
ప్రతి రోజు ఉరుకుల పరుగుల జీవితంలో ఒత్తిడి, సరిగ్గా విశ్రాంతి లేకపోవడం వల్ల చాలామందిలో తలనొప్పి, ఒళ్లు నొప్పులు సర్వసాధారణంగా మారిపోయాయి. ఇలాంటి చిన్నపాటి నొప్పులు రాగానే కొందరు ఏమాత్రం ఆలోచించకుండా వెంటనే మెడికల్ స్టోర్ కు వెళ్లి పెయిన్ కిల్లర్స్ తెచ్చుకుని వేసుకోవడం అలవాటు చేసుకుంటారు. ఆ మాత్రలు వేసుకోగానే క్షణాల వ్యవధిలో ఉపశమనం ఇస్తుందనే ఉద్దేశంతో ప్రతి చిన్న విషయానికి ఈ మాత్రలు మింగుతూ ఉంటారు. అయితే ఇలా మాత్రలు మింగడం ఆరోగ్యంపై తీవ్రమైన దుష్ప్రభావాన్ని చూపుతుంది. ముఖ్యంగా ఈ చిన్న అలవాటు చాప కింద నీరులా శరీరంలో సమస్యలు క్రియేట్ చేస్తుంది. తలనొప్పికి మందులు వాడితే ఏం జరుగుతుందో.. వివరంగా తెలుసుకుంటే..
కిడ్నీలు..
మన శరీరంలో కిడ్నీలు రక్తంలోని మలినాలను వడకట్టడంలో, వ్యర్థాలను బయటకు పంపడంలో , శరీరంలో ద్రవాల సమతుల్యతను కాపాడడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. అయితే ఎటువంటి వైద్యుల సలహా లేకుండా తరచూ వాడే కొన్ని రకాల నొప్పి నివారణ మందులు కిడ్నీల పనితీరును క్రమంగా దెబ్బతీస్తాయి. నాన్‌స్టెరాయిడ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ అనబడే ఎన్.ఎస్.ఐ.డి రకానికి చెందిన పెయిన్ కిల్లర్లు కిడ్నీలకు వెళ్లే రక్త ప్రవాహాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తాయి. ఈ రకమైన మందులు కిడ్నీలలో రక్తం సక్రమంగా ప్రవహించడానికి సహాయపడే కొన్ని సహజమైన రసాయనాల ఉత్పత్తిని నిరోధిస్తాయి. దీనివల్ల కిడ్నీలకు అందవలసిన ఆక్సిజన్ , పోషకాలు తగ్గిపోయి, వాటి పనితీరు క్రమంగా మందగిస్తుంది.
పెయిన్ కిల్లర్ల ప్రమాదం..
దీర్ఘకాలికంగా లేదా పదే పదే ఈ రకమైన మాత్రలు వేసుకోవడం వల్ల కిడ్నీల కణజాలం దెబ్బతింటుంది. ముఖ్యంగా శరీరంలో నీటి శాతం తగ్గిపోయినప్పుడు అంటే డీహైడ్రేషన్ సమస్య ఉన్న సమయంలో ఈ పెయిన్ కిల్లర్లు తీసుకుంటే కిడ్నీలు అకస్మాత్తుగా ఫెయిల్ అయ్యే ప్రమాదం కూడా పెరుగుతుంది. ఇప్పటికే డయాబెటిస్, హై బ్లడ్ ప్రెజర్ లేదా ఇతర దీర్ఘకాలిక మూత్రపిండాల సమస్యలతో బాధపడుతున్న వారు ఈ మందుల విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. ఎలాంటి ప్రిస్క్రిప్షన్ లేకుండా ఇష్టానుసారంగా వీటిని వాడడం వల్ల సమస్య మరింత జటిలమయ్యే అవకాశం ఉంటుంది.
అతిగా వాడితే..
పెయిన్ కిల్లర్ల అతి వాడకం వల్ల కిడ్నీలు దెబ్బతింటున్నాయని మన శరీరం కొన్ని రకాల సంకేతాల ద్వారా ముందే హెచ్చరిస్తుంది. మూత్ర విసర్జన సమయంలో మోతాదు చాలా తక్కువగా ఉండటం, పాదాలలో లేదా చీలమండల వద్ద వాపు కనిపించడం, ముఖం వాపు రావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. అలాగే ఎప్పుడూ విపరీతమైన అలసట, బలహీనత ఆవరించడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలగడం లేదా శరీరంలో నీరు చేరిపోవడం వంటి సమస్యలు ఎదురవుతాయి. ఒకవేళ జ్వరం, వాంతులు లేదా విరేచనాలు వంటి సమస్యలు ఉన్నప్పుడు శరీరంలో నీటి శాతం తగ్గిపోతుంది, ఆ సమయంలో ఈ మందులు వాడితే కిడ్నీలపై పడే భారం మరింత ఎక్కువగా ఉంటుంది.
వైద్యుల సలహా లేకుండా వాడకండి..
ఎలాంటి అనారోగ్య సమస్యకైనా వైద్యుల సలహా లేకుండా సొంత వైద్యం చేసుకోవడం ఎప్పుడూ శ్రేయస్కరం కాదు. చిన్నపాటి తలనొప్పి లేదా ఒంటి నొప్పుల కోసం ప్రతిసారీ మాత్రలు వేసుకునే బదులు తగిన విశ్రాంతి తీసుకోవడం, వేడి నీటి కాపడం పెట్టుకోవడం లేదా ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించడం మంచిది. శరీరంలో నీటి శాతం తగ్గకుండా తగినన్ని నీరు తాగుతూ ఉండాలి. ఏ చిన్న అనారోగ్య సమస్య వచ్చినా నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రదించి, వారు సూచించిన మోతాదులో మాత్రమే మందులు వాడడం ద్వారా కిడ్నీలను సురక్షితంగా కాపాడుకోవచ్చు.
*రూపశ్రీ.




