉండటం ఎలా తెలుసుకుంటే.. తల్లిదండ్రుల సూచనలు..  పిల్లలు తల్లిదండ్రుల  మాట విని సరైన మార్గాన్ని అనుసరిస్తే, అది తల్లిదండ్రులకు  చాలా సంతోషకరమైన విషయం. అలాంటి పిల్లలు కుటుంబానికి కీర్తిని తెస్తారు.  వారి తల్లిదండ్రులను గర్వపడేలా చేస్తారు. కాబట్టి జీవితంలో ఆనందం,  శాంతి కోరుకుంటే, ఎల్లప్పుడూ  తల్లిదండ్రుల సూచనలను పాటించాలి.  సరైన మార్గాన్ని అనుసరించాలి.  నేటి జెనరేషన్ అప్డేట్ అయి ఉండవచ్చు. కానీ తల్లిదండ్రుల దగ్గర అనుభవం ఉంటుంది.  కాబట్టి వారి అనుభవ పూరిత సలహాలు ఎప్పుడూ నష్టం మాత్రం కలిగించవు.  జీవిత భాగస్వామి మద్దతు.. జీవితంలో లైఫ్ పార్ట్నర్ చాలా ముఖ్యమైవారు.   జీవిత భాగస్వామి  సుఖదుఃఖాలన్నిటిలోనూ సపోర్ట్ ఇస్తూ అవగాహనతో మసలుకుంటే  జీవితం సులభంగా, సంతోషంగా మారుతుంది. జీవిత భాగస్వామి  అంటే పంచుకునేవారు. ఎలాంటి పరిస్థితిని అయినా అర్థవంతంగా చెప్పగలిగితే బాగస్వామి తప్పకుండా అర్థం చేసుకుంటారు.  ఎవరు అర్థం చేసుకోకపోయినా,  ఎవరు కష్టాలలో తోడు ఉండకపోయినా లైఫ్ పార్ట్నర్ తోడు ఉంటే బాధ, సమస్య ప్రభావం తెలియకుండా ఉంటుంది. తృప్తి.. ఈ కాలంలో మనిషికి లోపించినది తృప్తి.   ఎక్కువ కోసం ఆరాటపడకపోతే మనస్సు ప్రశాంతంగా ఉంటుంది, తద్వారా సంతోషంగా ఉంటాము. ముఖ్యంగా డబ్బు గురించి గొడవ చేసేవారు ఎప్పుడూ ఉన్నదాంతో  సంతృప్తి చెందరు. అందుకే మొదట డబ్బు దగ్గర ఉన్నదాంతో సంతృప్తి చెందడం నేర్చుకుంటే  అన్ని విషయాలలోనూ సంతృప్తిగా ఉండవచ్చు. ఆశించడం..  ఇతరుల సంపద,  ఆస్తి,  ఇతర వస్తువులు వంటివి కోరుకోవడం, తప్పని,  అది చాలా చీప్ మెంటాలిటీ అని  ఎప్పుడైతే తెలుసుకుంటారో.. అప్పుడు జీవితంలో దురాశను వదిలిపెడతారు. ఎవరినుండి అయినాఏదైనా ఆశించడం దురాశ చెందడమే. ఇట్లా దురాశను వదిలిన రోజు మనస్సు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది.  ఎటువంటి కోరిక లేకుండా జీవితాన్ని గడుపుతాము. భూత దయ.. నా వాళ్లు, మనవాళ్లు అని మాత్రమే కాదు.. అందరినీ, అన్ని జీవులను ప్రేమించాలి.అందరి పట్ల,  మూగ ప్రాణుల  పట్ల కూడా  దయ,  కరుణ కలిగి ఉంటే,   ప్రేమ,  శాంతిని నింపుకోగలుగుతారు. ఎప్పుడైతే పాజిటివ్ ఆలోచనలు,  మంచి ఆలోచనలు,  ఇతరులను ఇబ్బంది పెట్టని,  అన్ని జీవులను సమానంగా చూసే సమభావం అలవడుతుందో.. అప్పుడు మనిషి జీవితం ఎన్ని దుఃఖాలు, సమస్యలు వచ్చినా బాధకు లోనుకాకుండా ఉంటుంది.                               *రూపశ్రీ.

హెల్త్‌కు సైకిల్‌తో హైఫై కొట్టండి!

