"అలా అనకండి! అనుమానం వస్తే నివృత్తి చేసుకోవాలి. కాలం అలా వుంది. టెర్రరిస్టులు ప్రార్థనా మందిరాల్లో తమ మందుగుండు సామాగ్రిని దాచుకుంటున్న రోజులవి."
"అవుననుకోండి" నిజమేనన్నట్లు తల వూపాడు.
ఇన్ ఛార్జ్ ని ఇలా మాటల్లో పెట్టి గణపతిరాజు మనుషులు తమ పథకం మొదటి స్టెప్ వేశారు.
వాళ్ళు వంటశాలలో రహస్యంగా ప్రవేశించి పొయ్యిలో రెండు టపాకాయల సరాల్ని జారవిడిచారు.
వంటలు వండే పొయ్యి వంటశాల వెనక వుంది. అది వృద్ధుల నివాసానికి కూడా దగ్గరే.
సాయంకాలం కావడంతో వంటవాళ్ళు భోజనాలను వండటానికి సిద్ధమవుతున్నారు. కొందరు కూరగాయలు తరుగుతుంటే, మరికొందరు పొయ్యి రాజెయ్యడానికి వెళ్లారు.
వాళ్ళు పొయ్యిలో కొంత కిరోసిన్ పోసి వెలిగించగానే టపాకాయలు పేలడం ప్రారంభించాయి.
ఆ రోజు ఉదయం నుంచీ వాళ్ళ మనసుల్లో బాంబులే వుండటం వల్ల టపాకాయల మోతల్ని బాంబులు పేలుతున్నట్లు భ్రమపడ్డారు.
అక్కడ్నించి పరుగు లంకించుకుని "బాంబులు, బాంబులు" అంటూ అరవడం ప్రారంభించారు.
అప్పుడే తోటపనులు ముగించుకొచ్చిన వృద్ధులు ఆ కేకలకు భయభ్రాంతులయ్యారు.
ఏం జరిగిందో ఎవరికీ తెలియదు. బాంబులు పేలుతున్నాయన్నది మాత్రం స్పష్టం.
దాంతో ఎవరికి వారు ప్రాణభీతితో బయటికి పరిగెత్తడం ప్రారంభించారు.
ఇన్ ఛార్జ్ అయితే అప్పటికే బయటపడి లోపలున్నవాళ్ళని బయటికి పరిగెత్తమని అరుస్తున్నాడు.
ఉన్నది ఒకటే ద్వారం కాబట్టి అక్కడ తొక్కిసలాట ప్రారంభమైంది. ఆ తోపులాటలో ఇద్దరు ముసలాళ్ళు కిందపడిపోయారు.
వాళ్ళను లేవనెత్తాలన్న స్పృహ కూడా ఎవరికీ కలగడం లేదు. ఎవరికి వాళ్ళు బయటపడటానికి ఉరుకుతున్నారు. కిందపడిపోయినవాళ్ళను సైతం తొక్కుకుని పరిగెడుతున్నారు. అప్పుడు ఆ వృద్ధుడు పెడుతున్న గావుకేకలు హృదయవిదారకంగా వున్నాయి.
ఒక్కసారిగా ఆశ్రమ వాతావరణమే మారిపోయింది.
ప్రశాంతత గుండెల్ని ఎవరో చీలుస్తున్నట్లు ఆ ప్రాంతమంతా గందరగోళంతో నిండిపోయింది.
గణపతిరాజు, అతని ఇద్దరు అనుచరులు తాపీగా అనాథ మహిళా సదన్ కేసి అడుగులు వేస్తున్నారు.
సభామందిరంలో ఉపన్యసిస్తున్న విమలాబాయి ఈ కేకలకు తన ఉపన్యాసాన్ని ఆపింది. అందరూ కాసేపు చెవులు రిక్కించారు. బయట ప్రాణభయంతో అరుస్తున్న వృద్ధుల కేకలు వాళ్ళ చెవులను చీలుస్తున్నాయి. విమలాబాయితో సహా అందరూ లేచి బయటికి పరిగెత్తారు.
అప్పటికే బయట జనం పోగై అరుస్తున్నారు. వంటశాల నుంచి ఇంకా టపాకాయల శబ్దం వినిపిస్తోంది. అమ్మాయిలంతా సభామందిరం నుంచి కిందకు దిగారు. విమలాబాయి తన కుటీరానికి వెళ్ళింది.
అప్పటివరకు పేపర్ చదువుకుంటూ కాలక్షేపం చేస్తున్న తరుణ్ గది బయటికి వచ్చి నిలబడ్డాడు. ఏదో విపత్తు సంభవించినట్టు తెలుస్తూనే వుంది. అదేమిటో అంతుబట్టడం లేదు.
అతనికి వెంటనే గుర్తొచ్చింది మౌనిక. ఆమెను రక్షించుకోవాలి. ఇక ఏమీ ఆలోచించలేదతను.
బయటున్న గేటు దగ్గరికి పరిగెత్తుకొచ్చాడు. సభామందిరం మెట్లు దిగుతున్న మౌనిక కనిపించింది.
టపాకాయల శబ్దం చెవులను బ్రద్ధలు కొడుతోంది.
