ఫోన్ పెట్టేసిన వెంటనే ప్రసూనతో "ఎలాంటి పరిస్థితుల్లోనూ ఆ ఫోన్ కాల్ నువ్వు రిసీవ్ చేసుకోకు!" అన్నాడు.
"మీరు పడుకున్నారని...." నసిగింది ప్రసూన.
"ఫర్వాలేదు. లేపు!"
అప్పటికప్పుడు బయటకు వెళ్ళడానికి తయారయ్యాడు సాంబశివం.
"నేనూ వస్తాను!" అంది ప్రసూన
ఆలోచించిన కొద్దీ ప్రసూనకు వంద, పది, అయిదు దొంగ నోట్లకు సంబంధించినవని అనుమానం కలగసాగింది.
"నువ్వు రావద్దు. నేనే వెళ్ళి వస్తాను."
"నామీద మీకు ఆ మాత్రం నమ్మకం లేదా?"
బ్రతిమాలుతున్నట్లుగా అడిగింది.
"నమ్మకం సంగతి కాదు___ఇవన్నీ ప్రమాదకరమైన విషయాలు!"
"ఫరవాలేదు!"
"అహ! అలా వీల్లేదు! నిన్ను తీసుకెళ్ళను!"
"సరే అయితే! నేనసలు ఇక్కడ ఉండను! వెళ్ళి పోతాను." కోపంగా వెళ్ళిపోబోయింది ప్రసూన.
ఒక్కసారి నీరయిపోయాడు సాంబశివం.
'ప్లీజ్ వెళ్ళిపోకు ప్రసూనా! సరే! పోనీ, రా' అన్నాడు.
అప్పటి సాంబశివం ముఖం చూస్తుంటే కడుపులో దేవినట్లయింది, ప్రసూనకు. తన కోసం ఎలాంటి పని అయినా చేసే లాగా ఉన్నాడు. ఆ అభిమానాన్ని ఇలా వినియోగించుకోవడం న్యాయమేనా? ఒక్క క్షణం తనంటే తనకే అసహ్యం కలిగింది ప్రసూనకు. అంతలోనే ఆ ఆలోచన లన్నీ బలవంతాన ప్రక్కకు నెట్టి సాంబశివం తో బయలు దేరింది.
సాంబశివం కారు గమ్యస్థానానికి దూరంగా మైదానంలో ఆగింది. అక్కడ కారు పార్కుచేసి "ప్రసూనా దిగు! మనం కొంచెం దూరం నడవాలి!" అన్నాడు.
సాంబశివం, ప్రసూనా నడుస్తూ తాళం పెట్టి ఉన్న రాజకీయ నాయకుడి ఇంటికి వచ్చారు. వెనుకవైపు నుండి సర్వెంట్ క్వార్టర్స్ లోకి వచ్చారు.
ఆ గదిలో గోడకున్న అలమారు తన తాళంతో తీశాడు సాంబశివం. ఆ లోపల మరొక తలుపు పైకి బల్ల చెక్కలా కనిపిస్తూ ఉంది. అధి కూడా తాళంతో తీశాడు. అక్కడి నుండి లోపల ఇంటికి దారి ఉంది. సాంబశివంతో కలిసి ఆ ఇంట్లోకి వెళ్ళిన ప్రసూన అనుమానం రూఢి అయిపోయింది. బయటి నుండి తాళం పెట్టిఉన్న ఆ ఇంటిలోపల దొంగ నోట్ల ముద్రణ జరుగుతోంది. అక్కడున్న ప్రతి ఒక్కరూ ప్రసూనను చూడగానే గతుక్కుమన్నారు.
"ఫర్వాలేదు. మనలో మనిషి!" ఆజ్ఞాపిస్తున్నట్లే అన్నాడు సాంబశివం. గదిలోంచి బయటికి వచ్చిన మరుక్షణం సాంబశివం 'సింహం' అయిపోతాడు.
వారిలో ఒకతను ఎప్పుడూ బైనాక్యులర్ తో పరిసరాలు గమినిస్తోనే ఉంటాడు. మరొకచోట అవసరమైతే ఇల్లు మొత్తం నాశనం చేయడానికి బాంబులు రెడీగా ఉన్నాయి. ఆ ఇంట్లో వ్యక్తులు మాత్రం సర్వెంట్ క్వార్టర్స్ లోంచి గానీ లేదా మరొక తలుపు లోపలి నుంచి తెరుచుకుని గానీ బయట పడవచ్చును.
తన రిస్ట్ వాచ్ లోని టేప్ రికార్డర్ ఆన్ చేసింది ప్రసూన......పైట పిన్నులో ఉన్నది ఆటోమేటిక్ కెమెరా! ఆన్ చేస్తే చాలు. ఫిల్మ్ అయిపోయే వరకూ ఫోటోలు తీస్తుంది. అదికూడా ఆన్ చేసింది.
దగ్గిర దగ్గిర అరగంట వరకూ అక్కడే ఉన్నాడు సాంబశివం. ఆ తరువాత ప్రసూనతో కలిసి బయలుదేరాడు.
దారిలో అన్నాడు:
"నేను ఇవ్వాళ నిన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చానో తెలుసా?"
"నామాట కాదనలేక........"
"అదొక్కటే కాదు. తలుచుకుంటే ఎలాగో నిన్ను మరిపించగలను. నా తరువాత ఈవ్యాపారానికి నిన్ను వారసురాలిని చెయ్యాలనుకుంటున్నాను. ఇదంతా నువ్వు నెమ్మది నెమ్మదిగా నేర్చుకోవాలి!"
గతుక్కుమంది ప్రసూన. ఈ సంఘ ద్రోహాన్ని ఇతడు తర తరాలకు కొనసాగింఛా లనుకుంటున్నాడు. తన తరువాత వారసులను ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నాడు.
కానీ.....సాంబశివం తనకు సమస్తమూ ఇయ్యాలనుకుంటున్నాడు. తను అతనిని సర్వనాశనం చెయ్యబోతోంది.
సంఘర్షణతో దహించుకుపోతూ జాలిగా సాంబశివం చేతిమీద చేయివేసింది. సాంబశివం ముఖంలో కోటి వెలుగులు కనిపించాయి.
"సూనా! నీకు తెలుసా! స్పర్శ సంభాషిస్తుంది. నీ స్పర్శలో నాకు నీ మనస్సులో అభిమానం అర్ధమవుతోంది." అన్నాడు.
ప్రసూన సిగ్గుపడి ముఖం తిప్పుకుంది.
ఇద్దరూ ఇంటికి చేరుకునే సరికి హరి ఎదురు చూస్తూ కూచుని ఉన్నాడు.
అతడిని చూడగానే సాంబశివం ముఖం కఠినంగా మారిపోయింది.
"ఎందుకొచ్చావ్?"
"ఎందుకేమిటి? నా కూతుర్ని నేను తీసుకుపోదామని వచ్చాను!"
"వీల్లేదు!"
"నువ్వెవడివి వీల్లేదనడానికి? పెళ్ళికాని పిల్లని పరాయి ఇంట్లో ఎంత కాలం ఉంచను? నాకు పరువు నష్టం కాదూ?"


