Home » Dr ravuri bharadwaja » పాకుడురాళ్ళు

మంజరి సిగరెట్ తెచ్చి అతనినోటి కందించి తనే వెలిగించింది.
చలపతి గట్టిగా రెండు గుక్కలు పొగత్రాగి, చిటికవేసి సిగరెట్ నుసి రాల్చేశాడు.
" ఓ పని చేద్దాం. మళ్ళా ఆ శర్మగాడు మన కొంపకు రావటం నాకిష్టం లేదు. నేవెళ్ళి వాడి మొహాన అయిదొందలూ పడేసి వస్తాను. వాడసలే తిక్కరాముడు, వస్తూ వస్తూ కొంత ఫర్నిచరు కూడా పట్టుకొస్తాను. ఈ దిక్కు మాలిన కుర్చీలో కుర్చోవడమంటే చిర్రెత్తుకొస్తుంది. అవును గదూ?"
మంజరి గుండెల్లో సన్నని కంపరం బయలుదేరింది. వెంకటేశ్వర్లు తనకు డబ్బిచ్చిపోయినట్లు, చలపతికి యెలా తెలిసిందో మంజరికి బోధపడలేదు. మెల్లగా లేచివెళ్ళి అద్దం వెనుకనుండి పదిహేడు వందల రూపాయలనోట్లూ తెచ్చి చలపతి చేతిలో ఉంచింది. చలపతి వాటినోసారి లెక్కించిచూశాడు.
"ఈ పూటకు వెయ్యి చాలు. మిగతావి ఇంట్లో ఉంచు. వీలుంటే వెంటనే వస్తాను - లేదా అటునుంచి అటే రావుగారి దగ్గర కెడతాను ఈ పూట వారికి కాల్ షీట్ లేదు. నాకోసం నువ్వు కనిపెట్టుకొని ఉండకు. డూప్లికేట్ నా దగ్గరుందిగనక ఫర్వాలేదు."
పదినిమిషాల్లో డ్రెస్ చేసుకొని చలపతి వెళ్ళిపోయాడు. మంజరి కణతలు వొకసారి గట్టిగా నొక్కుకొని కుర్చీలో కూచుంది.
"పోస్టు"
మనుషులొచ్చిందాకా ఆగకుండానే కాకిగుడ్లనవాడు దబ్ మని ఓ కట్ట పడేసి సైకిలెక్కి వెళ్ళిపోయాడు. ఈలోగా తాయారు వెళ్ళి దాన్ని తీసుకొచ్చింది.
"ఇదేదో పత్రికండీ అమ్మాయిగారూ!" అన్నది తాయారు.
ఆ మాట వినగానే మంజరిలోకి కొత్తచైతన్యం వచ్చినట్లు అయింది. చేతులు గజగాజలాడాయి. వణుకుతున్న వేళ్ళతో రేపర్ చింపి వంగిన మధ్యబాగాన్ని సరిచేసి ఒక్కో పేజీయే తిప్పసాగింది. మొదటి నాలుగు పేజీల్లోనూ తయారవుతన్న సినిమాలవీ, ఆడుతున్న సినిమాలవీ ప్రకటనలున్నాయి. ఆ తరువాత ఏవో వార్తలూ, విశేషాలూ, సినిమాతారాల బొమ్మలూ వాటికింద వ్యాఖ్యలూ ఉన్నాయి. ఆమె వేళ్ళు గబగబా పేజీలను తిప్పేస్తున్నాయి. మధ్య పేజీలో పేజీకి మధ్యగా మంజరి బొమ్మ ఉంది మంజరి మెదడు దీపం వెలిగినట్లయింది. పదేపదే ఆ బొమ్మకేసే రెప్పార్పకుండా చూసింది, మెల్లగా ఆమె చూపులు పక్కలకు మళ్ళాయి. ఆ బొమ్మకింద సంపాదకుడు వ్యాఖ్యరాశాడు__
"వైజయంతి నుండి దిగి వచ్చిన అందాలకాణాచి మంజరి. ఆంధ్ర చలనచిత్ర రంగంలో అవతరించిన వినూత్న విశిష్ట తారామణి."
ఈ వాక్యాల్లో మంజరికి కొన్ని పదాలు అర్ధంకాలేదు. "వైజయంతం" "కాణాచి" అంటే ఏమిటి? తనను తిడుతున్నట్లా? పొగుడుతున్నట్లా?
బొమ్మకు పైభాగాన పెద్ద అక్షరాలతో "మకరంద మంజూష వంటి మంజరి రాక సినిమా పరిశ్రమ కొక వెలుగురేఖ" అని అచ్చేసారు. దానికింద చిన్న అక్షరాల్లో "రచన సత్యవాదా" అని ఉంది. బొమ్మకు రెండువైపులా వ్యాసముంది. ఆ వ్యాసాన్ని వొక్కసారిగా చదవలేకపోయింది మంజరి. నాలుగు పంక్తులు చదివాక మళ్లీ బొమ్మను చూసేది, పై హెడ్డింగూ, కింద వ్యాఖ్యా చదివేది. తిరిగి వ్యాసం చదవబొయ్యేసరికి ఇందాక ఎంతవరకూ చదివిందీ గుర్తు ఉండేది కాదు. అందుకి మళ్ళా మొదటినుండీ ప్రారంభించేది.
ఈ పద్దతిమీద మంజరి ఆ వ్యాసం పూర్తిగా చదివేసరికి రెండు గంటలసేపు పట్టింది. అందులోని కొన్ని పేరాలను పదేపదే  చదువుకొంది మంజరి. ఆ పేరాలలోని విషయం ఆమెకు పూర్తిగా అర్ధమైంది. అందుచేత హాయిగా ఆనందించగలిగింది.