అతను గేటు తీసుకుని బయటపడ్డాడు. కాలు మోపడానికి కూడా సందులేదు. వృద్ధులు అటూ ఇటూ భయంతో పరిగెడుతున్నారు. కొందరు గుంపులు గుంపులుగా పోగై ఆందోళనతో మాట్లాడుకుంటున్నారు.
అతను దారి చూసుకుని అమ్మాయిల వైపు నడిచాడు. తరుణ్ ఎప్పుడయితే గేటు తీసుకుని బయటికి వచ్చాడో తన ప్లాన్ సక్సెస్ అయినందుకు విషపు నవ్వు గణపతిరాజు పెదవులపై విప్పారింది.
ఇక ఒక్క క్షణం ఆలస్యం చేయదలుచుకోలేదు గణపతిరాజు. తన అనుచరులిద్దరికీ తనను అనుసరించమన్నట్లు సైగచేసి తరుణ్ వెంటపడ్డాడు.
అప్పటికే తరుణ్ మౌనిక దగ్గరికి వెళ్ళిపోయాడు.
"ఏం జరిగింది?" అంటూ ఆమెకు రక్షణ కవచంలా నిలబడ్డాడు.
"ఎవరికీ సరిగా తెలియదు. అయినా మీరెందుకొచ్చారిక్కడికి? ముందు లోపలికి వెళ్ళండి. లేకపోతే ప్రమాదం" అంది మౌనిక ఆందోళనతో.
"మీకోసమే వచ్చాను. రండి" అంటూ ముందుకు తిరిగాడు తరుణ్.
అప్పుడు పడింది అతని కడుపు మీద దెబ్బ. పేగులన్నీ పగిలిపోయినట్లు బాధ. ఎదురుగా నిలబడి వున్న ఆ ముగ్గుర్నీ చూస్తూనే అతనికి అర్థమైపోయింది వాళ్ళెవరో. బాధనంతా కడుపులోనే నొక్కిపట్టి కడుపులో గుద్దిన రాజు తొడలమధ్య బలంగా తన్నాడు.
అతనంత షార్ప్ గా రియాక్ట్ అవుతాడని వాళ్లు ముగ్గురూ ఊహించలేదు. అతను ఆ దెబ్బకు కుప్పకూలిపోతాడని వాళ్ళు భావించారు. అయితే అతను అలా తిరగబడి కొట్టడంతో ఖంగుతిన్నారు.
మొదట అతడ్ని నిర్వీర్యుణ్ణి చేసి, ఆ తర్వాత నింపాదిగా కత్తితో పొడవాలన్నది గణపతిరాజు ప్లాన్. గందరగోళంలో పొడిస్తే దెబ్బలు తగలడం అరుదు. అందుకే అంతా చుట్టుముట్టారు. రాజు ఆ దెబ్బకు తాళలేకపోయాడు. దెబ్బ తగిలిన భాగాన్ని పట్టుకుని వుండిపోయాడు. ఇక మిగిలింది ఇద్దరే! వాళ్లు కొట్టడానికి చేతులెత్తేలోపు తరుణ్ చేతులు రెండూ కత్తులై వాళ్ళ డొక్కల్లో కమ్మాయి గణపతిరాజులాంటి ప్రొఫెషనల్ కే దెబ్బకు కళ్లు తిరిగాయి.
అయితే క్షణంలో తేరుకున్నాడు అతను. ఇక లాభం లేదనుకుని ప్యాంటు జేబులోంచి కత్తి తీశాడు. పెన్ కంటే మరికాస్త పొడవున్న కత్తి కింది అంచు వంకీలు తిరిగి పొడిస్తే పేగులు లాగేస్తుందన్నట్లుంది.
గణపతిరాజు తన ఒంట్లోని శక్తినంతా చేతుల్లోకి తీసుకుని పొడవబోయాడు.
సరిగ్గా ఆ సమయానికి మోటార్ బైక్ శబ్దం ఆ ఆవరణలోని అరుపుల్ని, కేకల్ని చీల్చుకుని వినిపించింది.
గణపతిరాజు అటువైపు చూశాడు. బుల్లెట్ మోటార్ బైక్ ను నడుపుకుంటూ వస్తున్న అన్నావారి సత్రం సబ్ ఇన్స్ పెక్టర్ ను చూడగానే అతను ఠక్కున కత్తిని మడిచి జేబులో పెట్టుకున్నాడు.
బైక్ ఎక్కడా ఆగకుండా క్షణంలో గణపతిరాజు దగ్గరికి వచ్చి ఆగింది. ఎస్.ఐ. ముకుందం, వెనకనున్న కానిస్టేబుల్ ఛాయాపతి దిగారు.
తరుణ్, అమ్మాయిలు అలా గుడ్లప్పగించి చూస్తున్నారు. ముకుందం నింపాదిగా గణపతిరాజు దగ్గరికి వచ్చి "యు ఆర్ అండర్ అరెస్ట్" అని మరోమాటకు తావివ్వకుండా అతనికి బేడీలు వేశాడు. ఈ అనుకోని సంఘటనకు అతడు బిగుసుకుపోయాడు. ఒక్కక్షణం అతని మెదడంతా మొద్దుబారి పోయింది.