ఈకాలంలో పుట్టిన పిల్లలకు కాస్త నడవడం రాగానే పేరెంట్స్ అందరూ చేసేపని ఓ చిన్న సైకిల్ తెచ్చి ఇవ్వడం. ఆ సైకిల్ తో పిల్లలు చేసే అల్లరి అంతా ఇంతా కాదు. అయితే కొంచెం పెద్దయ్యాక ఇంకా ముఖ్యంగా స్కూల్ స్థాయి దాటిపోగానే వాళ్ల మనసంతా బైకులు, స్కూటీలు, గాడ్జెట్స్ చుట్టూ ఉంటుంది. కొందరు ఆసక్తి కొద్దీ గేమ్స్ వైపు వెళ్లి ఎన్నోరకాల ఆటల్లో మునిగి తేలిన సైకిల్ ను పక్కకు పెట్టేస్తారు. స్కూల్ దశ అయిపోగానే పక్కకు పెట్టేసే సైకిల్ ఇప్పటి కాలంలో మనుషుల ఆరోగ్యం పాలిట గొప్ప ఆప్షన్ అనేది వైద్యులు, ఫిట్నెస్ ట్రైనర్ ల అభిప్రాయం. అసలింతకూ అలా ఎందుకంటారు.  రెగులర్ ఎక్సర్సైజ్! ఉదయం లేచాక చాలామంది ఇంటి నుండి బయట పడితే తరువాత సాయంత్రం ఇంటికి చేరుతూ ఉంటారు. ఉద్యోగస్తులు అందరూ ఇంతే. అయితే ఉద్యోగం చేసేవాళ్ళు ఆఫీసుల్లో కూర్చునే చేస్తారు. ప్రస్తుతకాల ఉద్యోగాల్లో మానసిక ఒత్తిడి తప్ప శారీరక ఒత్తిడి ఉండదు అనేది వాస్తవం కదా. అయితే ఇంటి దగ్గర ఉండే కొద్దిసమయంలో ఏదైనా చిన్న చిన్న పనులకు బయటకు వెళ్లాలంటే పుటుక్కున బైక్ స్టార్ట్ చేస్తుంటారు అందరూ.  కనీసం కొత్తిమీర కట్టనొ, లేక వెల్లుల్లినో లేదా నిమ్మకాయలో ఇలాంటి చిన్న వాటికి కూడా బైకులు స్టార్ట్ చేస్తే మహానుభావులు ఉంటారు. బయట ఎండలు లేదా అర్జెన్సీ అనే కల్లబొల్లి కబుర్లు చెప్పేవాళ్లకు ఎలాంటి సందేహం లేకుండా సైకిల్ ఒక ఆప్షన్ అని చెప్పవచ్చు. ఇంజిన్ ఖర్చు లేనే లేదు! బైకు తీస్తే బర్రున శబ్దం చేసుకుంటూ రాకెట్ లో పోవాలంటే అందులో పెట్రోల్ ఉండాలి. పెట్రోల్ లేని బండి మూలన పడి ఉండాల్సిందే. కనీసం దాన్ని తొక్కడానికి  కుదరదు, తోయడానికి మనిషికే కండలు ఉండాలి. పెరిగిపోతున్న పెట్రోల్ ఖర్చులతో మనిషి పాకెట్ కు చిల్లులే. కానీ మన సైకిల్ ఉందండి. కష్టపడి అప్పుడప్పుడు గాలి కొట్టుకుంటే చాలు, టైర్ లలా ఉన్న మనుషులను స్లిమ్ గా చేసేస్తుంది. ఎలాంటి పెట్రోల్ గోల లేకుండా హాయిగా జాగ్రత్తగా వాడుకుంటే జీవితకాలం సేవలు చేస్తుంది.  వేగవంతమైన జీవితంలో అన్ని తొందరగా అయిపోవాలనే ఆలోచనలో చాలామంది ఎంతో ఉపయోగకరమైన వస్తువులను కొన్నింటిని పక్కకు తోసేస్తున్నారు. తీరా ఆరోగ్యాలు నష్టపోతున్న సందర్భాలలో జిమ్ లలో చేరి అక్కడ సేమ్ సైక్లింగ్ వర్కౌట్ చేస్తుంటారు. అలా నెలకు వేలు తగలెయ్యడం కంటే ఒక సైకిల్ పెట్టుకుని కొన్ని పనులకు సైకిల్ ని ఉపయోగించడం మంచిది. బైకులు, స్కూటీల కంటే తక్కువ ఖర్చుతో, పెట్రోల్ గట్రా అదనపు ఖర్చు లేకుండా, రోజూ తగినంత వ్యాయామాన్ని అందించే సైకిల్ కు హైఫై కొడితే పోయేదేముంది?? శరీరంలో అదనపు కొవ్వు తప్ప. అయితే మోకాళ్ళ నొప్పులు సమస్యలు ఉన్నవాళ్లు వైద్యుల సలహా తీసుకోండి మరి. సైకిల్ పెడిల్ తొక్కుతూ కాస్త రౌండ్స్ కొట్టండి మరి.            ◆ వెంకటేష్ పువ్వాడ.

టీ తాగే సరైన విధానం మీకు తెలుసా?