"మంజరి అన్న పేరుగల అందాలరాశి మద్రాసు వచ్చిందని విని పత్రికా ధర్మంగా ఆమె ఇంటికెళ్ళాను. ఆమెతో దాదాపుగా రెండు గంటలసేపు గడిపాను....మంజరి విద్యావతి. ఆంధ్రసాహిత్యంలోని అనుపానులన్నీ ఆ చిన్నారికి కరతలామలకాలు. అభినయశాస్త్రం ఆవిడకు అభిమాన విషయం. వివిధరసాలను పోషించడంలోని మెలకువలను ఆమె ఆకళించుకుంది. సంభాషణాచాతుర్యమంటే ఏమిటో మంజరినుండి తెలుసుకోవాలనడం అతిశయోక్తికాదు. గొప్ప సంస్కారం కలిగిన ఈ వ్యక్తి చిత్రపరిశ్రమలోకి రావడం ఈ పరిశ్రమ చేసుకొన్న పుణ్యమనడంలో తప్పులేదు."
మరో పేరా__
"మంజరి అప్సరాంగన అన్నా చాలదేమో ననుకొంటాను. దివినుండి భువికి దిగివచ్చిన శంపాతికలాగా పాలరాతి బొమ్మలాగా, మహాశిల్పి తీర్చిదిద్దిన స్వర్ణప్రతిమలాగా ఉంటుంది. మగువులను కూడా మోహింపచేయగల ఈ జగన్మోహిని త్వరలోనే వెండి తెరమీద దర్శనమీయబోతూవుంది."
ఇటువంటి పంక్తులు ఆ వ్యాసంలో చాలా ఉన్నాయి.
మంజరి ఆకలిమాటకూడా మరిచిపోయింది. ఆవిడ కళ్ళ కాంతిలో మిలమిల లాడిపోతున్నాయి. ఉత్సాహం ఉవ్వెత్తున పొంగులు వారుతోంది. కన్నార్పకుండా తన బొమ్మకేసి మళ్ళా మళ్ళా చూసుకొంటూ ఏవో లోకాలకు తేలిపోతూవుంది.
అనుకున్న విధంగా ఆరుగంటలకల్లా వెంకటేశ్వర్లు కార్లో వచ్చాడు. అతన్ని చూసిందాకా మంజరికి ఈ ప్రోగ్రాం సంగతి జ్ఞాపకమే రాలేదు. వెంకటేశ్వర్లు దొరబాబులా తయారయ్యాడు. మనిషి అల్లంత దూరాన ఉండగానే సేన్తువాసన గుప్పు మంటోంది.
మంజరిని చూస్తూనే అతను నవ్వేశాడు. కొంపదీసి మంజరి ఇవ్వాళ ప్రోగ్రాం కాస్తా కాన్సిల్ చేస్తుందేనని అతని భయం.
మంజరి, యధాశక్తి నవ్వింది. పత్రికలో తనను గురించి వ్యాసం వచ్చిన సంగతి వెంకటేశ్వర్లుకు చెప్పాలని ఆరాటపడింది. కానీ తనంతట తానే చెప్పడం బావుంటుందా? చెప్పినా సమయంగాని సమయంలో చెప్పడం మంచిదా? తానీ రంధిలోపడి ప్రోగ్రాం విషయం మరచిపోయానంటే వెంకటేశ్వర్లు నొచ్చుకోకుండా వుంటాడా? ఈ సందేహాలన్నీ మంజరికి తోచాయి. ఆవిదేమాట మాట్లాడకముందే వెంకటేశ్వర్లు తొందరచెయ్యసాగాడు.
"నే వచ్చేసరికే నువ్వు రెడీగా ఉంటావనుకొన్నాను. వీ ధోరణి చూస్తే అలా లేదు. చలపతిగా డేమన్నా గొడవ చేశాడా? డొక్క చీరేస్తానని చెప్పు వెధవను...నువ్వింకా షాపింగ్ కు వెళ్ళినట్టులేదు. అవునా? ఎందుకనిట?" అన్నాడు వెంకటేశ్వర్లు.
"వెళ్లలేదని కలగన్నారా?" అన్నది మంజరి.
"పిచ్చిదానా! ఇంతోసిదానికి కలలుగూడా కనాలా? నువ్వు షాపింగుకే వెడితే ఇంతదాకా నీ పర్చేజెస్ నాకు చూపకుండా ఉంటావా?" ఉండవు నాకు తెలుసు.
తనెట్లా ప్రవర్తిస్తే వెంకటేశ్వర్లు సంతోషిస్తాడో మంజరికి చూచాయగా తెలిసింది. అతడంటే తను వెర్రెత్తి పోతుంటుందని వెంకటేశ్వర్లు భ్రమపడుతున్నాడు. వెధవను పడనివ్వు. తనందుకు ఎంతమాత్రం బాధ్యురాలు కాదు. ఇప్పుడు తనేమని జవాబు చెప్పడం? సగం డబ్బు చలపతి పట్టుకెళ్ళాడనడం భావ్యంకాదు. ఈ సంబంధం చలపతికి కూడా తెలుసుననీ, అతని ఆమోదంతోనే, తనిందుకు వోప్పుకోన్నదని తెలియడంలో స్వార్ధంలేదు. ఇందువల్ల చలపతి స్థాయి పడిపోవడమే కాదు -తన స్థితికూడా అదేమేరకు దిగజారిపోయింది. చలపతి అనేవాడు ఉన్నా లేకున్నా తను వెంకటేశ్వర్లు కోసం తహతహలాడిపోవడం ఖాయమన్న భావం అతనికి కలగడమే ముఖ్యం ఇందువల్ల తనకెన్నో ప్రయోజనాలున్నాయి.
"నాతోగానీ మాట్లాడకూడదనుకొన్నావా ఏమిటోయ్?" అన్నాడు వెంకటేశ్వర్లు.
అతని ఉంగరాలమీద సాయంత్రపు నీరెండపడి జిగజిగమని మెరిసి పోతున్నాయని.
