ఆమె "బావున్నాను" అన్నట్టు చూసింది.
"నీ గురించి పత్రికల్లో చూస్తున్నాను విరాజి! చాలా మంది నోట వింటున్నాను. నువ్వెంత పైకి వచ్చావో నాకు తెలుసు. ఎంత సాధించావో నాకు తెలుసు. నాట్య రంగంలో నువ్వూ చేసిన, చేస్తోన్న ప్రయోగాలు అన్నీ గమనించాను నిన్ను చూస్తుంటే నాకెంతో సంతోషంగా వుండి విరాజీ!" అన్నాడు నాదముని.
విరాజి నవ్వింది. ఆ నవ్వులో పెదవుల కదలికల్లో ఓ కృతజ్ఞతా భావం వెల్లివిరిసింది.
"మీ నవల గాయం చదువుతున్నాను. మీరు ఊళ్ళోకి వచ్చారని తెలీదు. ఎక్కడో వుండి రాసి పంపిస్తారనుకున్నాను. నిన్ననే తెలిసింది, తిరిగి వచ్చారని కాసేపాగి.
"ఎన్ని ఊళ్ళుతిరిగినా, ఎంత దూరం ప్రయాణం చేసిన మనిషి తన నుంచి తాను పారిపోలేడనీ , తప్పించుకోలేడనీ తెలుసుకుని తిరిగి వచ్చేశాను విరాజీ."
"మనం ఎక్కడకు వెడతాం? వెళ్ళగలం దూరంగా వెళ్ళిన కొద్దీ మనకు మనం దగ్గరవుతూ వుంటాం" అంది విరాజీ.
ఇందాక ఆమెను లోపలకు తీసుకొచ్చిన కుర్రాడు రెండు కప్పుల్లో కాఫీ తీసుకొచ్చి యిద్దరి ముందూ పెట్టాడు.
"తీసుకో విరాజీ"
ఆమె కాఫీ త్రాగుతూ "మీ నవల చదువుతున్నాను. ఇన్నాళ్ళకి, తిరిగి యిన్ని సంవత్సరాల తర్వాత ఓ గొప్ప నవల చదువుటున్నానన్న అనుభూతి కలిగింది" అన్నది.
"ఆ నవల యితరులకు నచ్చటం వేరు, నీలాంటి కళామూర్తి నుంచి అభినందన పొందటం నాకు చాలా సంతోషం కలిగించింది." అన్నాడు నాదముని.
కొన్ని క్షణాలు మౌనంగా గడిచాయి.
ఇఇద్దరి మనస్సులో త్రిపుర నాట్యం చేస్తోంది. త్రిపురను ప్రపంచం గర్వించే నర్తకిని ఎన్నో కళలు కన్నాడు తన ఊహస్వప్నాలు త్రిపురలో చూసుకోవాలని ఎంతో ఊవ్విళ్ళూరాడు, కాని .....
విరాజికి వెనక ఎంతో ఆవేదన వుంది. తాను కళలు గన్నసంవత్సరాల తరబడి నిరీక్షించిన సాహిత్యం అతన్లోంచి పొంగిపొర్లుతోంది. "నిజమైన సాహిత్యమంటే యిదీ" అని నిర్వచిమ్చాగల రచయితా యీ నాటికి రూపొందగలిగాడు.
అలాగే ఓ అపురూప, ఆదర్శ నాట్య మయూరిని ఆమెలో సందర్శించాగలుగుతున్నడతను.
ప్రపంచానికి రెండు వరాలు ప్రసాదించ బదినట్లయింది.
"వచ్చే ఆదివారం రవీంద్ర భారతిలో నా ఆత్య ప్రదర్శన వుండి. తప్పకుండా రావాలి." అంది విరాజి.
కొంత సేపటికి ఆమె లేచి వెళ్ళిపోతుంటే గేటు దాకా వచ్చి __ ఆమె ఎక్కినా కారు కనుమరుగై పోయేవరకూ అలా చూస్తూ నిలబడ్డారు.
అతని మనసులో విచ్చుకుంటోన్న నూతన యితివృత్తానికి ఓ రూపం ఏర్పడుతున్నట్లయింది.
* * * *
రాత్రి పదకొండు గంటలకు గౌతం నిద్రపట్టక కారేసుకుని బయటకు బయల్దేరాడు.