  టీ భారతీయులకు ఒక గొప్ప ఎమోషన్. ఇది వేరే దేశం నుండి మన దేశానికి వచ్చిన పానీయమే అయినా భారతీయులు టీ అంటే ప్రాణం ఇస్తారు.  సమయం పాడు లేకుండా టీ తాగే వారు ఉంటారు.  నలుగురు స్నేహితులను అయినా,  ఉద్యోగ చర్చలకు అయినా, పిచ్చాపాటి కబుర్లు చెప్పుకోవడానికి అయినా ఛాయ్ సిట్టింగ్ ఒక మంచి మార్గం.  అయితే చాలా మందికి టీ తాగే సరైన మార్గం తెలియదు. టీ తాగడానికి కూడా ఒక పద్దతి ఉంది.  టీ కప్పు పట్టుకోవడం దగ్గర నుండి దాన్ని సిప్ చేయడం వరకు టీ వెనుక ఒక సంప్రదాయం,  దానికంటూ ఒక ప్రత్యేక గౌరవం ఉన్నాయి. ముఖ్యంగా పెద్ద పెద్ద రెస్టారెంట్లు,  ఖరీదైన లైఫ్ గడిపే వ్యక్తుల దగ్గర టీ తాగాల్సి వస్తే ఇష్టమొచ్చినట్టు తాగకూడదు.  టీ తాగేటప్పుడు పాటించాల్సిన టిప్స్ ఏంటి తెలుసుకుంటే.. కొన్ని ప్రాంతాలలో కొన్ని పదార్థాలను ఇష్టమొచ్చినట్టు తినలేం, తాగలేం.  తప్పు పద్దతిలో తినడం, తాగడం చేస్తే ప్రాంతీయత పరంగా వారిని అవమానించినట్టు ఫీలవుతారు.  అందుకే ప్రతి పదార్థం ఎలా తినాలి, ఎలా తాగాలి అనేవి తెలుసుకోవాలి. వాటిలో టీ తాగడం కూడా ఒకటి.  టీ భారతీయుల పానీయం కాదు.. కాబట్టి దాన్ని భారతీయులు వారికి నచ్చిన పద్దతిలో నచ్చినట్టు తాగేస్తారు. టీ తాగేటప్పుడు టీ కప్పు హ్యాండిల్ ను ఎల్లప్పుడూ టీ కప్పు సాసర్ పై ఉంచాలి. అది కూడా టీ కప్పు హ్యాండిల్ గడియారంలో  3 సంఖ్య ఎక్కడ ఉంటుందో ఆ కోణంలో ఉండాలి.  ఇక ఎడమ చేతితో టీ తాగేవారు అయితే టీ కప్పు హ్యాండిల్ గడియారంలో 9 సంఖ్య ఎక్కడ ఉంటుందో ఆ కోణం దగ్గర ఉండాలి. ఇలా ఉంటే టీ కప్పు అందుకోవడం సులభంగా ఉంటుంది. టీ కప్పు హ్యాండిల్ పట్టుకోవడానికి ఎప్పుడు చూపుడు వేలు, మధ్యవేలు,  బొటన వేలును ఉపయోగించాలి.  ఉంగరపు వేలు,  చిటికెన వేలును సపోర్ట్ కోసం ఉపయోగించాలి. టీ కప్పుతో పాటు చెంచా ఉంచితే దాన్ని కప్పు వెనుక భాగంలో ఉంచాలి.  కప్పులో ఎప్పుడూ చెంచాను ఉంచకూడదు.  టీలో పాలు లేదా పంచదార వేసుకున్నప్పుడు చెంచాను  కప్పు లో వృత్తాకారం లో తిప్పకూడదు.  అర్థవృత్తాకారంలో మాత్రమే అది కూడా ముందుకు వెనక్కు తిప్పాలి. శబ్దం రాకుండా తిప్పాలి. పంచదారను టీలో వేసుకుని చెంచాతో కలుపుతూ సుడిగుండం సృష్టించినట్టు తిప్పకూడదు.  అలాగే చెంచాను కప్పు మీద గట్టిగా కొట్టడం లాంటివి కూడా చేయకూడదు. టీని కలిపిన తరువాత చెంచాకు అంటుకున్న టీని నాకడం చేయకూడదు.  చెంచాను టీ కప్పు వెనుక భాగంలో పెట్టేయాలి. టీని కప్పులో సొంతంగా పోసుకునే పరిస్థితి ఉన్నప్పుడు కప్పు నిండుగా టీ పోసుకోకూడదు. ఎప్పుడూ కప్పులో 75శాతం మాత్రమే టీతో నింపాలి. 25శాతం ఖాళీగా ఉంచాలి.                                                *రూపశ్రీ.

వ్యాపారంలో ఎదగడానికి సూపర్ టిప్స్ ఇవి..!