"ఈ మాత్రం మీకు తెలియకపోతుందా అనుకొన్నానుగానీ, మరేంలేదు. చలపతి మాట్లాడవద్దంటే మానుకొనే స్థితిలోనే నన్నుంచారా? ఏం మాయచేశారో గానీ, ఒక్క రాత్రిలో నన్ను పూర్తిగా ఆకట్టుకొన్నారు. చలపతిగారే కాదు. హరిహరబ్రహ్మాదులొచ్చినా నన్ను మార్చలేరు. అదిగాదండీ! నన్నొక్కదాన్నీ షాపింగుకు వెళ్ళమన్నారు గదా, నేనలా వెడతాననే మీరనుకొన్నారా? మీరు పక్కనలేకుండా నేనిక ఏ పని చెయ్యదల్చలేదు. పదే పదే ఈ విషయంలో నన్నిక బాధపెట్టకండి, మీరెప్పుడొస్తే అప్పుడే కొనుక్కుందాం. రావడానికి మీకు అవకాశం లేకపోతే కొనడమే మానేద్దాం. ఇంతలో ముంచుకుపోయిందేమిటట?" అన్నది మంజరి, అతని ముఖాన్ని జాగ్రత్తగా గమనిస్తూ.
వెంకటేశ్వర్లు పూర్తిగా కరిగిపోయాడు. గబాలున కుర్చీలోంచి లేచి గడపల్లో నుంచున్న మంజరిని తోసుకుంటూ గదిలో కొచ్చి ఆవిణ్ణి కౌగలించుకుని వదిలేశాడు.
"లేడికి లేచిందే ప్రయాణమటండీ! దేనికైనా వేళాపాళా అంటూ ఉందికదా!....మీరో పదినిముషాలపాటు అలా వరండాలో కూచోండి. ఈలోగా నేను చీరె మార్చుకొని వచ్చేస్తాను."
వెంకటేశ్వర్లు అక్కణ్నుంచి కదిలేప్రయత్నమన్నా చెయ్యలేదు.
"వెళ్ళరా?"
"ప్చ్"
"అయితే నేనిలానే వచ్చేస్తాను." అన్నది మంజరి కళ్ళింత చేసుకుని.
"నువ్వెలా వచ్చినా ణా కభ్యంతరం లేదు. నా క్కావలసింది నువ్వుగానీ నీ డ్రెస్ కాదు."
"మీతో ను వాదించలేను బాబూ పదినిముషాలంటే, వొట్టు పెట్టినట్టు పదేనిముషాలు......ప్లీజ్!"
వెంకటేశ్వర్లు నవ్వుకొంటూ ఇవతలకొచ్చాడు. పది నిముషాలకు లోపుగానే మంజరి మేకప్ అయి వచ్చేసింది.
"నన్నిప్పుడే నమిలేస్తారా?"
వెంకటేశ్వర్లు లేచి నిలుచున్నాడు.
"పదండి తాళంవేసి వస్తున్నాను."
ఏడు గంటలకల్లా కారు మౌంట్ రోడ్డుమీద పాములా జారిపోతోంది. వెంకటేశ్వర్లే  డ్రయివ్ చేస్తున్నాడు. మంజరి అతని పక్కనే కూచున్నది. అతనేదో చెప్పుకుపోతున్నాడు, ఆవిడ వింటున్నట్టులేదు.
ఓ పెద్దషాపు ముందు కారాగింది. ఉయ్యాలలాగా రెండు మూడుసార్లు పైకి కిందికీ ఊగింది కారు.
"ఊఁ దిగు మరి!" అన్నాడు వెంకటేశ్వర్లు.
మంజరి చిరునవ్వుతో పైట సరిచేసుకొంటూ, సీటుమీదినే తలుపు దాకా జరిగి ఓ కాలు కిందబెట్టి చటుక్కున నోటికి చెయ్యడ్డం పెట్టుకొని చాపిన కాలును లోపలికి తీసుకొంటూ, "ఇప్పుడు కాదు - పదండి" అన్నది దీనంగా.
"ఏం?" అన్నాడు వెంకటేశ్వర్లు దిమ్మరపోయి.
"నాఖర్మకాలి, అన్నీ వొక్కసారే వనగూడాయి. మీ మాటలసందట్లో పడి బాగ్ తీసుకురావడం మరచిపోయాను. డబ్బంతా అందులోనే ఉండిపోయింది."
వెంకటేశ్వర్లు నిర్లక్ష్యంగా నవ్వాడు.
"ఓస్. ఇంతోసి దానికేనా నొచ్చుకోవడం? ఫర్వాలేదు లేరా నాదగ్గరుంది."
మంజరి, తటపటాయించినట్లు ఓ నిముషం అభినయించింది. వెంకటేశ్వర్లు ఆవిడ చెయ్యి పుచ్చుకొని కారులోంచి దించాడు. వాకిట్లో పొడవాంటి తలగుడ్డ చుట్టుకొన్న దర్వాన్ ముందుగా సలాంచేసి ఆ తర్వాత తలుపు తీసి వారు లోపలికొచ్చాక అటు తిరిగి నవ్వుకున్నాడు.
వీళ్ళను చూస్తూనే చాలాకాలంనుండీ ఎరిగున్న మాదిరిగా నలుగురైదుగురు వ్యక్తులు రకరకాల నమస్కారాలు చేసి ఇంగ్లీషు పద్దతిలో ఆహ్వానించారు.
అటువంటి సమయాల్లో ఏం చెయ్యాలో మంజరికి తెలీదు, తిరిగీ తను దణ్ణం బెట్టాలా? వెంకటేశ్వర్లు పెట్టలేదు. తలతోటి పెదవులతోటి చేసి చేయనట్టు నమస్కార మంటున్నాడని తననుకొంది, ఇవి చాలా ప్రమాదకరమైన ఘట్టాలనీ, తను వెంకటేశ్వర్లును గమనించడమే తప్ప గత్యంతరం లేదని మంజరి నిశ్చయించుకొంది.
"సారీస్" అన్నాడు వెంకటేశ్వర్లు ఓ సిగరెట్ అంటించి.
"వన్ మినిట్"
ఓ యాభై రకాల చీరెలు వారిముందు పరిచారు. వాటిని చూసి మంజరి దిమ్మరపోయింది. ఇన్నిరకాల చీరలను ఆవిడింతకుముందెన్నడూ చూడలేదు.
"చూడు మరి. నీ కేమేంకావాలో సెలక్టు చేసుకో, మనం త్వరగా తెమలాలి."
మంజరికి వాటన్నింటినీ కొనెయ్యాలని ఉంది. దేని అందం దానిదే! దేని ప్రత్యేకత దానిదే! ఒకదానికి, మరోదానికి పోలికే లేదు. నిజంగా మంచి గుడ్డలను ఎన్నుకోవడం చాలా కష్టమనుకొంది మంజరి!
