కేశవ సమాధానం చెప్పలేదు. కనురెప్పల క్రింది నీటిబిందువులు క్రిందికి జారకుండా ప్రయాసపడుతున్నాడు.
"నాకు మాటివ్వండి" మళ్ళీ అంది ఉమ.
"నాకు సాధ్యంకానిదడిగితే ఏం చెయ్యగలను ఉమా! నీ ఆజ్ఞకు కట్టుబడి నీ జీవితంలోంచి తొలగగలిగాను. కాని మనసులోంచి నిన్ను తొలగించుకోగలిగానా? నా బ్రతుకుకంతా ఆధారమైన ఆ భావబంధాన్ని తెంచగలిగే శక్తి నాకుందా?"
ఉమ సమాధానం చెప్పలేదు. అతని నుదుటిమీద గాయాన్ని చూస్తూ పడుకుంది. భాషను పొందే అర్హతలేని ఎన్నో భావాలు ఆమె కళ్ళలోనుండి కన్నీరుగా జాలువారుతున్నాయి. చలపతికాని, కేశవ కాని ఆ కన్నీరు తుడిచే సాహసం చెయ్యలేకపోయారు. ఆ నీటి బిందువులు మండుతున్న ఉమ గుండెలమీద పడి ఆవిరైపోతున్నాయి.
అంతలో ఉమ తన చీరకొంగు చింపి కేశవచేతికిచ్చి "ఆ మచ్చుకు కట్టుకోండి. నేను చూడలేకుండా ఉన్నాను" అంది.
వెంటనే మరొకవైపుకు తిరిగిపోయింది. ఉమ చింపి ఇచ్చిన ఆ చీరపేలిక చేతిలో పట్టుకుని భారంగా లేచాడు కేశవ.
ఆ చిన్న చీర పేలిక కొన్ని సంవత్సరాల ముందు లభించి ఉంటే? దీనికి సమాధానం లేదు.
35
కేశవ రాక కారణంగా ఉమలో సంచలనం కలిగినందుకు చలపతికి కలిగిన సంతోషం ఎంతోకాలం నిలవలేదు. కేశవ వెళ్ళిన మరునాడే ఉమకు జ్వరం తీవ్రంగా ముంచుకొచ్చింది. కేశవరావును తీసుకొచ్చాడు. రావు ఎంత ప్రయత్నించినా ఉమ జ్వరం తిరుగుముఖం పట్టలేదు. ఫిట్స్ కూడా వస్తున్నాయని తెలిశాక రావు పూర్తిగా నిరాశపడిపోయాడు.
"వాళ్ళ వాళ్ళకు టెలిగ్రాం ఇప్పించండి" చెప్పలేక చెప్పలేక చెప్పాడు రావు.
చలపతి పిచ్చివాడిలా అరిచాడు.
"ఎందుకు డాక్టర్! ఉమకేమైందీ? రక్తం కావాలా? నా రక్తమిస్తాను. డబ్బు కావాలా? నాకున్నదంతా ఇస్తాను. నా శరీరము, మనసు, ఆత్మ, ఏం కావాలన్నా తీసుకోండి. నా ప్రాణాలు తీసుకుని ఉమ ప్రాణాలతో కలిపెయ్యండి. నేనుండగా ఉమకు భయమేవిఁటి డాక్టర్?"
అతని విపరీతమైన ఆరాధనా భావనకు దిగ్భ్రమచెందాడు రావు. అట్లాంటి వ్యక్తి ఉమ సౌఖ్యం కోసం స్వయంగా విడాకులివ్వటం తలుచుకుని మనసులోనే అంజలి ఘటించాడు. ఏం మాట్లాడకుండా తల వంచుకుని వెళ్ళిపోయాడు.
"ఉమా! ఇలా చూడు. కళ్ళు తెరు, నేను ఉమా. చలపతిని. నీకు భయం లేదు. నేనున్నాను. ఏం కావాలన్నా ఇస్తాను."
ఉమ కళ్ళు తెరిచింది. నీరసంగా నవ్వింది.
"నాకు భయంలేదు. భయం దేనికి? ఏనాడు దేనికి భయపడ్డాను? కాని, నాకు కావలసింది నిజంగా ఇస్తారా?"
"అనుమానిస్తున్నావా? అడుగు ఉమా!"
"నా మాంగల్యాలు నా మెడలో వేసెయ్యండి."
