సుధ తొణకలేదు. అతనివంక తిరస్కారంగా చూసింది. "పరిచితులమాట కాదు నేను చెప్పేది మూర్తిగారూ! హృదయాలు యిచ్చిపుచ్చు కున్న వారిమాట. దురదృష్టవశాత్తూ ఆనాడు మీ యిద్దరి మాటలూ బయటనుండి వినటం తటస్థించింది. దురదృష్ట మేమిటిలెండి. అదృష్టమే అనుకుంటున్నాను. ఆనాటి మీ అరుపులూ, పెడబొబ్బలూ, ఆక్రందనా, క్షమాపణలూ....అదంతా పరిచయస్తులతో చేసేపని అని నేననుకొను మూర్తి గారూ! అదే సంభాషణ నాకూ మరో యువకుడికి మధ్య జరుగుతూ వుండటం మీరు చూడటం తటస్థిస్తే కొద్ది పరిచయమని మీ రానుకుంటారేమో తెలీదు" అంది.
"అయితే ఆనాడు మా ఇద్దరిమధ్యా జరిగినా సంభాషణ తా మీరు విన్నారన్నమాట."
"అవును, మిమ్మల్ని చూద్దామని వచ్చి లోపలినుండి వినబడుతున్న మాటలు విని గుమ్మం యివతలే ఆగిపోయాను. అంతా గ్రహించాను."
సత్యమూర్తి ఆవేశంతో "మీరేమీ గ్రహించలేదు. అది అర్ధంలేని, నా కెప్పటికీ అర్ధంకాని వెర్రి కలాపం. ఆమెను నేనే విధంగానూ ప్రలోభ పర్చలేదు. ఎట్టి ప్రమాణాలు చెయ్యలేదు. నేనమాయకుడ్ని, మొహమాటస్తుడ్నీ కావటంవల్ల సరియైన సమాధానం ఇవ్వలేక నన్ను నేను వంచించుకోవటం జరిగింది. కాని అది యదార్ధంకాదు సుధా! పెద్ద భ్రమ. తొందరలోనే ఆ భ్రమను తొలగించుకొని బయటపడ్డాను. సుధా! మీరు నన్ను అనుమానించకండి. నేను మోసగాడ్నికాదు, నేను ఎవరికి అన్యాయం తలపెట్టలేదు ప్రస్తుతం నా జీవితంలో జరుగుతున్నది సరియైన యదార్ధం. నేను డబుల్ గేమ్ ఆడటంలేదు. ఇలా నన్ను శంకించి యింకా స్థిమితము లేకుండా చెయ్యకండి సుధా!" అని ఆమెవంక ప్రాధేయపూర్వకంగా చూడసాగాడు.
సుధ ఓ సుష్కహాసం చేసింది. అట్లా నవ్వినప్పుడు ఆమె లేత చిగుళ్ళు బయటపడి విషాదంతో కూడిన ఓ రకమైన శోభను కలుగచేసినాయి.
"మూర్తిగారూ!" అంది అతని కళ్ళమీద కళ్ళు నిల్పి, "మీరు ఒకానొకనాడు ఈ గదిలోనే చెయ్యిపట్టుకున్నంత ఉద్రిక్తదశలో ఉషను ఏ రోజూ తాకకపోయి వుండవచ్చు మనం సముద్రంలో షికారు పోయినప్పుడు నా భుజంచుట్టూ చెయ్యి పోనిచ్చినట్లుగా- ఆమెకు చేసివుండకపోవచ్చు. అంతమాత్రంచేత అది యదార్ధం కాదనీ కేవలం భ్రమ అనీ నే ననుకోవటం లేదు. కన్నీళ్ళూ, క్షమాపణలూ కారణం లేకుండా జారిపడవు. మీరు మోసగాళ్లని నేను నిందించటం లేదు మన యిద్దరిమధ్యా జరిగింది యదార్ధమే కావచ్చు. కాని ఒక యదార్ధం వచ్చి మరో యదార్ధాన్ని ఎగరగొట్టలేదు కదా. అలా జరిగే పక్షంలో కొన్నాళ్ళకు మరో యదార్ధం వచ్చి దీన్ని ఎగరగొట్టవచ్చు సత్యానికి హద్దు ఎక్కడ చెప్పండి" అంది.