"మీరు చూడండి" అన్నది మంజరి మెల్లగా.
"నో, నో, ఆ రెస్పాన్సిబిలిటీ నా మీదుంచకు. నచ్చినవాటిని సెలెక్ట్ చేసుకోవడం నీ వంతు. బిల్ ఇచ్చేయడం నా వంతు." అన్నాడు వెంకటేశ్వర్లు నవ్వుతూ.
అతను మంజరిని రాసుకొంటూ నిలబడ్డాడు. ఆవిడ ఏదో విషయం మీద అవతలికి జరిగితే తనూ జరుగుతున్నాడు.
అరగంటకల్లా మూడు చీరెలను మరో అయిదుగాజాల జాకెట్ గుడ్డలను సెలెక్ట్ చేసింది మంజరి.
"వెరీ లో పర్చేజింగ్ మేడమ్" అన్నాడు సేల్సుమన్,
వెంకటేశ్వర్లు ఏడువందల రూపాయల నోట్లిచ్చి కొద్దిగా చిల్లర నోట్లు తీసుకొని "వుయ్ మేక్ యే మూవ్" అన్నాడు.
దర్వాన్ మెట్లు చివరదాకా వచ్చి సలాంచేసి నిలుచున్నాడు. "ఏందబ్బీ?" అన్నది మంజరి.
వెంకటేశ్వర్లు, ఓ రూపాయినోటు వాడిమీదికి విసిరేసి, కారును స్టార్ట్ చేశాడు.
"చీరెలు నచ్చాయిగదూ?" అన్నది మంజరి పొట్లాంకేసి మరోసారి సంతృప్తిగా చూసుకొంటూ.
వెంకటేశ్వర్లు మాట్లాడలేదు. పోలీస్ సిగ్నల్ కేసి కన్నార్పకుండా చూస్తున్నాడు.
"ఇంటికేనా పోవడం?" అన్నది మంజరి. పళ్ళుబిగబట్టి వెంకటేశ్వర్లును రాచుకొనేలాగా దగ్గరకు జరుగుతూ.
ఇంటికే . ఈలోగా వోసారి హోటల్ కెడదాం.
కారు సర్రున వలయంగా తిరిగి గేటుదగ్గర ఉయ్యాలలూది ఓ పెద్ద తోటలోకొచ్చింది. అక్కడ చెట్లకన్నా కార్లెక్కువగా ఉన్నాయి దీపాల కాంతిపడి రోడ్డంతా మిల మిలలాడిపోతోంది. వెంకటేశ్వర్లు తన కారు నో మూలగా ఆపాడు.
మంజరి వయ్యారంగా కారుదిగింది.
"కాటేజ్ నెంబర్ ఫిఫ్టీస్" అన్నాడు వెంకటేశ్వర్లు ఓ సూట్ వాలాతో.
అతనొకసారి చేతిలో ఉన్న నోట్ బుక్ ను కిందికి మీదికి చూసి "తమ పేరు వెంకటేశ్వర్లు గారాండీ" అని అడిగి సమాధానం వినకుండానే చెట్లమధ్యగా తీసుకెళ్ళి చిన్న ఇంటిముందాగాడు.
"ఇప్పుడే బోయ్ ను పంపిస్తాను. మీ టేబిల్ మీద మెమో కార్డు ఉంది. ఏంకావాలో ఫోన్ చెయ్యండి. ఇవ్వాళ ఉదయమే పారిన్ స్టఫ్ తెప్పించాను. వెరీ లిమిటెడ్ స్టాక్."
ఇంగ్లీషు అసలేమీ రాకపోతే లాభం లేదని మంజరి నిర్ణయించుకొంది.
"ఈ ఊళ్ళో ఎక్కడ చూసినా ఇంగ్లీషు ధారాళంగా మాట్లాడేస్తున్నారు. వారే మంటున్నారో తెలుసుకొని జవాబులియ్యకపోతే గొడ్డును చూసినట్టు చూస్తారు. ఇంగ్లీషురాకపోతే ఇక్కడ నెగ్గుకు రావడం కష్టం" అనుకొన్నది మంజరి.
"అలా బెదిరిన గొడ్డులా అన్నిటికేసి ముఖమింత చేసుకొని చూడకూడదు. చూశామంటే మనల్ని గమర్లకింద జమకట్టేస్తారు. ప్రతిదాన్నీ చాలా నిర్లక్ష్యంగా చూస్తుండాలి. ముఖ్యంగా డబ్బు విషయంలో వెనకా ముందూ చూడకూడదు. ముందు కూచో అన్నాడు వెంకటేశ్వర్లు."
మంజరి సోఫామీద జాగ్రత్తగా కూచుంది.
"అలా కాదోయ్. జార్లబడి కూచోవాలి. సుతారంగా కాళ్ళూపుతుండాలి. చేతుల్ని ఎప్పుడో గానీ కదిలించగూడదు. ఎటో చూస్తూ సమాధానమివ్వాలి... మధ్య మధ్య గడియారం కేసి చూసుకొంటూ ఉండాలి, అన్నట్లు నీకు వాచ్ లేదు కదూ? రేపొకటి కొందాం, మోచేతులదాకా ఈ గాజులుండకూడదు. కుడిచేతికో డైమండ్ బాంగిల్ చాలు. ఎడంచేతికి చిన్న వాచ్. ఈ రావలపాడు ఆకుచెప్పులు చెత్త కుండీలోకి గిరాటెట్టు. నాలుగైదు జతల హైహీల్ శాండిల్సు  కొందాం."
ఇంకెంతసేపు చెప్పేవాడో గానీ బాయ్ వచ్చి సలాం చేసి నిలుచున్నాడు.
"త్రిడాగర్స్ హాఫ్ బాటిల్, బన్, బట్టర్, జామ్, అయిస్ సోడా, చికెన్ బిర్యానీ."
అతను వొంగి అలానే రెండడుగులు వెనక్కువేసి వెళ్ళిపోయాడు.
"ఇక్కడింత చల్లగా ఉందేం?" అన్నది మంజరి.
