సత్యమూర్తి వీసమెత్తు అయినా చలించలేదు. ఆ మాటలన్నీ తనని కాదన్నట్లుగా నిర్లక్ష్యంగా చూస్తూ నిలబడ్డాడు. ఎప్పుడు అక్కడ్నుంచి వెళ్ళి పోతారా అని ఎదురు చూస్తున్నాడు. వాళ్ళు అంటూన్న కొద్దీ మరీ మొండికెత్తాడు.
అరిచినా, గీపెట్టినా, ప్రగల్భాలు పలికినా, బెదిరించినా ఏమీ ప్రయోజనం కనబడకపోయేసరికి తండ్రీ కొడుకులు విసిగిపొయ్యారు. "సరే యిప్పటికి వెడుతున్నాం. అయినా తప్పించుకున్నావనుకోకు. కన్న కొడుకునైనా సరే. నన్నన్యాయంచేసిన వాడిని నేను ఎన్నటికీ క్షమించను. చూస్తాను ఎలా గియ్యవో. పదరా రామ్మూర్తి. ఈ ముదనష్టపు యింట్లో యిహ క్షణమైనా వుండోద్దు. పద! సామానులు సర్దు, వెంటనే బయల్దేరుదాము" అని కొడుకుని రెక్కపుచ్చుకుని బరబర అవతలకు యీడ్చుకు వెళ్ళాడు.
మరో గంటసేపటిలో ఎన్నో నెలలనుంచీ ఆ యింటిలో స్థిరనివాసం ఏర్పరచుకుని జీవించిన ఆ తండ్రీ కొడుకులిద్దరూ తట్టా బుట్టా సర్దుకుని సామానంతా బండిమీద వేసుకుని ఆ యింటిని విడిచి వెళ్ళిపోయారు. ఒక సుఖమయిన హక్కును కోల్పోతున్నట్లు మనస్సులో యిరువురికీ బాధగానే వుంది. వెలితిగా ఉంది. కానీ ఏం చెయ్యటం? విధి అంటారే అది యిక్కడ సాక్షాత్కరించిదయ్యె.
తుఫాన్ వెలిసినట్లయింది. ఆ మేడ పై భాగమంతా హఠాత్తుగా ప్రశాంతంగా అయిపోయింది.
క్రింద అద్దెకుంటూన్న వివిధ భాగాల్లోని వారు తెగ గుసగుసలాడాడు కుంటున్నారు.
మేడమీద వసారాలో పిట్టగోడ దగ్గర అచేతనంగా నిలబడి బయటికి చూస్తున్నాడు సత్యమూర్తి. అతని కనుకొలకుల్లో నీళ్ళు నిలిచాయి. కన్న తండ్రి....! సొంత అన్న! డబ్బు దగ్గరకు వచ్చేసరికి ఎంత నీచంగా ప్రవర్తించారు? వాళ్ళమాటలు పచ్చి అబద్దాలని అతనికి తెలుసు అందుకే వాళ్ళంటే పరమ అసహ్యంవేసింది. అందుకే అంత మొండికెత్తాడు. పరిస్థితి విషమించాక వాళ్ళింక ఈ ఇంటిలో వుండకూడదు.
ఏమి కోపం! ఏమి మనుషులు! డబ్బుకోసం మనుషులు ఎలా గడ్డి తింటారు? బంధాలు లేవు. రక్తసంబంధాలు లేవు వాత్సల్యాలు లేవు. అభిమానాలు లేవు.
స్వార్ధం! భయంకరమయిన స్వార్ధం!
స్వార్ధమే మనిషిని పరిపాలిస్తోంది. స్వార్ధమే కుటుంబాన్ని పరిపాలిస్తోంది. స్వార్ధమే దేశాన్ని పరిపాలిస్తోంది. స్వార్ధమే ప్రపంచాన్ని పరిపాలిస్తోంది.
తలనొప్పితో అతని కణతలు పగిలిపోతున్నాయి. "అబ్బ!" అనుకుంటూ వెనక్కి తిరిగాడు.
వంటవాడుకూడా ఇంటిలో లేడు. తను ఒక్కడే...వున్నా మెదులుతున్నాడు ఆ విశాలమయిన పై అంతస్థులో.
మెల్లగా కదిలి ఒక్కొక్క అడుగే వేసుకుంటూ మేడనంతా కలియతిరుగుతున్నాడు. బావురుమంటోంది యిల్లు. ఒక్కో గదిలోకి వెళ్ళి చూస్తున్నాడు. విశాలమయిన ఆ గదులన్నీ వట్టిపోయి, కళావిహీనంగా, కనతి విహీనంగా కనబడుతున్నాయి. గుండెల్ని చీల్చే నిశ్శబ్దం. ఆ నిశ్శబ్దం అతనికి ఏదో బోధిస్తోంది. "నువ్వొక్కడివీ యిందులో ఏం బావుకుంటావు చెప్పు ఇదిగో నీమేడ. ఇదిగో నీ ఆస్తి. ఇదిగో నీ యినప్పెట్టె. ఇవిగో పొత్తులబొమ్మలనోట్లు. దస్తావేజులు, ఏం అనుభవిస్తావో అనుభవించు." అని ఏదో అజ్ఞాత స్వరం గ్రుచ్చిగ్రుచ్చి ప్రశ్నిస్తూ సవాలుచేస్తోంది.
అతనా నిశ్చల నీరవ ఏకాంతాన్ని భరించలేకపోయాడు. హఠాత్తుగా అతనికి విపరీతమయిన భయోద్వేగం కలిగింది. శరీరంలోని రక్తమంతా గడ్డకట్టిపోయినట్లయింది.
"అమ్మో నే నొక్కడ్నే ఈ స్మశానంలో వుండలేను....వుండలేను" అని లోలోన ఒక్కగావుకేకవేసి, గబగబ తాళమెక్కడుందో వెదికి యివతలకు వచ్చి తలుపువేసి గొళ్ళానికి తాళంపెట్టాడు. త్వరత్వరగా మెట్లుదిగి, గేటు తీసుకుని బయటపడి రోడ్డుమీద తొందరగా నడిచి వెళ్ళిపోసాగాడు.
27
అద్దాని కెదురుగా జుట్టు విరియబోసుకుని దెయ్యంలా నిలబడి తన ముఖం తాను విచిత్రంగా చూసుకుంటోంది సుధ.
మనిషి సగమయిపోయింది. చెక్కిళ్ళు లోపలికి పోయి, కన్నులు కాంతిని కోల్పోయి, ముఖమంతా కళావిహీనంగా వుంది. కళ్ళచుట్టూ నల్లగీతలు ఏర్పడ్డాయి.
సుధ ముఖాన బొట్టుకూడా పెట్టుకోలేదు. తనని గురించి ఆమె ఏమీ శ్రద్ధలు తీసుకోనట్లు వేసుకున్న దుస్తులుకూడా నలిగి, మాసివున్నాయి.
మెట్లమీద అడుగుల చప్పుడయింది. సుధ ఉలికిపడి గుమ్మంవైపు చూసింది తలుపులు గడియ వేసిలేదు. ఎవరో పైకి వస్తున్నారు పనివాడేమో? ఎవరయినాకాని గడియ పెట్టేద్దామని త్వరత్వరగా ద్వారంవేపుకు పరుగెత్తింది. కాని అప్పటికే ఆలస్యమయిపోయింది ఆమె గడియమీద చేయి వేసేలోపునే, దభాలున బయటనుంచి ఎవరో తలుపుతోశారు. ఆమె నిశ్చేష్టితయై నిలబడిపోయింది. ఎదురుగా సత్యమూర్తి.