  మనిషి జీవితంలో ఆదాయం రావడానికి ఏదో ఒక ఉపాధి తప్పనిసరిగా ఉండాలి.  కొందరు ఒకరి కింద పనిచేస్తారు. మరికొందరు తమకు తామే ఉపాధి సృష్టించుకుంటారు.  ఇలా తమకు తాము ఉపాధి సృష్టించుకునేవారు వ్యాపారస్తులు అవుతారు. వ్యాపారం బాగా ఎదిగితే వీరే కొందరికి తమ కింద ఉపాధి కల్పిస్తారు.  అయితే వ్యాపారం మొదలుపెట్టిన ప్రతి ఒక్కరు సక్సెస్ కాలేరు. దీనికి కారణం  వ్యాపారానికి సంబంధించి కొన్ని విషయాలు తెలియకపోవడమే.. చేతిలో డబ్బు ఉంటే చాలు వ్యాపారం చేసేయవచ్చు అని కొందరు అనుకుంటారు. కానీ వ్యాపారం చేయాలన్నా, అందులో విజయం సాధించాలన్నా జ్ఞానం చాలా అవసరం. వ్యాపారంలో విజయం సాధించాలంటే ప్రతి ఒక్కరు నేర్చుకోవాల్సిందేమిటో తెలుసుకుంటే.. కష్టపడి పనిచేయడం.. వ్యాపారంలో విజయం సాధించాలంటే కష్టపడి పనిచేయడం ఎప్పుడూ అవసరం.  సోమరితనంతో,  నిర్లక్ష్యంగా పనిచేస్తే ఎప్పటికీ విజయం సాధించలేరు.  తగినంత సమయం ఉన్నప్పుడు లక్ష్యాలను చేరుకోవడానికి దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. లేకపోతే అది విజయానికి బదులుగా అపజయాన్ని మిగులుస్తుంది. సానుకూల ఆలోచన.. పాజిటివ్  ఆలోచన,  ఆత్మవిశ్వాసం విజయానికి కీలకం. తమ మీద తాము నమ్మకం పెట్టుకోవడం ద్వారా తాము చేసే పనులలో  సానుకూల ఫలితాలను పొందగలుగుతారు. ప్రతికూల ఆలోచనలు  మనసులోకి ఎప్పుడూ రానివ్వకూడదు. ఇది  ఆత్మవిశ్వాసాన్ని బలహీనపరుస్తుంది. సత్సంబంధాలు..  స్వంత వ్యాపారాన్ని ప్రారంభించినప్పుడు ప్రజలతో మంచి సంబంధాలను కొనసాగించాలి. ఇది  వ్యాపారానికి ప్రయోజనకరంగా ఉంటుంది. ఎల్లప్పుడూ  కస్టమర్లకు ప్రాధాన్యత ఇవ్వాలి.  కస్టమర్ల సాటిసిఫ్యాక్షన్ ను దృష్టిలో ఉంచుకోవాలి. దానికి తగినట్టు ప్రణాళికలు మారుస్తూ ఉండాలి. రిస్క్.. కొత్త వ్యాపార అవకాశాలను త్వరగా గుర్తించి, వాటిలో పెట్టుబడి పెట్టడానికి భయపడకూడదు.. అయితే, ఏదైనా రిస్క్ తీసుకునే ముందు జాగ్రత్తగా ఆలోచించాలి. రిస్క్ తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అన్ని అంశాలను పరిగణిలోకి తీసుకోవాలి. నిజాయితీ.. వ్యాపారస్తులకు ఉండాల్సిన  ఒక ముఖ్యమైన లక్షణం నిజాయితీ.  నిజాయితీగా వ్యవహరించడం వల్ల  ఖ్యాతి,  వ్యాపారం మెరుగుపడుతుంది.  దీని ద్వారా  గొప్ప లక్ష్యాలను సాధించవచ్చు. కస్టమర్‌లు,  ఉద్యోగుల మధ్య నమ్మకమైన వాతావరణాన్ని నిర్మించాలి. ఇది  వ్యాపారాన్ని పెంచుతుంది. దృఢ సంకల్పం.. కొత్త వ్యాపారాన్ని ప్రారంభించేటప్పుడు, ప్రతి ఒక్కరూ ఎప్పుడు విజయం సాధిస్తామో అని ఆలోచిస్తారు. విజయం రాత్రికి రాత్రే రాదు. ఓపికగా ఉండి ప్రయత్నిస్తూ ఉండాలి.  వ్యాపారం అంటే  విజయం మాత్రమే కాదు.. అందులో విజయం ఉంటుంది,  వైఫల్యం కూడా ఉంటుంది. కాబట్టి  వైఫల్యాలు ఎదురైతే వాటి  నుండి నేర్చుకుని ముందుకు సాగండి. విజయం సాధిస్తే మళ్లీ కొత్త మార్గాలను జాగ్రత్తగా అన్వేషిస్తూ సాగాలి. లీడర్షిప్ స్కిల్స్.. వ్యాపారం చేయడానికి న్యాయకత్వ నైపుణ్యాలు ఉండాలి.  వాటిని మెరుగుపరుచుకోవాలి.  ఎందుకంటే తన కింద వారిని నడిపించడానికి అవి సహాయపడతాయి.  సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకునే సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలి. పై విషయాలను అన్వయించుకోవడం ద్వారా  వ్యాపారంలో విజయం సాధించవచ్చు. వ్యాపారాన్ని  కొత్త శిఖరాలకు తీసుకెళ్లవచ్చు.  జీవితంలో కీర్తిని, ప్రతిష్టను కూడా సాధించవచ్చు.                                        *రూపశ్రీ.

