విజయా క్లాత్ స్టోర్స్ ముందున్న కారు జోహ్రా ఎక్కగానే సైన్ కేసి దూసుకుపోయింది.
ఖలీల్ జోహ్రాతో ఏం మాట్లాడలేదు.
కారు పదినిమిషాలు ప్రయాణించాక సైన్ రైల్వేస్టేషన్ క్రాస్ రోడ్స్ లో వున్న బసంత్ కోర్ట్ అపార్టు మెంట్స్ పార్కింగ్ ప్లేస్ లో ఆగింది.
ఇద్దరూ కారు దిగారు.
ఖలీల్ ముందు దారితీయగా వెనుక జోహ్రా బయలుదేరాడు.
మూడు దశాబ్దాల క్రితం నిర్మించిన అపార్టుమెంట్స్ కావడంతో దానికి లిఫ్టు లేదు. ఫ్లోర్స్ చాలా ఎత్తుగా కట్టారు. ఇద్దరూ చెక్కమెట్లమీదుగా ఫోర్త్ ఫ్లోర్ కి చేరుకున్నారు.
ఖలీల్ చుట్టుప్రక్కలకు చూసి జేబులోంచి ఇ-6 అపార్టుమెంట్ కీ బయటకు తీసి అపార్టుమెంట్ డోర్ ఓపెన్ చేసి జోహ్రా లోపలకు రాగానే తలుపులు మూసి వేసాడు.
"ఈరోజు నుంచి నువ్వుండబోతున్న అపార్టుమెంటు ఇదే. మంచి సెంటర్ లో ఉంది. సైన్ మెయిన్ సెంటర్ ఇదే. ఈ చుట్టు ప్రక్కల నీకేది కావాలన్నా దొరుకుతాయి."
"ఈ అపార్టుమెంట్ ఎవరిది?" జోహ్రా అపార్టుమెంట్ ని నలువైపులా కలియజూస్తూ అడిగాడు.
"నాదే.... కాని నా పేరు మీద లేదు. ఇక్కడ నీకెలాంటి ప్రమాదముండదు సైన్ పోలీస్ స్టేషన్ ఎస్.ఐ. నా ద్వారా ఇలాంటి అపార్టుమెంట్సు రెండు కొనుక్కున్నాడు. నా దగ్గర అతను లంచాలు తీసుకున్నట్లు సాక్ష్యాలు కూడా ఉన్నాయి."
"అతని అవసరం నాకు లేదు. నా ఉనికి గురించి ఈ మహానగరంలో నీకు తప్ప మరెవరికీ తెలియకూడదు. నా సంగతి నేను చూసుకోగలను. నువ్వెంటనే వెళ్ళి పదిలక్షల కేష్ ఫారెన్ స్కాచ్ విస్కీబాటిల్స్ ఒక పది, షాంపైన్ బాటిల్స్ ఒకపది, ఓడ్కా ఒక పదిబాటిల్స్ పంపించు ఇక్కడున్న ఫోన్ కి ఎస్.టి.డి. ఫెసిలిటీ ఉందా?"
"లేదు వెంటనే అరేంజ్ చేస్తాను."
"గుడ్.... ఏ పనయినా నలుగురి దృష్టి మనమీద పడకుండా, అనుమానం రాకుండా చేయాలి."
"నీ పని పూర్తయ్యేవరకు నీకు ఏది కావాలన్నా క్షణాల్లో సమకూర్చుతాను లక్షలే కాదు కోట్లు కావాలన్నా ఇస్తాను. నా కోర్కె నీ దృష్టిలో అతిచిన్న కోర్కె ఆ కోర్కెను తీరిస్తే చాలు నీకు జీవితాంతం రుణపడి ఉంటాను" ఖలీల్ ఆశగా అన్నాడు.
జోహ్రా కొద్దిక్షణాలు ఆలోచించి అలాగే అన్నట్లు తలూపాడు.
ఆ మరుక్షణం అపార్టుమెంట్ కి తాళం వేసి కీ జోహ్రా చేతికందించాడు ఖలీల్.
మరో నిమిషానికి వాళ్ళిద్దరూ ఎక్కిన టాక్సీ విక్టోరియా టెర్మినస్ కేసి దూసుకు పోయింది.
* * * * *
ఫోరెన్ సిక్ లాబ్ ఎక్స్ పర్టు దేవానంద్ ఇంటి ఆవరణలోని మామిడిచెట్టు కొమ్మలపై దొరికిన హెయిర్ ని, 200 రెట్లు మేగ్నిఫై చేసి చూపించగల మైక్రోస్కోప్ తో పరీక్షించి రిపోర్టు తయారుచేసి సీల్ చేసి లాబ్ మెసెంజర్ తో సిద్దేశ్వర్ ఓబరాయ్ కి పంపించాడు.
* * * * *
ఖలీల్, జోహ్రా ఎక్కిన టాక్సీ విక్టోరియా టెర్మినస్ నుంచి తాజ్ కాంటినెంటల్ కి వెళ్ళే రూట్ లోకి మలుపు తిరిగి కొంతదూరం ప్రయాణించి ఇంపోర్టెడ్ ఫోటోగ్రాఫిక్ మెటీరియల్ దొరికే ప్రాంతంలో ఆగింది.