అదిరిపడ్డాడు చలపతి. అంటే ఇంతటి అనర్ధానికి తను మాంగల్యాలు తీసిపారెయ్యటమే కారణమా? వాటికి అంత విలువనిస్తోందా ఉమ? పరిస్థితి తను అర్థం చేసుకున్నట్లుగా ఉమ ఎందుకు అర్థం చేసుకోదు?
"అంతటి విజ్ఞానవతివి ఇంత మూర్ఖంగా మాట్లాడతావేమిటి ఉమా! నిండు సభలో తన పరాక్రమాన్ని నిరూపించుకొని ధీరత్వంతో తనను చేపట్టిన 'రమయతీతి' రాముని ఇల్లాలు సీతాదేవి తన మాంగల్యాలను పూజించిందంటే ఆశ్చర్యంలేదు. దేవతలను కూడా కాలదన్ని ఏరికోరిన నలుని వివాహమాడిన దమయంతి తన మాంగల్యాలను పవిత్రంగా భావించిందంటే అందులో వింత ఏముందీ? సంవత్సరకాలం మాత్రమే బ్రతుకుతాడని తెలిసినా, మృత్యువును కూడా లక్ష్యపెట్టక భోగభాగ్యాలను తృణీకరించి సత్యవంతుని సతికావటమే తన మహాభాగ్యంగా భావించిన సావిత్రికి మాంగల్యాలు ప్రాణప్రదంకాకేమవుతాయి? కేవలం ఆర్ధికపరిస్థితులకు లొంగి, సాంఘిక నియమాలకు ఎదురుతిరగలేక, వేరు మార్గంలేక, విధిలేక మెడలో తగిలించుకున్న నీ మాంగల్యాలకు విలువేవిఁటీ? ఒక ఒడంబడికకు మించిన ప్రాధాన్యం వాటికేముందీ? చైతన్యంలేని నాలో చైతన్యం కలిగించావు. ఒక విధమైన మూర్ఖత్వంలో పడి ఉన్న నా మనసును వికసింపజేశావు. సంస్కారమనే పదానికి అర్థం తెలియని నా వ్యక్తిత్వానికి నీ సంస్కారంతో ఆకారాన్నిచ్చావు. విద్యపట్ల విముఖుడినయిన నన్ను విజ్ఞుడిని చేశావు. ఆ సంస్కారమే, ఆ మనోవికాసమే, ఆ విజ్ఞానమే, నాకత్యంత బాధాకరమైన ఈ నిర్ణయం నేను తీసుకునేలా చేశాయి. చివరకు నువ్వు సృష్టించిన చైతన్యంలో నువ్వే నిలవలేక పారిపోతావా?"
ఉద్రేకంగా అన్నాడు చలపతి.
ఆ మాటలకూ, మాట్లాడిన తీరుకూ ముగ్ధురాలై చూసింది ఉమ. ఆమె కళ్ళలో సంతృప్తి ప్రతిఫలించింది. నిదానంగా అంది.
"ఇంక ఫర్వాలేదు. నేనున్నా లేకపోయినా నిండుగా బ్రతకగలరు మీరు."
చలపతి గడగడలాడాడు.
"వద్దు ఉమా! అలా అనకు. తపస్వినివి నువ్వు. నీ మాటలు యథార్ధమవుతాయి. నువ్వులేని నాకు బ్రతుకేవిఁటీ? నువ్వు మనసారా ప్రేమిస్తున్న వ్యక్తితో నువ్వు సుఖపడాలని మాత్రమే నీ మాంగల్యాలను తీసేశాను కాని నిన్ను దూరం చేసుకోవాలని కాదు. నీకు తెలుసా సంగతి."
బరువుగా నిట్టూర్చింది ఉమ.
"మీరు నాకంటే చాల ఎదిగిపోయారు. నేను ఊహించను కూడా లేని లోకాలలో నిలబడి మాట్లాడుతున్నారు. కాని, ఒక్క మాట! సజీవంగా ఉన్న నాకు ఆ మాంగల్యాలను ధరించే అర్హత ఉందో లేదో నాకు తెలీదు, కాని నేను చచ్చిపోయాక మాత్రం నన్ను మాంగల్యాలతోనే దహనం చెయ్యండి. నా శవానికి వాటిని ధరించే అధికారం తప్పకుండా ఉంది. శారీరకంగా నే నేనాడూ వాటికే అపచారమూ చెయ్యలేదు."
"ఉమా!" ఆర్తనాదం చేశాడు చలపతి.
ఉమకు క్రమంగా మాటపడిపోయింది.
టెలిగ్రాం అందుకుని కామాక్షమ్మా, శోభా వచ్చి వ్రాలారు.