జనవరిలో పుట్టిన వారి వ్యక్తిత్వం ఎలా  ఉంటుందో తెలుసా?

జనవరి నెలలో అనేక ప్రత్యేకతలు ఉన్నాయి, అన్నింటికంటే ముఖ్యంగా ఇది సంవత్సరం ప్రారంభ నెల. ఈ నెలలో  చల్లని గాలి,  నిర్మలమైన  ఆకాశం కూడా ఉంటుంది.  దీనిలాగే ఈ నెలలో జన్మించిన పిల్లలు కూడా కొన్ని ప్రత్యేక వ్యక్తిత్వాలను కలిగి ఉంటారు. జనవరిలో జన్మించిన వారి రాశిచక్రం,  పుట్టిన సమయం కూడా వ్యక్తి స్వభావాన్ని ప్రభావితం చేస్తాయి. జనవరిలో జన్మించిన వ్యక్తులు తరచుగా  భిన్నంగా కనిపిస్తారు. వారిలో ఒక వింతైన తీవ్రత ఉంటుంది, చిన్న వయస్సులోనే జీవితాన్ని నేర్చుకోవాలనుకుంటున్నట్లుగా వీరి ప్రవర్తన ఉంటుంది.  ఇలాంటి మరిన్ని వివరాలు తెలుసుకుంటే.. జ్యోతిష్యం, మనస్తత్వశాస్త్రం,  ప్రవర్తనా అధ్యయనాల ప్రకారం జనవరిలో జన్మించిన వారు సహజంగా ప్రశాంతంగా, దృఢంగా ఉంటారు.  నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు.   పరిణితి.. జనవరిలో జన్మించిన పిల్లలు గంభీరమైన స్వభావం,  ఆలోచనలో పరిణతితో  వారి వయసు  కంటే తెలివైనవారిగా కనిపిస్తారు.  ఎక్కువగా మాట్లాడరు, కానీ వారు మాట్లాడినప్పుడు  జాగ్రత్తగా మాట్లాడతారు. వారి నిర్ణయాలు భావోద్వేగాలపై తక్కువగా,  తర్కంపై ఎక్కువగా ఆధారపడి ఉంటాయి. చిన్నతనంలో  అందరికీ దూరంగా ఉండటం ఎక్కువ. ఎవరితో ఎక్కువ మాట్లాడరు కూడా..  కానీ కాలక్రమేణా ఈ లక్షణాలు వారికి బలంగా మారతాయి. నిరాడంబరత, ఆదర్మమార్గం.. జనవరిలో జన్మించిన వ్యక్తులలో లీడర్ క్వాలిటీస్ ఎక్కువ. అయినా కూడా ఆడంబరాలకు దూరంగా ఉంటారు. ఎలాంటి హడావిడి లేకుండా లీడర్స్ గా ఎలా ఉండాలో  వారికి తెలుసు. వారు ఆజ్ఞాపించరు, ఆదర్శంగా ముందుకు సాగుతారు. పాఠశాలలో లేదా ఆఫీసులలో అయినా, అందరూ వీరి పట్ల చాలా నమ్మకంతో ఉంటారు. క్రమశిక్షణ.. క్రమశిక్షణ వారి రక్తంలోనే ఉంటుంది. జనవరిలో పుట్టిన వారికి  బద్దకం అంటే శత్రువట.  సమయానికి మేల్కొనడం, తమ పనిని సరిగ్గా చేయడం,  తమ బాధ్యతలను నెరవేర్చడం వీరికి నేర్పించాల్సిన అవసరం లేదు. ఈ క్రమశిక్షణ కొన్నిసార్లు వారిని కఠినంగా లేదా మొండిగా చేస్తుంది. ముఖ్యంగా  తమ ఇష్టానికి తగ్గట్టు ఏదైనా  జరగనప్పుడు మరింత మొండిగా మారతారు. వ్యక్తీకరణ..  వీరి భావోద్వేగాలు చాలా లోతుగా ఉంటాయి. కానీ అవి చాలా తక్కువగా వ్యక్తం చేస్తారు. వీరి నుండి  ప్రేమ పూర్తి నిజాయితీతో వస్తుంది,  స్నేహాలు జీవితాంతం ఉంటాయి. అయితే భావోద్వేగాలను వ్యక్తపరచడంలో సంకోచం వారిని సంబంధాలలో అపార్థాలకు గురి చేస్తుంది. భయం.. కష్టపడి పనిచేయడానికి భయపడరు.  కష్టాలకు భయపడి వెనుకంజ వేయడం వంటివి చేయరు. జనవరిలో పుట్టిన పిల్లలు కష్టపడి పని చేయడాన్ని గౌరవిస్తారు. రాత్రికి రాత్రే విజయం సాధించాలనే భ్రమలో  జీవించరు. అందుకే వారు తమ కెరీర్‌లో నెమ్మదిగా ఎదుగుతారు.  కానీ పూర్తీగా పై స్థాయిలో ఉండే విధంగా స్థిరపడతారు.   వారి గొప్ప బలం ఓర్పు. వారి అతిపెద్ద బలహీనత తమతో తాము చాలా కఠినంగా ఉండటం.   బాధ్యత.. ఇంట్లో అయినా లేదా సమాజంలో అయినా జనవరిలో పుట్టిన వారు  చిన్న వయస్సులోనే బాధ్యతలను స్వీకరిస్తారు. వారు తక్కువ ఫిర్యాదు చేస్తారు,  తమ విధులను నెరవేర్చడంలో  నైపుణ్యం కలిగి ఉంటారు. కొన్నిసార్లు ఈ భారం వారిని అంతర్గతంగా అలసిపోయేలా చేస్తుంది. కానీ వారు అలసిపోతున్నట్టు అస్సలు బయటపడనీయరు.                                          *రూపశ్రీ.