ఆ రోజు గెస్ట్ హౌస్ లో విరాజిని కలుసుకున్నప్పటికి నుంచీ అతనికి మరీ అస్థిమితంగా వున్నది. తనను పోగొట్టుకోవటమే కాకుండా విరాజిని కూడా దారుణంగా పోగొట్టుకుంటున్నాడు. తానేక్కడికి కొట్టుకు పోతున్నాడో ఏమీ తెలియటం లేదు.
ఈ సినిమా వేషాల పరిస్థితి మరీ విషమంగా వుంది తనదంటూ ఓ ఆరోగ్యకరమైన యిమేజ్ సృష్టించుకుండామంటే ఇక్కడా కుదరటం లేదు. అడుగడుక్కీ పోటీ, ఎప్పుడూ తొలుచుకు తినేసి కాంప్లెక్స్ , వీటికి స్టెప్స్ , డ్యూయిట్స్ , ఫైట్స్ డ్రీం సీన్స్, మారువేషాలు వెయ్యటం __ యివన్నీ తప్పటం లేదు. కాదంటే తాను తెర మరుగైపోయే ప్రమాదం అనుక్షణం తొంగిచూస్తూనే వుంది.
పోటీ _ పోటీ _ పోటీ .
ఈ పోటీలో నిలబడటం కోసం ప్రమాదకరమైన దోరణులకు లొంగి పోవటం __ తన జీవితానికీ శాపం తప్పదా?
అతనికి మంచి టీ త్రాగాలనిపించింది. కారుని వరదరాజు టీకొట్టు వైపు పోనిచ్చాడు.
కారు రోడ్డుకు అటు ప్రక్క నిలిపి బయటకు దిగబోతుంటే, అతన్ని చూసి వరదరాజే గబగబా పరుగెత్తుకు వచ్చాడు.
"మీరు క్రిందికి దిగకండి బాబుగారూ. మీరిప్పుడు పూర్వంలా కాదు. సినిమాస్టార్ . జనం మిమ్మల్ని గుర్తు పట్టారంటే ఊపిరాడనివ్వరు" అంటూ వారించాడు.
"నేను యితరులకు స్టార్ నే కావచ్చు. నీకు మాత్రం ఎప్పటికప్పుడు డబ్బులు తడుముకుని, ఎంత దూరమైనా నడిచివచ్చి టీ తాగివెళ్ళే పాత గౌతంనే వరదరాజూ " అన్నాడు.
వరదరాజు కళ్ళు చమర్చాయి. "మీ అభిమానం నాకు తెలుసు బాబుగారూ" అన్నాడు. అతని గొంతు కొంచం వణికినట్లయింది.
"ఉండండి బాబుగారూ టీ కలుపుకోస్తాను" అంటూ కొట్టు దగ్గరకు వెళ్ళి రెండు నిమిషాల్లో టీ కప్పుతో తిరిగివచ్చాడు.
టీ త్రాగుతుంటే ప్రాణం లేచి వచ్చినట్లయింది.
"వరదరాజూ! నా సినిమాలేమయినా చూస్తున్నావా?" అనడిగాడు.
"లేదు బాబుగారూ. ప్రొద్దుట అయిదు గంటలకు టీషాపు తెరుస్తాను. రాత్రి పన్నెండు గంటలదాకా ఊపిరి సలపదు. నాకు గల్లాపెట్టె దగ్గర నేను తప్ప యింకొరు కూచోటానికి ఆస్కారంలేదు అదీగాక సినిమా లంటే నా కంత యింటరెస్ట్ లేదు బాబుగారూ!
గ్లామర్ అనేపదానికి ఎంత విశిష్టత వున్నా దాని ఉనుకిని గురించి పట్టించుకుని కొందరు వ్యక్తులు అక్కడక్కడా తారసపడటం విచిత్రమే కాకుండా మీదకు సవాలు విసిరేసినట్లయింది.
ఆ ప్రయత్నంగా టీషాపు వైపు చూశాడు. కొన్ని సంవత్సరాల క్రితం ఎలా వున్నదో ఎదుగూ బొదుగూ లేకుండా అలాగే వున్నది.
"వరదరాజూ! నువ్వేమీ అనుకోకపోతే నీకెంత కావాలంటే అంత డబ్బు సహాయం చేస్తాను. నీ టీ షాపును పెద్ద హొటలుగా మార్చి వెయ్యకూడదూ?" అన్నాడు గౌతం.
