Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ప్రతి లైబ్రరీలోనూ అందెశ్రీ నిప్పుల వాగు.. రేవంత్
posted on: Nov 11, 2025 2:56PM

ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ అంత్యక్రియలు తెలంగాణ ప్రజానీకం అశ్రునయనాల మధ్య పూర్తయ్యాయి. హైదరాబాద్‌లోని లాలాపేట్ నుంచి ఘట్‌కేసర్ వరకు అందెశ్రీ అంతిమయాత్ర కొనసాగింది. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఘట్‌కేసర్‌లోని ఎన్‌ఎఫ్‌సీ నగర్‌లో అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. అంతిమ సంస్కారాలకు సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు శ్రీధర్ బాబు, జూపల్లి కృష్ణారావు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్‌తో పాటు ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు హాజరయ్యారు.
అంతిమయాత్ర సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందెశ్రీ పాడెను మోశారు. ఈ సందర్భంగా ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని భావోద్వేగానికి లోనయ్యారు. అందెశ్రీ కుటుంబ సభ్యులకు సంతాపం తెలియజేశారు. వారికి అండగా ఉంటానని రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారు. అనంతరం మీడియాతో మట్లాడిన రేవంత్ రెడ్డి.. ఓ కళాకారుడిగా, రచయితగా అందెశ్రీ ఎన్ని ఆర్థిక ఇబ్బందులు పడ్డారో తనకు తెలుసునని చెప్పిన రేవంత్ రెడ్డి, అందెశ్రీ పశువుల కాపరిగా, తాపీ మేస్త్రిగా పనిచేశారు. ఉద్యమకారుడిగా తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనలో అందెశ్రీ గొప్ప పాత్ర పోషించారు. ఆయనను కోల్పోవడం తెలంగాణ సమాజంతో పాటు వ్యక్తిగతంగా తనకు కూడా తీరని లోటన్నారు.
అందెశ్రీ రాసిన ప్రతీ పాట తెలంగాణ ప్రజల్లో స్ఫూర్తి నింపిందని సీఎం రేవంత్ అన్నారు. అందుకే ఆయన రాసిన జయ జయహే తెలంగాణ గీతాన్ని పాఠ్యాంశంగా చేర్చేందుకు మంత్రివర్గంలో నిర్ణయం తీసుకుంటామన్నారు. అందెశ్రీ పేరుతో ఓ స్మృతి వనాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. అందెశ్రీ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందన్నారు. అలాగే ఆయన పాటల సంకలనం నిప్పుల వాగు ఒక భగవద్గీతగా, బైబిల్‌గా, ఖురాన్‌గా తెలంగాణ సమస్యలపై పోరాడేవారికి మార్గదర్శకంగా పయోగపడుతుందన్న రేవంత్ రెడ్డి అందుకే నిప్పుల వాగు పుస్తకాన్ని తెలంగాణలోని ప్రతీ లైబ్రరీలో అందుబాటులో ఉంచుతామన్నారు.
ప్రత్యేక రాష్ట్ర సాధనలో తన పాటలతో అలుపెరుగని కృషి చేసిన అందెశ్రీకి పద్మశ్రీ ఇవ్వాలని గత ఏడాది కేంద్రానికి లేఖ రాశామని సీఎం రేవంత్ అన్నారు. ఈ సంవత్సరం కూడా కేంద్రానికి లేఖ రాస్తామన్నారు. ఆయనకు పద్మశ్రీ గౌరవం దక్కేలా కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఆయనను పద్మశ్రీతో గౌరవించుకునేందుకు కృషి చేద్దామని సీఎం రేవంత్ పిలుపునిచ్చారు.