పెళ్లికి ముందు కాబోయే జంట ఒకరినొకరు ఈ ప్రశ్నలు వేసుకోవాలి..!

పెళ్లి అనేది ఇద్దరు వ్యక్తుల జీవితాలకు సంబంధించినది. ఈ ఇద్దరిలో ఏ ఒకరి అభిప్రాయం,  ఆలోచన,  ఇష్టం లేకపోయినా మరొక వ్యక్తి కూడా జీవితాంతం ఇబ్బంది పడాల్సి ఉంటుంది. అందుకే పెళ్లి అంటే ఆచి తూచి నిర్ణయం తీసుకోవాలని పెద్దలు చెబుతుంటారు. వెనుకటి కాలంలో పెళ్లి అంటే కేవలం పెద్దల నిర్ణయం. కానీ నేటి తరంలో పెళ్లి చేసుకునే వారిదే మొదటి, చివరి నిర్ణయం కూడా.. పెళ్ళి చేసుకోబోయే జంటలు పెళ్లికి ముందు ఒకరినొకరు కొన్ని ప్రశ్నలు తప్పనిసరిగా వేసుకోవాలని అంటున్నారు రిలేషన్షిప్ నిపుణులు. దీని వల్ల ఒకరినొకరు తెలుసుకోవడానికి వీలుంటుంది. దీని ఆధారంగా పెళ్లి గురించి నిర్ణయాలు కూడా తీసుకోవచ్చు.  ఇంతకీ పెళ్లికి ముందు కాబోయే జంట ఒకరినొకరు వేసుకోవాల్సిన ప్రశ్నలు ఏంటో తెలుసుకుంటే.. అంచనాలు.. పెళ్ళికి ముందు చాలామంది తమకు వచ్చే భాగస్వామి అలా ఉండాలి, ఇలా ఉండాలి అని అంచనాలు పెట్టుకుని ఉంటారు. ఈ అంచనాల గురించి ప్రశ్నించుకోవడం చాలా మంచిది. ఇది ఎవరి ఆలోచన ఎలా ఉంది? ఎలాంటి లైప్ కోరుకుంటున్నారు అనేది అర్థం చేసుకోవడంలో సహాయపడుతుంది. పెళ్లి తర్వాత ఉద్యోగం.. భారతదేశంలో ఇంటి బాధ్యత చూసుకునేది మగవారే.. అందుకే వారికి ఉద్యోగం తప్పనిసరి. అయితే  అమ్మాయిలు చదువుకున్నా,  ఉద్యోగం చేస్తున్నాపెళ్లి తర్వాత ఈ పరిస్థితులు మారుతుంటాయి.  అందుకే పెళ్లి తర్వాత ఉద్యోగం చేయాలా వద్దా? అనే విషయాలు ముందుగానే చర్చించుకోవడం మంచిది. వివాహం తర్వాత వీటి గురించి ఎలాంటి సమస్య రాకుండా ఉంటుంది. బాధ్యతలు.. ఇంటి బాధ్యతలు, ఆర్థిక భాద్యతలు,  పిల్లల బాధ్యతలను ఎలా విభజించాలి? వాటిని ఇద్దరూ ఎలా షేర్ చేసుకోవాలి అనే విషయాలు కూడా పెళ్లికి ముందు చర్చించుకోవాలి.  దీని వల్ల ఇద్దరూ తమ బాధ్యత చక్కగా నెరవేర్చుకోగలరు. ఆర్థిక ప్రణాళిక.. బాగస్వామి ఆర్థిక అలవాట్లు,  పొదుపులు, ఖర్చు విధానాలను అడిగి తెలుసుకోవాలి. ఎంత సంపాదన ఉంది, ఎంత ఖర్చు చేస్తున్నారు వంటివి అర్థం చేసుకోవచ్చు. దీని వల్ల వివాహం తర్వాత ఇద్దరూ ఆర్థికంగా ప్లానింగ్ చేసుకోవచ్చు. ఇది వివాహం తర్వాత గొడవలను, విబేధాలను రాకుండా ఉండటంలో సహాయపడుతుంది. పిల్లల ప్లానింగ్.. పెళ్లి కాకుండానే పిల్లల గురించి మాట్లాడటం కాస్త విచిత్రం అనుకుంటారు అందరూ. కానీ నేటితరం వారు పిల్లల బాధ్యతను ఇద్దరూ షేర్ చేసుకుంటారు. అందుకే ఎంత మంది పిల్లలను ప్లానింగ్ చేసుకోవాలి? పిల్లలను ఎప్పుడు కనాలి? పిల్లలను ఎలా పెంచాలి? పిల్లల బాధ్యతల విషయంలో తల్లిదండ్రులు ఎలా ఉండాలి?  