"ఏమిటా పుస్తకం"
"ఏదో నవల"
"బాగుందా నవల చదువుతూ ఉంటే!"
"ఏమిటోగా వుంది"
"ఏమిటది -?"
"వీళ్ళు యీ రచన ఎందుకు చేశారా అన్పిస్తోంది"
"ఇంకా"
"రచన చేసిన వాళ్ళకి ఒకలక్ష్యం అంటూలేదు"
"అంటే - ?"
"రచన చేసిన వాళ్ళకి నా పుస్తకం చదివిన వాళ్ళకి ఏదైనా క్రొత్త సంగతి తెలియాలి అన్న తపనలేదు"
"కధ ఏమిటి?" అన ఆసక్తిగా అడిగాను.
"ఒక అమ్మాయి ఒక అబ్బాయి కలసి విడిపోయారు. మళ్ళీ కలిశారు. కధ అయిపోయింది" అంటూ తేలికగా నవ్వేసింది మిస్ మార్లిన్.
అదివిని రాజమాత గాయత్రీదేవి నవ్వింది.
"యీ రోజు మీప్రోగ్రాం ఏమిటి?" అని అడిగాను.
"బైటకు ఎక్కడి కయినా వెళ్ళాలని ఉంది"
"విజయనగరం పోదామా?"
"ఓ ఎస్." ఆమె సమాధానం విన్నాక నేను రాజమాత వంక చూచాను.
"తిరగటం నేర్చిన వాళ్ళకి యింట్లో ఉండాలంటే కట్టివేసినట్లుగా ఉంటుంది" అన్నారు రాజమాత మిస్ మార్లిన్ వంక చూస్తూ.
"సరేవెళ్ళి రండి తోడు అవుసరం అయితే... ..."
"మీరూ వెళ్ళిరండి" అన్నారు రాజమాత మిస్ మార్లిన్ వెంటనేను తప్పని సరిగా పోతున్నట్లు ఆమెకు తెలియ నివ్వకూడదు.
విజయనగరం బయలుదేరాం. డ్రైవర్ని వొద్దని చెప్పింది మిస్. మార్లిన్.
"నాకు డ్రైవింగ్ రాదు?" అని చెప్పాను.
"డ్రైవింగ్ రాదా!" అని చిత్రంగా నావంకచూచింది ఆమె.
"సైకిలు తొక్కటం వచ్చు" అని నా సమాధానం.
"కారు నడపడం రాదా?"
"విమానం నడపడం కూడా రాదూ" అన్నాను నవ్వుతూ.
"పారాచూట్ తో దూకటం వచ్చునా పోనీ...." అని అడిగింది "తల్లీ నువ్వు ఏ దేవ;లోకంనించో దిగివచ్చిన తెల్ల దొరసానిని. దూకడం సంగతి అట్లా ఉంచి సినిమాలలోనూ, పుస్తకాల్లో బొమ్మల్లోనూ తప్ప న్నెఉ దాన్ని కంటితో చూడనుకూడాలేదు. యిదేం పారిస్ అనుకుంటున్నావా లండన్ అనుకుంటున్నావా? యింటికొక కారూ! వీధికోక హెలికాఫ్టర్ ఉండడానికి-?" అనుకున్నాను. మిస్ మార్లిన్ కారు నడుపుతోంది ఆమె కారు నడిపే వేగానికి ప్రాణాలు అరిచేతుల్లో పెట్టుకుని కూర్చున్నాను. అవుసరమయినప్పుడు దారి అడుగుతోంది.
విజయనగరంలో మహారాజ కాలేజిముందు కారు ఆగింది. అక్కడ నించి కోట బంకుల్ దిబ్బ, గురజాడ అప్పారావుగారి యిల్లూ చూచివచ్చాం నడిచే. గురజాడవారియిల్లు చూపుతూ వుంటే "ఎవరీయన నాలుగుమూలల నాలుగు గదులు కట్టుకుని మధ్యలో హాలుపెట్టుకుని చిత్రంగా కట్టుకున్నాడే యిల్లు?" అని అడిగింది మిస్ మార్లిన్.
"ఒకకవి"అని బదులు యిచ్చాను.
"గొప్పకవా?"
"మధురవాణిని, గిరీశాన్ని, పూర్ణమ్మను సృష్టించిన కవి అన్నాను.
"పూర్ణమ్మ అంటే?"
"యీ సృష్టిలోని విషాదమంతా రాశిపోస్తే పూర్ణమ్మ అవుతుంది" నా సమాధానం.
కోటమీద ముక్కోణాకారం జండా ఎగురుతోంది జుల్ ఫికార్!
కోట అంతా చూచి వచ్చాక "కోట ప్లాను చాలా బాగుంది" అన్నది మార్లిన్. విజయనగరం జిల్లా కేంద్రం అయినా యింకా పల్లెటూరులాగానే ఉంటుంది. ప్రజల జీవితంలో పరుగు కన్పించదు. నింపాదితనం కన్పిస్తుంది.
విజయనగరం విద్యలకి పుట్టినిల్లు బాగా చదువుకున్నవాళ్ళు ఎంతో నిరాడంబరంగా కన్పిస్తారు. ఎదుటివ్యక్తికి ఏదో చెప్పి నూరి పోద్దామన్న తపనకన్నా ఎదుటి వ్యక్తినించి ఏవయినా క్రొత్త సంగతులు తెలుసుకుందామన్న ఆరాటం కన్పిస్తుంది. కోటప్రాకారానికి ఫిరంగులు పేల్చేటందుకు ఏర్పాటుచేసిన యింజనీరింగ్ అర్ధం చేసుకోవటానికి ప్రయత్నం చేస్తున్నాను.
కాస్సేపు పోయాక వెనక్కు తిరిగిచూస్తే మార్లిన్ లేదు. రోడ్డుకి అవతల ఉన్న ఒక కొట్టుముందు నిలబడి ఉంది.
రెండు అరటిపళ్ళు తీసుకుంది మార్లిన్. రెండు రూపాయలు యివ్వమని డిమాండు చేస్తున్నాడు కొట్టువాడు. ఆమె డబ్బులు యివ్వబోయే సమయానికి నేనూ అక్కడకు పోయాను. కొట్టువాడు నన్ను చూచి కాస్తంత కళపళ పడ్డాడు.
ఆమె వేషమూ, విదేశీ వాలకమూ చూచి మస్కా కొట్టాలని చూస్తున్నాడు కొట్టు అతను. ఆమె యివ్వబోతున్న రెండురూపాయలు చేతి లోకి తీసుకున్నాను.
"ఏమిటది" అని అడిగాను.
"అరటిపళ్ళు కొన్నారండి" అతని సమాధానం.
"ఎన్ని కొన్నారు?" అన్నాను.
"రెండు"
"అయితే నీకెంత యివ్వాలి"
"రెండురూపాయలు"
"ఇదేమిటి?"
"అంతేనండి"
"ఎందుకని రెండు అరటిపళ్ళు రెండు రూపాయలా??"
"రేట్లు పెరిగినాయండి"