"ఎయిర్ కండిషన్లు కాటేజ్"
"అంటే?" అందామనుకొంది మంజరి. కానీ అనలేదు. ఆ మాటే అంటే తననుమరింత వెర్రిబాగుల దానికింద జమకడతాడేమోనని మంజరి అనుమానించింది. వెంకటేశ్వర్లు కాదు -ఎవరయినా సరే - తనకేమీ తెలియదనీ, తనోమొద్దు స్వరూపమనీ అనుకోవడం మంజరికిష్టంలేదు. అందుకని ఎయిర్ కండిషన్డ్ కాటేజ్ అంటే తెలిసిపోయినదానిలాగా" అలాగా నేనూ అదే అనుకొన్నానులెండి" అన్నది మంజరి.
వెంకటేశ్వర్లు కాలుస్తున్న సిగరెట్ కు మరో కొత్త సిగరెట్ అటించాడు. అతన్ని మూడ్స్ లోకి లాగాలనుకొంది మంజరి.
"మనమిక్కడ కెందుకొచ్చినట్లో చెప్పారు కాదేం?" అన్నది మంజరి నవ్వును పెదవులుదాటి రానివ్వకుండా.
"తెలీదా?"
"ఊఁహూ! మీరు చెప్పింది నాకెలా తెలుస్తుందీ?" అన్నది మంజరి.
"ఇప్పుడప్పుడే చెప్పను. ముందో చుక్క వేసుకోవాలి. కాస్త మేత పడాలి. అప్పుడడుగు తప్పకుండా చెబుతాను."
"ఇంతోసిదానికి ఇక్కడదాకా రావాలా! ఈ గదుల్లో తప్ప మరెక్కడ కూచోరాదా? ఆ గదిలో మంచంకూడా వుందే!"
వెంకటేశ్వర్లు ఏం చెప్పేవాడో గానీ, అంతలోనే బోయ్ ఓ పెద్ద ట్రేలో బుట్టెడు సరంజామా తెచ్చి బల్లమీద ఉంచిపోయాడు. అతని వెనకనే వెంకటేశ్వర్లు కూడా వెళ్ళి, తలుపుకు గడియ బిగించేశాడు.
"అదేం?" అన్నది మంజరి. అమాయకంగా ముఖంపెట్టి.
"వన్ మినిట్" అంటూ వెంకటేశ్వర్లు. సీసాలోంచి నురగలు కక్కుతున్న ద్రవపదార్ధాన్ని గ్లాసుల్లోకి వోమ్పాడు. మిగతా ఖాళీని సోదాతో నింపేశాడు. తనొకటి తీసుకున్నాడు. మంజరికేసి చిరునవ్వుతో చూసి ఊఁ అన్నాడు. తీసుకోమని సైగచేస్తూ.
"నాకొద్దు బాబూ! సయించదు" అన్నది మంజరి, ముక్కును చిట్లిస్తూ.
"నాన్సెన్స్! సయిచక పోవడంలో అర్ధంలేదు. అసలిందుకే నిన్నిక్కడకు తీసుకొచ్చింది. మనం రోజూ తినేతిండి. ఇక్కడే తినక్కర్లేదు. ఊఁ.....ప్లీజ్" అన్నాడు వెంకటేశ్వర్లు.
"నాకా వాసన గిట్టదండీ బాబూ!చూశారా -అప్పుడే కడుపులో తిప్పుతోంది. అబ్బ!" అంటూ ముక్కు మూసుకొంది మంజరి.
వెంకటేశ్వర్లుకు నిజంగా కోపమే వచ్చిందో, లేక కోపం వచ్చినట్లు అభినయించాడో తెలీదు గానీ, ఠపీమని గ్లాసును బల్లమీద పడేసి లేచి నిలుచున్నాడు.
"అయితే వెడదాం పద! లే మరి" అన్నాడు పెద్దగా
మంజరి గుండెలు అదిరిపోయాయి. వెంకటేశ్వర్లు నిజంగా కోపంవచ్చిందనే నమ్మింది. ఇతని మీదనే తన భవిష్యత్తంతా ఆధారపడివుంది. ఇతను చెయి జారవిడిస్తే- ఒక్కడుగు తను ముందుకెళ్ళలేదు. అంటే - తానిప్పుడు -ఆ పాడువాసనగొట్టే నీళ్ళు తాగడమో, తాగకపోవడమో అన్నదానిమీద, తన బ్రతుకంతా ఆధారపడి వుండటం దురదృష్టకరం. నిజంగా - ఎంత స్వల్పవిషయాల మీద మానవుల జీవితాలు ఆధారపడివుంటాయో చూస్తుంటే అమితాశ్చర్యంగా వుంటుంది.
"లేవను గూడా లేవనన్నమాట. అయితే నేను వెడుతున్నాను."
"నేను లేవనన్నానా! అవసరమయితే మీరే వచ్చి - ప్లీజ్! కొంచెం చేయూత వివ్వకూదదూ?" అన్నాది మంజరి, అతన్ని నిండారా చూస్తూ.
మంజరి చూపుల్లో ఓ విచిత్రమైన శక్తివుంది. అవసరాన్నిబట్టి ఆసక్తి రకరకాల రూపాలు ధరిస్తూ వుంటుంది. అది స్వతహాగా ఆమెలో ఉన్నది కాదు; తన పరిసరాల నుండి సంతరించుకొన్నదా శక్తీ.. ఒక్కొక్క సారది, యమపాశంలాగా మారుతుంది. ఇంకోసారి వ్యక్తిలోని ఇంద్రియ వాంఛలను రెచ్చకొడుతుంది. మరోసారి ఎదుటివారిని నిరుత్తరులను చేస్తుంది. కొన్ని సమయాలలో, కన్నీరు కారిస్తే, మరికొన్ని సమయాలలో తూష్ణింభావాన్ని అభివ్యక్తం చేస్తుంది. ఆశక్తి ఎప్పుడూ ఆమె స్వాధీనంలోనే వుంటుంది. ఏ అవతారం ఎత్తమంటే ఆ అవతారం ఎత్తుతుంది. ఏ పని చెయ్యమంటే గుట్టుచప్పుడు కాకుండా ఆపని చేస్తుంది.