నికాన్ ఫోర్తు జనరేషన్ కెమేరా ఒకటి, టెలిస్కోపిక్ లెన్స్ ఒకటి, ఆటోమేటిక్ కెమేరా మోటార్ ఒకటి, పవర్ ఫుల్, టెలీకమ్ వైడ్ ఏంగిల్ లెన్స్ ఒకటి, కలర్ ఫిల్మ్స్ ఆరు, పర్చేజ్ చేసి వాటన్నిటిని ఒక లెదర్ కిట్ లో సర్దుకుని తిరిగి వచ్చి టాక్సీ ఎక్కారు.
* * * * *
సిద్దేశ్వర్ ఓబరాయ్ రాత్రంతా మేల్కొని వాషింగ్టన్ లోని ఎఫ్.బి.ఐ. డైరెక్టర్ ని అర్ధిస్తూ ఒక రిపోర్టుని తయారుచేసాడు. ఆపైన ఎఫ్.బి.ఐ.లో తనకు నాలుగయిదు ఏండ్ల క్రితం పరిచయమయిన ఒక ఆఫీసర్ కి ఫోన్ చేసి వివరాలన్నీ అందించి తన పని త్వరగా అయ్యేలా చూడమని రిక్వెస్ట్ చేసి ఫోన్ పెట్టేశాడు.
* * * * *
"ఇంత డబ్బు ఏం చేసుకుంటాం మనం?" యశోధర మాస్టర్ కి బ్రెడ్ ని టోస్ట్ చేసి అందిస్తూ అడిగింది.
మనస్సును సమాధాన పరచి ప్రశాంతంగా ఉంచలేని మెటీరియలిస్టిక్ ప్రపంచంపై ఆమెలో తీవ్ర అసంతృప్తి పొరలుగా పేరుకుపోయి ఉంది.
"ఈ ప్రశ్న ప్రస్తుత ప్రపంచంలో ఏ ఒక్కరూ అడగరు. వాళ్ళకు డబ్బు విలువ తెలుసు గనుక ఆ సాహసం చేయరమ్మ....బట్..." మాస్టర్ నెమ్మదిగానే అన్నాడు.
యశోధర నవ్వింది.
ఆపైన అంది ఫిలాసాఫికల్ గా "ఆరాఫత్, నెల్సెన్ మండేలా, మదర్ థెరిస్సా నీ దృష్టిలోకి వీళ్ళు రారా? చెప్పు నాన్నా."
ఈసారి మాస్టర్ నవ్వాడు. అహాన్ని తోడు తీసుకుంటూ అన్నాడు. "వాళ్ళ వాళ్ళ లక్ష్యాలను సాధించటానికి ఏం కావాలో తెలుసామ్మ...డబ్బు.....వాళ్ళ ఉద్యమాలు ఫలితాలు సాధించేవరకు కొనసాగడానికి డబ్బు కావాలి. నెల్సన్ మండేలా ప్రపంచ దేశాలలో తిరిగి ఆయా దేశాధినేతల నైతిక అండను సంపాదించుకోవాలి. అందుకు ఆయన అన్ని దేశాలు తిరగాలి. ఇంటర్నేషనల్ ఎయిర్ వేస్ ధర్మసంస్థలు కాదుగా ఆయన్ని ఉచితంగా ఏ దేశానికి కావాలంటే ఆ దేశానికి తిప్పటానికి? ఉద్యమాలు కొనసాగించే వారికి పనిచేసి నలుగు డబ్బులు సంపాదించుకొనే వీలుండదు. ఆ వీలు లేకపోయినా ఆకలి వేయటం మానదుగా? జెండాలు, బ్యానర్లు లాంటివి ఉద్యమ ప్రచారానికి తయారు చేసుకోవాలి. వాటికయినా డబ్బు కావాలి. మదర్ థెరిస్సా రోగపీడితులకు. ఆప్తులకు స్వాంతన చేకూర్చాలంటే మందులు కావాలి. బట్టలు కావాలి, నిలువ నీడ కావాలి. ఇవన్నీ ఎలా వస్తాయి? ఆరాఫత్ పాలస్తీనా ఉద్యమాన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళగలడు? వాళ్ళు గొప్పవాళ్ళు చాలా గొప్పవాళ్ళు ప్రజల సుఖ సంతోషాలకోసం తమ వ్యక్తిగత సుఖసంతోషాల్ని ధారపోసారు. కాదనటం లేదు. పాకిస్తాన్ వెధవలు ఎన్నెన్ని ఆగడాలు చేస్తున్నా ఇండియా యుద్దానికి ఎందుకు దిగటం లేదో తెలుసా? ఒక కారణం భారతీయులు శాంతి ప్రియులు రెండో కారణం ఏమిటో తెలుసా? యుద్ధం చేసేంత డబ్బు ఇండియా ట్రెజరీలలో ఉందా? లేదు ఉండి ఉంటే పాకిస్తాన్ కి ఇంతకాలంగా బుద్ది చెప్పకుండా ఉంటుందా? శరీరంలో ఒక భాగం మీద వ్రణం లేస్తే ఆపరేట్ చేయాలి. పూతమందు పైపైన పూసి ప్రయోజనం లేదు కాని ఆపరేషన్ కి చాలా ఖర్చవుతుంది. కాదంటావామ్మ....? నన్నా, నేను సంపాదించబట్టే కదా నువ్వీనాడు లక్షలకు లక్షలు దానం చేయగలుగుతున్నది."