వంటి విషయాలు చర్చించుకోవాలి. ఇది భార్యాభర్తల బందాన్ని బలపరుస్తుంది. వివాదాలు.. ప్రతి ఒక్కరికి కోపం, అసహనం,  చిరాకు, గొడవ,  సమస్య వంటివి ఎదురైనప్పుడు స్పందించే విధానం వేరుగా ఉంటుంది.  ఇలాంటివి ఎదురైనప్పుడు ఎవరు ఎలా స్పందిస్తారు అనేది తెలుసుకోవాలి.  దీని వల్ల వివాహం తర్వాత గొడవలు, సమస్యలు వచ్చినప్పుడు వాటిని ఎలా పిరిష్కరించుకోవాలో ఇద్దరికీ అర్థం అవుతుంది. కుటుంబ సంబంధాలు.. పెళ్లంటే కేవలం ఇద్దరు వ్యక్తులు ఒక్కటవ్వడం కాదు.. రెండు కుటుంబాలు ఒక్కటవ్వడం. పెళ్లి తర్వాత అమ్మాయి, అబ్బాయి తమ అత్తమామలతో ఎలా ఉండాలి? ఎలాంటి అనుబంధం కోరుతున్నారు? వంటివి ఓపెన్ గా మాట్లాడుకోవాలి. ఇలా చేస్తే వివాహం తర్వాత ఎలాంటి విభేదాలు ఉండవు. ఇష్టాలు, అయిష్టాలు.. కాబోయే భాగస్వామి ఇష్టాలు, అభిరుచులు,  అలవాట్లు, ఆహార ప్రాధాన్యతలు వంటివి పెళ్లికి ముందు తెలుసుకోవాలి.  వైవాహిక బంధం ఎక్కువగా ఒకరి ఇష్టమైనది మరొకరు చేయడం అనే పని ద్వారా బలపడుతుంది.  దీని పల్ల ప్రాధాన్యత ఇస్తున్నట్టు అర్థం అవుతుంది.  అందుకే ఒకరి ఇష్టాలు మరొకరు తెలుసుకోవాలి.                                *రూపశ్రీ.

అమ్మాయిలను మోసం చేసే అబ్బాయిలు చేసే పనులు ఇవి..!

  మోసం అనేది అన్ని చోట్ల ఉంటుంది. అయితే పూర్తీ నష్టం జరిగిన తర్వాత మాత్రమే మోసం జరిగింది అని ఎవరైనా తెలుసుకోగలుగుతారు. కొలీగ్స్, స్నేహితులు, బంధువులు.. ఇలా ఎవరి చేతులో మోసపోయినా తిరిగి జీవితాన్ని నిర్మించుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ ఒక అమ్మాయి అబ్బాయి చేతిలో మోసపోతే అది జీవితం మీద చాలా గట్టి దెబ్బ అవుతుంది. కానీ ఈ విషయంలో అమ్మాయిలకు ఒక అవకాశం ఉంది. అదే ముందు జాగ్రత్త.. ఏ అబ్బాయి అయినా అమ్మాయిని మోసం చేయాలనే ఉద్దేశంతో ఉంటే ఆ అబ్బాయిలు చేసే పనులే వారిని పట్టిస్తాయి.  వీటిని అర్థం చేసుకుంటే అమ్మాయిలు జాగ్రత్తపడి మోసగాళ్ల బారినుండి తప్పించుకోవచ్చు. ఇంతకీ.. అమ్మాయిలను మోసం చేసే అబ్బాయిలు చేసే పనులేంటో తెలుసుకుంటే..   ప్రవర్తన.. అబ్బాయి అమ్మాయిని మోసం చేసే ఉద్దేశంతో ఉంటే వెంటనే కనిపించే మొదటి మార్పు.. ప్రవర్తన మారిపోవడం.  అబ్బాయి ప్రవర్తనలో మార్పు కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. మునుపటిలాగా ప్రేమించకపోవడం, శ్రద్దగా ఉండకపోవడం చేస్తారు.   