జాగ్రత్త.. నొప్పి కూడా కనిపించకుండా శరీరంపై దాడి చేసే ఆరోగ్య సమస్యలు ఇవి..!

శరీరంలో ఏ చిన్న సమస్య వచ్చినా సాధారణంగా నొప్పి రూపంలో బయటపడుతుంది. తలనొప్పి, కడుపునొప్పి, కీళ్లనొప్పులు వంటివి రాగానే మనం వెంటనే జాగ్రత్తపడి వైద్యులను సంప్రదిస్తాం. కానీ అన్ని ఆరోగ్య సమస్యలూ హెచ్చరికగా నొప్పిని ఇవ్వవు. మన శరీరంలో ఎలాంటి నొప్పి లేదా స్పష్టమైన లక్షణాలు లేకుండానే కొన్ని తీవ్రమైన వ్యాధులు సైలెంట్ గా మొదలై దెబ్బతీస్తుంటాయి. బయటకు మనం చాలా ఆరోగ్యంగా, ప్రశాంతంగా కనిపిస్తున్నప్పటికీ లోపల అనారోగ్యం నిశ్శబ్దంగా పాకే ప్రమాదం ఉంది. అందుకే ఆరోగ్య నిపుణులు వీటిని సైలెంట్ కిల్లర్స్ అని పిలుస్తుంటారు.నొప్పి లేకుండా సైలెంట్ కిల్లర్స్ లాగా శరీరాన్ని ఆక్రమించే ఆ జబ్బులు ఏంటో తెలుసుకుంటే..

నిశ్శబ్దంగా దాడి చేసే ప్రధాన ఆరోగ్య సమస్యలు..

హై బ్లడ్ ప్రెషర్ లేదా అధిక రక్తపోటు..

ఎక్కువ రక్తపోటు సమస్యను  ప్రధాన సైలెంట్ కిల్లర్ గా చెబుతారు. బిపి  బాగా పెరిగినా చాలామందికి ఎలాంటి నొప్పి గానీ, శారీరక ఇబ్బంది గానీ కనిపించదు. కేవలం తలనొప్పి లేదా తలతిరగడం వస్తేనే బిపి పెరిగిందని అనుకోవడం పొరపాటు. బిపి చాలా కాలం పాటు అదుపులో లేకపోతే అది నిశ్శబ్దంగా గుండె, మూత్రపిండాలు, కళ్లు , మెదడు రక్తనాళాలను తీవ్రంగా దెబ్బతీస్తుంది. ఆహారంలో ఉప్పు తగ్గించడం, రోజువారీ వ్యాయామం, బరువును అదుపులో ఉంచుకోవడం , తరచుగా బిపి తనిఖీ చేయించుకోవడం ద్వారా దీనిని అరికట్టవచ్చు.

టైప్-2 డయాబెటిస్..

టైప్-2 డయాబెటిస్ కూడా మొదటి దశలో ఎలాంటి నొప్పులను కలిగించదు. శరీరంలో ఇన్సులిన్ సక్రమంగా పనిచేయనప్పుడు రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు నెమ్మదిగా పెరుగుతాయి. మొదట్లో  సాధారణ అలసట తప్ప ప్రత్యేకమైన లక్షణాలు ఉండవు. కానీ రక్తంలో వేగంగా  మారే చక్కెర స్థాయిలు దీర్ఘకాలంలో కంటి చూపు, నరాలు, గుండె , కిడ్నీల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయి. ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ లేదా హెచ్ బి ఎ1సి పరీక్షల ద్వారా దీనిని మొదట్లోనే  గుర్తించవచ్చు. క్రమబద్ధమైన వ్యాయామం , బాలెన్స్డ్ డైట్  తీసుకోవడం  దీనికి మంచి పరిష్కారం.

ఫ్యాటీ లివర్..

ఫ్యాటీ లివర్ సమస్య కూడా కాలేయంలో కొవ్వు చేరుతున్న సమయంలో ఎలాంటి నొప్పిని తెలియజేయదు. కాలేయ కణాలలో అధిక కొవ్వు చేరడం వల్ల మొదట్లో  అసౌకర్యం ఉండదు కానీ, వ్యాధి ముదిరితే కాలేయ వాపు , ఫైబ్రోసిస్ కు దారితీస్తుంది. ఊబకాయం, టైప్-2 డయాబెటిస్ , అధిక కొలెస్ట్రాల్ ఉన్నవారిలో ఫ్యాటీ లివర్ వచ్చే అవకాశం ఎక్కువ. బరువు తగ్గడం, పౌష్టికాహారం తీసుకోవడం , క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం ద్వారా కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.

క్రానిక్ కిడ్నీ డిసీజ్..

క్రానిక్ కిడ్నీ డిసీజ్ లేదా మూత్రపిండాల వ్యాధి కూడా మొదటి దశల్లో ఎలాంటి నొప్పిని కలిగించదు. కిడ్నీల పనితీరు నెమ్మదిగా తగ్గుతున్నప్పుడు శరీరంలో ద్రవాలు చేరి పాదాల వాపు, అలసట, మూత్రంలో మార్పులు వంటివి వ్యాధి ముదిరిన తర్వాతే కనిపిస్తాయి. మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి బిపి, షుగర్  స్థాయిలను ఎప్పటికప్పుడు అదుపులో ఉంచుకోవాలి. అలాగే వైద్యుల సలహా లేకుండా తరచూ పెయిన్ కిల్లర్స్ వాడటం మానుకోవాలి. కిడ్నీల పనితీరును తెలుసుకోవడానికి క్రియేటినిన్ , మూత్ర పరీక్షలు తోడ్పడతాయి.

నొప్పి లేదు కదా అని నిర్లక్ష్యం చేయకుండా వయస్సు, శరీర తత్వాన్ని బట్టి సంవత్సరానికి కనీసం ఒకసారైనా సాధారణ హెల్త్ చెకప్ చేయించుకోవడం ఎంతో ఉత్తమం. సరైన జీవనశైలి, ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు , క్రమబద్ధమైన వైద్య పరీక్షలే మనల్ని ఈ నిశ్శబ్ద వ్యాధుల నుండి కాపాడుతాయి.

                                                                                                                                                *రూపశ్రీ.