నన్ను హింసించకు సుధా! నన్ను హింసించకు" అని సత్యమూర్తి ఆర్తనాదం చేశాడు. "ఇన్ని మలుపులు, మార్పులూ, అవాంతరాలు నేను భరించలేను. ఒప్పుకుంటాను. తప్పటడుగులు వేశాను. తెలివిమాలి ప్రవర్తించాను సుధా! నన్ను అన్యాయం చెయ్యకండి. నాకిప్పుడు ప్రపంచములో ఎవరూలేరు. ఏకాకిని, దిక్కు తెలియని పక్షిని. నా ఆశలన్నీ మీమీద నిల్పుకున్నాను అవి అడియాశలు చేయకండి. జీవితం సగంలో విరిగిపోతే, విరిగిన నడుంతో ఎలా గడపను? ఎలా బ్రతకను?"
అతని కళ్ళనుండి నీళ్ళు కారుతున్నాయి. ఏడుపు నాపుకోలేక పోతున్నాడు.
ఆమె చాలా సేపటివరకూ ఏమీ మాట్లాడలేదు. తలవంచుకుని తీవ్రంగా ఆలోచిస్తున్నట్లు నిశ్శబ్దంగా కూర్చుంది.
బావురుమనే నిశ్శబ్దం గుండెల్ని తొలిచే నిశ్శబ్దం.
ఆఖరికి ఆమె తల ఎత్తింది ముఖంలో ఎలాంటి తీవ్రతగాని, దుఃఖంగానీ ప్రస్పుటం కావటంలేదు. "మూర్తిగారు" అంది గంభీర కంఠముతో. "మీ మనసు కష్టపెడుతున్నట్లయితే నన్ను క్షమించండి. మానవ మాతృరాలిని నాలోనూ అనేక బలహీనతలుంటాయి. నాన్నగారి దుర్మరణంతో నాకు ఏ విషయం మీదనైనా యిచ్చ నశించి పోయింది. నా కిప్పుడు ఐహిక విషయాలమీద ఏ విధమైన ఆసక్తిలేదు. ఏ కారణం వల్ల ఆత్మహత్య చేసుకోలేకపోయానో తెలియటంలేదు. కాని యిహ జీవితంలో ఎలాంటి బంధం వుండటం మాత్రం కల్ల. నాకు నిర్మల జీవితంకావాలి. పవిత్ర జీవితం కావాలి. స్వార్ధం, స్వసుఖం, బంధాలు నన్ను స్పర్శించ కూడదు. నా రక్తం గడ్డకట్టుకుపోయింది. శిలనైనాను. ఈ గడ్డకట్టిన రక్తాన్ని, కఠిన శిలను మీరేమి చేసుకుంటారు? నన్ను మరిచిపోండి. మీరు ఏకాకి ఎందుకౌతారు? ఏమికారు. మీ జీవితంలో అనేక యదార్దాలు వుండవచ్చుగాని, ఉషకు మాత్రం ఒకటే ఒక్క యదార్ధమని నా విశ్వాసం ఆమె దగ్గరకు వెళ్ళండి. స్వీకరించకపోదు. దయవుంచి నా మాట వినండి మూర్తిగారూ!"
"సుధా! సుధా!! ఇలాంటి కఠినశాసనం విధించకంది మిమ్మల్ని విడిచి నేను బ్రతకలేను. నేను మీమాట వినేటట్లు చేయకండి, మనిద్దరి మధ్యా ఇలాంటి సంభాషణ జరుగుతుందని నేను కల్లోకూడా అనుకోలేదు. మీ దగ్గర్నుండి ఇలాంటి కఠినమైన వాక్కుల్ని వినాల్సివస్తుందనీ, విధి ఇట్లా తిరుగబడుతుందనీ ఎప్పుడూ ఊహించలేదు నిజమేనా నిజమేనా అనిపిస్తోంది ఇది కల...పీడకల...నిజం కాకూడదు. జరగటానికి వీల్లేదు. మీరు నాకు కావాలి అంతే."