మంజరి ఇప్పుడా శక్తిని ఆవాహన చేసింది.
"వెంకటేశ్వర్లుగాడి కోపం తగ్గించు" అన్నది మంజరి.
మరుక్షణంలోనే అతనికోపం కాస్తా దిగజారిపోయింది.
"అతన్ని ణా దగ్గరకు లాక్కురా" అన్నది మంజరి.
వెంకటేశ్వర్లు అడుగులో అడుగు వేసుకొంటూ దగ్గరగా వచ్చాడు.
మంజరి పక పకమని నవ్వింది. ఆ నవ్వుతోనే సుడులు తిరిగిపోయింది. వెంకటేశ్వర్లు అయోమయంగా, ఆమె సోఫాముందు నిలబడివున్నాడు. అప్రయత్నంగా కుడిచేయి ముందుకు చాపారు. మంజరి నవ్వును అపనయించుకొంటూ, అతని చేతిని పట్టుకొని లాగులాగి, ఆ ఊపుతో తను లేచి వెళ్ళి, అతని గుండెలమీద పడి చిన్నగా చుంబించింది.
"అంత కోపమయితే ఎలాగండి! నేను సరదాకోసం సయించదన్నాను. కోపమొస్తే మీరెలా వుంటారో చూడామణి బుద్దిపుట్టింది. క్షణంలో కోపం తెప్పించాను....ఎంత బావున్నారని? బాబూ మీకో నమస్కారం! అనవసరంగా మీరు కోపగించుకొని, నా ముందు నిలబడకండి అప్పుడు నేనేమన్నా చేస్తే నాది పూచీలేదు. "అయ్యూ మంజరిలా వెర్రెత్తిపోయి" నామీద పడిపోయిందేమిటా" అని మీరనుకొన్నా లాభంలేదు. అన్నా లాభంలేదు. ఊఁ గో(ఆ)న్ రెడీ అన్నాది ,మంజరి, అతన్ని గూడుతో ఓ పోటు పొడిచి.
వెంకటేశ్వర్లు అప్పటిగ్గానీ తేరుకోలేదు. ముందుగా తనో గుక్కతాగి, నాలుకతో పెదవులు తడుపుకొంటూ అదే గ్లాసును మంజరి కన్ధించాడు. ఆవిడ శరీరమంతా గరిపొడిచింది. ఘాటైన మధ్యపు వాసనతో, తలతిరిగి పోయినట్లయింది. కానీ తాగకుండా వుండేందుకు వీల్లేదు. ఇప్పటికే యీ వెధవ నానాయాగీచేశాడు. దాన్ని సర్దుకోవడానికి తాతలు దిగిరావలసి వచ్చింది. ఇప్పుడేమిటి చేయడం?
"ఊఁ హావిట్!" అన్నాడు వెంకటేశ్వర్లు, గ్లాసును మంజరి పెదవుల కానించి.
తనకే ఇంగ్లీషు వచ్చి వుంటే, ఎంచక్కగా వుండేది. ఏదో బాన్, పీన్, కాన్, మంటూ మాట్లాడేది. ఇంగ్లీషు రాకపోవడం ఎంత ప్రమాదం.
వెంకటేశ్వర్లు ఈలోగా మరో గుక్కతాగి, సోఫాలో కూచున్నాడు. మంజరిని తన ప్రక్కగా కూచోబెట్టుకున్నాడు. దాదాపు బలవంతంగా ఆమెచేత రెండు గుటకలు తాగించాడు. ఆవిడ పెదవులంటిన చోటనే, తనూ పెదవులుంచి గ్లాసు మొత్తం ఖాళీచేశాడు. ఆ తరువాత ఇన్ని జీడిపప్పులు తీసుకొని కసాబిసా నమిలాడు. కాసిని పప్పులు మంజరిచేతకూడా తినిపించాడు.
"ఇందులో వున్న గమ్మత్తే యిది మంజరి! ఇంత పుచ్చుకో మనిషికేమీ డేంజర్ వుండదు. మధ్య మధ్య ముక్కకూడా పడుతుండాలి. ఇందుకే పెద్దవాళ్ళు "చుక్కా,ముక్కా-అక్కా చెల్లెళ్ళు" అన్నారు. మరో ట్రిప్ కానిద్దామా?"
మంజరి కథని మాటలయితే వినపడుతున్నాయి. అర్ధంకూడా అవుతున్నాయి కానీ, జావాబె చెప్పబుద్ది కావడం లేదు. మాటలు, వొకదానితో మరొకటి కలిసిపోయి, మెలికల గొలుసులాగా తయారయి పోతున్నట్లనిపించింది. అప్పుడు తానా చిక్కుముడినీ విప్పలేనని కూడా అనిపించింది.
"ఎలావుంది?" అన్నాడు వెంకటేశ్వర్లు, గ్లాసులోకి మళ్ళా వొంపుతూ.
మంజరి నవ్వింది తను నవ్వుతున్నానని కూడా అనుకొంది.
"మరింకేం! ముందు ఇప్పుడిప్పుడే పని చేస్తోందన్నమాట. ఫారెన్ లిక్కర్స్ బ్రహ్మండంగా ఉంటాయనుకో డార్లింగ్, మరింత నాటుసరుకు సంగతి, నా ముందుకు మరో రెండు డోసులు - రెండంటే రెండే రెండు వేసుకొని చూడు -స్వర్గం నీముందుండకపోతే అప్పుడడుగు ఊఁ.....కమాన్."
ఈసారి మంజరి శరీరం ఆవిడ స్వాధీనంలో లేదు. అతను గ్లాసందిస్తే ఖాళీ చేసిందాకా వదల్లేదు పేగు భగ్గున మండిపోతుంటే, ఇన్ని జీడిపప్పులు గబగబా నమిలింది. తరవాత మాంసం ముక్కలు పక్కకు నెత్తి ఇంత బిరియానీ కూడా తిన్నది. ఆ మసాలా వాసన శరీరమంతటా పాకి పేరుకుపోయినట్లనిపించింది మంజరికి.
"ఇంకోసారి -ఆఁ? వెయ్యవా?" అన్నాడు వెంకటేశ్వర్లు.