అవసరాలు.. కేవలం తన అవసరాల గురించి మాత్రమే ఆలోచించే అబ్బాయి మోసం చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలాంటి వారికి ఇతరుల అవసరాల గురించి, వారి భావాల గురించి అస్సలు పట్టదు.  వారికి  కావాల్సింది దక్కనప్పుడు వారు సింపుల్ గా దూరం పెడతారు.     నిజాలు.. మొదట చిన్న చిన్న విషయాలు కూడా షేర్ చేసుకున్న వ్యక్తి  ఆ తరువాత ఏ విషయాలు చెప్పకుండా గోప్యత మెయింటైన్ చేస్తుంటే, పైగా ఏదైనా విషయం అడిగినప్పుడు నిజం చెప్పకుండా  అబద్దాలు చెబుతుంటే  అలాంటి వారిని నమ్మడం కష్టం.   సమయం.. ప్రేమలో ఉన్నవారు,  ప్రేమిస్తున్న వారు.. తమ పార్ట్నర్ కోసం తప్పకుండా ఏదో ఒక విధంగా సమయాన్ని కేటాయిస్తారు.  వారు ఎంత బిజీ అయినా సరే.. సమయాన్ని కేటాయిస్తారు. కానీ మోసం చేసే ఉద్దేశ్యం ఉన్నవారు ఏదో ఒక సాకు చెబుతుంటారు. అలాంటి వారికి బంధం పట్ల సీరియస్ నెస్ ఉండదు.   మాటలు.. చేష్టలు.. మోసం చేసే ఉద్దేశం ఉన్న అబ్బాయిల మాటల్లోనూ, చేష్టలలోనూ చాలా వ్యత్యాసం ఉంటుంది. మాటల్లో చాలా తియ్యగా మాట్లాడతారు. గొప్పలు చెబుతారు,  తాము చాలా అత్యుత్తమం అనేలా నమ్మిస్తారు. కానీ ప్రవర్తన దగ్గరకు వచ్చేసరికి పూర్తీగా సీన్ మారిపోతుంది. తాము చెప్పిందే చేయాలన్నట్టు డిమాండ్ చేస్తారు.  లేకపోతే నిర్లక్ష్యం చూపిస్తారు.   సహాయం.. మోసం చేసే ఉద్దేశం ఉన్న అబ్బాయిలు పూర్తీగా స్వార్థంతో ఉంటారు.  అమ్మాయి ఏదైనా సహాయం అడిగినప్పుడు సహాయం చేయకపోవడం లేదా తప్పించుకున్నా అతను అమ్మాయిని కేవలం వాడుకుంటున్నాడని అర్థం.   స్వప్రయోజనం.. అబ్బాయి డబ్బు లేదా ఏదైనా సహాయం వంటి వాటికోసం అమ్మాయిని ఒత్తిడి చేసి మరీ ఇబ్బంది పెడుతుంటే అతను మోసం చేసే ఉద్దేశం ఉన్నవాడని అర్థం. నిజంగా ప్రేమించే అబ్బాయిలు తమ వల్ల తను ప్రేమించే అమ్మాయికి ఎలాంటి కష్టం రాకూడదు అనుకుంటారు.   నియంత్రణ.. అమ్మాయి తన కుటుంబానికి, తన సన్నిహితులకు దూరంగా ఉండాలని డిమాండ్ చేసే అబ్బాయిలు ఎప్పుడూ నిజమైన ప్రేమ కలిగి ఉండరు. అమ్మాయిని నియంత్రణలో ఉంచాలని అనుకునేవారు ఆమెను తమకు అనుగుణంగా వాడుకుంటారు.   బాధ్యత.. ప్రతి అబ్బాయికి తను ప్రేమించిన అమ్మాయి పట్ల బాధ్యత ఉంటుంది. కానీ అతను అమ్మాయి పట్ల బాధ్యతతో ఉండకుండా కేవలం తన సొంత సంతోషం గురించి మాత్రమే ప్రాధాన్యత ఇస్తుంటే అతను అమ్మాయి పట్ల సీరియస్ నెస్ లేనట్టే..   ఎమోషన్స్.. అమ్మాయిలకు సాధారణంగానే ఎమోషన్స్ ఎక్కువ ఉంటాయి. అయితే అబ్బాయి అమ్మాయి ఎమోషన్స్ ను పట్టించుకోకుండా ,  అర్థం చేసుకోకుండా ఉంటే అతను సరైన పార్ట్నర్ కాడని అర్థం.అలాంటి వాడితో ఏ అమ్మాయి సంతోషంగా ఉండలేదు.   - రూపశ్రీ