మంచి ఆహారం తీసుకుంటున్నా హిమోగ్లోబిన్ లోపం ఉంటోందా.. అసలు కారణం ఏంటంటే!

మహిళల్లో చాలామంది ఎదుర్కునే సమస్యలలో హిమోగ్లోబిన్ లోపం కూడా ఒకటి. చాలామంది మహిళలు హిమోగ్లోబిన్ లోపంతో వైద్యులను సంప్రదిస్తూ ఉంటారు. వైద్యులు చాలా వరకు ఐరన్, ఫోలిక్ యాసిడ్ మందులు రాసిస్తుంటారు. అయితే.. ఈ మందులు వాడినప్పుడు మాత్రం హిమోగ్లోబిన్ పెరిగి, ఆ తరువాత తిరిగి తక్కువ స్థాయిలకు పడిపోతూ ఉంటుంది. హిమోగ్లోబిన్ పెరగడం కోసం మంచి ఆహారం తీసుకుంటున్నా సరే.. చాలామంది మహిళలలో హిమోగ్లోబిన్ పెరగకుండా లోపంలాగానే ఉండిపోతుంది. హిమోగ్లోబిన్ లోపం వల్ల అలసట, కళ్లు మసకబారడం, దృష్టి తగ్గిపోవడం, తల తిరగడం వంటి సమస్యలు ఎదురవుతాయి. అసలు మంచి ఆహారం తీసుకున్నా హిమోగ్లోబిన్ లోపం ఎందుకు వస్తుంది? దీని వెనుక కారణాలు ఏంటి? తెలుసుకుంటే..
హిమోగ్లోబిన్ లోపం ఎందుకు వస్తుంది?
మంచి ఆహారం తీసుకుంటూ, ఆరోగ్యం పట్ల ఎంత శ్రద్ధ వహిస్తున్నప్పటికీ, శరీరంలో రక్త ప్రసరణ సరిగా జరగకపోవడం వల్ల హిమోగ్లోబిన్ లోపం ఏర్పడుతుందని వైద్యులు అంటున్నారు.
శోషణ ప్రాముఖ్యత..
హిమోగ్లోబిన్ పెరగడానికి ఆరోగ్యకరమైన ఆహారం తింటే సరిపోదని వైద్యులు చెబుతున్నారు. తినే ఆహారం మన శరీరానికి సరిగ్గా శోషించబడుతోందని కూడా నిర్ధారించుకోవాలని అంటున్నారు. చాలాసార్లు ఆకుకూరలు, పప్పుధాన్యాలు, పండ్ల వంటి ఐరన్ అధికంగా ఉండే ఆహారాలను సమృద్దిగా తీసుకున్నా.. శరీరం వాటిని సరిగ్గా శోషించుకోలేవు. ఇక్కడే అసలు సమస్య మొదలవుతుంది, ఇది రక్తహీనతకు దారితీస్తుందని వైద్యులు చెబుతున్నారు.
విటమిన్-సి పాత్ర..
హిమోగ్లోబిన్ లోపానికి విటమిన్ సి లోపం కూడా కారణం కావచ్చని వైద్యులు చెబుతున్నారు. ఎందుకంటే విటమిన్-సి శరీరం ఐరన్ ను గ్రహించడానికి సహాయపడుతుంది. అందువల్ల ఐరన్ తీసుకుంటూ, నిమ్మకాయలు, నారింజ వంటి విటమిన్ సి అధికంగా ఉండే ఆహారాలను తీసుకోకపోతే శరీరం ఐరన్ ను శోషించుకోలేదు.
జీర్ణవ్యవస్థ..
జీర్ణక్రియ సరిగ్గా లేకపోతే, శరీరం పోషకాలను సరిగ్గా గ్రహించలేకపోతుంది. దీనివల్ల గ్యాస్ , ఎసిడిటీ వంటి సమస్యలు తలెత్తి, హిమోగ్లోబిన్ స్థాయి తగ్గడానికి కారణం కావచ్చు.
మహిళల్లో సమస్య ఎక్కువ..
హిమోగ్లోబిన్ లోపం సమస్య మహిళల్లో, ముఖ్యంగా నెలసరి సమయంలో అధిక రక్తస్రావం అయ్యేవారిలో ఎక్కువగా కనిపిస్తుంది. ఇది కాకుండా, గర్భధారణ సమయంలో శరీరానికి ఎక్కువ ఐరన్ అవసరం ఉంటుంది, ఈ సమయంలో సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే హిమోగ్లోబిన్ తగ్గే అవకాశం ఉంటుంది.
విటమిన్ -బి12, పోలిక్ యాసిడ్ లోపం..
విటమిన్ బి12 , ఫోలిక్ యాసిడ్ లోపం కూడా హిమోగ్లోబిన్ పెరగకుండా అడ్డుకుంటుంది, ఎందుకంటే ఈ రెండూ ఎర్ర రక్త కణాల నిర్మాణంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి, శరీరంలో వీటి లోపం ఉంటే, శరీరంలో రక్తం ఏర్పడే ప్రక్రియ ప్రభావితమవుతుంది.
*రూపశ్రీ.