అతని చేతులు గాలిలో తేలిపోతున్నాయి, గ్లాసును రెండు చేతులతోనూ పట్టుకొన్నాడు.
"నన్నిక వొదిలిపెట్టండి మీకు దండం పెడతాను" అన్నది మంజరి సోఫాలో జారగిలపడి.
"దట్సాల్, నువ్విక ఆగలేవు" అన్నాడు వెంకటేశ్వరరావు నవ్వుతూ.
"అతను నవ్వుతున్నాడు" అనుకొంది మంజరి.
"పోనీ నువ్వోపని చెయ్యి డార్లింగ్! వెళ్ళు ఆ మంచంమీద పడుకో పదినిమిషాల్లో నేను వచ్చేస్తాను."
మంజరికా మాటలన్నీ వినిపించాయి. కానీ లేవలేక పోయింది ఎవరో తనలోనుంచి బరువునంతా తీసేసినట్లూ, తను దూదికన్నా తేలికగా అక్కడెక్కడో తెలిపోతున్నట్లూ అనిపించింది.
"ఇంతటితో యీ పీడ వదలిపోతే బావుణ్ణు! వీడు వదలదు" అనుకొంది మంజరి.
గాలి బిగబట్టి బలాన్నంతా కూడదీసుకొని సోఫాలోంచి లేచింది.
ఈ ఊహకు చుట్టూఉన్న వస్తువులన్నీ కిందికి దిగి జారి పోయినట్లనిపించింది. అడుగులు వేస్తుంటే, ఎవరో వెనకనించి తోస్తున్నట్లుగా వుండి, తిరిగి చూసింది. మంజరి వెంకటేశ్వర్లు సీసాను ఖాళీచేస్తున్నాడు. మరోచెంప దున్నపోతు నెమరేస్తున్నట్లుగా, చారెడు వెడల్పున్న దవడలను, పెద్ద చప్పుడుతో కదిలిస్తున్నాడు.
"దున్నపోతు, దున్నపోతు" అని గొణిగింది మంజరి.
ఎటూ తూలకుండా సరాసరి మంచం దగ్గరకెళ్ళి, వొక్కసారిగా వాలిపోయింది. మెత్తని మబ్బుల్లో పడుకొన్నట్లుగా వుంది. మంజరి బరువుకు మంచం, పైకిందికీ ఊగి సర్దుకొంది. తలదగ్గర ఆకు పచ్చ దీపం, మందంగా వెలుగుతోంటే, దాన్నోసారి చూసి, శరీరాన్ని మంచం మధ్యకు చేర్చింది. మంజరి, ఆమెకు సమానస్థాయిలో చుట్టూవున్న పరుపు కూడా కప్పుకుపోయింది. ఆవిడ ఎటుదొర్లితే అటుగా మంచామంతా వొరిగిపోతున్నదనిపించింది.
"ఎంత బావుందీ మంచం?"
తరువాత ఏమనుకోన్నదీ మంజరికి జ్ఞాపకంలేదు. కానీ ఏదో జరుగుతుందనిపించింది. ఆవిడకు పరిసరాలన్నీ అలుక్కుపోయి కనుపించసాగాయి. తన శరీరాన్ని ఎవరో సాగదీస్తున్నట్లుగా, విరిచేస్తున్నట్లూ లీలగా జ్ఞాపకం! నిజముగా ఆ నిమిషాన ఏం జరిగిందో ఆ తరువాత కూడా మంజరికి తెలీదు. అది తెలిసిన వ్యక్తి వొక్కరే. అతనెటుగూడీ ఆ విషయం మంజరికి చెప్పడు. చెప్పమని ఆవిడ కూడా అడగదు.
కలలోంచి తెరుకున్నట్లుగా అట్టడుగు నీళ్ళనుండి పైకి తెలుతున్నట్లుగా, మంజరికి స్పృహ రాసాగింది తననోరు తనకే అసహ్యం వేసి, మెదతిప్పి, కాండ్రించి గోడమీద ఉమ్మివేసింది. తనమీదకు బరువుగా వాలిపోయిన, శరీరాన్ని బలవంతంగా పక్కకు తొలగించి లేచి కూచుంది. చేతులు గాలిలోకి ఝోడించింది. మెడ అటూ ఇటూ తిప్పి విరుచుకొంది. అలవాటు చొప్పున జాకెట్ గుండీలు సర్దుకొనబోయింది. ఓ క్షణం మూర్చపడి వెంటనే వెంకటేశ్వర్లుకేసి అసహ్యంగా చూసి, చప్పున మంచం దిగిపోయింది.
"అడవిదున్న" అనుకొంది మంజరి.
ఆవిడ కళ్ళు మెరవెరలాడుతున్నాయి. కడుపులో కవ్వంబెట్టి చిలుకుతున్నట్లుగా వుంది. త్రేన్పు వచ్చినప్పుడల్లా, దుర్గంధపూరితమైన వాయువు వెలువడి ఆమెతల తిరిగిపోతూవుంది! సోఫాలో జారగిలబడి కూచుంది. బల్లమీద ఇందాకటి గ్లాసులు, సీసాలు కనిపించాయి. బల్లచుట్టూ మెతుకులు, ఎముకుల ముక్కలు చిందర వందరగా పడిపోయివున్నాయి. మంజరి శరీరం రోమాంచితమయింది. ఓ గ్లాసును విసురుగా గోడకేసి కొట్టింది. ఫెళ్లుమని చప్పుడుతో, అది ముక్కలు ముక్కలయి, గాజుపెంకులు అంతటా చిందిపడ్డాయి.
"ఏమిటది?" అన్నాడు వెంకటేశ్వర్లు, ఓ చేతిమీద లేచి కూచ్చుని "గ్లాసు పగిలిందేం?"
మంజరి మాట్లాడలేదు.
"చెయ్యిగానీ తగిలిందా?"
"ఊఁ"
"టైమెంత?" అంటూనే వెంకటేశ్వర్లు తనవాచీని చూసుకొని 'అబ్బో' అన్నాడు.
"ఎంత?"
"ఒకటిన్నర"
"అబ్బా!"