వరదరాజు నవ్వాడు. "ఎందుకు బాబుగారూ నన్నిలాగే వుండనివ్వండి. దీన్ని పెద్దది చేసుకునే కొద్దీ దాని ఎదుగుదలతో నేను ఉక్కిరి బిక్కిరి అవుతూంటాను. నా మనసు తట్టుకోలేని, దానితో అది పెట్టె కొత్త కొత్త సమస్యలతో అనుక్షణం కుస్తిపడుతూ వుండాలి. ఎంతో మందికి సంజాయిషికీ యిచ్చుకునే స్థితిలో నన్ను నేను పెట్టుకోవాలి. నాడి కాని జీవితం జీవించాలంటే భయమేస్తుంది. బాబుగారూ!
గౌతమ్ అతని వంక ఆశ్చర్యంగా చూశాడు. ఒక సామాన్యుడికి అవగాహన అయిన సత్యాన్ని తాను క్షణం క్షణం ఎందుకుదూరం చేసుకుంటున్నాడు. తనదికాని, ప్రేమపూర్వకం కాని, ఇష్టంలేని జీవితంలోకి ఎందుకు దూరిపోతున్నాడు.
కారులో కూర్చున్నది ప్రఖ్యాత సినిమా నటుడు గౌతమ్ అని గుర్తు పట్టి జనం చుట్టు గుమిగూడసాగారు.
"బాబుగారూ వీళ్ళు మిమ్మల్ని గుర్తుపట్టేశారు. ఇంకో అయిదు నిముషలంటే యీ సమయం కాని సమయంలో కూడా రోడ్డంతా జనంతో నిండిపోతుంది. ఇహ వెళ్ళిపొండి బాబుగారు" అన్నాడు వరదరాజు టీ కప్పు అందుకుంటూ.
గౌతమ్ నిట్టూర్పి కారుస్టార్టు చేశాడు.
* * * *
టి. వి. లో విరాజి యిచ్చిన ప్రదర్శనకు అద్భుతమైన రెస్పాన్స్ రావటం చేత ఢిల్లీ నుంచి టి.వి. కేంద్రం వాళ్ళు ఆమెనాహ్వనించి అఖిల భారత స్థాయిలో టి.వి. పోగ్రాం ఇప్పించారు. దాంతో ఆమె పేరు దేశమంతా మార్మోగిపోయింది.చాలా రాష్ట్రాల నుంచి ఆమెను ప్రదర్శనల నివ్వమని ఆహ్వాన పరంపరలు వస్తున్నాయి. ఆమెకు క్షణం ఊపిరి సలపటంలేదు.
ఇన్ని పోగ్రాంల మధ్య హైదరాబాదు రవీంద్రభారతిలో నృత్య ప్రదర్శన ఏర్పాటు చేసుకుంది. అది అమె క్రొత్తగా కూర్చుకున్న బ్యాలే. తన శక్తినంతా ధారపోసి తయారుచేసింది.
ఆడిటోరియమంతా ప్రేక్షకులతో కిటకిటలాడుపోతుంది.
ప్రదర్శనకు నాదమునివచ్చాడు. గౌతమ్ కూడా వచ్చాడు. నాదముని గౌతమ్ ని చూడలేదు గౌతమ్ చూశాడు గాని కొంచెం దూరంగా కూర్చివటం చేత పలకరించడానికి వీల్లేకపోయింది.
పోగ్రాం మొదలయింది.
గౌతమ్ కన్నార్పకుండా చూస్తున్నాడు. విరాజి. తన విరాజి. తనని తీర్చిదిద్దడానికి అహొరాత్రులుశ్రమించిన విరాజి పరుగుపందెంలో తనతో పోటీపడిన విరాజి. తనకు అందని ఎత్తులకు , ఆకాశపధంలోకి వెళ్ళిపోయింది. ఆమె ముందు తాను ఎంత అనిపించింది . తన అల్పత్వం కళ్ళముందు సాక్షాత్కరించినట్లయింది.
ప్రేక్షకులు మంత్ర ముగ్దులైనట్లు, అతి నిశ్సబ్దంగా చూస్తున్నారు. అందరూ ఓ తన్మయావస్థలో లీనవైపున్నట్లుఎంత అనుభూతి!