అతను లేచాడు. చన్నీళ్ళలో జేబుగుడ్డను తడిపి, ముఖమంతా తుడుచుకొన్నాడు. రెండు మూడు దఫాలు పుక్కిలించాడు. మంజరిని కూడా అలా చెయ్యమన్నాడు. ఫోన్ చేసి బోయ్ తో రెండు స్ట్రాంగ్ టీ, బిల్లూ పంపమన్నాడు.
మళ్ళా నిశ్శబ్దం.
దూరంగావున్న కాటేజీల నుండి అప్పుడప్పుడు నవ్వులు, సోదాలు కొట్టిన చప్పుళ్ళు, ఇంగ్లీషు మాటలు, సన్నని సంగీతంలో కలసి వినిపిస్తున్నాయి మంజరికి మాట్లాడేందుకు కారణం దొరికింది.
తెల్లవార్లూ, ఇక్కడ ఇలానే జరుగుతుంటుందా? అన్నది మంజరి.
"ఆఁ! రాత్రింబవళ్ళు ఈ హోటల్ ఇంత బిజీగానూ వుంటుంది. మనమంటే పెందరాడే పోతున్నాం గానీ -అలా కాదులే మంజరీ! మరోసారి మనం కంప్లీట్ గా ఓ రాత్రల్లా ఎంజాయ్ చేద్దాం."
బోయ్ టీ కప్పులూ, బిల్లూ ఓ ట్రేలో పెట్టుకొచ్చాడు, బిల్లు డెబ్బై రెండు రూపాయలు చిల్లరయింది. వెంకటేశ్వర్లు డెబ్బయ్యయిదు రూపాయలిచ్చి 'టేకిట్' అన్నాడు.
"థాంక్యూ సార్, థాంక్యూ మేడమ్"
"నొ మెన్షన్" అన్నాడు వెంకటేశ్వర్లు.
మంజరికి 'నో' ఆనం అక్షరం మాత్రమే వినిపించింది. మిగతావి వినపడలేదు., అందుకని తనుకూడా "నో" అన్నముక్కను పెద్దగా అని, మిగతావాటిని దాదాపు ఏమీ వినిపించకుండా గొణిగింది.
కారు దగ్గరకు రావడం కష్టమయి పోయింది. వెంకటేశ్వర్లు ఆమెనడుం చుట్టూ చెయ్యి వేసి, మధ్య మధ్య వేళ్ళతో పొట్టమీద కితకితలు పెడుతూ కారుదగ్గరకు తీసుకొచ్చాడు. చాలాసేపు ఆరుబయట వుండడం చేత కారు స్టార్టు కాలేదు.
"ఏమయింది?" అన్నాది మంజరి.
వెంకటేశ్వర్లు పలకలేదు. మరోసారి ట్రయ్ చేశాడు. కాసేపు ఇంజన్ గిర్ గిర్ మని రొధపెట్టి, స్టార్టయింది. చల్లనిగాలి ముఖానికి తగిలాక, ప్రాణం తేరుకున్నట్లుగా వుంది. మంజరికి వెంకటేశ్వర్లు కారును విపరీతమైన వేగంతో నడుపుతున్నాడు.
"నిన్నింటిదగ్గర దిగబెట్టనా?" అన్నాడు వెంకటేశ్వర్లు గేరు మారుస్తూ.
"మరెక్కడన్నా పట్టుకుపోతారా?"
అతను నవ్వాడు.
"అడివిదున్న నువ్వే!" అనుకొంది మంజరి.
ఇంటికి చేరేసరికి రెండు గంటలయింది. దూరంగా సినిమా వీడియోలనుండి ఏదో పాట ముక్కలు ముక్కలుగా వినపడుతోంది. అది మినహాయిస్తే ఘనీభవించిపోయిన నిశ్శబ్దం.
అతను చీరెల పొట్లం అందించి చేయిచాపాడు. మంజరితను చేతినందించిది వేళ్ళు నలిగిపోయేలా ఓసారి గట్టిగా నొక్కి, అరచేతిలో గీరి, మరీ నవ్వాడు వెంకటేశ్వర్లు మంజరి మువ్వలు కదిలించినట్లు నవ్వింది.
కారెళ్ళిపోయింది.
"అమ్మయ్య! పీడా వదిలింది" అనుకొన్నది మంజరి అంతా అడవిదున్న తంతు. ఈ వేళ్ళు మరో వారం రోజులదాకా ఎందుకూ పనికిరావు.
వరండాలో కొచ్చేసరికి "అమ్మగారూ!" అంటూ తాయారు లేచి కూచున్నది.
మంజరి ప్రాణం గతుక్కుమన్నది లోపల చలపతి ఉంటే__
తాయారు లైటువేసింది.
"అయ్యగారు సందకాడ వోపాలి వొచ్చెల్లినారండీ! మల్లా షూటింగ్ కు ఎల్తామన్నారండీ! పొద్దుటగానీ, తిరిగి రామన్నారండీ!"
"బ్రతికించాడు" అనుకొంది మంజరి.
తలుపులు తీసుకొని గదిలో కొచ్చింది. వడగాల్పుల మధ్యవున్నట్లుగా ఫీలయింది మంజరి చీరెల సంచుల్ని కుర్చీల్లోకి గిరాటెట్టి మంచం మీద పడుకొంది. కాళ్ళజోడు కూడా విడవలేదు.
"అన్నం తినరా అమ్మాయిగారూ?" అన్నది తాయారు ఆవలిస్తూ.
"వొద్దే ఆకలిగా లేదు."
తాయారు ఇంకోసారి ఆవలించింది. మంజరి కాలిజోళ్ళు విప్పి మూలగా ఉంచి, మెడదాకా దుప్పటి కప్పింది.
"తలుపేసుకోండమ్మాయిగారు! నేనింటికెడతాను"
"వొద్దులే తాయారూ! ఈ రాత్రి నువ్వుకూడా ఇక్కడే పడుకో నాకీ పూట భయం భాయ్మగా వుంది. తలుపులన్నీ గట్టిగా వేసెయ్యి."
తాయారు గోడపక్కగా చెంగుపరుచుకొని పండుకొని మంజరికి సరిగ్గా పక్క కుదర్లేదు.

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra